ప్రపంచీకరణ గుట్టు... తెలుగు కథతో రట్టు

  • 90 Views
  • 2Likes
  • Like
  • Article Share

దేశాల సరిహద్దులను చెరిపేస్తూ స్వేచ్ఛా వాణిజ్యానికి పట్టంకట్టడమే ప్రపంచీకరణ పరమోద్దేశం.  వైవిధ్యభరితమైన ఆయా ప్రాంతాల భాష, సంస్కృతి, జీవన విధానాల మీద క్రీనీడలను పరుస్తూ మూడు దశాబ్దాల కిందట ఈ మార్కెట్‌ ఆధారిత ఆర్థిక క్రీడ మొదలైంది. దీని తీక్షణతకి సామాన్యుల బతుకులు ఎన్నో ఆటుపోట్లకు లోనయ్యాయి. కులవృత్తులు ధ్వంసమయ్యాయి. కుటీర పరిశ్రమలు కనుమరుగయ్యాయి. మానవ జీవితానికి సంబంధించిన ప్రతి పార్శ్వాన్నీ ప్రపంచీకరణ ఎన్నో కుదుపులకు గురిచేసింది. ఈ సంక్షోభాన్ని తెలుగుకథ ఎలా బొమ్మకట్టిందో చూద్దాం.
భారతదేశంలో తొంభయ్యో దశకంలో సరళీకృత ఆర్థిక విధానాల అమలు తర్వాత ప్రపంచీకరణ ఊపందుకుంది. నిజానికి, ప్రపంచీకరణ వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. జీవితాల్లోకి కొత్త సౌలభ్యాలు వచ్చాయి. వాటికి సమాంతరంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో పెను సంక్షోభాలూ చోటుచేసుకున్నాయి. తెలుగు కథ ఈ పరిణామాలన్నింటినీ చిత్రించే ప్రయత్నం చేసింది. 
      ప్రపంచీకరణ ప్రయోజనాల గురించి ఎవరు ఎంతగా చెప్పినా, దాని అంతిమ లబ్ధిదారులు మాత్రం పెట్టుబడిదారులే. స్వలాభాల కోసం స్థానిక వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే వారి విజయ సూత్రం. భారతదేశం అంటేనే వ్యవసాయాధారితం. నేటికీ దేశంలో 60 శాతం మందికిపైగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవితాలు వెళ్లదీస్తున్నారు. ప్రపంచీకరణ వల్ల సాగు రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య పంటల హవా పెరిగింది. సేద్యంలో యాంత్రీకరణ సాధారణమైపోయింది. పురుగుమందులు, ఎరువులకు పెట్టుబడి పెరిగిపోయింది. తీరా, పండిన పంటను మార్కెట్టుకు తీసుకెళితే సరైన ధరలుండవు. చివరికి రైతుకు మిగిలేది అప్పుల ఊబే. దీంతో రైతన్నలు వ్యవసాయ కూలీలుగా, కర్మాగారాల్లో కార్మికులుగా మారుతున్నారు. మరెందరో ఉపాధి కోసం గల్ఫ్‌ బాటపడుతున్నారు. ఏజెంట్ల మోసాలకు అన్యాయంగా బలవుతున్నారు. అలాంటి ఓ రైతు వ్యధని పెద్దింటి అశోక్‌కుమార్‌ తన ‘వలసబతుకులు’లో కళ్లకుకట్టారు. ‘‘ఎనుకట కలో గంజో తాగి బతికినం. తూ నీయవ్వ. ఏం కాలంరా ఇది. ఎక్కడికిపోయిన మన రెక్కల కష్టం దోచుకుని మనల్ని మోసం చేసేవాళ్లే’’ అంటూ ఇందులో ముత్తయ్య అనే రైతు చెప్పే మాటలు ప్రపంచీకరణ దోపిడీ స్వరూపాన్ని కళ్లకుకడుతుంది. అశోక్‌కుమార్‌ రాసిన ‘ఆ ఇల్లు మూతవడ్డది’ కథ కూడా ఇలాంటిదే. ప్రపంచీకరణ కొట్టిన చావు దెబ్బకు ఉపాధి కరువై, బతుకుదెరువు కోసం వలస వెళ్తున్న మహిళలు... కాంట్రాక్టరు చేతిలో ఎదుర్కొంటున్న లైంగిక హింసను ‘ఊయల’ కథలో గీతాంజలి చిత్రించారు. మానవ హక్కుల్ని వలస మింగేస్తుందని తెలియజెబుతూ కంటతడి పెట్టించే కథ ఇది. ప్రపంచీకరణ ప్రభావంతో పంట భూములు కర్మగారాలు, ఇళ్ల స్థలాలుగా రూపాంతరం చెందుతున్నాయి. మార్కెట్‌ పోటీకి తట్టుకోలేక కుటీర పరిశ్రమలు కుప్పకూలడంతో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. మార్కెట్‌ పరుగు పందెంలో గెలవలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కార్మికుల వ్యథని నల్లూరి రుక్మిణి ‘గీతలకావల’ కథల్లో చిత్రించారు. విద్య వ్యాపారమయం కావడం, కష్టపడి సాధించిన డిగ్రీలు బతుకుతెరువు చూపించక విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారడం, చదువుల ఒత్తిడిని తట్టుకోలేక ఉసురు తీసుకోవడం.. ఈ కథల్లో తారసపడతాయి.
అభాగ్యుల వెతలు
ప్రపంచీకరణ అనే మాట గత మూడు దశాబ్దాల నుంచే ఎక్కువగా వినిపిస్తున్నా, దీని మూలాలు శతాబ్దాల కిందటే కనిపిస్తాయి. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం ఇందులో భాగమే. బహుళజాతి సంస్థలు ఆయా దేశాల్లో వలసలు పెంచుకుని లాభాలు గడించాలంటే ముందుగా ఆయా దేశాల్లో కాస్తో, కూస్తో అభివృద్ధి అయి ఉన్న ఉత్పత్తి శక్తులను దెబ్బతీయాలి. ఆ తర్వాత వారి సరుకుల స్థానంలో తమ వస్తువులను అమ్ముకోవాలి. దానికోసం కంపెనీలు రాజకీయ నాయకులతో చేతులు కలుపుతాయి. ప్రపంచీకరణ పేరుతో వాటికి మన నాయకులు స్వాగతం పలుకుతారు. అవసరమైతే దేశీయ సంస్థలను ప్రైవేటు పరం చేసి వాటి దోపిడీకి సహకరిస్తారు. ఫలితంగా స్వదేశంలో ఉత్పత్తయ్యే సరుకుల రేటు తగ్గిపోతుంది. ఇక్కడి ఉత్పత్తిదారులు పూర్తిగా దివాళాతీసే పరిస్థితి తలెత్తుతుంది. మరోవైపు పల్లెల నుంచి పట్టణాలకు చేరిన భూస్వాములు విద్యాసంస్థల్ని స్థాపించి వ్యాపారులుగా ఎదుగుతారు. మద్యం, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాలని ఏలుతారు. ఈ పరిణామాలన్నింటినీ కూర్మనాథ్‌ ‘వెన్నెల పడవ’ కథా సంపుటి విశదీకరిస్తుంది. 
      ప్రపంచీకరణ వల్ల తీవ్ర కుదుపులకి లోనైౖన వాళ్లలో చేనేతన్నలు కూడా ఒకరు. విదేశాల నుంచి పోటెత్తుతున్న వస్త్రాలు, మరమగ్గాల వేగం ముందు చేతిమగ్గాలు నిలువలేక నీరుగారిపోతున్నాయి. ఫలితంగా శతాబ్దాల ఘన చరిత్ర ఉన్న నేతన్నలు ఎందరో బతుకు భారమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సందుపట్ల భూపతి రాసిన ‘మగ్గం బతుకు’ కథ ఈ దీన స్థితిని కళ్లకు కట్టింది. ఇందులో కుటుంబంతో కలిసి ఒక నేతన్న మగ్గం నేస్తూ పొట్టపోసుకుంటూ ఉంటాడు. అయితే ఆ ఊళ్లో అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన మరమగ్గం వీరి ఉపాధికి గండికొడుతుంది. తినడానికి తిండిలేక కుటుంబం మొత్తం అల్లాడుతుంది. దాన్ని చూసి తట్టుకోలేని ఆ చేనేత కార్మికుడు బలవంతంగా ఉసురు తీసుకుంటాడు. ప్రపంచీకరణ వల్ల ఆరిపోతున్న అభాగ్య బతుకుల గురించి తెలియజెప్పి కన్నీరు పెట్టిస్తుందీ కథ. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి తలుపులు బార్లా తీయడంతో పరాయి సంస్థలు దేశీయ రిటైల్‌ రంగంలోకి అడుగు పెడుతున్నాయి. వాటికి స్థానిక కార్పొరేట్‌ సంస్థలు తోడవుతున్నాయి. అందరూ కలిసి భారీ షాపింగ్‌ మాళ్లు, సూపర్‌ మార్కెట్లతో ఓ మాయాప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. మొదట తక్కువ ధరల ఆశచూపి మధ్యతరగతిని వీటికి అలవాటు చేస్తారు. స్థానికంగా ఉండే చిల్లర వర్తకుల్ని కోలుకోలేని దెబ్బతీసి వారు తమ వ్యాపారాలను వదిలేసేలా చేస్తారు. ఆ తర్వాత ఇష్టారీతిగా ధరలు పెంచుతూ వినియోగదారుల జేబులు గుల్లచేస్తారు. నిజానికీ ఇప్పుడున్న మాల్స్‌లోకి అడుగుపెడితే సామాన్యుడు ఎంతో ఆత్మన్యూనతకు లోనవుతాడు. దేశాభివృద్ధిలో తానెక్కడ ఉన్నాడో తెలియక తల్లడిల్లతాడు. ఈ దృశ్యాన్ని డా।। ఎం కిషన్‌రావు ‘చూపు’ కథలో పాఠకుల కళ్లముందుంచుతారు. 
