తిరువీధుల మెరిసీని దేవదేవుడు

  • 461 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఆశ్వయుజ మాసం తొలిదినాలు... శరదృతువు మొదలై వర్షాల నుంచి తెరిపి లభించే సమయం... భారతదేశం అంతటా సమశీతల వాతావరణం నెలకొంటుంది. ఆ శారద రాత్రుల చల్లటి వెన్నెల వేళలో దేశమంతా దసరా సంబరాల్లో మునిగిపోతుంది. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. ఇంతటి కోలాహలం మధ్య తిరుమల గోవిందనామాల ఘోషతో మారుమోగుతుంది. బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు ఊరూవాడా కదలివస్తుంది. ఏడుకొండలు భక్తజన సంద్రాలవుతాయి. 
తిరుమల
బ్రహ్మోత్సవాలు క్రీ.శ.7వ శతాబ్ది నుంచి జరుగుతున్నట్లు ఆధారాలు ఉన్నాయి. పల్లవ యువరాణి ‘సమవాయి’ వీటిని ప్రారంభించిందట. ఆ తర్వాత వచ్చిన రాజులు వాటిని కొనసాగించారు. మొదట్లో ఏడాదికి రెండుసార్లు చొప్పున బ్రహ్మోత్సవాలు జరిగేవి. విజయనగర రాజుల కాలానికి నెలకొకటి చొప్పున 12 ఉత్సవాలకు చేరుకున్నాయి. ఇప్పుడు దసరా నవరాత్రులు, వసంత నవరాత్రుల్లో మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలప్పుడు మలయప్ప స్వామి తన దేవేరులు శ్రీదేవి, భూదేవీ సమేతుడై... ఆలయ ప్రధానార్చకుడి పర్యవేక్షణలో, వేదపండితులు నాలాయిరం (ఆళ్వారులు తమిళంలో రాసిన వైష్ణవ కీర్తనలు) చదువుతూ ముందు సాగుతుండగా, వివిధ సాంస్కృతిక బృందాలు వెంటరాగా వాహనాల మీద ఊరేగుతాడు. అప్పుడు ఆ ఆనంద నిలయుణ్ని చూసేందుకు రెండుకళ్లూ చాలవు. సాధారణంగా దసరా నవరాత్రుల్లో బ్రహ్మోత్సవాలు జరిగినా, అధికమాసం వస్తే... మొదటిసారి భాద్రపదంలో, రెండోసారి ఆశ్వయుజంలో (దసరా నవరాత్రులప్పుడు) జరుగుతాయి. మొదటిసారి జరిగేవి సాలకట్ల ఉత్సవాలు. రెండోసారి ధ్వజారోహణం, అవరోహణం కార్యక్రమాలు ఉండవు. ఈసారి ఈ అధికమాసం వచ్చింది. 
      బ్రహ్మదేవుడు ప్రారంభించాడు కాబట్టే ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయంటారు. ఉత్సవ ప్రారంభానికి ముందురోజే స్వామి సేనాధిపతి విష్వక్సేనుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఆలయ పరిసరాలను చూసివస్తాడట. అప్పుడే దేవాలయంలో యాగశాలకు ఉపకరించే మట్టిని సంగ్రహిస్తారు. ఇదే ‘మృత్సంగ్రహం’. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా అంకురారోపణం చేస్తారు. దీని కోసం మట్టికుండల్లో నవధాన్యాలు ఉంచుతారు. ఇది జీవోత్పత్తి వికాసాలకు, సమృద్ధికి చిహ్నం. మొదటిరోజు సాయంకాలం శుభముహూర్తంలో, వేదమంత్రాలు, నగారా మోతల నడుమ ధ్వజస్తంభం మీద గరుడముద్ర ఉన్న పచ్చరంగు పతాకాన్ని ఎగరవేస్తారు. పసుపురంగును శుభప్రదంగా నమ్ముతారు. ఇదే ధ్వజారోహణం... సకల దేవతలకూ ఉత్సవ ఆహ్వానం. అప్పటినుంచి తొమ్మిది రోజుల వరకూ తిరుమలలో సంబరాలు అంబరాన్నంటుతాయి. 
ఈ ఉత్సవాల వైభవాన్ని కళ్లారా తిలకించే అన్నమయ ‘తిరువీధుల మెరసీని దేవదేవుడు’ అని ఆలపించాడు కాబోలు. ఆయన కాలానికే వాహనసేవలు స్థిరమయ్యాయి. ఆ పాటలో పేర్కొన్నట్లే ఇప్పటికీ ఆ సేవలు అలాగే కొనసాగుతున్నాయి.
తిరువీధుల మెరసీని దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను       
తిరుదండెలపైనేగే దేవుడిదె తొలినాడు
సిరుల రెండోనాడు శేషుని మీద
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరికింద
పొరి నాలుగోనాడు పూవు కోవిల లోను       
గ్రక్కున ఐదోనాడు గరుడునిమీద
ఎక్కెను ఆరోనాడు ఏనుగుమీద
చొక్కమై ఏడోనాడు సూర్యప్రభమీదను
ఇక్కువ తేరును గుర్రమెనిమిదోనాడు              
కనకపు టందలము కదిసి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట
ఎనసి శ్రీవెంకటేశుడింతి యలమేల్మంగతో 
వనితల నడుమను వాహనాలమీదను
          
       ఉత్సవ ప్రారంభానికి ముందు అనంతుడు, గరుత్మంతుడు, చక్రాళ్వారు, విష్వక్సేన, దేవేరులతో కలిసి మలయప్ప తిరుమల మాడ వీధుల్లో ఊరేగుతాడు. ఈ దృశ్యాన్ని చూసిన అన్నమయ్య ‘తిరుదండెలపైనేగే దేవుడిదె తొలినాడు’ అన్నాడు. తిరు అంటే పూజ్యమైన, ఇక దండె అంటే కొయ్యతో చేసిన దిమ్మెలాంటిది. పల్లకీలకు ఆధారంగా ఉండేది. మొత్తమ్మీద తిరుదండెలపై అంటే పల్లకిపై అని. ఈ సమయంలోనే దేవతలు, గంధర్వులు, అప్సరసలు, మునులకు ఆహ్వానం పలికేందుకు గరుత్మంతుడు ఆలయ పరిసర ఆకాశంలో విహరిస్తాడని అంటారు. 
శేషవాహనారూఢుడు
ధ్వజారోహణం తర్వాత మొదటిరోజు రాత్రివేళ శ్రీవారు శ్రీదేవీ భూదేవీ సమేతుడై ఏడుకొండలకు ప్రతిరూపమైన ఆదిశేషుడిపై విహరిస్తాడు. పాలకడలిలో పద్మనాభుడు పవళించేది ఆదిశేషుడిపైనే కదా! శయ్యగా సేవలందించినందుకు గుర్తింపుగా అనంతుడికి దక్కిన వరమే పెద్ద శేషవాహనం. రెండోనాడు స్వామి చిన్న శేషవాహనం మీద దర్శనమిస్తాడు. ఈ చిన్న శేషవాహనం వాసుకి. పాముల్లో విష్ణుమూర్తి అంశ వాసుకిలో ఉంటుందని కృష్ణుడి గీతా బోధ. శేషవాహనాల మీద విష్ణుమూర్తి ఊరేగడం మనలో నిబిడీకృతమై ఉన్న కుండలిని శక్తి గురించి తెలియజేయడమే. అంతేకాదు శేషుడు కాలానికి ప్రతీక. అదేరోజు రాత్రి వేంకటశైల విభుడు హంస వాహనయానం చేస్తాడు. హంస పాలూ నీళ్లను వేరు చేస్తుంది. దీని నుంచి మనం కూడా చెడును విసర్జించి మంచిని గ్రహించాలన్న సందేశమిస్తాడు మరాళ వాహనం మీదున్న ఆ పరమహంస.
