తెలుగు సాహిత్య చందమామ

  • 87 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పి.సత్యవతి

  • విశ్రాంత అధ్యాపకురాలు
  • విజయవాడ
  • 9848142742
పి.సత్యవతి

ఒక రచన ఎందుకు గొప్పదో చెప్పలేని పరిస్థితుల్లో మాత్రమే ప్రయోజనం లేని సాహిత్యం పుట్టుకొస్తుంది. అలాంటి దాన్ని గొప్పదని ఎవరంటారు? ఎందుకంటారు?’’... ఇది కొడవటిగంటి కుటుంబరావు అభిప్రాయం. ఆయన దృష్టిలో అలాంటి రచనలు అర్థరహితం. అర్ధశతాబ్దం పాటు సాగిన తన సాహితీ సేద్యంలో ఏనాడూ ప్రయోజనం లేని సాహిత్యాన్ని సృష్టించలేదాయన. అందుకే కొ.కు. రచనల గొప్పతనాన్ని రకరకాల కోణాల్లో విడమరిచే విశ్లేషణలు చాలానే వచ్చాయి. ఆ విషయాన్ని అలా ఉంచితే, ‘‘ఆయన రచనలకు ఈనాటికీ ప్రాసంగికత ఉంది. ఇప్పుడాయన్ని తలచుకుని స్ఫూర్తి పొందుదా’’మంటూ ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి ఏం చెబుతున్నారో చదవండి మరి...
చందమామతో
మొదలైన పుస్తక పఠనాసక్తి ఎవరికీ మధ్యలో ఎప్పటికీ నిలిచిపోదనేది స్వానుభవం. ‘చందమామ, బాల’... మా తరం అభిమానించిన తొలి పత్రికలు. కథల మీదే కాదు అసలు చదవడం మీదే మమకారం కలిగించినవి అవే. ఆ ‘చందమామ’ను అంత పఠనీయంగా చేసిన అదృశ్యహస్తం గురించి అప్పుడు తెలియదు. తర్వాతెప్పుడో తెలిసింది అందులోని ప్రతి కథా ఒక చెయ్యి తిరిగిన రచయిత రాసినట్లే ఉండటానికి కారణమేంటో!
      కొడవటిగంటి కుటుంబరావు ‘కురూపి’ నవల చదివి ఆయన రచనలతో ప్రేమలో పడ్డాను. నేను అభిమానించిన ‘చందమామ’ ఈయనే అని తెలిసి మరింత ప్రేమించాను. అప్పటిదాకా ఆయన కథలు, నవలలు చదివానే కానీ, అది కాలక్షేపం చదువని అర్థమైంది నాకు. ఎందుకంటే నాకప్పటి వరకూ పుస్తకాలు చదువుకుంటూ పోవడం ఒక్కటే తెలుసు. ఎవరు బాగా రాస్తున్నారు, ఎవరివి చదవాలి? ఏవి మనకు దగ్గరగా వస్తున్నాయి అనే ఆలోచన లేదు. క్రమంగా ఎంపిక చేసుకుని చదివే స్థాయికి ఎదుగుతున్నప్పుడు తెలిసింది... కుటుంబరావు అనే రచయిత బాగా రాస్తారు, ఆయన రచనల్లో మంచి విశ్లేషణ ఉంటుందని. ఒక విషయాన్ని నలిగిపోయిన పద్ధతిలో కాకుండా వేరేలా కూడా ఆలోచించవచ్చని ఆయన ద్వారానే తెలుసుకున్నాను. ‘కురూపి’ ఆయన నవలలన్నింట్లో గొప్పదని కాదు. కానీ, ‘ఆయన రాసినవన్నీ ఇకనుంచి మనసు పెట్టి చదువు’ అని నాకు నేను చెప్పుకున్న సందర్భం అది. అప్పట్లో వారపత్రికల్లో ఎన్నో కథలు వచ్చేవి. అన్నీ చదువుకుంటూ పోవడమే కానీ తర్వాత వాటిలోంచి నాకు నచ్చడం మొదలుపెట్టినవి కొన్నే. కళాశాల చదువు కోసం హైదరాబాదు వచ్చే నాటికి నాకొక అభిరుచి ఏర్పడింది.
      తర్వాత క్రమక్రమంగా సాహిత్యం చదువుతూ ఇష్టాలు పెంచుకుంటూ, అయిష్టాలేంటో తెలుసుకుంటూ వచ్చినప్పుడు కొద్దిమందే నా అభిమాన రచయితలయ్యారు. వారిలో కొడవటిగంటి స్థానం చెక్కు చెదరలేదు అప్పటికీ ఇప్పటికీ. 
అదో చరిత్ర
‘‘ఏ కాలపు జీవితాన్ని విమర్శించేది ఆ కాలపు సాహిత్యం. నేటి జీవితాన్ని విమర్శించలేనిదీ, నేటి భావాలను సంస్కరించలేనిదీ, నేటి జీవితాన్ని అలంకరించలేనిదీ నేటి సాహిత్యం కాదు. నేను రాసినదైనా సరే’’ అనే కొ.కు., ‘‘మానవుడు చేసే సమస్త ప్రయోజనాలకు సాహిత్యం తోడుగా ఉంటుంది. నాగరికత పెంపొందించుకోవడానికి, సంస్కారం అభివృద్ధి చేసుకోవడానికీ సాహిత్యం ఎంతో అవసరం’’ అని స్వయంగా చెప్పారనిపించింది. నిజానికి ఏ కాలపు జీవితాన్ని విమర్శించేది ఆ కాలపు సాహిత్యమే కాదు అది అన్ని కాలాలకు ఒక చరిత్రలా నిలిచిపోతుందని ఆయన సాహిత్యాన్ని ఇప్పుడు చదివితే అర్థమవుతుంది.
      ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో జన్మించిన కొడవటిగంటి, ప్రపంచ చరిత్రలోని అతిముఖ్య సంఘటనలను అర్థం చేసుకుంటూ, విశ్లేషించుకుంటూ మార్క్సిస్టు దృక్పథాన్ని హేతువాదాన్ని సంతరించుకుని విస్తృతంగా రచనలు చేశారు. నవల, నాటకం, వ్యాసం, కథలతో పాటు గల్పిక అనే కొత్త ప్రక్రియకు ప్రాచుర్యాన్ని సమకూర్చారు. ఆయన పాఠశాల విద్య అభ్యసిస్తున్నప్పుడే అటు ప్రపంచాన్నీ అవగాహన చేసుకున్నారు. ఆనాటి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిణామాలను... ముఖ్యంగా తెలుగునాట మధ్య తరగతి మీద వాటి ప్రభావాలను తన రచనల్లో అద్భుతంగా నమోదు చేశారు. ఆయన చిన్నవీ పెద్దవీ దాదాపు ఇరవై రెండు నవలలు, అనేక వ్యాసాలూ, గల్పికలే కాకుండా అపరాధ పరిశోధక కథలు, గొలుసు కథలు, దిబ్బ కథలు అని వర్గీకరించిన వాటితో కలిపి అయిదువందల కథలు రాశారు.
      మొదట్లో ఆయన నవలలు, కథలను ‘విశాలాంధ్ర’ ప్రచురణ సంస్థ పదమూడు సంపుటాలుగా వేసింది. ఇప్పుడు ‘విరసం’... కుటుంబరావు సాహిత్య సర్వస్వంగా పద్దెనిమిది సంపుటాలను ప్రచురించడానికి పూనుకుంది. 
సుమారు యాభై సంవత్సరాల కాలంలో దాదాపు పదిహేనువేల పేజీల సాహిత్యం రచించారాయన.
    కొ.కు. సాహిత్య ప్రవేశం చేసినప్పుడు తెలుగునాట భావకవిత్వపు ఊపు తగ్గి, అభ్యుదయ కవిత్వ అరుణోదయం అవుతోంది. అటు శ్రీశ్రీ, ఇటు చలం సమాజం మీద వెలుగు ప్రసరిస్తున్నారు. కుటుంబరావు మొదటినుంచీ గుడ్డి సంప్రదాయాలకు వ్యతిరేకి. స్త్రీల బానిసత్వ నిర్మూలన విషయంలో చలం తడమని విషయాలను ఆయన చర్చించారు. ‘అనుభవం’ అనే నవలలో ఒక పాత్రతో ఇలా చెప్పించారు... ‘‘చలం గారి కథలలో మగవాళ్లని పశువుల్లా చిత్రించడము, ఆడదానికి స్వేచ్ఛ యిచ్చి వదిలెయ్యడము జాస్తిగా ఉంది. కానీ ఆడది మగవాడిని అందుకునేందుకు సంఘంలో ఎటువంటి మార్పులు జరగాలో స్పష్టంగా లేదు. టాగోర్‌ నవలలో గోరా అన్నట్టు సంఘానికి ఎడంగా నిలబడి సామాన్య ప్రజలను హీనంగా చూసేవాడు తన సంస్కారానికి తను మురిసిపోవచ్చు గాని సంఘానికి చిన్నమెత్తు ఉపకారం చెయ్యలేడు’’.
మధ్యతరగతి జీవితాల ప్రతిరూపాలు
కొ.కు. రాసిన అయిదు నవలలు ఓ అర్ధశతాబ్దపు ఆంధ్ర దేశ చరిత్రను, ముఖ్యంగా కోస్తా జిల్లాల మధ్యతరగతి జీవిత చరిత్రను కళ్లకు కడతాయి. అవి... ‘చదువు, అనుభవం, గడ్డు రోజులు, జీవితం, అరుణోదయం’. ఈ నవలలో ఇరవయ్యో శతాబ్దపు ప్రథమార్ధంలో సంభవించిన రెండు ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక కాటకం, ముస్సోలినీ ఫాసిజం, హిట్లర్‌ హోలోకాస్ట్, జపాన్‌ మీద ఆటంబాంబు, మనదేశంలో జలియన్‌ వాలాబాగ్‌ దురంతం, జాతీయోద్యమం, సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, ఖద్దరు ధారణ, కమ్యూనిస్టు ఉద్యమం, దేశ విభజన, స్వాతంత్య్రం, గాంధీజీ హత్య తదితర సంఘటనలను ఆయా పాత్రల జీవన గమనంతో సమ్మిశ్రితం చేసి చెప్పారు. ఆ సంఘటనలు కొందరిలో భావ సంఘర్షణను, వేకువను... మరికొందరిలో ప్రేక్షక మాత్రతను... ఇంకొందరిలో స్వార్థ ప్రయోజనాలను కలిగించిన వైనాన్ని మార్క్సిస్టు దృక్కోణం నుంచి విశ్లేషించారు. ‘‘జీవితానుభవమూ, దృక్పథమూ, పరిజ్ఞానమూ కలిస్తే గానీ ఎవరూ మార్క్సిస్టు కాలేరు’’ అన్నది ఆయన సూత్రం. ఆయన రచనల్లో చలనశీలతా ఆశావహ దృక్పథాన్ని స్పష్టంగా చూడవచ్చు. 
‘చదువు, అనుభవం’ నవలల్లో ఆనాటి చరిత్ర చిత్రణ విపులంగా ఉంటుంది. ‘చదువు’ కుటుంబరావు ఆత్మకథ అంటారు గానీ ఆయన కాదన్నారు. ఆ నవలలో కథానాయకుడు సుందరంలాగే కుటుంబరావు కూడా బెనారస్‌ విశ్వవిద్యాలయంలో చదువుతూ, ఆర్థిక కాటకం వల్ల వెనక్కి వచ్చారు. ఓ ఇరవై ఏళ్లలో ఆంధ్రదేశంలో వచ్చిన మార్పుల్ని ఈ అయిదు నవలల్లో ప్రస్తావించారు. నామమాత్రంగానే మిగిలిన సంస్కరణోద్యమం, తగ్గని మూఢాచారాలు, అమలు కాని చట్టాలను గురించి ఆర్తితో రాశారు. వీటిని చదివితే ఆనాటి రాజకీయ వాతావరణమే కాదు ఆనాటి నాటకాలు, గొప్పనటులు, రచయితలూ, నాటకరంగ ఉత్థాన పతనాలు, సంగీతకారులు, గాయకులూ ఎందరో పరిచయమవుతారు. వందేళ్లు వెనక్కి వెళ్లి తెనాలి, గుంటూరు, బెజవాడ, మద్రాసు పట్టణాల్లో నివసించి వచ్చినట్లు ఉంటుంది.
స్త్రీల పట్ల సహానుభూతి
ప్రేమ, వివాహం, స్త్రీ పురుష సంబంధాలు, స్త్రీల జీవితం, సౌందర్యం, కాలక్రమంలో యువత ఆలోచనల్లో వస్తున్న మార్పుల గురించి కొ.కు. దాదాపు పది నవలలు రాశారు. స్త్రీ పురుషుల మధ్య భావైక్యత, స్నేహం, పరస్పర గౌరవం, అవగాహనల పునాది మీద స్త్రీ పురుష సంబంధాలు నిలబడాలే కానీ, కులమత సంప్రదాయ వర్గపునాదుల మీద నిలబడ్డంత వరకు అవి బోలుగానే ఉంటాయని తన రచనల్లో నిర్ద్వంద్వంగా చెప్పారాయన. మానవ సంబంధాలన్నింటికీ అపేక్ష ముఖ్యం. అపేక్ష హృదయాంతరాలలోంచి ఒక్కసారిగా పుట్టుకురాదు. అవతల వ్యక్తి అర్థం అవుతున్న క్రమంలో భూమిని చీల్చుకుని వచ్చే మొక్కలాగా మొలుచుకొస్తుందంటారు కుటుంబరావు. ప్రేమ, వాత్సల్యం అనే అర్థంలో ఆయన ఎక్కువగా అపేక్ష అనే మాట వాడారు. స్త్రీలపట్ల ఆయనకున్న సహానుభూతికి ఒక్క ‘ఆడజన్మ’ నవల చాలు. ‘‘ఆచారం రీత్యా అయితేనేం, చట్టరీత్యా అయితేనేం, ఒకరికన్న తక్కువగా పుట్టడం చాలా శోచనీయం. అయినా మన సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు, అనేకమంది బీదల కడుపున పుడతారు, కొందరు ఆడవాళ్లుగా పుడతారు... అటువంటి సమాజం మనది’’ అంటూ మొదలుపెడతారు ఈ నవలని. ఆయన నవలలన్నీ స్త్రీ కేంద్రకమైనవి కాకపోయినా చాలావాటిలో స్త్రీల సమస్యల్ని సహానుభూతితో చిత్రించారు. ‘పంచకల్యాణి, ఆడజన్మ, అనామిక, నీకేం కావాలి’లలో విభిన్న స్త్రీ పాత్రలను తీర్చిదిద్దారు. ‘బెదిరిన మనుషులు’ నవల మధ్య తరగతి మనస్తత్వాలకొక అద్దం. ‘బకాసుర, గ్రహాంతర వాసి’ ఆయన దృక్పథాన్ని అర్థం చేయించే ప్రతీకాత్మక నవలలు. ఏది రాసినా ఆయనది పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలి. పాఠకులలో మానసిక సంస్కారం కలిగించడమే ఆయన ఆశయం. కానీ అద్భుత శైలీ శిల్ప విన్యాసం ఆయన ఆలోచన కాదు.
‘‘... ఇంచుమించుగా మధ్యతరగతి నగర వాసుల వివాహ సమస్యలన్నీ ఆయన కథల్లో చిత్రించబడ్డాయి. ఒకనాటికి తెలుగు సాహిత్యంలో వివాహ వ్యవస్థ గురించి ఎవరైనా సమగ్రంగా రీసెర్చ్‌ చెయ్యాలనుకుంటే ఒక్క కొడవటిగంటి సాహిత్యం సరిపోతుంది’’ అంటారు విమర్శకులు హరిపురుషోత్తమరావు. ఆయన రాసిన వందలాది కథలలో ఒక్క వివాహ వ్యవస్థనే కాదు, మధ్యతరగతి జీవుల అనేక బలహీనతలను, నిలవనీటి తత్వాన్ని వ్యంగ్యంగా సున్నితమైన హాస్యంతో చెప్పారు. ‘దాలిగుంటలో నక్కలు’, ‘మనము మేము’, ‘దుక్కిటెద్దు’, ‘నువ్వులు తెలకపిండి’ ‘ఫోర్త్‌ డైమెన్షన్‌’ మొదలుకుని అనేక కథలు.. ఆనాటి ఆర్థిక స్థితి మీదా, రచనల మీదా, రాజకీయాల మీదా వాటికి మధ్య తరగతి స్పందనా అలవోకగా రాసుకుపోయారు. 
సూటిగా... స్పష్టంగా
గతంలో ‘విరసం’ ప్రచురించిన కొ.కు. చరిత్ర వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, సైన్సు వ్యాసాలూ ఆయన మార్క్సిస్టు దృక్పథానికి దర్పణాలు. సినిమాలు, కథా సంకలనాలు, నవలల మీద ఆయన రాసిన విమర్శలు చాలా సూటిగా, నిర్మొహమాటంగా ఉంటాయి. ఎవరినీ మెప్పించడానికీ, పైకెత్తడానికీ ఆయన రాయలేదు. ఎంత పేరున్న రచయిత రచననైనా తనకి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ఉదాహరణకి బుచ్చిబాబు పుస్తకం మీద సమీక్షలో ‘‘... ఇందులో సామాజిక ప్రేరణలకు స్థానం ఇవ్వకపోవడం గమనార్హం. ప్రతి రచనా సామాజిక జీవితంపై వ్యాఖ్యగా ఉండాలని, మిగిలిన అంశాలన్నీ రచనకు ఉపాంగాలనీ నామటుకు నేను నమ్ముతున్నాను’’ అన్నారు. సమాజాన్ని స్పృశించని రచన ఆయన్నీ స్పృశించదు. అప్పట్లో ఓ ప్రముఖ రచయిత కథా సంకలనం మీద సమీక్షలో ‘‘ఈ రచయిత కథలు అన్నీ ఒక లెవెల్లో ఉండవు. ఇతనికి మామూలు మాటల స్థానంలో ‘అమామూలు’ మాటలు వాడటం ఇష్టం. కొన్ని నుడికారాలు అచ్చంగా స్వంతం. కొన్ని ఉపమానాలు ఊహకు అందవు. ఉదాహరణలు అనవసరం. విరివిగా వెలువడే తన రచనలు చదివే వారందరికీ అవి పరిచయమే అయి ఉంటాయి’’ అని రాశారు. కథల్లో మాదిరిగా విమర్శలో కూడా సున్నితమైన వ్యంగ్యం ఆయన స్వభావం. సమాజాన్ని తడమనిది, హేతువుకు అందనిది, కృత్రిమమైనది ఏదీ ఆయనకు నచ్చదు.
రాతకి, చేతకీ మధ్య పూడ్చలేని అగాధాలు ఉండే వ్యక్తులు కొందరు అన్ని రంగాల్లో కనపడుతూ ఉంటారు. కొడవటిగంటి రాతే ఆయన చేత అని మిత్రులు, ఆయన కుటుంబ సభ్యులూ చెబుతారు. ‘‘రచయితగా ఉండటానికీ, భర్తగా ఉండటానికీ ఆయనలో వైరుధ్యం లేదు. రచయితకీ, భర్తకీ తేడా లేకపోవడం మంచి అనుభవం. సహజమైన అనుభూతులతో జీవించాం. అర్థవంతమైన జీవితం గడిపాం’’ అంటారు ఆయన సహచరి వరూధిని. అన్ని సంవత్సరాలు మద్రాసులో ఉండి కూడా సినిమా సంస్కృతి అంటించుకోని వ్యక్తిగా ఆయన్ని చాలామంది ప్రశంసిస్తారు.
1909 అక్టోబరు 28న జన్మించిన కుటుంబరావు 17 ఆగస్టు 1980న దేహాన్ని విడిచిపెట్టారు. 1931లో మొదటి కథ రాసినప్పటి నుంచి చనిపోయేవరకూ రాస్తూనే ఉన్నారు. సుమారు ఓ అర్ధ శతాబ్దం తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఆయన తెలుగు సాహితీ విద్యార్థులకు ఓ పాఠ్యప్రణాళిక. 


వెనక్కి ...

మీ అభిప్రాయం