అందరూ తెలుగుతల్లి దూతలే

  • 3122 Views
  • 50Likes
  • Like
  • Article Share

    వేణుబాబు మన్నం, మనోహర్ కన్నీడి, భానుప్రకాష్ కర్నాటి

  • "తెలుగు వెలుగు" ప్రత్యేక ప్రతినిధులు
  • విజయవాడ

విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

విజయవాడ పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్‌ కళాశాలలో ౪వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు డిసెంబరు ౨౭, ౨౮, ౨౯ తేదీల్లో ఘనంగా జరిగాయి. ఆరంభ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భాషా పండితులు, ప్రముఖ సాహితీవేత్తలు హాజరయ్యారు. సాహిత్య అకాడెమీ అధ్యక్షులు చంద్రశేఖర కంబార ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రసిద్ధ రచయిత్రి శివరాజు సుబ్బలక్ష్మి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. ప్రముఖ గాయని ఆకునూరి శారద ప్రార్థనా గీతం ఆలపించారు. సంఘ అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు స్వాగతోపన్యాసం చేస్తూ... మూడు రోజులపాటు నిర్వహించే ఈ మహాసభల్లో భాషా పరిరక్షణకు చేపట్టాల్సిన అంశాలపై చర్చలు, ప్రతిపాదనలు, తీర్మానాలు జరుగుతాయని తెలిపారు. మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ తెలుగుతల్లి దూతలేనని అన్నారు. అనంతరం సంఘ కార్యదర్శి డా.జి.వి.పూర్ణచందు మాట్లాడుతూ...మహాసభలకు వస్తున్న విశేష స్పందన భాషా పరిరక్షణ ప్రాధాన్యాన్నితెలుపుతున్నాయన్నారు. 
      సభాధ్యక్షులు డా.మండలి బుద్ధప్రసాద్‌  వేదికను అలంకరించిన అతిథులకు ఆహ్వానం పలికారు. మాతృ భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.  భాషాస్వాభిమానం లేకపోవడం బాధకారమన్నారు. రాష్ట్రేతర ప్రజలకున్న మాతృభాష స్వాభిమానం తెలుగువారికి లేకపోవడం బాధాకరమైన విషయని డా.మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసి, ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలిన యోధుల త్యాగం మర్చిపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని, మానవ హక్కుల్ని, బాలల హక్కుల్ని విస్మరించి మరీ  ఏకపక్ష నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ఆంగ్లంపై పట్టుసాధించడం ముఖ్యమని ఏకంగా విద్యాబోధనే ఆంగ్ల మాధ్యమంలో చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... విద్యార్థులు మాతృభాషపై పట్టుసాధించడం ముఖ్యమని గుర్తించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. భాషా పరిరక్షణకు ఎంతవరకు పోరాటం చేస్తున్నామనే విషయం ప్రతి ఒక్కరూ పునః సమీక్షించుకోవాలని అభిప్రాయపడ్డారు. "మెకాలే... సంస్కృతంతో ప్రయోజనం ఏమీ లేదు, అది మీలో మూఢనమ్మకాల్ని పెంచుతుంది అంటే మనం ఒప్పేసుకున్నాం. ఆయన స్థాపించిన వందలాది విద్యాసంస్థలు చూసి ఆశ్చర్య పోయాం.  ఇంగ్లీషు మీద ప్రేమ పెంచేసుకున్నాం. కానీ ఇంగ్లీషు చదువుతో మనం గులాంగిరిని మాత్రమే నేర్చుకున్నాం. దీని నుంచి బయటపడి మన ప్రత్యేకతను నిలుపుకోవాల్సిన సమయమిది" అని చంద్రశేఖర కంబార పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణల సందేశాలను నిర్వాహకులు చదివి వినిపించారు. ఆచార్య కొలకలూరి ఇనాక్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఆచార్య వెల్చేరు నారాయణ రావు, ఆచార్య డేనియల్‌ నెగర్స్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంజీవ నరసింహ అప్పడు, అప్పాజోశ్యుల సత్యనారాయణ, ఎన్‌.వెంకటేశ్వర్లు, డా.కె.ఐ.వరప్రసాద రెడ్డి, ఆకునూరి శారద తదితరులు ముఖ్యఅతిథులుగా వేదికను అలంకరించారు. 
      మహా సభల ప్రత్యేక సంచిక 'తెలుగు ప్రపంచం'ను డా: కె.ఐ. వరప్రసాద్ (శంతా బయోటిక్ అధినేత) ఆవిష్కరించారు. భాషణ, బోధన, ఆలనా, పాలనా భాషకి నాలుగు చక్రాలు. తెలుగునాట అవేందుకో మొరాయించాయి. తలా ఒక చెయ్యి వేసి ముందుకు నడిపిద్దాం అన్నారాయన.  సభల సందర్భంగా "ప్రపంచ తెలుగు"  పరిశోధనా గ్రంధాన్ని ఎన్. వెంకటేశ్వర్లు (సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు) ఆవిష్కరించారు.
ప్రతి ఒక్క తెలుగువాడు ఇకపై 'మాతృభాష నా జన్మహక్కు...నా పిల్లల జన్మహక్కు' అంటూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అజో-విభో-కందాళం ఫౌండేషన్ ఛైర్మన్ అప్పాజోశ్యుల సత్యనారాయణ స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. తెలుగునేలపై తెలుగు విద్యార్థి ప్రాథమిక విద్యను కూడా తెలుగు మాధ్యమంలో కొనసాగించడానికి అవకాశం లేకుండా చేసే ప్రయత్నాలను చూస్తే ఆశ్చర్యం వేస్తోందని అన్నారు. మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసం జరగకపోతే మానసిక వికాసం, విజ్ఞాన సముపార్జన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని తెలుగులో అనువాదించే కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
      మనకి ఇంగ్లిషు వచ్చు అనుకుంటున్నాం.. కాని రాదు. తెలుగు రాదనుకుంటున్నాం కానీ వచ్చు. ఇంగ్లీషులో మనం మాట్లాడుతున్నాం అంటే దాని అడుగున తెలుగు ఉంది. తెలుగు భూమికగా మన ఇంగ్లీషు సాగుతుంది. అందుకే మాతృభాష ఎక్కడికి పోదని వెల్చేరు నారాయణ రావు అన్నారు.

ఆంధ్రలో భాషకి అన్యాయం 

"ఇది మన జాతి అని చెప్పుకునే శక్తి మనలో ప్రస్తుతం సన్నగిల్లింది. 200 ఏళ్లు పాలించిన ఆంగ్లేయులు వెళ్తూ వెళ్తూ  మనకున్న మితిమీరిన రాజభక్తి మెచ్చి ఇంగ్లీషు బానిసత్వం ఇచ్చివెళ్లారు. ఇంగ్లీషు వాళ్ల సంకెళ్లు ఉన్నంతకాలం మనం స్వతంత్రంగా బతికాం. వాళ్లు వెళ్లాక అనుకరించడం మొదలుపెట్టాం. మెకాలే లేకపోతే మన దేశంలో విద్యేలేదు అని నమ్మేవాళ్లు నేటికీ కొల్లలు. కరుణ, ఔదార్యం, వ్యక్తిత్వం లాంటివి అమ్మభాష ద్వారానే అబ్బుతాయి. ఇందులోని జీవన సౌందర్యాన్ని మరచి దేనివెనుక పరిగెడుతున్నామో అర్థం చేసుకోవాలి. మనలో మౌలిక భారతీయత, దాన్ని ప్రదర్శించే వాహిక అమ్మభాష అవసరం. ఇది తెలిస్తే మనం ఉత్తమ భారతీయులం, తెలుగువాళ్లం అవుతాం.  మన సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు, ఆ గొప్పదనాన్ని చెప్పుకునేటప్పుడు ఇంకో సంస్కృతిని గురించి కించపరచాల్సిన అవసరం గానీ, అగత్యం గానీ లేదు. దెబ్బ తగిలి పడినప్పుడు ఏ భాషలో అరుస్తాడో అదే అతని మాతృభాష అవుతుంది. ఆ భాష తన సమాజపు దృక్పథాన్ని, లక్షణాన్ని, సంస్కృతినీ ప్రతిబింబిస్తుంది.  ప్రస్తుతం మన తెలుగునేల మీద మనం మాట్లాడే భాష అర్థం చాలా మందికి తెలియదు. మనం ఏ భాషకి చెందిన వారం కాకుండా తయారవడం దీనికి కారణం. ప్రభుత్వ విధానాల వల్ల పిల్లలకి అమ్మభాషా దూరమవుతోంది. అభావం నుంచి భావంలోకి ప్రయాణించడానికి మన తెలుగు రక్త స్పర్శని మళ్లీ గుర్తు తెచ్చుకుందాం" అని సిరివెన్నెల చెప్పారు. 

