మరుగవుతున్న మాణిక్యాలు

  • 1298 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా.కె.ఎల్‌.వి.ప్రసాద్‌

  • హనుమకొండ
  • 9866252002
డా.కె.ఎల్‌.వి.ప్రసాద్‌

కాలం గడిచే కొద్దీ పాతవి కొన్ని మరుగున పడిపోతుంటాయి. అలానే కొత్తవీ మన జీవితాల్లో భాగమైపోతుంటాయి. ఇవి సహజంగా జరిగేవే. భాష కూడా దీనికి అతీతమేమీ కాదు. ఒకప్పటి తెలుగు వాడుక భాషతో పోలిస్తే... ఇప్పటి తెలుగులో ఆంగ్లం ప్రభావం ఎక్కువ. ఫలితంగా మనవైన కొన్ని పదాలు వాడుకలోంచి కనుమరుగవుతున్నాయి. 
ఓ ఇరవై
ఏళ్ల కిందివరకు, రోజువారీ కొలతకు అంగుళాలు, మూరలు, గజాలు, బారలు, అడుగులు విరివిగా ఉపయోగించేవాళ్లు. ఇప్పుడు భూములు, ఇళ్ల స్థలాలు, బట్టలు లాంటివి మినహాయిస్తే వీటి వాడుక తగ్గిపోయింది. మీటరు, ఫీట్లు, ఇంచులు లాంటి ఆంగ్ల పదాలు వాడుకలోకి వచ్చాయి.  తూకం విషయానికి వస్తే... వీసెడు (120 తులాలు), పదలం (అరవీసె), ఏబులం (పావువీసె) వగైరాలు ఉండేవి. ఇప్పుడవి గ్రాము, పావుకిలో, అరకిలో, కిలోగ్రాము, క్వింటాళ్లుగా చెలామణీలోకి మారిపోయాయి. ఇక ద్రవ పదార్థాల కొలతలకు శేరు, సోల, గిద్ద వంటి పదాలుండేవి. ఇప్పుడైతే లీటరుదే పైచేయి. అయితే లీటరు పదాన్నే ముందు మరో పదం చేర్చి అన్నింటికీ ఉపయోగిస్తున్నామే తప్ప మన కొలతల్లో ఉన్న వైవిధ్యం ఆంగ్లంలో కనిపించదు.
గుబ్బగొడుగు ఎక్కడ?
గ్రామాల్లో ఎప్పుడైనా చేపలు అవసరమైతే దగ్గర్లో ఉన్న పంటకాలవకో, పెద్దకాలవకో వెళ్లేవాళ్లు. ఆ పూటకు సరిపడా చేపలు పట్టి వండుకు తినేవారు. దీనికోసం తాటాకు ఈనెలతో కప్ప ఆకారంలో ఓ వైపు తెరుచుకుని ఉండే బుట్టను తీసుకెళ్లేవాళ్లు. దాన్ని నీళ్లలో అటూయిటూ తిప్పితే, అందులో చిన్నచిన్న చేపలు పడేవి. ఆ బుట్టను ‘తిఱ్ఱి’ అంటారు. అయితే ఇప్పుడు అలా చేపలు పట్టడం తగ్గింది. దాంతో ఆ పదం వినియోగమూ తగ్గిపోయింది. వర్షకాలం వస్తే గొడుగును వాడాల్సిందే. ఒకప్పుడు తాటాకును గుండ్రంగా వంచి గొడుగును తయారు చేసుకునేవారు. ఇది వర్షం నుంచి రక్షణ ఇవ్వగలిగినా, అవసరం లేనప్పుడు మూసి ఉంచే వీలు లేకపోయేది. ఇప్పుడు గుడ్డతో చేసిన గొడుగులు వాడుకలోకి వచ్చాయి. ఇవే గుబ్బగొడుగులు. ఎవరైనా పెద్దవాళ్లు ‘వర్షం వస్తోంది. గుబ్బగొడుగు ఎక్కడ?’ అంటే, పిల్లలు తెల్లమొఖం వేసేస్తారిప్పుడు!
      నీళ్లు కాచుకునేందుకు ఒకప్పుడు బొగ్గులు, కట్టెల పొయ్యిలే ఆధారం. వీటికి మూడు వైపులా మూసి ఉండి, నాలుగో వైపు కట్టెలు, వరిపొట్టు లాంటివి పోసేందుకు ఏర్పాటు ఉండేది. దానిమీద బానను ఉంచేవాళ్లు. అలా వేడినీళ్ల ఏర్పాటు ఉండేది. ఆ వేడినీళ్లు ప్రసాదించిన కుండను ‘దాపుకుండ’ అనీ, ఇంకొన్ని ప్రాంతాల్లో ‘కాగు’ అనీ పిలుచుకుంటారు. అంటే నీళ్లు కాచుకునేది. పల్లెల్లో ఇప్పటికీ ఈ పొయ్యిలు కనిపిస్తుంటాయి. 
‘జల్లి- మూకుడు’ వంట- వార్పులకు సంబంధించిన మట్టిపాత్ర. ఇది కూడా మరుగున పడేందుకు సిద్ధంగా ఉన్నదే. ఒకప్పుడు అన్నం వార్చాక, వచ్చిన గంజినీ వివిధ రూపాలలో వాడుకునేవారు. అందుకే ఈ జల్లి- మూకుడు అవసరమయ్యాయి. ఇప్పుడందరూ ‘అత్తెసరు’కు అలవాటుపడ్డారు. దాంతో వాటి అవసరం తీరిపోయింది.
      ధాన్యం కొలవడానికి పుట్టి, కుంచం, అడ్డెడు, మానెడు, తవ్వ, సోల వాడుకలో ఉండేవి. రైతులు కూడా పంట చేతికొచ్చాక ధాన్యం కొలిచేందుకు ‘కొలకుండ’ను ఉపయోగించేవాళ్లు. ఇప్పుడు టన్ను, క్వింటాళ్లే రైతుల నోళ్లలో నానుతున్నాయి. కొన్నేళ్ల కిందివరకు ప్రయాణంలో ఇబ్బంది కలగకుండా ఉంటుందని ‘మరచెంబు’లో నీళ్లు తీసుకెళ్లేవాళ్లు. దాన్ని కంచు, రాగి లేదా స్టీలుతో తయారుచేసేవాళ్లు. ఇప్పట్లా ప్లాస్టిక్‌ సీసాల వినియోగం లేదు మరి! పైగా ‘మరచెంబు’ కాలుష్య కారకం కాదు. 
పావలా లేదు...
కానీ, అర్ధణా, అణా, బేడ, పావలా, ముప్పావలా... ఇలా ఉండేది నాణేల విలువ. రూపాయికి 16 అణాలు. 4 అణాలు- పావలా, 8 అణాలు- అర్ధ రూపాయి, 12 అణాలు- ముప్పావలా. ఇవే తెలంగాణలో చారాణ, ఆఠాణ, బారాణ అని వ్యవహారంలో ఉండేవి. అసలు నోట్ల వాడకమే తగ్గుతున్న రోజులివి! అందరూ ఏటీయెం కార్డులే వాడుతున్నారాయే. 
కాలానుగుణంగా భాషలో మార్పులు పొడచూపుతుంటాయి. అయితే కొత్తొక వింత అన్నట్లుగా... పాతవాటిని మరుగున పడేయకుండా వాటిని ఇప్పటి తరాలకు పరిచయం చేయాలి. దానిద్వారా ఆ పదాల చుట్టూ అల్లుకున్న భాష, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక బంధాలు అంతరించి పోకుండా కాపాడుకోగలుగుతాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం