సాహితీ శ్రామికుడు నవ్యతకు నాయకుడు

  • 263 Views
  • 1Likes
  • Like
  • Article Share

    వావిలిపల్లి రాజారావు

  • ఉపాధ్యాయులు, పొందూరు, శ్రీకాకుళం జిల్లా.
  • 9963606391
వావిలిపల్లి రాజారావు

దేశం బ్రిటిషు వలసపాలనలో మగ్గుతున్న రోజులవి. వ్యక్తి స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రం అంటేనే నిర్బంధించే సంక్షుభిత పరిస్థితులవి. అలాంటి గడ్డురోజుల్లో చదువుకుని, అచంచల మేధోసంపన్నుడిగా ఎదిగిన వ్యక్తి ‘కళాప్రపూర్ణ’ కట్టమంచి రామలింగారెడ్డి. సాహితీవేత్తగా, వక్తగా, విమర్శకుడిగా, విద్యావేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, అనేక రంగాల్లో తెలుగునాట తనదైన ముద్రవేశారాయన. 
‘‘గత
శత వసంతాల తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదట మనసులో మెదిలే కొద్దిమంది వైతాళికుల్లో కట్టమంచి రామలింగారెడ్డి గారొకరు. 1899లో తన 19 సంవత్సరాల వయస్సులో వారు రాసి ప్రచురించిన ‘ముసలమ్మ మరణము’ తెలుగు కవిత్వంలోకి ఒక కొత్త ఆలోచనను ప్రవేశపెట్టింది. నూటికి నూరుపాళ్లు ఆధునిక కావ్యం కాకపోయినా అది విషాదాంత కథనూ, ఆధునిక ఇతివృత్తాన్నీ తెలుగు కవిత్వంలోకి ప్రవేశపెట్టింది. 1914లో రామలింగారెడ్డి గారు రాసి ప్రచురించిన ‘కవిత్వతత్త్వ విచారము’ గ్రంథం తెలుగు సాహిత్యాధ్యయనంలో కొత్త వెలుగును ప్రసరింపజేసింది’’ అన్నారు వల్లంపాటి వెంకటసుబ్బయ్య. ‘ఆధునిక సాహితీ విమర్శకు ఆద్యుడు.. విద్యాపరిపాలన రంగాలలో అనవద్యుడు’గా గుర్తింపు పొందిన రామలింగారెడ్డి 1880, డిసెంబరు 10న చిత్తూరు జిల్లా కట్టమంచిలో జన్మించారు. తల్లిదండ్రులు నారాయణమ్మ, సుబ్రహ్మణ్యంరెడ్డి. పినతండ్రి పెద్దరామస్వామి రెడ్డికి దత్తపుత్రుడుగా వెళ్లారు. రామలింగారెడ్డి చిన్నతనంలోనే రామాయణ, భారత, భాగవతాల మీద పట్టు సాధించారు. పుస్తక పఠనం మీద ఆసక్తి పెంచుకున్నారు. ప్రాథమిక విద్య అనంతరం చిత్తూరు బోర్డు ఉన్నత పాఠశాలలో చేరారు. అక్కడి గురుదేవుల సాహచర్యంలో తెలుగు వ్యాకరణం, శబ్దశాస్త్రం, ఛందో విజ్ఞానం లాంటి అంశాల్లో మెలకువలు నేర్చుకున్నారు. చెన్నై క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1902లో బియ్యే పరీక్షల్లో చరిత్ర, తత్వశాస్త్రాల్లో బంగారు పతకాలను సాధించారు. రామలింగారెడ్డి ప్రతిభను గుర్తించిన బరోడా సంస్థానం ఉపకార వేతనం అందజేసి విదేశీ చదువులకు పంపించింది. అలా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసి అక్కడి విద్యావిధానాలను, విద్యాసంస్థల నిర్వహణా తీరునీ అవగాహన చేసుకున్నారు.
      రామలింగారెడ్డి మంచి వక్త. కళాశాల స్థాయి నుంచే ప్రసంగాలిచ్చేవారు. 1905లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడయ్యారు. ఇలా ఎన్నికైన తొలి భారతీయుడు కట్టమంచే కావడం విశేషం. విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉపన్యాసాలిచ్చి ఆంగ్లేయుల గడ్డ మీద అందరి ఆదరాభిమానాలనూ పొందారు. ఆయన అసాధారణ విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, హాస్య చతురత అలా లోకానికి వెల్లడైంది. నిర్భయంగా మాట్లాడటంలో రామలింగారెడ్డికి ఉన్న నేర్పు అనేక ప్రజాసమూహాలకు ఆయన నాయకత్వం వహించేందుకు ఆస్కారం కల్పించింది. అది ప్రజావేదికైనా, శాసనసభ అయినా కట్టమంచి ఉపన్యాస ధోరణి ప్రభావవంతంగా ఉండేది.
ఆధునిక విమర్శకు బాటలు
విద్యార్థి దశలోనే కవిత్వం పట్ల అమితమైన ఇష్టాన్ని పెంచుకున్నారు కట్టమంచి. డిగ్రీ చదువుతున్నప్పుడే ‘ఆంధ్ర భాషాభిరంజనీ సమాజం’ నిర్వహించిన పోటీల కోసం ‘ముసలమ్మ మరణం’ అనే ఖండకావ్యం రాశారు. ఉత్తమకావ్యంగా పండితుల ప్రశంసలతో పాటు ఇది బహుమతినీ పొందింది. పాఠకులకు కొత్త ఆలోచనలను, కొత్త దృష్టిని కలిగించింది. ఆ కళాశాల రోజుల్లోనే పింగళి సూరన ‘కళాపూర్ణోదయం’ మీద రామలింగారెడ్డి విమర్శనాత్మక ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత 1914లో మైసూరు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉన్నప్పుడు నాటి ప్రసంగాన్ని విస్తరించి రాతరూపంలోకి తీసుకొచ్చి ‘కవిత్వ తత్త్వ విచారము’ అనే సాహిత్య విమర్శగా ప్రచురించారు. తెలుగుసాహిత్య చరిత్రలో ఇదో నూతన ఒరవడిని సృష్టించింది. 
      కవుల చరిత్రలూ, అలంకార చర్చలే విమర్శగా చలామణి అవుతున్న రోజుల్లో ఒక కావ్యాన్ని సమగ్రంగా విశ్లేషించే పద్ధతికి కట్టమంచి శ్రీకారం చుట్టారు. అర్థం లేని ఆరోపణలు చేయకుండా కవిత్వం గురించి విపులంగా చర్చించి, దానికి విలువకట్టే సంప్రదాయానికి కట్టమంచే ఆద్యులు. విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన పాశ్చాత్య సాహిత్య విమర్శను చాలా శ్రద్ధగా అధ్యయనం చేశారు. కొత్తదనాన్ని ఆహ్వానించే పాఠకులు.. కట్టమంచి విమర్శా పద్ధతిని సహృదయతతో అర్థం చేసుకున్నారు. 
భావనాశక్తి ఉండాలి
‘కవిత్వతత్త్వ విచారం’లో కవిత్వం అంటే ఎలా ఉండాలి! మంచి కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలేంటీ! అసలు ‘కళాపూర్ణోదయం’ ఎందుకు గొప్ప కావ్యమయ్యిందీ! ఇలాంటి విషయాలెన్నింటినో చర్చించారు రామలింగారెడ్డి. ఒక కవి కల్పనా శక్తికీ, కథనానికీ, పాత్రపోషణకీ, నాటకీయతకీ, అంగాంగ సమన్వయానికీ కళాపూర్ణోదయం మంచి లక్ష్య గ్రంథమంటారాయన. సూరన్నకవి మరో రచన ‘ప్రభావతీ ప్రద్యుమ్నం’.. కళాపూర్ణోదయం అంత గొప్ప రచన కాలేకపోవడానికి కారణం అందులో చవకబారు శృంగారం రాజ్యమేలడమేనని చెబుతారు. 
      కవిత్వానికి భావనాశక్తి ప్రాణం. భావనాశక్తి అంటే కావ్యంలోని విషయాలను పాఠకుడి మనసులో ముద్రపడేట్టుగా చేయగలిగిన సామర్థ్యం. వ్యాకరణమూ, యతిప్రాసలు, అలంకారాలూ.. ఇలా అన్నీ సమకూరినా భావనాశక్తి లేని పాండిత్యం కృతకంగా ఉంటుంది. ఆలోచనలూ, భావాలూ సంకల్పాలూ అనేవి మానవ ప్రకృతిలోని మూడు ప్రధానాంశాలుగా రామలింగారెడ్డి గుర్తించారు. భావాలు లేకుండా పద్యాలు రాయవచ్చు గానీ కవిత్వపు మాధుర్యం లేకుండా రాసే కావ్యాలు సాహిత్యంలో నిలబడలేవంటారు ఆయన. పండితులందరూ కావ్యాలు రాయడం వల్ల ఆయా కావ్యాల్లో కవిత్వపు గాఢత లేకుండా పోయిందనీ, పాతతరంలో కవిత్వం కన్నా పాండిత్య ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యమివ్వడంతో అవి నేటి కాలానికి నాసిరకమైనవిగా మారాయని కట్టమంచి అభిప్రాయపడ్డారు. సమకాలీన జీవితాన్ని తిరస్కరించడమూ, అలంకార శాస్త్ర గ్రంథాల ఆధిపత్యాన్ని అంగీకరించడమూ, మానవ జీవితాన్ని గురించి మౌలికంగా ఆలోచించే సాహసం చేయకపోవడం వల్ల తెలుగులో నూతన భావప్రసరణ సాధ్యపడలేదు. పాత పద్ధతులనే అనుసరిస్తూ పాత కావ్యాలనే తిరిగి తిరిగి రాస్తున్నారే తప్ప కొత్త ప్రతిపాదనలు చేయట్లేదని సమకాలీన కవులను కట్టమంచి విమర్శించారు. 
కాలానికి అవసరమైన విమర్శ
సాహిత్య విమర్శకు సంబంధించి ‘కవిత్వ తత్వవిచారం’లో కట్టమంచి పదునైన ప్రతిపాదనలు చేశారు. గుణదోష విచారణ అనేది ఉత్తమ విమర్శకి కొలమానం అయినప్పటికీ దోషారోపణ చేస్తూనే అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను.. ఆలోచనలను అందించడం కూడా విమర్శకుడి బాధ్యత అని కట్టమంచి పేర్కొన్నారు. ఇలా కొన్ని సూత్రీకరణల ద్వారా తెలుగు సాహిత్యవిమర్శకి కొత్త బలం చేకూర్చారు కట్టమంచి. కవిత్వతత్త్వ విచారం ప్రచురించిన కొద్దికాలానికే రాజకీయాల్లో, విశ్వవిద్యాలయ పరిపాలనలో ఆయన తలమునకలైపోయారు.   
      సాహిత్యంలో సరికొత్త భావాలకూ, అధునాతన కవితా పద్ధతులకు పటిష్ఠ పునాదులు వేశారు కట్టమంచి. ‘ఆంధ్రసర్వ కళాశాల విద్యాప్రవృత్తి, లఘుపీఠికా సముచ్ఛయం, వ్యాసమంజరి, పంచమి, వేమన, నవయామిని, భారత ప్రశంస, అంపకం, దేవీ భాగవతం, ప్రతాప రుద్రీయం, భారత అర్థశాస్త్రం’ తదితర రచనలు ఆయన కలం నుంచి జాలువారాయి. కట్టమంచి సారస్వతంలో ఖండకావ్యాలు, వ్యాస సంపుటాలు, కావ్యాలూ, సాహిత్య విమర్శలతో వివిధ ప్రక్రియావైవిధ్యం కనిపిస్తుంది. ఛలోక్తులు, చమత్కారాలతో కట్టమంచి వచన రచనల్లో ఓ ప్రత్యేకశైలి ప్రస్ఫుటమవు తుంది. అయితే, ఆయన ‘కవిత్వతత్త్వ విచారం’ మీద పండితులు కొందరు విమర్శలు చేశారు. కాళూరి వ్యాసమూర్తి శాస్త్రి, అక్కిరాజు ఉమాకాంతం, నోరి నరసింహశాస్త్రి తదితరులు కట్టమంచి లేవనెత్తిన అంశాలకి జవాబులు చెప్పలేదు కానీ, పాశ్చాత్య సులోచనాలతో తెలుగు సాహిత్యాన్ని చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. కానీ, ‘కవిసమ్రాట్‌’ విశ్వనాథ సత్యనారాయణ మాత్రం ‘‘రామలింగారెడ్డిగారు కవిత్వతత్త్వ విచారము రాసి విమర్శాపథంలో గొప్ప దృక్పథం కలిగించి నవ్యసాహిత్యానికి కొత్త బోదెలు తవ్వారు’’ అన్నారు. ‘‘కాలానికి అవసరమైన విమర్శ కట్టమంచిది. కాలగమనం ఇష్టంలేక అన్నీ తాటాకుల్లోనే ఉన్నాయనే తత్వం ఆయన వ్యతిరేకులది’’ అని వ్యాఖ్యానించారు చేకూరి రామారావు. 
విద్యావేత్త.. నాయకుడు
కేంబ్రిడ్జిలో ఉన్నప్పుడే భారత జాతీయ నాయకులతో కట్టమంచికి పరిచయాలుండేవి. తమ విశ్వ విద్యాలయంలో ప్రసంగించడానికి గోఖలే, లాలా లజపతి రాయ్‌ లాంటి వారిని ఆహ్వానించేవారు కట్టమంచి. గోఖలే వ్యక్తిత్వానికి కట్టమంచి ప్రభావితులయ్యారు. ఆయన సలహా మేరకే బోధనా వృత్తిని స్వీకరించారు. బరోడా కళాశాలలో అధ్యాపకులుగా చేరారు. కొద్ది కాలం తర్వాత మైసూరు మహారాజు కళాశాలలో చేరారు. ఆంగ్లం, చరిత్ర, తర్కశాస్త్రాలను ఆయన బోధించేవారు. అమెరికా, ఫిలిప్పీన్స్, జపానుల్లో పర్యటించి అక్కడ విద్యా సంస్థల్ని, విద్యా విధానాలనూ కట్టమంచి పరిశీలించారు. మైసూరు మహారాజు కళాశాల ప్రధానాచార్యునిగా, విశ్వ విద్యాలయం రూపకర్తగా, విద్యాశాఖా ధికారిగా వివిధ హోదాల్లో పన్నెండేళ్ల పాటు పనిచేశారు. ఆ రోజుల్లో కట్టమంచి పాఠాలు వినేందుకు ఆయన విద్యార్థులు కానివారు కూడా వచ్చేవారట! 1916లో ఏర్పాటైన మైసూరు విశ్వ విద్యాలయం కట్టమంచి కృషి ఫలితమే. 1918లో కర్ణాటక రాష్ట్ర ఇన్‌స్పెక్టరు జనరల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌గా రామలింగారెడ్డి నియమితులయ్యారు. ఆ సమయంలో పాఠశాలలు లేని గ్రామాల్లో కొత్త బడుల ఏర్పాటు కోసం ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. దళితులకు పాఠశాల ప్రవేశం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. బ్రిటీషువారికి వ్యతిరేకంగా గాంధీ నాయకత్వంలో సహాయనిరాకర ణోద్యమం ముమ్మరంగా కొనసాగుతున్న రోజుల్లో కట్టమంచి అధ్యాపకత్వానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంతకాలం జస్టిస్‌ పార్టీలో పనిచేసి ఆ తర్వాత యునైటెడ్‌ నేషనలిస్టు పార్టీలో చేరారు. 1935లో కాంగ్రెస్‌ తరఫున చెన్నై శాసన మండలికి ఎన్నికయ్యారు. సభలో ప్రజా సమస్యల మీద గళం విప్పి జనాదరణకు పాత్రులయ్యారు. అద్భుత ప్రసంగాలతో అప్పటి ప్రభుత్వ విధానాలను దునమాడారు.
      ఆ సమయంలోనే ఆంధ్రులకు ఓ విశ్వవిద్యాలయం ఉండాలన్న డిమాండును ప్రభుత్వం ముందుంచారు కట్టమంచి. ఆ స్వప్నం సాకారమై, ఆంధ్ర విశ్వ కళా పరిషత్తుకు కట్టమంచే తొలి ఉపకులపతి అయ్యారు. ఆయన సూచన మేరకే ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని విజయ వాడకు మారుగా విశాఖలో ఏర్పాటు చేసింది. రాజకీయ కార్యకలాపాల వల్ల కొద్దికాలానికి ఉపకులపతి పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. 1936- 1949 మధ్యలో మళ్లీ విశ్వవిద్యాలయం బాధ్యతలు వహించి దాన్ని ఉత్తమ విద్యాసంస్థగా నిలబెట్టారు. ఏలూరులోని ప్రఖ్యాత ‘శ్రీ సీఆర్‌ రెడ్డి కళాశాల’ కట్టమంచి పేరిట ఏర్పాటైందే. 1945లో రామలింగారెడ్డి ఏయూ ఉపకులపతిగా ఉన్నప్పుడు ఆయనే దీన్ని ప్రారంభించారు. విద్యారంగంలో కట్టమంచి కృష్టికి అప్పటి ఆంగ్ల ప్రభుత్వం ‘సర్‌’ బిరుదును ప్రదానం చేసింది. 
      ఆధునిక తెలుగు సాహిత్యానికి బాటలు పరచడంతో పాటు దేశ పురోభి వృద్ధికి ఎనలేని సేవచేసిన రామలింగారెడ్డి 1951 ఫిబ్రవరి 24న ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ‘‘పెక్కేండ్లు ఆంధ్ర విశ్వ విద్యాలయోపాధ్యక్షతా పదవి నిస్సామాన్య ప్రతిభతో బరిపాలించిన మహావ్యక్తి రామలింగారెడ్డి గారు. రసలుబ్ధుడైన యీతని సౌహార్దము కొందఱభినవాంధ్ర కవులకు మూలశక్తియైనది. రాయప్రోలు, అబ్బూరి, దువ్వూరి, పింగళి మున్నగువారి యభ్యున్నతికీయన ఆసరా మేలయినది’’ అన్న మధునాపంతుల మాటలు తెలుగు సాహిత్యంపై కట్టమంచి ప్రభావానికి అద్దంపడతాయి. విభిన్న రంగాల్లో అవిరళ కృషి చేసిన కట్టమంచి ఆకాంక్ష ఒక్కటే.. ‘‘తెలుగు భాష యొక్కటి మాత్రమక్షయ ముగ నిలిచియుండినజాలును’’!


వెనక్కి ...

మీ అభిప్రాయం