     

సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ " విద్యావిధానంలో  మార్పులు తీసుకువస్తే పిల్లలు సృజనాత్మకంగా తయారవుతారు. కొత్త నాగరికతకు సరికొత్త పాఠాలు నేర్పుతారు. భాషకు కొత్త దానాన్ని కలిగిస్తారు. తమదైన ఆలోచనతో విభిన్న సంస్కృతిని ఆవిష్కరించి ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో భాషపై జరుగుతున్న దాడికి నిరసనగా ఈ సభలకి తెలంగాణ మిత్రులు సగానికిపైగా  వచ్చారు. భాషా పరిరక్షణ తెలుగు మాట్లాడే ప్రతీ ఒక్కరి బాధ్యత. 
ప్రభుత్వమే ఇటువంటి సభల నిర్వహణ ను ఒక బాధ్యతగా తీసుకోవాలి. భాషోద్యమ సదస్సులు ప్రతీ చోటా నిర్వహించాలి. భాషా పటిష్టం కావాలనే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాలుండాలి. ఒకరి వల్ల ఏం జరుగుతుందిలే... అనుకోవొద్దు. అణువులా ఎవరి ప్రయత్నం వారు చేయాలి. ఒక సుదీర్ఘ రాజకీయ యాత్రకి భాషా పరిరక్షణే సరైనదని ప్రజా ప్రతినిధులు గుర్తించాల"ని సూచించారు.

 

పరిశోధన అంటే సమాచార సేకరణ కాదు

      భాషా పరిశోధన అంటే సమాచార సేకరణ కాదని.... సమాచారాన్ని సమన్వయపర్చడమని వెల్చేరు నారాయణరావు పేర్కొన్నారు. 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా  ౨౭వ తేదీన మధ్యాహ్నం సురవరం ప్రతాపరెడ్డి వేదికపై భాషా పరిశోధన ప్రతినిధుల సదస్సు జరిగింది. ఆచార్య వెల్చేరు నారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భాషా పరిశోధన ప్రాధాన్యతను ఇప్పటివారు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలని సూచించారు. అనంతరం దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతి గజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ.... గిరిజన సాహిత్యం, వైద్య విధానంపై కూడా పరిశోధనలు జరగాలని అన్నారు. విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా పరిశోధన జరిగితే భాష ఔన్నత్యం ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. సాహిత్యాన్నే కాదు.... సంస్కృతినీ బోధించేది భాషే అని తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పూర్వ పీఠాధిపతి ఆచార్య.ఎన్.భక్తవత్సల రెడ్డి చెప్పారు.

      4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా సాహితీరంగ ప్రతినిధుల సదస్సు సురవరం ప్రతాపరెడ్డి సభావేదికపై ౨౭వ తేదీన సాయంత్రం 4.35 గంటలకు జరిగింది. ప్రముఖ సాహితీవేత్త విహారి అధ్యక్షత వహిస్తున్నారు. పెద్దింటి అశోక్‌కుమార్, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, ఆచార్య మన్నవ సత్యనారాయణ అతిథులుగా వచ్చారు.
      నాలుగో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా ౨౭వ తేదీన సాయంత్రం "తెలుగు బోధనారంగ ప్రతినిధుల సదస్సు" జరిగింది. దీనికి డా. రావి రంగారావు అధ్యక్షత వహించారు. తెలుగు బోధన కేంద్రంగా వక్తలు విశ్లేషణాత్మక సూచనలు అందించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనుబంధం, ఆత్మీయత, స్పందన, తిరుగుబాటు లాంటివాన్ని మనసు లక్షణాలు అని, ఒక వ్యక్తి నిజమైన మనిషిగా ఎదగాలంటే మాతృ భాషలో విద్యాబోధన అత్యావశ్యకమని అన్నారు. పరిభాషలో బోధన వల్ల మానసిక శక్తులు వికసించవని అన్నారు.  ఇంజనీరింగ్, వైద్యం లాంటి అన్ని స్థాయిల్లో తెలుగుని ఒక సబ్జెక్టుగా చేర్చాలని కోరారు. దీనివల్ల వాళ్లలో వ్యాపార దృష్టి పోతుందని విశ్లేషించారు. తెలుగునాట ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఎంపిక విధానాలు మారాలని, కేవలం ఐఛ్చిక ప్రశ్నలు ఇచ్చి వాళ్ళని ఎంపిక చేస్తున్నారని, కానీ తెలుగు బోధించే వారికి వాక్ రూప, లిఖిత, సృజనాత్మక నైపుణ్యాలు ఉండాలని, వీటన్నింటిని పరిశీలించే ఎంపిక చేయాలని అన్నారు. తెలుగు పాఠ్య పుస్తకాల స్వరూప స్వభావాలు మారాలని, పిల్లల స్థాయిని పరిగణనలోకి తీసుకుని పాఠాలు చేర్చాలని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో మూల్యాంకన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లానికి నిర్దేశించిన బోధన ప్రమాణాలనే తెలుగుకు అనుసరిస్తున్నామని, ఇది మారాలని అన్నారు. 
      ౨౭వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు సరికొండ నరసింహరాజు,  మోహిత, మాదిరాజు బిందు వెంకట దత్త శ్రీ, ఉమర్ షరీఫ్... నిర్వహణలో..  సినీ గేయ రచయిత వెన్నెలకంటి  సభాధ్యక్షులుగా మహాకవుల ప్రత్యేక కవి సమ్మేళనం జరిగింది. మొదటగా వెన్నెలకంటి మాట్లాడుతూ... " నానీ.. హైకూ.. రెక్కలు అంటూ... ఏవేవో రూపాల్లో కవిత్వం రాస్తూ.. అదే కవిత్వమనే భ్రమలో వున్నారు చాలామంది. అవి ప్రక్రియలు. ప్రక్రియలు ఎప్పుడూ కవిత్వం కాదు. అది ఏ ప్రక్రియలో చేరితే అది ఆ ప్రక్రియా కవిత్వమవుతుందన్నారు. 
      తర్వాత.. సినీ గేయ రచయిత రసరాజు.. " వెన్నెలే ఏమందో... వెన్నలో ఏముందో.. నా భాషను అడగండి. నా వెంట నడవండి... తెలుగు నా భాష.. తెలుగు నా శ్వాస... అంటూ కవితతో ఎలుగెత్తారు. కడుపులో వున్న బిడ్డ ఈ భూమ్మీద పడటానికి ఎందుకు జంకుతున్నాడో...  ఈనాటి దారుణ పరిస్థితులను  భువనచంద్ర కవితలో  వెల్లడిచేశారు. గేయ రచయుతలు వడ్డేపల్లి కృష్ణ, వీణాపాణి.. ఇంకా ఇతర ప్రసిద్ధ కవులు తమ తమ కవితలు చదివి వినిపించారు. 