కొలువుదీరినాడు కల్పవృక్షం మీద
మూడోరోజు పొద్దున స్వామి దేవేరులతో కలిసి సింహవాహనాన్ని అధిష్ఠిస్తాడు. విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ని సంహరించాడు. పీడన నుంచి లోకానికి విముక్తి ప్రసాదించాడు. భగవద్గీతలో తన విభూతులను వివరిస్తూ మృగాల్లో మృగరాజులో తన అంశ ఉంటుందంటాడు పరమాత్ముడు. అంతేకాదు, సింహం బలానికి, పౌరుషానికి ప్రతీక. మనమూ కష్టాలు, ఆటంకాలకు లొంగిపోకుండా సింహంలా జీవించాలన్నదే దీని అంతరార్థం. మూడోరోజు రాత్రివేళ ముత్యపు పందిరి వాహనంపై అలరిస్తాడు కోనేటప్ప. మానవాళికి శాంతి, ప్రేమ, సహజీవన బోధే ఈ వాహన సేవ సందేశం. అన్నమయ్య పదంలో మురిపెంగా ఒదిగింది ఈ ముత్యపు పందిరి వాహనమే.
      కోరిన కోరికలు తీర్చేదిగా పేరుగాంచిన కల్పవృక్షం వాహన సేవ నాలుగో రోజు పొద్దునే జరుగుతుంది. అంతేకాదు, కామధేనువూ చింతామణి కూడా ఊరేగింపులో పాల్గొంటాయి. ‘పొరి నాలుగోనాడు పూవు కోవెలలోను’ అని అన్నమయ్య అన్నది కల్పవృక్ష వాహనం గురించే. పువ్వుకోవెల అంటే కల్పవృక్షమే. అదే రోజు రాత్రి స్వామి సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తాడు. ఆయన రాజులకు రాజు కదా అందుకే ఈ వాహనం. అయిదోనాడు ఉదయం వేంకటేశ్వరుని కుడిచేతిలో బంగారు చిలుక ఉంటుంది. ఎడమచేతిలో మణులు పొదిగిన మంగళసూత్రం కనిపిస్తుంది. ఇదే మోహిని అవతారం. 
మాతృసేవకు మెచ్చి...
మొత్తం బ్రహ్మోత్సవాలకు తలమానికం అయిదోరోజు రాత్రివేళ జరిపే గరుడవాహన సేవ. ఈ వేడుక చూడటానికి లక్షల మంది భక్తులు వస్తారు. గరుత్మంతుడి తల్లి వినత నాగమాత కద్రువ దగ్గర దాసిగా ఉంటుంది. అమృతం తీసుకువస్తేనే... మీ అమ్మకు దాస్య విముక్తి అంటాయి నాగులు. దాంతో స్వర్గానికి వెళ్లి అమృతం తీసుకువస్తాడు గరుత్మంతుడు. అలా గరుడుడి మాతృసేవకు గుర్తింపుగా ఎల్లలోకాలకు ఏలిక విష్ణుమూర్తికి వాహనంగా ఉండే అర్హత లభించింది. ఈ రోజున స్వామి పురాతనమైన, ప్రశస్తమైన మకరకంటి, లక్ష్మీహారాలతో అలంకృతుడవుతాడు. ఇంకా శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్‌ (గోదాదేవి) సన్నిధి నుంచి తెప్పించిన తులసిమాలను వేంకటపతి మెడలో వేస్తారు. ఆండాళ్‌ తాను ధరించి విడిచిన మాలను శ్రీరంగనాథుడికి అర్పించిన ఘట్టానికి గుర్తుగా చేసేది ఇది. ఈమెనే చూడికుడుత్త నాచ్చియార్‌ అంటారు. గోదాదేవి శ్రీరంగనాథుడిలో ఐక్యమయ్యే ఘట్టమే కృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’కు ఆధారం.
ఇక్కువ తేరును గుర్రము...
కోనేటప్ప కోదండ రామయ్యగా మారి ఆరోరోజు హనుమంత వాహనసేవ జరిపించుకుంటాడు. సాయంకాలం దేవేరులతో కలిసి స్వర్ణరథం మీద సాక్షాత్కరిస్తాడు. బంగారు రథాన్ని లాగే అవకాశం మహిళలకే ప్రత్యేకించారు. ఆ తర్వాత ఏడు కొండలవాడు ఏనుగుమీద ఊరేగుతాడు. సముద్ర మథనంలో లక్ష్మీదేవితోపాటే రెండు ఏనుగులు ఆమెను అభిషేకిస్తూ క్షీరసాగరం నుంచి పైకి వచ్చాయి. ఆమెను మెప్పించేందుకే ఈ సేవ. అన్నమయ్య పదం కూడా ‘ఎక్కెను ఆరోనాడు ఏనుగుమీద’ అన్నది. 
ఏడోనాడు పొద్దునే లేలేత రవికిరణాలు సప్తగిరులను ఆక్రమిస్తుండగా, స్వామి సూర్యప్రభ వాహనం మీద ఊరేగుతాడు. భూమి మీద శక్తి అంతటికి ఆధారం సూర్యుడు. అందుకే సూర్యుణ్ని ప్రత్యక్షదైవంగా సూర్యనారాయణుడిగా కొలుస్తారు. సంకీర్తనాచార్యుడు ‘చొక్కమై ఏడోనాడు సూర్యప్రభ మీదను’ అన్నాడు. రాత్రివేళ చంద్రప్రభ వాహనసేవ జరుగుతుంది. విశ్వవిభుడికి సూర్యచంద్రులు రెండు నేత్రాలన్న విషయాన్ని స్ఫురింపజేస్తాయి ఇవి. ఎనిమిదోనాడు శుభ ముహూర్తంలో భక్తులు గోవింద నామాన్ని స్మరిస్తూ స్వామివారి తేరును లాగుతారు. దీన్ని తోరణాలతో అలంకరించి ఆలయం చుట్టూ తిప్పుతారు. అదే రోజు నిర్వహించే అశ్వవాహన సేవతో వాహనసేవలు ముగుస్తాయి. భక్తుల కలిదోషాన్ని నివృత్తి చేయడమే ఈ అశ్వవాహనం వెనుక ఉన్న ఉద్దేశం. ‘ఇక్కువ తేరును గుర్రమెనిమిదోనాడు’ అని అన్నమయ్య పదం వివరిస్తుంది. ఇక్కువ అంటే ‘జాడ, ఉనికి, స్థానం’ అని అర్థం. 
పదోనాడు పెండ్లిపీట
తొమ్మిదో రోజు దేవేరుల సమేతంగా స్వామికి, తర్వాత చక్రాళ్వారును పుష్కరిణిలో స్నానం (స్నపన తిరుమంజనం) చేయించడంతో బ్రహ్మోత్సవ సంరంభం ముగుస్తుంది. దీనికి సూచికగా ధ్వజావరోహణం చేస్తారు. ఈ రోజే స్వామి, దేవేరులను పల్లకిలో మాడవీధుల్లో తిప్పుతారు. ఈ వేడుకనే ‘కనకపుటందలము కదిసి తొమ్మిదోనాడు’ అన్నాడు అన్నమయ్య. అందలం అంటే పల్లకి. ఇంతటితో ఆగకుండా ‘పెనచి పదోనాడు పెండ్లిపీట’ అని స్వామికి కల్యాణాన్నీ జరిపించాడు. ‘ఎనసి శ్రీవెంకటేశు డింతి అలమేల్మంగతో/ వనితల నడుమను వాహనాల మీదను’ అంటూ తిరువీధుల్లో గరిమల మించిన సింగారాలతో మెరిసి పోతున్నాడంటాడు. ఎనసి అంటే కలిసి, గరిమ అంటే గొప్పతనం. వర్ణించలేనంత గొప్పగా ఉన్నాయట ఆయన సింగారాలు(అలంకారాలు).
      ఇలా అంగరంగ వైభవంగా, కన్నుల పండగగా జరిగే తిరుమల బ్రహ్మోత్సవాలు భక్తుల్లో ఆధ్యాత్మికతను, పారవశ్యాన్ని నింపుతాయి. ఇలాంటి ఉత్సవాలే భారతీయ సంస్కృతీ ధార అవిచ్ఛిన్నంగా కొనసాగేందుకు ఊతగా నిలుస్తున్నాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం