అడుసు తొక్కనేల

  • 183 Views
  • 0Likes
  • Like
  • Article Share

    జి.వి.నారాయణరెడ్డి

  • అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య
  • 8008600212
జి.వి.నారాయణరెడ్డి

ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విద్యావేత్తలు, మేధావులు, భాషాభిమానులను కలవరపాటుకు గురిచేశాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులను గందరగోళంలోకి నెట్టేశాయి. ‘తాంబూలాలిచ్చేశాం..’ అన్నట్టు వెలువడిన ఈ నిర్ణయంతో బోధనా సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌
రాష్ట్రం అక్షరాస్యత విషయంలో ఇప్పటికీ దేశ సగటుకు కింద ఉంది. అందరికీ కనీసం మాతృభాషలో చదవడం, రాయడం నేర్పలేకపోతున్నాం. ప్రభుత్వం విద్యారంగానికి కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయించినా నియత, అనియత విద్య ద్వారా అక్షరాస్యులను చేయలేక పోతున్నాం.
      ఉన్నపళంగా పిల్లలందరూ ఆంగ్లభాషలోనే చదువుకోవాలని ప్రభుత్వం చెప్పడం ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థుల హక్కులను కాలరాయడమే. భాష కానీ, సబ్జెక్టు కానీ విద్యార్థుల మీద నిర్బంధంగా రుద్దే హక్కు అటు తల్లిదండ్రులకు, ఇటు ప్రభుత్వానికీ లేదు. ప్రభుత్వం నిర్బంధంగా అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని మాత్రమే కొనసాగించాలని అనుకుంటే, ముందు అందుకు తగినట్టు పాఠశాలలను, ఉపాధ్యాయులను సంసిద్ధం చేయాలి. భాష అర్థంకాక విద్యార్థులు బడి మానేేస్తే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 
      ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఎంతమంది ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు తరగతులను బోధించగలరు? వారికి ఉన్న విద్యార్హతలేంటి? నెల లేదా రెండు నెలల శిక్షణతో వారు ఇంగ్లీషు భాషలో పాఠ్యాంశాలను బోధించగలరా? సగానికిపైగా ఉపాధ్యాయులు పూర్తిగా తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారు. గత ఇరవై ఏళ్ల పైబడి తెలుగు మాధ్యమంలోనే పాఠాలను బోధిస్తున్నారు. ఇప్పుడు ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని నిర్బంధపెడితే నాణ్యత లోపిస్తుంది. దీంతో విద్యార్థులు నష్టపోతారు.
ప్రభుత్వం ఎవరిని సంప్రదించింది?
అధికారుల హడావుడి నిర్ణయాల వల్ల ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమై పోతుంది. 2008లో సక్సెస్‌ పాఠశాలల పేరుతో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినప్పుడు సీబీఎస్‌ఈ సిలబస్‌ వద్దని, రాష్ట్ర సిలబస్‌ పెట్టమని మేధావులందరూ చెప్పినా వినలేదు. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకుని 2009- 10 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర సిలబస్‌ ప్రవేశపెట్టారు. దశలవారీగా ఒక్కో తరగతి పెంచుకుంటూ ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమ బోధనలో శిక్షణ ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు. ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు తరగతులను బోధించడానికి అదనపు ఉపాధ్యాయులను నియమించలేదు. దాంతో ఉభయ మాధ్యమాల విద్యార్థులను కలిపి మొక్కుబడిగా పాఠాలు బోధిస్తున్నారు. ఇప్పటికీ ఇదే పరిస్థితి!
      ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. తర్వాత రేషనలైజేషన్‌ పేరుతో చాలా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తీసేశారు. ఆయా బడుల్లోని విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. ఇవాళ తిరిగి ప్రభుత్వ పాఠశాల మీద అధికారులు ప్రయోగాలు చేయడం ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడమే. ఏ పని చేయాలన్నా మొదట సన్నద్ధత అవసరం. ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ పూర్తిగా విఫలమైంది. ప్రాథమిక పాఠశాలలను మోడల్‌ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని, దగ్గరలో ఉన్న పాఠశాలలను కలిపేశారు. ఇప్పటికీ ఆ బడులకు కనీస అవసరాలను సమకూర్చలేదు.
      ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించగలిగిన వారు ఎంతమంది ఉన్నారు, ఎంత మంది బోధించలేరు అన్నది ముందు నిర్ధరించాలి. ఆంగ్ల మాధ్యమ తరగతులు బోధించడానికి అవసరమైన అదనపు ఉపాధ్యాయులను నియామకాల ద్వారా వెంటనే భర్తీ చేయాలి. ‘నాడు- నేడు’ ద్వారా పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాగే పాఠశాలల్లో ఆంగ్లంలో బోధించడానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించి దశలవారీగా వాటిని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చవచ్చు. అలాగే తెలుగు మాధ్యమంలో మాత్రమే చదువుకుంటాననే విద్యార్థులను గుర్తించి వారి కోసం ప్రతి మండలంలో అవసరమైన పాఠశాలల్లో తెలుగు మాధ్యమం సెక్షన్లను కొనసాగించాలి. ఆంగ్ల మాధ్యమం పాఠాలను బోధించలేని ఉపాధ్యాయులను ఈ పాఠశాలలకు బదిలీ చేయాలి.  
      ఉన్నత చదువులు చదివి దశాబ్దాలుగా విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుల ఆలోచనలు కానీ, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉపాధ్యాయ సంఘం నాయకుల ఆలోచనలను కానీ స్వీకరించడానికి అధికారులకు, ప్రభుత్వానికి మనసొప్పడం లేదు. విద్యాశాఖలో పని చేస్తున్న బోధనేతర సిబ్బంది, నాన్‌ గవర్నమెంట్‌ ఆర్గనైజేషన్ల ఆలోచనలు మాత్రమే స్వీకరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఆ తర్వాత తమ తప్పిదాలను తెలుసుకుని మార్పులు చేస్తున్నారు! ఇలాంటి నిర్ణయాలు లక్షలాది విద్యార్థులు, ఉపాధ్యాయుల్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్న విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.


వెనక్కి ...

మీ అభిప్రాయం