అహింసకు అర్థమేంటి?

  • 88 Views
  • 0Likes
  • Like
  • Article Share

అహింస బోధిస్తాం/ ప్రశాంతి సాధిస్తాం/ లోకంలో ఆకలే లేకుండా చేస్తాము... ఇది దాశరథి చైతన్య గీతిక. హింస రాజ్యం చేసే చోట సాధారణ జీవితం కల్లోల భరితమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి అసాధ్యం. అభివృద్ధి లేనిచోట ఆకలిదప్పులకు అంతే ఉండదు. అదే అహింసా మార్గంలో నడవటం నేర్చుకున్నప్పుడు, సమాజమంతా అదే తాటిపై నడుస్తున్నప్పుడు మనుషుల ముఖాల్లో ప్రశాంతత దర్శనమిస్తుంది. ప్రశాంతమైన మనసులు మాత్రమే సమతులమైన లోకాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేస్తాయి. ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడు ఆకలి అన్న పదం ఏ లోగిలిలోనూ వినపడదు. మొత్తమ్మీద అహింస అన్నది వ్యక్తి వికాస మార్గమొక్కటే కాదు సమాజాభివృద్ధి సూత్రం కూడా!
      ‘‘పరిపూర్ణమైన అహింసను గురించి ఎవరికీ తెలియదు. కనుక అట్టి అహింసను ఆచరణలో పెట్టగలవారెవ్వరూ లేరు. భౌతికంగా జీవించినంత కాలము పరిపూర్ణ అహింసా విధానం అసంభవం. భుజించుట, త్రాగుట, నివసించుట, తిరుగుట ఇత్యాది కార్యాచరణలో జరుగుచున్న నాశనమంతయు స్వార్థజనితము, కనుక హింసాపూరితము’’... ఇది కోగంటి రాధాకృష్ణమూర్తి ‘గాంధీమార్గం’లో కనిపించే మహాత్ముడి బాట. మనసు, మాట, చేతలతో ఇతరులను ఏమాత్రం ఇబ్బంది పెట్టినా అది హింస కిందికే వస్తుందన్నది నిఘంటువుల మాట. హరి నామస్మరణను ద్వేషిస్తూ, ప్రహ్లాదుణ్ని తూలనాడుతూ కఠోరమైన శిక్షలకు గురిచేశాడు హిరణ్యకశిపుడు. అతని బంట్లయితే పసివాణ్ని నిప్పుల్లోకి విసిరేశారు. పాములతో కరిపించారు. ఏనుగులతో తొక్కించారు. ఎత్తయిన పర్వతం మీదినుంచి కిందికి తోశారు. ఇన్ని చేసినా... 
పాఱడు లేచి దిక్కులకు బాహువు లొడ్డడు బంధురాజిలో
దూఱడు ఘోరకృత్యమని దూఱడు తండ్రిని మిత్రవర్గమున్‌
జీరడు మాతృసంఘమువసించు  సువర్ణగృహంబులోనికిన్‌
దాఱడు కావరే యనడు తాపము నొందడు కంటగింపడున్‌

      ప్రహ్లాదుడు కన్నీళ్లు పెట్టలేదు. భయపడలేదు. అడ్డుకోలేదు. తండ్రిని దూషించలేదు. ఎదిరించలేదు. తల్లి కొంగు వెనుక దాక్కోలేదు. బంధువుల మధ్యకు దూరిపోలేదు. మిత్రులను పిలవలేదు. కాపాడమంటూ ఎవరినీ అర్థించలేదు. కోపం తెచ్చుకుని మనసును కష్టపెట్టుకోలేదు. చిన్న పిల్లాడు ఇలా ఉండటానికి ఎంత గుండె నిబ్బరం కావాలి! అలా ఉన్నాడు కాబట్టే చివరికి గెలిచాడు. అందుకే వేమన కూడా ‘‘తిట్టి కొట్టిరేని తిరిగి మాటాడక/ అట్టునిట్టు చూచి అదిరిపడక/ తన్నుగాని యట్లు తత్త్వజ్ఞుడుండును’’ అన్నాడు. ఇదే మరి అహింసా మార్గమంటే. ‘అహింస గొప్పది కాదంటారా... నాలుగు తగిలించండి వాళ్లకి’ అనే వాళ్లు దీన్ని అర్థం చేసుకుంటే మేలు. 
      బుద్ధుని గొప్పతనాన్ని, అహింసావాదాన్ని వివరిస్తూ కరుణశ్రీ ఓ కథ చెప్పారు. అదేంటంటే... గౌతముడు, దేవదత్తుడు వన విహారం చేస్తున్నారు. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న హంసను దేవదత్తుడు బాణంతో కొట్టాడు. అది నేలపడి విలవిల్లాడుతుంటే గౌతముడు వెళ్లి దానికి చికిత్స చేశాడు. ‘నేను కొట్టాను కనుక అది నాది’ అన్నాడు దేవదత్తుడు. ‘నేను రక్షించాను కనుక అది నాది’ అని గౌతముడు సమాధానమిచ్చాడు. ఇద్దరూ వెళ్లి శుద్ధోదన మహారాజును న్యాయమడిగారు. ‘ఈ హంస ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్లదే’నని తీర్పుచెప్పాడు ఆ మహారాజు. తర్వాత దేవదత్తుడు పిలిస్తే భయంతో హంస వెళ్లదు. గౌతముడు ‘చెల్లిరావే, కల్పవల్లిరావే, పాలవెల్లిరావే, కన్నతల్లిరావే, చక్కదనములీను చక్కదనాల జాబిల్లిరావే, హంస తల్లి రావే’ అని పిలవగానే వచ్చి చేతుల్లో వాలింది! 
      ఈ కథా సారంశమొక్కటే... హింసతో దేన్నీ సాధించలేం. 
... భీరులనే కర్మవీరుల గావించు/ ఆయన పిలుపు శంఖారవంబు/ సత్యంబు శాంత్యహింసలకు స్వాగతమిచ్చె/ ఆయన బ్రతుకు మహా ప్రయాగ ... అంటూ ఆనాడు గాంధీజీని కీర్తించారు కరుణశ్రీ. ఆ మహాత్ముడి చేతుల్లోని అహింసాయుధమే జాతికి పట్టిన పీడను వదిలించింది. అహింస మార్గాన్ని స్వయంగా అనుసరిస్తూ, కోట్లాది మందితో అనుసరింపజేయించారు కాబట్టే ఆయన పుట్టినరోజు ప్రపంచమంతటికీ ‘అహింసా దినోత్సవం’ అయ్యింది. కాబట్టి ‘కండ లేని వాడికే గండం’ అన్నది అబద్ధం. కండను నమ్ముకుంటే కన్నీరు మిగులుతుంది. మనతోపాటు లోకమంతా గండాలపాలవుతుంది. ‘అహింసా పరమో ధర్మః’ అన్న తాత్విక దృక్పథమే మన బాట అయినప్పుడు, మార్గమధ్యంలోని రాళ్లూముళ్లూ కాస్త బాధించినా చివరికది గమ్యాన్ని చేరుస్తుంది. ఇంతకూ ఆ గమ్యం ఏంటంటారా... సుఖప్రదమైన సంఘజీవనం.  


వెనక్కి ...

మీ అభిప్రాయం