మనుషులు కారు.. వినియోగదారులు
స్థానిక సంస్కృతినీ, సంప్రదాయాల్నీ, ఆహారపు అలవాట్లనీ సమూలంగా ధ్వంసం చేయడం, యువతను పెడపోకడల్లోకి నెట్టడం ప్రపంచీకరణలో కనిపించే మరో కోణం. ఇటీవల యువతరం చిరిగిపోయిన దుస్తుల్ని ఫ్యాషన్‌గా భావించడం, బ్రాండ్ల వరదలో పడి కొట్టుకుపోతూ మితిమీరిన ఖర్చులు చేయడం ఇందులో భాగమే. అలాగే ప్రపంచీకరణ వల్ల సమాచార, సాంకేతిక రంగాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఫోర్‌జీ ఫోన్లు, ఉపగ్రహ ప్రసార సాధనాల వల్ల సమాచార మార్పిడిలో వేగం పెరిగింది. కానీ, వీటి దుష్ప్రభావాలు నేటి యువతరం మీద తీవ్రంగా ఉంటున్నాయి. వహీదా రాసిన ‘జాజిపూల పరిమళం’ కథ వీటిని తెలియజెపుతూ, ఆ మాయ నుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో వివరిస్తుంది. కార్మికులు, సహజ వనరులు చౌకగా లభించే ప్రాంతాల్లో బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాలు, కర్మాగారాలను నెలకొల్పుతాయి. వాటి వల్లనే మన దేశంలో పొరుగు సేవలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లాంటివి ప్రవేశించాయి. దాంతో శీతల పానీయాలు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, చైనా ఫోన్లు దేశాన్ని ముంచెత్తాయి. వీటి వల్ల యువత జీవితాల్లో వచ్చిన పోకడలు, ముఖ్యంగా సాంకేతికతకు యువత బానిసవుతున్న విధానాన్ని పెద్దింటి అశోక్‌కుమార్‌ ‘సాఫ్ట్‌వేర్‌’ కథలో తెలియజెప్పారు. 
ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితాలతో టీవీ విడదీయలేనంతగా పెనవేసుకు పోయింది. పదుల సంఖ్యలో ఛానళ్లు, ఒకదానికొకటి పోటీ పడి మరీ ప్రత్యేక కార్యక్రమాలతో గడప గడపలో వినోదాన్ని పంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపం చంలో జరిగే పరిణామాలు, విశేషాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాయి. కానీ, వీటిలో మాటిమాటికీ వచ్చే ప్రకటనలు మనిషిని వస్తు వినిమయ కేంద్రంగా మార్చేస్తున్నాయి. అల్లం రాజయ్య ‘వెలుతురు నది’ కథ దీని గురించి తెలియజేస్తుంది. ‘‘అమ్మకి సీరియళ్లు, నాన్నకి వార్తలు... అందులోనూ అన్నీ అబద్ధాలే, తమ్ముడికి ఆటలు, యువతులకేమో ప్రకటనల్లో కనిపించే సౌందర్య సాధనాలు, చక్కని శరీర కొలతల కోసం ఆరాటాలు.. అందుకే ‘టీవీలు లేనికాడికి పారిపోతే బాగుండు’’ అని ఒక యువతి ఈ కథలో ఆవేదన వ్యక్తం చేస్తుంది. 
ఆప్యాయత కరువై...
ప్రపంచీకరణ వల్ల ప్రపంచంలోని మనుషులందరూ ఏకమవుతారని, ప్రజల మధ్య ఎల్లలు చెరిగిపోతాయని చాలా మంది చెబుతుంటారు. ఇంకా, కులాలెక్కడివి అంతా కలిసే తింటున్నాం, కలిసే నడుస్తున్నాం, కలిసే ఉద్యోగాలు చేస్తున్నాం అని ఎందరో ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ, ఆర్థిక సంస్కరణలు అమలై మూడు దశాబ్దాలైనా కుల వివక్ష ఇంకా వికృత కోరలు చాస్తూ ఎలా అడ్డుగోడలు సృష్టిస్తోందో పసునూరి రవీందర్‌ ‘అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా’ కథా సంపుటి వివరిస్తుంది. ఒక వ్యక్తి నగరంలో అద్దెఇల్లు కోసం తిరుగుతుంటే చాలా చోట్ల ‘వెజిటేరియన్స్‌ ఓన్లీ’ అని బోర్డులు కనిపిస్తుంటాయి. వాటిని చూసి ‘చీ ఛీ ఇదా అభివృద్ధంటే’ అని చీదరించుకుంటాడా వ్యక్తి. ఆధునిక వస్తువులు, వేష భాషల్లో వచ్చే మార్పులు కాదు; మనిషి సంస్కారం, పరివర్తనలో మార్పు రావాలని ఈ సంపుటిలోని కథలు తెలియజెబుతాయి. ఒకప్పుడు కొన్ని కులాలకు పరిమితమైన వస్తువుల్ని ఇప్పుడు అందరూ తయారు చేస్తున్నారని, వ్యాపారంలో వచ్చిన మార్పులు సామాజికంగా ఎందుకు రావట్లేదని ‘కుల వృక్షం’ కథలో ప్రశ్నిస్తారు వనజ తాతినేని. 
ప్రపంచీకరణ వల్ల మనిషి వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. దేశంలో నూతన ఆర్థిక విధానాలు మొదలయ్యాక సాఫ్ట్‌వేర్‌ కొలువు లకు ప్రాధాన్యం ఏర్పడింది. మంచి ఉద్యోగాలను అందుకోవడానికి చిన్నప్పటి నుంచే పిల్లల మీద చదువుల ఒత్తిడి పెరిగింది. దీన్ని ఆసరా చేసుకుని కార్పొరేటు పాఠశాలలు, కళాశాలలు ఫీజుల పేరుతో తల్లిదండ్రుల మూలుగలు పీల్చడం మొదలుపెట్టాయి. బతుకులు ఆర్థిక చట్రాల్లో చిక్కుకుపోయాయి. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వచ్చినవాళ్లంతా అమెరికా బాట పడుతున్నారు. ఇలా జీవితం యాంత్రికమయం అవుతుందే తప్ప బంధాలు అనుబంధాలు ఉండటంలేదని అబ్బూరి ఛాయాదేవి ‘అదొక సంస్కృతి’ కథ వివరిస్తుంది. చిన్నప్పటి నుంచి చదువే ధ్యేయంగా, ఒత్తిడితో సహవాసం చేస్తూ పెరిగిన పిల్లల్లో మానవతా విలువలు లోపిస్తున్నాయి. ప్రతి విషయాన్నీ లాభనష్టాల కోణంలో ఆలోచించేలా వారి మనసులు కుచించుకుపోతున్నాయి. అందుకే, రెక్కలొచ్చిన తర్వాత కన్నవాళ్ల గురించి ఆలోచించకుండా తమ గమ్యాలకు ఎగిరిపోతున్నారు. పట్టించుకునే దిక్కులేక ఎందరో అమ్మానాన్నలు బిక్కుబిక్కుమంటూ జీవితాలు వెళ్లదీస్తున్నారు. ఈ తీరుని తాయమ్మ కరుణ ‘జీవితం’ కథలో కళ్లకు కట్టారు. పైగా, మానవ సంబంధాల్లో దూరం పెరిగి మొక్కలనో, కుక్కలనో పెంచుకుంటూ వాటి పట్ల ప్రేమాభిమా నాలు చూపిస్తున్న వైనాన్ని ‘సత్యవతి’ కథలో వనజ తాతినేని తెలియజెప్పారు. ఆఖరికి తల్లిదండ్రుల అంత్యక్రియలకూ రాని బిడ్డల మీద ‘కొడుకులందరూ దొంగ నా కొడుకులు’ అంటూ గోపాలరావు పాత్ర ద్వారా ధ్వజమెత్తుతారు పలమనేరు బాలాజీ ‘చందమామ రావే’ కథలో.  