* * *

ప్రపంచ తెలుగు రచయితల మహాసభల రెండో రోజు విశేషాలు 
రాజకీయ రంగ ప్రతినిధుల సదస్సు మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ౨౮వ తేదీన ఉదయం పది గంటలకు జరిగింది. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ... ''అధికారంలో ఉన్నవారు ప్రజలకు ఇష్టం ఉన్నా.. లేకపోయినా.. తమ నిర్ణయాలను ప్రజలపై రుద్దుతూ.. చట్టాలు చేస్తారు. మాతృభాష భోధనాభాషగా వుండాలనేది ప్రాథమిక సూత్రం. అయితే నూటికి ఎనభైశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవాలని కోరుకుంటున్నారు. ఎందుకూ.. అంటే.. సమాజంలో ఎక్కువగా తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు కాబట్టి. మరి తెలుగు మాధ్యమంలో చదువుతున్న ఇరవై శాతం ప్రజల పరిస్థితి ఏంటీ? వాళ్ల హక్కును కాలరాస్తే ఎలా? ఇది ప్రజాస్వామ్యానికి... సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధం కదా!'' అని ఆవేదన వ్యక్తం చేశారు. ‌తర్వాత... శాసనమండలి సభ్యులు మాధవ్ మాట్లాడుతూ... ''మనభాష సరళమైనదీ.  ప్రపంచ భాషలతో చాలా తేలికగా అనుసంధానం చేయడానికి వీలైన భాష అనే సంగతి పాలకులు గుర్తించడం లేదు.  భాషలకి మతాల మకిలి అంటగట్టడం సరైంది కాదు.  భాష పరంగా నాయకులకు ఓట్లు వేసేలా ప్రజల్లో పరివర్తన రావాలి... అంతర్జాతీయ పాఠశాలల్లో సైతం.... తెలుగును బోధించేలా శ్రద్ధ తీసుకోవాలని'' చెప్పారు. సీపీఐ జాతీయ నాయకులు కె. నారాయణ మాట్లాడుతూ "భాషకి సంబంధించిన బాధ్యత మనందరిమీదా ఉంది. తెలుగని చెప్పి చాలామంది అర్థంకాని భాషలో మాట్లాడుతున్నారు. రైలుని ధూమశకటం అంటే అందరికీ అర్థమౌతుందా! ఇంకా సరళమైన పదాలను తయారుచేయలేమా... అన్నది పండితులే ఆలోచించాలి. ‌నేటి కాలపు పిల్లలకి సులభంగా.. సరళంగా ఉండేలా పాఠ్యపుస్తకాల రూపకల్పన జరగాలి. ఇప్పుడు చేశారు. ఇంకా చేయాల్సింది చాలావుంది. పండితులు పరిశోధనా కేంద్రాలను నెలకొల్పి భాషను ఇంకా సులభంగా.. ఆకర్షణీయంగా చేయడానికి కృషి చేయాలి. ఎవరైనా భాష గురించి మాట్లాడుతుంటే... మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదివారు! మీరేం చదివారు! అంటూ వ్యక్తిగతంగా విమర్శించడం మంచిది కాదు. భాష ఉనికి కోసం మనమేం చేయాలో ఆలోచించాల్సిన సమయమిది" అన్నారు. ‌తర్వాత శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు మాట్లాడుతూ "తెలుగువాళ్లు తెలివైనవాళ్లు, ఆలోచనా పరులు అంతేకాదు సామాజిక స్పృహ లేని స్వార్థపరులు అని నేటి పరిస్థితులను చూస్తే నా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన సాహిత్యం, చొరవ, తెగింపు ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. ‌తెలుగు కూడు పెడుతుందా! బతుకునిస్తోందా అన్నది పక్కన పెట్టి భాష గురించి ఆలోచించాలి" అని చెప్పారు.
      సాంకేతిక తెలుగు రంగ ప్రతినిధుల సదస్సు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన మొదలయింది. ''ఈ రోజు భాష అంతర్జాతీయ యుగంలోకి ప్రవేశించింది. భారతీయ భాషలలో కంప్యూటర్ పరంగా లిపికి సంబంధించిన పరిశ్రమ ౩౦ ఏళ్ళ క్రితమే మొదలయింది. ప్రస్తుతం కంప్యూటర్ మీద ఏ భాషని అయినా మనం తర్జుమా చేసుకోవచ్చు. ప్రస్తుతం అన్ని భారతీయ భాషలు యూనీకోడ్ లోకి వచ్చాయి.అయితే కంప్యూటరికారణలో భాషణ పరంగా ప్రస్తుతం కొంత ఇబ్బంది ఉంది. దీని కోసం ౨౦ ఏళ్ల నుంచి యంత్రానువాదంలో కృషి జరుగుతోంది. ఇది కూడా పూర్తిస్థాయిలో వస్తే ఇక మాధ్యమం అన్న వాదనలు ఉండవు. కృత్రిమ మేధతో యంత్రానువాదం తేలిక అవుతుంది'' అని అన్నారు గారపాటి. అతిథి పాలెపు సుబ్బారావు ప్రాచీన రాతప్రతుల ప్రాధాన్యం గురించి చెప్పారు. వీవెన్ మాట్లాడుతూ ''రచయితలు కేవలం వాట్సాప్, ఫేస్బుక్లో మాత్రమే కాకుండా బ్లాగుల్లో, సొంత  వెబ్సైట్లలో రాయండి. గూగుల్ సెర్చ్ వీటిని ఉపయోగించుకుంటుంది. కొత్త ఉపకరణాలు తయారు చేసుకుంటుంది. మీ రచనని చదివి ఆడియో రూపంలో పెట్టండి'' అన్నారు. 
భాషకు ప్రభుత్వమే శత్రువు
సురవరం  వేదిక మీద తెలుగు భాషోద్యమ ప్రతినిధుల సదస్సు ౨౮వ తేదీన ఉదయం 11 గంటలకు జరిగింది.  సభాధ్యక్షులు డా. సామల రమేష్ బాబు మాట్లాడుతూ... ''దేశభాషలందు తెలుగు లెస్స, తీయని తేనె తెలుగు అని ఒట్టి మాటలు చెప్పుకుంటే సరిపోదు. కాలానుగుణంగా భాషను అభివృద్ధి చేసుకోవడం ముఖ్యం, దీనికోసం ఏం చేయాలన్నది ఆలోచించాలి'' అని అన్నారు. "ఇవాళ ప్రభుత్వమే భాషకు ప్రధాన శత్రువు. బడి, ఒడి (దేవాలయం), పలుకుబడి వీటిలో తెలుగు వాడుకలోకి రాకుండా భాష అభివృద్ధి చెందదు. పరాయి భాష మీద ప్రజల్లో మోజు పెంచి, అమ్మభాషా మాధ్యమాన్ని తీసేయాలని ప్రభుత్వం చూస్తోంది. దీనికి వ్యతిరేకంగా అందరం ఉద్యమించాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు మేధావులు తమ స్వార్థం కోసం సమర్థించడం దారుణం. ప్రతి ఇంట్లో మన భాషని మనం గణనీయంగా వాడాలి" అని అన్నారు సామల రమేష్ బాబు.  
      అతిథిగా విచ్చేసిన జొన్నవిత్తుల మాట్లాడుతూ... ''ప్రతి నియోజకవర్గంలో ౧౫౦౦ నుంచి ౨౦౦౦ మంది భాషాభిమానుల్ని సంఘటితం చేయాలని అన్నారు. భాషని లేకుండా చేయాలని చూసేవాళ్ళని అధికారంలో లేకుండా చేసే శక్తి మనకు ఉంది. నిజానికి ప్రభుత్వం తన నిర్ణయంతో మనకి మంచే చేసింది. దానివల్ల ఈరోజు మనం నా భాష అని ఇక్కడ నినదిస్తున్నాం. లేకుంటే నా పుస్తకం, నా కవిత అని అనుకునేవాళ్లం. భాషకు ఎసరు పెట్టడం ఎప్పటినించో చాపకింద నీరులా జరుగుతోంది. ఇంగ్లీషు లేకపోతే అట్టడుగు వర్గాలకు నష్టం అంటున్నారు జగన్. నిజంగా వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళ భాషలో పాలన సాగించమనండి చూద్దాం." అన్నారు జొన్నవిత్తుల. మరో అతిథి పారుపల్లి కోదండరామయ్య... "తెలుగువాడు తెలుగుని ప్రేమగా చూడనంత వరకు మనం ఎన్ని నినాదాలు, ఉద్యమాలు చేసినా వృథా" అన్నారు.  మరొక అతిథి, డిప్యూటి కలెక్టర్ తులాల సవరమ్మ... పాలనలో వాడుకలో ఉన్న భాషే నిలబడుతుంది అన్న యునెస్కో మాటని గుర్తుచేశారు. ఇంగ్లీష్ కు సమాన పదాలు మన తెలుగులోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత తెలుగు భాష ఉద్యమంలో తన "కమ్మనైన తెలుగు భాషని కలనైనా మరవొద్దు'' గీతాన్ని ఉద్యమ గీతంగా ఎంచుకోవడం ఆనందంగా ఉందన్నారు యాలవర్తి రమణయ్య. హోసూరు నుంచి వచ్చిన విజయకుమార్... ఏ మాధ్యమంలో చదువుకోవాలో చెబుతూ సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులు 11 ఉన్నాయని, ప్రభుత్వ నిర్ణయం కోర్టుల ముందు నిలబడదని అన్నారు. బరంపురం నుంచి వచ్చిన తుర్లపాటి రాజేశ్వరి... ఏపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇతర రాష్ట్రాల్లో తెలుగుకు ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఒడియా బళ్లు కొన్ని ఉన్నాయని, వాటిలో ఇంగ్లీషు తెస్తే, ఇతర రాష్ట్రాల్లో తెలుగు ఎందుకు ఉంచుతారని సూటిగా ప్రశ్నించారు. ప్రాధమిక విద్యలో తెలుగు లేకపోతే తెలుగుకు తీవ్ర ప్రమాదం తప్పదని హైదరాబాదు నుంచి వచ్చిన అధ్యాపకులు దాసోజు పద్మావతి చెప్పారు. కుటుంబం, పాఠశాల ఇవి రెండే భాషని బకిస్తాయని అన్నారామె. కార్యక్రమంలో పలువురు భాషాభిమానులు, వివిధ రంగాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 

మధ్యాహ్నం పన్నెండు గంటలకు గిడుగు రామమూర్తి సాహితీ సాంస్కృతిక వేదిక పై విశ్రాంత ఐఏఎస్ అధికారి యన్.ముక్తేశ్వరరావు సంచాలకులుగా పాలనారంగ ప్రతినిధుల సదస్సు జరిగింది. ముక్తేశ్వరరావు మాట్లాడుతూ "భాష అనేది ప్రజల ఉమ్మడి ఆస్తి. ప్రజల హక్కు. అందరినీ కలిపే శక్తి. సాధారణంగా ఉద్యోగులు మాకు తెలుగు అంతంత మాత్రమే వచ్చు అంటారు అది అబద్ధం. మనకు వచ్చింది తెలుగు రానిది ఇంగ్లీషు. ఏదో ఇంగ్లీష్ వచ్చు కదానే భ్రమలో ఉంటారు ఏ శాఖా ఉద్యోగులైనా. అదే పడికట్టు భాషను నేర్చుకొని ఆ భాషలోనే పాలనచేయడం సరైనదా? అసలు వచ్చీ రానీ భాషలో పాలన చేసే అర్హత మనకుందా? పాలనా భాషగా తెలుగును అమలు చేయకపోవడం వల్ల. పరాదీనులుగా మారిపోయాం. ప్రజల ఈ పాలనా పరమైన విషయాల్లో తెలుగు కోసం పాలకులను ప్రశ్నించాలి. ప్రభుత్వం చేసే కార్యక్రమాలూ రూపొందించే నివేదికలు ప్రజలకు అర్థమయ్యేలా ఉండాల"ని సూచించారు. తర్వాత విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ  కలెక్టర్ నూర్ భాషా రహంతుల్లా మాట్లాడుతూ పాలనా భాషగా తెలుగు అమలు అన్నది తెలుగువారి దీర్ఘకాల కోరిక. దీని కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు మాధ్యమంలో చదువుకున్నవాళ్లకి ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

      సురవరం ప్రతాపరెడ్డి వేదికపై చరిత్ర పరిశోధన రంగ ప్రతినిధుల సదస్సు ౨౮వ తేదీన మధ్యాహ్నం జరిగింది. డా.రాపాక ఏకాంబరాచార్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈమని శివనాగిరెడ్డి అధ్యక్షతన సభ జరుగుతోంది. డా.సవరం వెంకటేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.

సంగీత నవావధానం

డా. గుమ్మా సాంబశివరావు అనుసంధాన కర్తగా... డా. మీగడ రామలింగ స్వామి 'సంగీత నవావధానం' కార్యక్రమం గిడుగు రామమూర్తి సాహితీ సాంస్కృతిక  వేదిక పై ౨౮వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగింది. అష్టావధానం లాంటిదే సంగీత నవావధానం. కాకపోతే... ఇందులో ఏడు అంశాలే వుంటాయి. అందుకే ఇది నవావధానం. పురాణం, శతకం, ప్రబంధం, నాటకం, ఆధునికం, అవధానం, శ్లోకం వంటి అంశాలకు సంబంధించిన పద్యాలను ప్రాశ్నికులు (అష్టావధానంలో మాదిరిగా  ప్రశ్నలు అడిగేవారు) పద్యాన్ని పలానా రాగంలో చెప్పమని అడగటం ఈ అవధానం విశిష్టత. తెలుగు పద్యాన్ని హృద్యంగా  పాడటమెలాగో నేర్పడమే కాదు.. పిల్లలకు... నేటి యువతకు పద్యం పట్ల ఆసక్తి కలిగించడమే లక్ష్యంగా ఈ అవధానం రూపుదిద్దుకున్నదంటారు అవధాని. వంతులు వెంకటేశ్వర్లు పురాణం అనే అంశంలో 'అడుగెదనని కడవెడుజను...' అనే గజేంద్ర మోక్షం ఘట్టంలో పద్యాన్ని కేదారగౌళ రాగంలో పాడమని సూచించారు. శతకం అంశంలో పులకుంట శ్రీనివాసరావు... వేలూరి రవికుమార్ నాటకం అనే అంశంలోనూ.. చిగురుపాటి పూర్ణచంద్రరావు అవధానం అంశంలో 'పూరి, గారి, వడ, సాంబారు వంటి పదాలిచ్చి ఆనంద భైరవి రాగంలో పద్యాన్ని...  ఆధునిక అంశంలో పంచాగ్నుల కృష్ణవేణి 'భరతఖండంబు చక్కని పాడియావు' అను చిలకమర్తి పద్యాన్ని బిలహరి రాగంలో పాడమని సూచించారు. చివరిగా వలివేటి వేంకట శివరామకృష్ణ శ్లోకం అనే అంశంలో భాగంగా 'మానిషాద' అనే రామాయణ శ్లోకాన్ని మోహన రాగంలో పాడమని సూచించారు. ఇలా ఏడు అంశాలపై సంగీత సాహిత్య అంశాలను ప్రస్తావిస్తూ.. పద్యాలతో అలరిస్తూ సభను రాగరంజితం చేశారు.

 

సాహితీ సంస్థల ప్రతినిధుల సదస్సు: శిఖామణి (కవి సంధ్య) అధ్యక్షతన సురవరం వేదిక మీద జరిగింది. ఆయన మాట్లాడుతూ ''ఒక జాతి సాహితీ ప్రయాణంలో సాహితీ సంస్థల పాత్ర ఎనలేనిది. అస్తిత్వ ఉద్యమాలు వచ్చాక సాహితీ సంస్థలు బాగా ఉనికిలోకి వచ్చాయి. బంగారు పళ్ళానికి గోడ చేర్పు అవసరం అయినట్లు ఎంత గొప్ప సాహిత్యకారుడైనా సాహితీ సంస్థల ఆదరువు అవసరం. తెలుగు మాధ్యమాన్ని తొలగిస్తే ౧౫, ౨౦ ఏళ్ల తర్వాత మన రాతని, చదువుని మనం కోల్పోతాం'' అన్నారు. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం సమన్వయకర్త తేళ్ల అరుణ మాట్లాడుతూ ''రాసే కవి కోకిలలనన్నింటిని సాహితీ వనంలోకి తెచ్చేవే సాహితీ సంస్థలు. ఇక్కడ చేను ఉంది... అక్కడ నీరు ఉంది.. మధ్యలో కాలువ తవ్వేదే సాహితి సంస్థలు'' అన్నారు. ఈ సదస్సుకు అతిథిగా హాజరైన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షులు, రాళ్లపల్లి సుందరరావు మాట్లాడుతూ "ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారు అమ్మభాషలో చదువు, సంస్కృతి కోసం తపిస్తుంటే, ఇక్కడ తెలుగు మాధ్యమాన్ని తీసేయడం ఏంటని" ప్రశ్నించారు. ఇటీవల కాలంలో సాహితీ సంస్థల ప్రతినిధులు తగ్గారని, సాహితీ పాఠకులు తగ్గటమే దీనికి కారణమని పేర్కొన్నారు. ప్రియమైన కథకులు, ప్రియమైన రచయితలు వాట్స్ అప్ గ్రూప్ ల ద్వారా కొత్త రచయితలను ప్రోత్సహిస్తున్నామని అడ్మిన్ ఇందూ రమణ చెప్పారు. సాహితి సంస్థల పుస్తకాల్ని ప్రభుత్వం కొనాలని కడప నుంచి వచ్చిన జింకా సుబ్రహ్మణ్యం కోరారు. సంస్కృతి పేరుతో ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని, దీని గురించి ప్రశ్నించాలని అనంతపురం నుంచి వచ్చిన అప్పిరెడ్డి హరినాథరెడ్డి పిలుపునిచ్చారు. అలాగే జిల్లా స్థాయిలో రచయితల భవన్ ఉండాలని కోరారు. సాహితి సంస్థలన్నీ కలసి తెలుగుని కాపాడుకోవాలని,  ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకినెలా చెయ్యాలని ఈ సదస్సు తీర్మానించింది.


      "మా దగ్గర సరైన తెలుగు బళ్లు లేవు. ఉన్న వాటిలో ఎవరైనా రిటైర్ అయితే మళ్ళీ పోస్టులు మంజూరు చెయ్యడం లేదు. తెలుగు పుస్తకాలూ అంతంత మాత్రమే. దీని గురించి మా ముఖ్యమంత్రిని కలుద్దామని అనుకుంటున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం తెలుగు మాధ్యమమే వద్దని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మేము ఏ ముఖం పెట్టుకుని ఆయన్ని కలుస్తాం. మా సీఎంకి ఒడియా రాదు. కానీ అధికార భాష పెట్టారు. మాధ్యమాన్ని తప్పనిసరి చేశారు. నాలుగు సార్లు గెలుస్తూ వచ్చారు. ఒడియా వాళ్ళకి ఉన్న భాషాభిమానం ఇక్కడ లేదు.  ఉంటే ప్రభుత్వ నిర్ణయం మీద తిరగబడి ఉండేవాళ్ళు. జగన్ తన నిర్ణయాన్ని ఉపసంహరణ చేసుకోకుంటే కోర్టుకి వెళ్తాను. 

- ఆనందరావు పట్నాయక్, రాయగఢ్


      "భాష చచ్చిపోయే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ భాష మనకి మోటుగా కనిపిస్తుంది. మన భాషని మనం గౌరవించుకోం. మన భాషలో కాకుండా ఇతర భాషలో ఆలోచిస్తాం. ఆ భాషకి సంబంధించిన జానపద సాహిత్యం కనుమారుగవుతుంది. చివరగా అందులో అభివృద్ధి చెందిన కలలు అంతరిస్తాయి. ప్రస్తుతం తెలుగునాట ఇదే కనిపిస్తుంది" అని సాంస్కృతిక రంగ ప్రతినిధుల సదస్సు అధ్యక్షులు దీర్గాసి విజయ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. 
      గిడుగు రామమూర్తి సాహితి సాంస్కృతిక వేదికపై ప్రముఖ నృత్య దర్శకులు డా. సప్పా దుర్గాప్రసాద్ "తెలుగు వారి ఆలయ నృత్యరీతులు" అనే అంశంపై వ్యాఖ్యాన రూపకం ౨౮వ తేదీన సాయంత్రం ౪ గంటలకి జరిగింది. ''ఒకనాడు ఆలయాల్లో దైవారాధనలో భాగంగా గణికలు, ఏలలు, జోలలూ, కౌతాలు, చూర్ణికలు.. పేరుతో  సలక్షణ పద్ధతి ఉండేదని... ఇప్పుడలాంటివేవీ లేవనీ'' ఆవేదన వ్యక్తం చేశారు. శైవాగమంలోనే కాకుండా... విష్ణు ఆరాధనకు సంబంధించిన ఆలయ నృత్య రీతులను వేదికపై అభినయిస్తూ... వ్యాఖ్యానం చేస్తూ... ఈ తరానికి తెలియని విశిష్టాంశాలను తెలిపారు. సాయంత్రం నాలుగున్నరకి 'రంగం' ప్రజా సాంస్కృతిక వేదిక రాజేష్ బృందం "తెలుగు భాషోద్యమ గీతాలను స్ఫూర్తి వంతంగా ఆలపించింది. తర్వాత పాలగుమ్మి రాజగోపాల్ "కావ్యాలలో తెలుగు సొగసు" అనే అంశంపై గాన ప్రసంగం . భాగవతంలో మానవీయ విలువలను ప్రతిబింబించే పద్యాలను రాగయుక్తంగా పాడి వినిపించారు. గజేంద్ర మోక్షం, రుక్మిణీ కల్యాణం, ప్రహ్లాద చరిత్ర లాంటి ఘట్టాలలోని పద్యాలనే కాకుండా కృష్ణదేవరాయల పద్యాలనీ, మనుచరిత్రలో పద్యాల్నీ ప్రసిద్ధ రాగాలలో పాడి సభను రాగరంజితం చేశారు.

 

"యువత- తెలుగు భవిత"  అనే  ప్రత్యేక ప్రసంగంలో... సినీ గేయ రచయిత అనంత శ్రీరాం మాట్లాడుతూ...  గూగుల్, ఫేస్బుక్ వంటి బహుళజాతి కంపెనీలు ప్రతీ ప్రాంతీయ భాషలోనూ వారి ప్రభావం చూపాలని... ప్రాంతీయ భాషల్లో వారి ఉత్పత్తులు ప్రవేశించాలని... ప్రతీ భాషనూ వారు ఆదరిస్తున్నారు.  అమ్మ భాషను నమ్ముకుంటే అన్నానికి లోటుండదు.  సాంకేతిక పరిజ్ఞానం తో పాటూ... ఆంగ్ల పరిజ్ఞానం కూడా ఉంటే ఈ రోజుల్లో బతకడం కష్టం కాదు. ఏ భాషతోనైతే మనం కలలో మాట్లాడతామో.. మన ఆలోచనలు ఏ భాషలో ప్రతిఫలిస్తాయో... అది మన మాతృభాష. అంటాడో మహానుభావుడు. ఇప్పుడు యువతకు తెలుగుభాషను దూరం చేస్తే నష్టం ఏంటంటే... కలలోనూ... ఆలోచనలనూ. తెలుగులో యోచించే స్థితిని కోల్పోతాం. యువతను భాష వైపు తిప్పేందుకూ... వారిలో ఉత్సాహాన్ని కలిగించేందుకు ఒక పాట పాడి విపిస్తానంటూ... "రా రా ముందుకు రా వెనకే ఉండక ముందుకు రా/ రా రా బయటకి రా... గడపలు గదులు దాటుతు ముందుకు రా/ కొత్త దారులను... చీల్చుకునేందుకు... కొత్త ఊపిరులను నింపుకునేందుకు రా రా ముందుకు రా ఎవరో ఎందుకు... ఎవరో ఎందుకు నీకు తోడుగా నువ్వు కదలిరా/ ఎవరో చెయ్యందించడమెందుకు నీకు నీవుగా లేచి నడచిరా! అంటూ చైతన్యం కలిగించేలా పాడటమే కాదు... ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

     ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ "నిజం చెప్పాలంటే ఇవ్వాళ తెలుగు భాష కొద్దోగొప్పో నిలిచి ఉందంటే ఈ విషయంలో ఈనాడు పత్రికాధిపతి రామోజీరావుకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే.. మనం వాల్ పోస్టర్ అంటామే దానికి గోడ పత్రిక అనే సమానార్థక పదాన్ని వారి పత్రికలో రాస్తూ ఉంటారాయన. భాషకు సంబంధించి బృహత్తర గ్రంథాలయాన్ని నడుపుతున్నారాయన. ఈ రకంగా ఎవరికి వారే భాషా పరిరక్షణ కు కృషి చేస్తే భాష ఎందుకు బతకదూ!'' అన్నారు.

 

ప్రచురణ రంగ ప్రతినిధుల సదస్సు

గ్రంథాలయాలు ఉంటేనే పుస్తకాలు ప్రజలకు అందుతాయి, అవి పుస్తకాలు కొంటేనే ప్రచురణలు జరుగుతాయి అన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం కార్యదర్శి డా. రావి శారదా అన్నారు. ప్రచురణ రంగ ప్రతినిధుల సదస్సుకు ఆమె అధ్యక్షత వహించారు. ఈ లైబ్రరీల వల్ల ప్రచురణ రంగం దెబ్బతింటోందని అన్నారామే. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం ఒక్క పుస్తకాన్ని కూడా కొనలేదని, ఇప్పుడొస్తున బాల సాహిత్యం నాణ్యతతో ఉండటం లేదని చెప్పారు.  దీనికి సమన్వయకర్త డా. కపగంతు రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రచురకర్తల్ని కదిలిస్తే కన్నీళ్లే అని వ్యాఖ్యానించారు. పుస్తకం తెరిస్తేగాని భాష ప్రజల్లోకి వెళ్లదనీ, ప్రజలు చదివితేగాని ప్రచురణకర్తలు ముందుకు రారని అన్నారు.  పుస్తకాల డౌన్లోడ్లు తగ్గించి, ప్రతి ఇంట్లో పుస్తకాలు కొనే, చదివే అలవాటు రావాలని పేర్కొన్నారు. అతిథి శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్ అధినేత దిట్టకవి రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఏడాదికి 5 వేల పుస్తకాలు తెలుగులో రావడం ఆశ్చర్యమే అన్నారు. చదవాలనే ఆసక్తి పిల్లల నుంచి పెద్దలకి రావడం లేదని చెప్పారు. చదువరులు తగ్గిపోవడం వల్ల ప్రచురణకర్తలు జంకుతున్నారని అన్నారు. మరో అతిథి పెద్దబాలశిక్ష ప్రచురణకర్త గాజుల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రచురణ రంగం తీవ్ర ఒడిదొడుకుల్లో ఉందని, కంపోజ్, ప్రూఫ్ల ఖర్చులు బాగా పెరిగాయని, అవి కూడా సరిగా ఉండటం లేదని పేర్కొన్నారు. మరో అతిథి శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర గ్రంథమాల ప్రతినిథి కల్లూరి రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. గతంలో కవులు సంఘంగా ఏర్పడి పుస్తకాలు వేసేవారని చెప్పారు. 20 ఏళ్లుగా జిల్లా గ్రంథాలయాలు ఒక్క పుస్తకము కూడా కొనలేదని, ఉన్న పుస్తకాలు మూటకట్టి అటక మీదకి ఎక్కించారని చెప్పారు. రచయితలు తమ పుస్తకాల్ని ముద్రించి తక్కువ ధరకు అందించాలని పిలిపునిచ్చారు. ఒకప్పుడు విజయవాడ ఏలూరు రోడ్డు అంటేనే పుస్తక ప్రచురణకు కేంద్రమని, ఇప్పుడది బోసిపోయిందని చెప్పారు.

      ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రతినిథిగా కె.లక్ష్మయ్య మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా తెలుగులో ఒక్క పబ్లిషర్ కూడా రాలేదని అన్నారు. ఈ పరిస్థితి మరే రాష్ట్రంలోనూ కనిపించదని వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు పిల్లల చదువులకు వేలల్లో  ఖర్చు చేస్తున్నారు గాని, పుస్తకాలను కొనివ్వడం లేదని అన్నారు. పిల్లలకి డబ్బులు ఇచ్చి నచ్చిన పుస్తకాల్ని కొనుక్కోమనీ చెప్పరు. ప్రభుత్వం చొరవతో పాటు, తల్లిదండ్రులు పూనుకుంటేనే ప్రచురణరంగం బతుకుటుందని అన్నారు.


      "వచ్చితి విజయవాడకు... చొచ్చితి మాధుర్యమొసగు సుందర సీమన్... తెచ్చితి నే పద్యములను..." అంటూ... అందరి హృదయాలలో పద్యాలను అంటించిపోవాలనే... "పలకరిస్తే పద్యం " కార్యక్రమంలో డా. రాధశ్రీ  అడుగడుగునా పద్యాలతోనే పలకరించారు. అలవోకగా పద్యాలను పాడి సభికులను ఆనందింపజేయడమే కాదు ఆశ్చర్యచకితులను చేశారు.


డా.కె.వి.సత్యనారాయణ నృత్యదర్శకత్వంలో నంది తిమ్మన పారిజాతాపహరణంలోని సత్యకృష్ణల ప్రణయ ఘట్టాన్ని ప్రదర్శించారు. సత్యభామగా.. సి.హెచ్.అజయ్ కుమార్, కృష్ణ పాత్రలో సి.హెచ్.శ్రీనివాస్ సహాయ నర్తకీమణులుగా కావ్య, మానస, అనూహ్య, నీహారిక భావన చరిష్మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* * *

ప్రపంచ తెలుగు రచయితల మహాసభల మూడో రోజు విశేషాలు 

4వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల్లో ౨౯వ తేదీన ఉదయం రాష్ట్రేతర ప్రతినిధుల సదస్సు మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ "భాష గురించి గళమెత్తే వాళ్లని ప్రస్తుతం ద్రోహులుగా చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇక్కడే తెలుగుకి భవిత లేకపోతే ఇక పక్క రాష్ట్రాల్లో పట్టించుకునేది ఎవరు?  కానీ ఇక్కడ తెలుగు మాధ్యమాన్ని నిలపడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వాళ్ళ గురించి రెండు రాష్ట్రాలు ఆలోచించాలి. అప్పుడే తెలుగు మళ్ళీ దేశంలో రెండో స్థానానికి వస్తుంది. లేకపోతే ఇతర రాష్ట్రాల్లోని వారు అక్కడి సంస్కృతిలో కలిసిపోయే అవకాశం ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో తెలుగు పీఠాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని" అన్నారు. 

 

      గిడుగు రామమూర్తి సాహితి సాంస్కృతిక వేదిక పై జరిగిన రాష్ట్రేతర ప్రతినిధుల సమావేశంలో సమన్వయ కర్తగా రాళ్ళపల్లి సుందరరావు మాట్లాడుతూ "భాష విషయంలో కొన్ని రాష్ట్రాలు భిన్నంగా ఉంటున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో ఉంటున్న తెలుగువాళ్లు తెలుగు మాట్లాడలేని పరిస్థితి నేడు ఉంది. నేను కోరుకున్నదొక్కడే... ఇక్కడి రాజకీయ రాజకీయేతర నాయకులు అప్పుడప్పుడు మా ప్రాంతాల్లో పర్యటించి మా బాగోగులు... మా భాషా స్థితిగతులను పట్టించుకోవాలని" కోరారు.  

 

      బెంగళూరు నుంచి వచ్చిన ఎ.ఎన్ సి.వి.రావు మాట్లాడుతూ భాష మూలాల స్మరణ... సాంకేతిక భాషగా తెలుగుకి ఎదురవుతున్న సవాళ్లనూ... చెప్పారు.

 

      హోసూరు నుంచి వచ్చిన ప్రతినిధి సీతారామారావు మాట్లాడుతూ "ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు... బిడ్డ అమ్మపాల కోసం ఏడుస్తుంటే ఒరేయ్ బాబు, ఇది నాగరిక సమాజం, నీకు అమ్మపాలు వద్దు, డబ్బాపాలు తాగు అంటున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? తమిళనాడులో ఒక కోటి మంది తెలుగు వారున్నారు. మరి అక్కడ తెలుగు చదువులు ఎందుకు ఉండకూడదు" అని అన్నారు. 

 

     హోసూరు నుంచి వచ్చిన మరో ప్రతినిధి ఎం.ఎస్.రామస్వామి మాట్లాడుతూ... "తెలుగువాళ్లు తెలుగు పత్రికలు చదవడం లేదు. తమిళనాడులోనే కాదు... ఏ రాష్ట్రాలలో కూడా  చదవడం లేదు. కన్నడంలో ఎంతో మందికి జ్ఞానపీఠాలొచ్చాయి. తెలుగులో మూడే వచ్చాయి. ఏంటీ దారుణం! ఏమైపోయింది మన పోరాట పటిమ! అంటూ ఆవేదన చెందారు. 

 

      నాగపూర్ నుంచి వచ్చిన ఎన్.ఎన్.మూర్తి మాట్లాడుతూ "మహారాష్ట్ర లో ఉన్న ఐదు ప్రాంతాల్లో తెలుగు పూర్తి భిన్నంగా ఉంది. విదర్భలో తెలుగు బడే లేదు. అయితే... ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రమైనా ఇక్కడ తెలుగును ప్రభుత్వమే దూరం చేయడం దారుణం. ఒరియాలో భాషాపరమైన ఒత్తిడి ఉపాధ్యాయులపై పెడుతున్నారు. బలవంతంగా ఒరియాలో చెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రలో  ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం అనేది ఒరిస్సాలో ఉన్న తెలుగు వాళ్ల మీద కూడా పడే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. బెంగళూరు నుంచి వచ్చిన ప్రసాదం హనుమంతరావు మాట్లాడుతూ "తెలుగు కన్నడ తల్లులు అక్కాచెళ్లెళ్లు. ఇక్కడ భాష గురించి ఏం చెప్పాలో... ఏం చేయాలో తెలీని పరిస్థితి. ఎందుకంటే... తెలుగు రాష్ట్రమైన ఆంధ్రలో ఆంగ్ల మాధ్యమం తిష్ఠవేసిన తీరు... ఏం మాట్లాడనీయకుండా చేస్తోంది" అని ఆవేదన చెందారు. 

 

      ముంబయి నుంచి వచ్చిన ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్రలో 60 లక్షల మంది తెలుగువారున్నారు. ముంబయి నగరంలో 10 లక్షల మంది, ముంబయిలోని ఒక్క వర్లి లొనే 3 లక్షల మంది నివసిస్తున్నారు. కానీ గతంలో ముంబయిలో 52 తెలుగు మాధ్యమ బళ్లు ఉంటే అవి ఇప్పుడు 16కి తగ్గిపోయాయి. దీనికి కారణం అధ్యాపకుల నియామకం లెకపోవడం అని కొందరంటే, తల్లిదండ్రులు అని మరికొందరు చెబుతారు. ముంబైలో ఎంతోమంది తెలుగు వాళ్లుగా చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడుంది. తెలుగు రాష్ట్రాలు సాయం చెయ్యాలి.

 


తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ "ఆరు దేశాలకి మాతృ లిపిని ఇచ్చిన ఘనత తెలుగు వారి సొంతం. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమంలో బళ్లు నడుస్తుంటే, ఇక్కడ ఏపీ లో అమ్మ భాషలో చదువుని నిషేధిస్తే ఎలా? తెలుగు వాళ్లకోసం, తెలుగు అభ్యున్నతి కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ఆ తెలుగుకి ముప్పు వాటిలుతుంటే మాట్లాడకుండా ఎలా ఉంటాం?. తెలుగు బతికితేనే రచయితలు ఉంటారు. సంస్కృతి, జాతి అస్తిత్వం సాధ్యం.  ఈ రోజు భాష కోసం మాట్లాడుతున్న వాళ్ళకి కులం ఆపాదిస్తుండటం దారుణం. ప్రభుత్వ విధానం వల్ల 2021 జనాభా లెక్కల్లో తెలుగు 5వ స్థానానికి పడిపోయే పరిస్థితి దాపురించింది.  ఇక్కడ తెలుగుని నిషేధిస్తే ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారు ఏ ముఖం పెట్టుకుని భాష కోసం గళం విప్పుతారు? ఉపాధి భాషగా ఉంటేనే తెలుగు మనగలుగుతుంది. స్థానిక ఉద్యోగాల్లో తెలుగు లో చదివిన వారికి ప్రాధాన్యం ఉండాలి. వచ్చేతరానికి భాషను అందించడానికి గట్టి ప్రయత్నం జరగాలి." అని అన్నారు. 


"నా పేరు విక్రమ్ కుమార్. ఐఐటీ మద్రాసులో  భారతి లిపి అనే సంస్థలో ప్రాజెక్టు అసోసియేట్గా ఉన్నాను. రెండు ప్రాజెక్టులను గురించి మన తెలుగు వాళ్లకు అవగాహన కలిగించాలని ఈ సభలకు వచ్చాను.. ఒకటి భారతి లిపి. ఈ లిపి నేర్చుకోవడం ద్వారా వివిధ భారతీయ భాషల లిపులను సులభంగా చదవచ్చు. కొత్త భాషా ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ వేరే లిపిలో రాసివుంటే చదవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐఐటీలో ఒక ప్రొఫెసర్ దీనిని రూపొందించారు. భారతీయ స్కిప్ట్ డాట్ కామ్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
      సైన్స్ ఇన్ తెలుగు అనే మరో ప్రాజెక్టు ఉంది. అన్ని భారతీయ భాషల్లోకి శాస్త్ర విజ్ఞానం వెళ్లాలనే ఉద్దేశంతో చేసిందిది. ఇందులో శాస్త్ర విషయాలు తెలుగులో వచ్చే ప్రయత్నం చేసారు మద్రాసు ఐఐటీ ప్రొఫెసర్లు. 
      చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు అది సరైంది కాదు. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న చాలామంది ఒకప్పుడు తెలుగులో చదువుకున్నవాళ్లే.  తెలుగు మాధ్యమంలో చదువుకున్న పిల్లలు కూడా ఐఐటీలో సీటు సంపాదించవచ్చు. అలాగే ఇంటర్వూలో కూడా తెలుగులో సమాధానాలు చెప్పమని ఒత్తిడి చేయడం లేదు."


 

పత్రికా ప్రసార మాధ్యమ రంగ ప్రతినిధుల సదస్సు     

మహాసభల్లో భాగంగా పత్రికా ప్రసార మాధ్యమ రంగ ప్రతినిధుల సదస్సు ౨౯వ తేదీన మధ్యాహ్నం జరిగింది. దూరదర్శన్ రిటైర్డ్ డిప్యూటీ డైరక్టర్ జనరల్ డా. ఆర్.అనంత పద్మనాభరావు అధ్యక్షత వహించారు.

      పత్రికల్లో భాష గురించి రామోజీ ఫౌండేషన్‌ హెచ్ఓడీ జాస్తి విష్ణుచైతన్య మాట్లాడుతూ "తెలుగుభాష కోసం నిర్దిష్టంగా చేయాలనే ఉద్దేశంతో ఛైర్మన్‌ రామోజీరావు ప్రారంభించిన పత్రిక తెలుగువెలుగు. దీనిలో భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు... వీటి విశిష్టత ఏంటి? వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఏమిటి? కాపాడుకోకపోతే జరిగే నష్టం ఏమిటి? వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ మేం చాలా పరిశోధించి సాధికారికంగా ఇస్తున్నాం. ఇవన్నీ రెండు కోణాల్లో ఆలోచించి ఇస్తున్నాం. ఒకటి పాఠకులందరికీ అవగాహన కలగాలి. రెండోది భాషోద్యమానికి సంబంధించి, భాషకు సంబంధించి ప్రచారం చేసే వాళ్లందరికీ మంచి సరంజామా అందించాలి. వాళ్లు మిగతా వాళ్లలో అవగాహన కలిగించాలంటే వాళ్లు ఈ పరిశోధనలన్నీ చేసి చెప్పలేరు కాబట్టి, అవసరమైన సామగ్రి అంతా అందించాలనేది ఒక లక్ష్యం. భాషను కాపాడుకోవాలంటే, తరువాతి తరానికి దానిని అందించాలి. వాళ్లు ఏ కారణాల రీత్యా అయినా, ఏ మాధ్యమంలో చదువుతున్నా వాళ్లకి కనీసం ఇంట్లో అయినా దానిని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఛైర్మన్‌ రామోజీరావు బాలభారతం పత్రికను ప్రారంభించారు. దానిలో పిల్లలకు బడిలో ఉపాధ్యాయులుగానీ, ఇంటిలో అమ్మానాన్నలుగానీ చెప్పలేని విషయాలని తేటతెలుగులో వాళ్లకు అర్థమయ్యేలా అందిస్తే ఆ రకంగా వాళ్లు చదవడం పట్ల ఆకర్షితులవుతారు. కనీసం ఈ రకంగానైనా వాళ్లకి భాష అందుతుంది. అలవాటవుతుంది. భవిష్యత్‌ తరాలకి అది కొనసాగుతుందనే ఉద్దేశంతో దాన్ని కొనసాగిస్తున్నాం. వీటితోపాటు మన సాహిత్యం, ఇతర భాషల్లో ఉన్న గొప్ప సాహిత్యాన్ని కూడా మన వాళ్లకు అందించాలనే ఉద్దేశంతో 1978లో ప్రారంభించిన చతుర, విపుల పత్రికలను కూడా ఆయన చాలా ఉదారంగా, ‘‘మనం స్వచ్ఛంద సేవ చేస్తున్నాం కాబట్టి, వాటిని కూడా ఫౌండేషన్‌ కిందే కొనసాగించండి. ఎంత నష్టం వచ్చినా ఫరవాలేదు దాన్ని మనం భరిద్దాం. ఇది మనం తెలుగు జాతికి మనం అందిస్తున్న కానుక’’ అని భావించి సంవత్సరంన్నర క్రితం ఆ పత్రికలను కూడా ఫౌండేషన్‌కు అప్పగించారు. వీటన్నింటి ద్వారా తెలుగు ఉద్యమానికి, తెలుగు భాషకు ఒక వేదికను కల్పిస్తున్నామనే అనుకుంటున్నాం. ఆ వేదిక మీద భాషోద్యమకారులకు, భాషా ప్రేమికులకు మేమెంతో సహాయం చేయగలం. అలాగే వాళ్లకు భాషా సంబంధమైన సందేహాలకు, చర్చలకు మేం మంచి వేదికను కల్పిస్తున్నాం. దీనికి సంబంధించి ఇంకా మీ అందరి సహాయాన్ని సహకారాన్ని కోరుకుంటున్నాం. అలాగే పత్రికని అన్నిచోట్లకు, అన్ని ప్రాంతాలకు అందించలేకపోవచ్చు. అందువల్ల ఇటీవల తెలుగువెలుగు డాట్‌ ఇన్‌ పేరుతో ఒక అంతర్జాల వేదికను కూడా ప్రారంభించాం. దీనిలో ఉన్న సమాచారమంతా చాలా సాధికారికమైందే. ప్రస్తుతం భాషకు సంబంధించి, మాధ్యమానికి సంబంధించి చాలా ఆందోళన పడుతున్నాం. కానీ తల్లిదండ్రుల్లో మార్పుని, అవగాహనని కల్పించాలి. అది కల్పించాలంటే అందుకు అవసరమైన సాధికారిక సమాచారమంతా మేం పరిశోధన చేసి, అక్కడ ఇస్తున్నాం. మీరు దానికి ఉపయోగించుకోండి. అలాగే మీకు తోచిన అంశాలను, మీరు మా ద్వారా పది మందికి పంచవచ్చు. భాషకు సంబంధించి మీ ప్రాంతంలో వాడుకలో ఉన్న పదాలు, ప్రపంచమంతా వ్యాప్తి చేయవచ్చు అని మీకు అనిపించిన పదాలను మాతో పంచుకోండి. వాటిని మేం ప్రపంచమంతా వ్యాప్తి చేయడానికి మా ప్రయత్నం మేం చేస్తాం. అలాగే మేం చేస్తున్న పదాలను ఈనాడు, ఈటీవీ, కొత్తగా వచ్చిన ఈటీవీ భారత్‌ మాధ్యమాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నాం. ఇది మనందరం కలిసి చేసుకోవాల్సిన ఒక బృహత్కార్యం. దీనికి  మీ అందరి సహకారాన్ని కోరుతున్నాం. మా వంతు మేమేం చేయగలం అనేది కూడా మీనుంచి సలహాలు, సూచనలు కోరుతున్నాం. ఒకసారి అని కాదు ఎప్పటికప్పుడు మీరు మీకు తోచిన పద్ధతిలో మాకు అందజేస్తే, మేం యథాశక్తి వాటిని మీరు కోరుకున్న కోణంలో మేం సాయం చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం" అని చెప్పారు.


అతిథి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ మాట్లాడుతూ.. "అమాయకుడు ప్రకృతి, ఆంధ్రుడు వికృతి. మా తెలుగుతల్లికి ముళ్లపూదండ అయిపోయింది పరిస్థితి.   తెలుగు భాష చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. మన మాతృభాష తెలుగు పరిరక్షణకు నా సూచన ఒక్కటే. తెలుగు అక్షరాలు నేర్పిస్తాం. తెలుగు పాఠాలు నేర్పిస్తాం. తెలుగు పత్రికలు చదవడం నేర్పించండి. పత్రికను ప్రేమించుమన్న, పత్రికను చదివించుమన్న, మాతృభాషను పెంచుమన్న... పత్రిక చదవడం, దినపత్రిక చదవడం అలవాటు చేస్తే వాళ్లకు తెలుగు అద్భుతంగా వస్తుంది. వాళ్లు చాలా ఉత్తమ స్థితికి వస్తారు.     
      తెలుగు భాష చాలా ప్రీతిపాత్రమైన భాష. అయితే ఒకసారి తెలుగు తల్లి విగ్రహం కింద ఒకాయన అడిగాడు హాస్యావధానంలో... ఏమండీ తెలుగుతల్లికి మనం గౌరవించడానికి, అభిమానం చూపించడానికి భక్తితోటి మనం తెలుగుతల్లి విగ్రహం కట్టించాం కదా.. ఆ విగ్రహం కింద అక్షరాలు ఇంగ్లీషులో ఉన్నాయేమండీ అన్నారు. నేనేం చెప్పానంటే.. ఆ అక్షరాలు ఇంగ్లీషులోనే ఉంటే మంచిది. అవి ఎందుకంటే ప్రపంచబ్యాంకు రుణంతో కట్టించి ఉంటారు. మనకు అర్థం కాకపోయినా ఫర్వాలేదు. ప్రపంచబ్యాంకు అధికారులకు అర్థమైతే చాలు.. అని అన్నాను. అది పేపర్లో బాక్సుకట్టి వచ్చింది. ఆ మర్నాడే ఆ తెలుగుతల్లి పేరు తెలుగులోకి వచ్చింది. అందువల్ల హాస్యం వల్ల కూడా మనకు ఉపయోగపడుతుంది. అందువల్ల మీడియా అనేది ఈనాడు దినపత్రికను చదివితే మనకెంతో ప్రయోజనం. అది తెలుగువెలుగును పెంపొందిస్తుంది. విపులమైన విజ్ఞానాన్ని అందిస్తుంది. తెలుగుజాతి చతురమైన జాతి అనిపించుకుంటుంది. ఆ నాలుగు పత్రికల్లో నేను పనిచేస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. ఈనాడు పత్రిక అంటే రోజూ కోటి మంది తెలుగు వాళ్లకు తేనెలొలికే తెలుగును అందిస్తున్న భాష. ఆ పత్రిక గాక మీ ఇష్టమొచ్చిన పత్రిక చదవండి. ఏ పత్రిక చదివినా కూడా చాలా కష్టం. చాలా తొందరగా తెలుగు అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే... పత్రికను నడపటమంటే పుత్రికను నడపటం కన్నా కష్టం. పుత్రికను పెంచాలంటే ఎంత ఇబ్బందో చూస్తున్నాం. కదా సమాజంలో.. నిర్భయ కేసులు చూస్తున్నాం కదా! తెలుగు భాషకు పత్రికా పఠనం నేర్పించినట్లయితే అది అభయ. అభయమవుతుంది. తెలుగువారికి అభయమిస్తుంది" అని చెప్పారు.


      మీడియా విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ... "మీడియా మీద, మాంద్యం మీద దాడి జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ సభలు జరుపుకోవడం ముదావహం. మీడియా భాషా స్వేచ్ఛకి, మీడియం భావ స్వేచ్ఛకు సంబంధించినవి. వీటికి విఘాతం కలుగుతొంది. తెలుగు బతకాలంటే మీడియా స్వేచ్ఛ ఉండాలి. తెలుగును కాపాడుకోవడం కాదు.. అభివృద్ధి చేసుకోవాల్సిన వాస్తవాన్ని అందరూ గుర్తించాలి. సాంకేతిక పదజాలాన్ని తెలుగులోకి తేవాలి. మీడియా పక్షపాతం నుంచి బయటపడి ప్రజల పక్షాన నిలవాలి. తెలుగు మీడియా ఇప్పుడు వివాదాస్పద సంధి దశలో ఉంది. దాని స్వతంత్రతని కాపాడాలి" అని చెప్పారు.

      మీడియా విశ్లేషకులు, ఆకాశవాణి ప్రయోక్త నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ... "భాష, సాహిత్యం ఒకటి కాదు. ఈ విషయంలో గందరగోళం ఉండకూడదు. భాషకి సంబంధించి వార్తలు ఇవ్వడంలో ఎలాంటి దృక్పథం అనుసరిస్తున్నాం అన్నది కూడా ప్రధానమే. భాషాభివృద్ధికి సంబంధించి ఆవేశం కన్నా ఆలోచన, అధ్యయనం అవసరం" అని అన్నారు. 

      ఆంధ్ర జ్యోతి ప్రతినిధి రెంటాల జయదేవ మాట్లాడుతూ... "అమ్మ భాష కోసం ప్రజలు ఆందోళనలు వినిపిస్తున్న సభలు ఇవి. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత... భాషాభివృద్ధిలో రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఎందుకు ఉంటోంది.  కళాకారులు, సినీ ప్రముఖులు, మేధావులు అమ్మ భాషకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? తెలుగు భాషకు పత్రికలు చాలా సేవ చేస్తున్నాయి. ఈనాడు పత్రిక నిరంతరాయంగా తెలుగు సేవ కొనసాగిస్తోంది.  గగనసఖి (ఎయిర్ హోస్టెస్) లాంటి చాలా పదాల్ని ఈనాడు తెచ్చింది." అని చెప్పారు.

      ఆంధ్రభూమి దినపత్రిక ప్రతినిధి నిమ్మగడ్డ చలపతిరావు మాట్లాడుతూ.... "అమ్మభాషా మాధ్యమం మీద మీడియా ప్రతినిధులందరూ ముఖ్యమంత్రి కి వినతులు అందించి మన భాషని కాపాడుకోవాలి. రాజధాని సమస్యకు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని ఆంగ్ల మాధ్యమం వ్యతిరేకత మీద ఇవ్వడంలో పత్రికలు విఫలమయ్యాయి అన్నది వాస్తవం. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన మీడియా ఇపుడు తెలుగును కకావికాలం చేస్తోందన్నది కూడా విస్మరించలేనిదే" అని అన్నారు. 

      ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు, మంజులూరి కృష్ణకుమారి మాట్లాడుతూ... "భాషని నిలబెట్టే కళారూపాలని మనం కాపాడుకోవాలి. ప్రస్తుతం బళ్లలో తెలుగు బోధన సరిగా ఉండటం లేదు. ఒక పరిశోధన ప్రకారం.. 7వ తరగతి పిల్లాడు 5వ తరగతి తెలుగు పాఠాలు సరిగా చదవలేని పరిస్థితి.  దీన్ని సరిచేయాలి. తెలుగు టీచర్లలో భాషా నైపుణ్యాలు పెరగాలి" అని అన్నారు. 


 

      మహిళా ప్రతినిధుల సదస్సు విశిష్ట అతిథిగా నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. ఆమె  మాట్లాడుతూ.... "రచయిత్రుల కథలు, నవలలు, సీరియళ్లు చదివే నేనూ భాష నేర్చుకున్నాను. శ్రీశ్రీ కవితలు చదివి నేను కూడా కవిత్వం రాశాను. ప్రస్తుతం 'అ' అంటే అత్యాచారం అన్నట్లు సమాజం తయారైంది. మహిళ అంటే ఆటబొమ్మ కాదని, మహిళని మాతృమూర్తిగా గౌరవించాలని ఈ సందర్భంగా రచయిత్రులు నినదించాలి. దీనిమీద తీర్మానం చెయ్యాలి. ఆస్తులు, అంతస్తులు, అధికారం ఆశాశ్వతం. అక్షరాలు శాశ్వతం. పదవులు అశాశ్వతం. పదములు శాశ్వతం. అక్షరాలతో మనం సమాజాన్ని మార్చవచ్చు" అని అన్నారు.
"సంద్రమా సంద్రమా
ఎవరికోసమే ఈ పరుగులు
అందుకోసమే ఈ నురగలు
నీ ఘోషతో నా భాషలో 
పల్లవే రాయనా పాటలే పాడనా..." అంటూ కవితలు వల్లించారు.

      చెన్నై నుంచి వచ్చిన ప్రతినిధి ఎ.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.... "అవసరమైతే ఆంగ్లం నేర్చుకోవచ్చు. కేవలం ఉద్యోగం కోసం... ఉన్నట్లుండి తెలుగు మాధ్యమాన్ని తీసెయ్యడం మంచిది కాదు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల పిల్లలు ఏం చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలీదు.  పిల్లలు.. తల్లిదండ్రులతో భాగస్వామ్యం అవ్వాలంటే.. తెలుగు మాధ్యమం బడుల్లో ఉండాలి" అని అన్నారు.


      ముగింపు సభల్లో... మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షోపన్యాసం చేస్తూ.... "మనది ప్రజాసామ్య ప్రభుత్వం. కాని ప్రజల హక్కులకి రక్షణ లేదు. తెలుగు వెలగాలి. విద్య ద్వారా తెలుగు వికసించాలి.
 భాష ఎప్పుడు నశిస్తుందో అప్పుడే జాతి నశిస్తుందని  ఆవేదనతో   తెలుగు ప్రజలందరూ ఈ సభలకు వచ్చారు. వ్యక్తపరచలేని... ప్రజల ఆవేదనని వ్యక్తపరచేవాడే నిజమైన రాజకీయ నాయకుడు. ఈనాడు తెలుగు కోసం ప్రతీ తెలుగువాడి హృదయం క్షోభిస్తుంది.
       అందరూ ఈ సభల్లో పాల్గొనకపోవొచ్చు. కాని భాష పట్ల బలమైన కాంక్ష వుంది. తపన ఉంది. బడుల్లో తెలుగు తీసేసినా పలుకు బడుల్లో తెలుగుని కాపాడుకోవాలని నేను మనవి చేస్తున్నాను. సంతోషించదగ్గ విషయం ఏమంటే... ఈ సభల వల్ల వివిధ రాజకీయ నాయకుల మద్దతు మనకు లభించింది " అని చెప్పారు.


      తెలుగు జోలికొస్తే కలాల ద్వారా, గళాల ద్వారా రచయితలందరు నినదిస్తారని ఈ సభలు చాటి చెప్పాయి. 

- మండలి బుద్ధప్రసాద్


      ఇవాళ మన జీవితాల్ని శాసించే వాళ్ళు తెలుగు నేర్చుకుంటే పిల్లలు ఎందుకూ పనికిరారు అంటున్నారు. ఈ భావజాలం వల్ల భాషకి, సమాజానికి ప్రమాదం పొంచి ఉంది. ఈ స్థితి నుంచి... తెలుగు చదువుటే పర్లేదు, తెలుగు చదువుకుంటే బ్రహ్మాండం, మన పిల్లల్ని తెలుగులో చదివించకపోతే ఎందుకూ పనికి రారు అనే స్థితికి అంచెలంచెలుగా మనం చేరుకోవాలి. సాంకేతిక పదజాలాన్ని తెలుగులోకి తెచ్చుకుంటే అందరూ తెలుగు చదవడానికి ఆసక్తి చూపుతారు.

- పరకాల ప్రభాకర్, సామాజిక, రాజకీయ విశ్లేషకులు, వ్యాఖ్యాత


      తల్లకిందులుగా తపస్సు చేసినా ఇంగ్లీషు మాధ్యమము ఏపీలో విజయవంతం కాదు. మన దగ్గ అక్షరాస్యతే సరిగా లేదు, సరైన ఉపాధ్యాయులు లేరు. ఇక ఇంగ్లీషు మీడియం ఎలా కుదురుతుంది. ఇది మిడిమిడి జ్ఞానంతో తీసుకున్న నిర్ణయం. 

- మధు, సీపీఎం నాయకులు


మాతృభాషా పరిరక్షణకు ప్రతిఒక్కర్ని కార్యోన్ముఖులను చేస్తూ ౪వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా ముగిశాయి.

 

* * *


వెనక్కి ...

మీ అభిప్రాయం