లాభాలన్నీ వాళ్లకే 
      ప్రస్తుతం మాటిమాటికీ దేశాల ఆర్థిక వ్యవస్థలు గడగడా వణుకుతుండటం కూడా ప్రపంచీకరణ పుణ్యమే. అక్కడెక్కడో అమెరికా కేంద్ర బ్యాంకు ఏదో నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం ఎన్నో దేశాల మీద పడుతోంది. అదేదో ఒక బ్యాంకు దివాళాతీస్తే కొన్ని దేశాల ఆర్థిక మూలాలు కదిలే పరిస్థితి. రూపాయి మారకం విలువ నానాటికీ తగ్గుతుండటం, అకస్మాత్తుగా వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతుండటం లాంటివన్నీ దాని చలవే. ఒకవైపు ప్రపంచీకరణ విఫలం అవుతున్నా, మన దేశంలో పాదం మోపడానికి బహుళజాతి కంపెనీలు ఆరాటపడుతున్నాయి. ప్రభుత్వాలూ వాటికి తానతందాన అంటున్నాయి. వీటన్నింటినీ బి.ఎస్‌.రాములు ‘కామన్‌వెల్త్‌’ కథలో వివరించారు. ఒక వైపు ప్రపంచీకరణ... స్వేచ్ఛా వాణిజ్యం అంటూనే మరోవైపు మన కార్మికులు, ఉద్యోగులు, పరిశోధకులు పశ్చిమ దేశాలకు వెళ్లడానికి అనేక నిబంధనలు విధించడం, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో వాటిని మరింత కఠినం చేయడాన్ని ఈ కథ చర్చిస్తుంది. ఇంకా బమ్మిడి జగదీశ్వర రావు ‘దూరానికి దగ్గర’, సి.వెంకటేష్‌ ‘గ్లోబల్‌ గ్రామం’ ముదిగంటి సుజాతరెడ్డి ‘నిశ్శబ్దం, జవాబుల్లేని ప్రశ్నలు’, ఓల్గా ‘మార్పు’, దార్ల రామచంద్ర ‘గద్దొచ్చే కోడిపిల్ల’ లాంటి ఎన్నో కథలు ప్రపంచీకరణ దుష్ప్రభావాల్ని తెలియజెబుతాయి. 
      ప్రపంచీకరణ పశ్చిమ దేశాలకు, బహుళజాతి సంస్థలకు మాత్రమే ఉపయోగంగా మారింది. దీన్ని గుర్తించి దేశీయ ఆర్థిక విధానాల్లో మార్పుచేర్పులు చేయకపోవడంలో పాలకుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఉంది. నిజమైన సమానతా సూత్రాల ప్రాతిపదికన ప్రపంచీకరణ చోటుచేసుకుని ఉంటే, ప్రపంచంలోని ప్రతి పౌరుడికీ ఆ ఫలాలు అందేవి. కానీ, పరిస్థితి దానికి భిన్నం. అందుకే ప్రపంచీకరణ వల్ల ఉపాధి కరువై జనం విలవిలలాడుతున్నారు. రోజు రోజుకూ మానవతా విలువలు అంతరించి పోతున్నాయి. మనుషులు, జాతులు, ప్రాంతాల మధ్య బంధాలు దెబ్బతిని వైరుధ్యాలు పెరుగుతున్నాయి. ప్రపంచ భాషగా ముందుకొచ్చిన ఆంగ్లం ధాటికి స్థానిక భాషలు దెబ్బతింటున్నాయి. సామాజిక బాధ్యత కలిగిన తెలుగు కథకులు ఈ మొత్తం పరిణామాల మీద తమదైన పరిశీలనాత్మక వ్యాఖ్యానాలను తమ కథల్లో పొందుపరిచారు. సామాన్యుల జీవితాలను శాసిస్తున్న శక్తుల అసలు రూపాలు బహిర్గతం చేసే ఈ రచనలు.. నడుస్తున్న చరిత్రకు నిలువుటద్దాలు.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం