పుట్టిన కేకనీ నేనే.. ఆఖరి కౌగిలినీ నేనే

  • 852 Views
  • 1Likes
  • Like
  • Article Share

ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితమే అర్థంకాలేదన్న మాట’’ అన్నారు శ్రీశ్రీ. మారుతున్న కాలానికనుగుణంగా మనిషి జీవితంలో చోటుచేసుకుంటున్న సంక్లిష్టతల్ని కవితాద్దంలో ప్రతిబింబిస్తున్నారు ఆధునిక కవులు. ఈ క్రమంలో ప్రత్యేక వాదాలూ పుట్టుకొచ్చి సమాజం తీరుతెన్నుల్ని వాస్తవంగా కళ్లకు కట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఆయా పోటీ పరీక్షల్లో ప్రఖ్యాత కవితా పంక్తుల ప్రాధాన్యం ఎక్కువే. దిగంబర, స్త్రీవాద కవిత్వాలకు సంబంధించిన విశేష కవితా పాదాలను చూద్దాం.
నిఖిలేశ్వర్‌ 

♦ ‘‘నన్నయను నరేంద్రుడి బొందలోనే/ నిద్రపోనియ్యి/ లేపకు పీక నులిమి గోతిలోకి లాగుతాడు’’ (ఆత్మయోని)
♦ ‘‘ఈ దేశంలో ప్రతి నగరం/ నవనవలాడే మహాగాయం/ దూరం నుండి అది ఎర్రగులాబి/ దగ్గరికి వెడితే రక్తస్రావపు వ్రణం’’ 
(నీవు చెప్పింది అబద్ధం కాదు)
జ్వాలాముఖి 
♦ ‘‘నాగరికత నిగనిగల కౌగిలిలో/ మైమరచి మైకం కమ్మిన, నేటి వ్యామోహపు/ పతిత జాతికి చరచి చూపాలనుంది/ జాగృతికై ధ్వంస రచన చేయాలనుంది’’ (సూర్యస్నానం)
♦ ‘‘నంగనాచి నాగరికతను నగ్నం చేసి/ నవ మధువున సూర్యస్నానం చేయించి/ న్యూయార్కునగర వేదికన నీగ్రో వీరునితో/ ‘నూడ్‌ట్విస్టు - తాండవం’ చేయించాలనుంది’’ (సూర్యస్నానం)
♦ ‘‘పగులుతూన్న జాతి దర్పణంలో/ మహాత్ముల త్యాగఫలం/ నిష్ఫలమై స్రవిస్తూంది’’ (కిలికించితం)
♦ ‘‘మనమంతా జగన్నాటక సూత్రధారులం/ మనమంతా బృహన్నాటక పాత్రధారులం/ మనమంతా గత పురాణేతిహాస కాలాలకు చిహ్నాలం/ మనమంతా జగత్కల్యాణ భావాలకు ప్రాణాలం’’ (అవలోకన)
భైరవయ్య 
♦ ‘‘దిగంబర కవిత్వంలో అక్షరాలు/ కామంతో పుచ్చిపోయిన లతాంగి పయోధరాలపై/ నూతన నఖక్షతాలు కావు’’ 
(దిగంబరి)
♦ ‘‘మనిషీ మానసిక శిఖరాగ్రాలపై/ మానవత్వాన్ని ప్రతిష్ఠించే మహర్షీ!’’ 
(ఎముకల కేకలు)
♦ ‘‘కలం మీద కాలాన్ని దూసుకుంటూ/ కవనాల్తో కవిత్వంలోకి చొచ్చుకుంటూ/ చుట్టూ భయంకర దృశ్యాలు సృష్టిస్తూ/ కన్‌ చెదురుగా - దిల్‌ బెదురుగా/వచ్చాను’’ 
(అగ్నిప్రవేశం)
చెరబండరాజు 
♦ ‘‘ప్రపంచమొక నగ్నశిలా/ ఫలకమువలె కనిపిస్తున్నది/ భగవంతుడి అసలు పేరు నగ్నప్రియుడంటాను’’ 
(నన్నెక్కనివ్వండి బోను)
♦ ‘‘ఛందోబద్ధ సాహితీ వృక్షంలో/ చీడపురుగు ‘గీ’ పెడుతున్నది’’ (చూడలేను)
మహాస్వప్న 
♦ ‘‘మానవత రెండుకళ్లూ మూసుకుపోయినప్పుడు/ విప్పుకుంటున్న మూడోకన్నునై/ కాలం వాయులీనం మీద కమానునై/ చరిత్ర నిద్రాసముద్రం మీద తుఫానునై/ నేను వస్తున్నాను దిగంబర కవిని/ రాత్రి ఉదయిస్తున్న రవిని’’ 
(గ్లానిర్భవతి భారత)
♦ ‘‘తెల్లగా తెల్లవారింది/ నాటకానికి తెరజారింది/ ప్రపంచంలా పరచుకున్న జీవితం మీద/ నగ్న సూర్యోదయమైంది’’ 
(నటసామ్రాట్)
నగ్నముని 
♦ ‘‘నిన్ను ప్రేమిస్తాను/ నిన్ను మంచితనంతో భయపెడతాను/ నీ బొమికల్ని హడలగొడతాను/ నీ కలల్లో కల్లోలం రేపుతాను’’ (సుఖరోగి)
♦ ‘‘కారంలో పొర్లించిన రోకళ్లతో/ పట్టపగలు/ విషయించాలనుంది’’
(కాస్మిక్‌ జాతి కోసం)
♦ ‘‘ఈ లోకాన్ని వొదిలి/ ఆ దేవుడుగాడు చచ్చాడు/ ఇంక దెయ్యమే కనికరించాలి/ ఆక్రందనలతో నిండిన ఆకాశం నుండి దీవించాలి’’ (దెయ్యం దీవించాలి)
స్త్రీవాద కవిత్వం
♦ ‘‘ఆ కళ్లల్లో/ లక్ష వర్గాలున్నాయి/ కానీ చూపులకి మాత్రం వర్గ విభేదాలు లేవు’’ - జయప్రభ (చూపులు)
♦ ‘‘నేను సమాజం చెక్కిన అబలనీ/ సంప్రదాయపు వంటింటి పిల్లినీ కాదు/...’’  - రత్నమాల (ఆది మానవిని)
♦ ‘‘నేను పతివ్రతామ తల్లిని కాను/ ప్రబంధ కన్యను కాను/ పంచదార చిలకను కాను/ ఫ్యాషన్‌ పెరేడ్‌ బొమ్మను కాను/ పసిపాపల చంపే పాపిని కాను/ పంచాది నిర్మల వారసురాలిని’’  - ఓల్గా (ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి)
♦ ‘‘ఆకాశంలో సగం ఎరుపు/ మిగిలిన సగం నలుపు/ అదెలా అంటే.../ చెబుతా సూటిగా, విను శ్రద్ధగా/ ఎరుపు మన రంగు... నలుపు మనోళ్ల రంగు’’ - వసంత కన్నబిరాన్‌ (ఆకాశంలో సగం)
♦ ‘‘ఆడది శారీరక అవినీతి నుంచే ఎదిగిందనే మగ సంస్కారం/ మాకు రామాయణమంత పాత’’ - కుప్పిలి పద్మ (పాతరోత)
♦ ‘‘ఆకాశమంతా ఒలికిపోయిన/ మా అనంత వేదనా హృదయం/ కమిలి గడ్డకట్టుకుపోయి/ నిజంగా నీలి నీలిగా ఉంది’’    - శాంతిప్రియ (క్షతగాత్రులు)
♦ ‘‘అక్కడ/ జీవితం గాయపరిచిన పక్షులన్నీ/ పేదరికం మూటగట్టుకుని వాలతాయి/ బాధలు గాథలు సమానత్వం పాటిస్తాయి/ పెదాలు మూగవోతే కన్నీళ్లు మాట్లాడతాయి’’  - మహెజబీన్‌ (సరిహద్దు రేఖలు)
♦ ‘‘ఎండమావినీ నేనే, తొలకరి మబ్బునీ నేనే/ కలకత్తా కాళికనీ నేనే, సలాం బాంబేనీ నేనే/ మధర్‌ థెరిసానీ నేనే, బీస్ట్‌ అండ్‌ బ్యూటీనీ నేనే/ పుట్టిన కేకనీ నేనే, అఖరి కౌగిలినీ నేనే...’’ - శివలెంక రాజేశ్వరీదేవి (ద్వైతం)
♦ ‘‘శరీరమంతా ఒక చోటే గడ్డకట్టినపుడు/ ఒక వైయక్తిక పర్వతం నిశ్శబ్దంగా విస్ఫోటనం చెందినపుడు/ నేను బాధని అరచేతిలో పట్టుకొనడాన్కి/ విఫలయత్నాలు చేస్తుంటాను’’  - కె.గీత (నేను రుతువునైన వేళ)
♦ ‘‘గ్యాస్‌ పొయ్యి మంటల్లోనే/ నీలాల గగనాన్ని చూస్తాను/ కుక్కర్‌ విజిల్స్‌లోనే/ మనోజ్ఞ సంగీతం వింటాను...’’  - మందరపు హైమవతి (ద్విపాత్రాభినయం)
♦ ‘‘ప్రపంచంలోని నరకమో/ నరకంలోని ప్రపంచమో/ త్రీడీలో చూస్తున్నట్టే ఉంటుంది/ లేబర్‌ రూంలో అడుగుపెడితే చాలు వీరంతా చెబుతున్న తెల్లచీర/ మల్లెపూలు పాలగ్లాసు వరసల్లో/ పరాధీనతా బానిస కన్నీరు ద్వీపాంత వాసం ఫ్రేం కట్టినట్టు కనిపిస్తాయి’’  - కొండేపూడి నిర్మల (లేబర్‌ రూమ్‌)
♦ ‘‘నీకు పంచేందుకు రక్తం లేకే కదా/ నిన్ను పెంచేందుకు తీరిక లేకే కదా/ నీ అక్కకు ఇంకా పాకడమైనా రాలేదనే కదా/ నేన్నిన్ను వద్దనుకున్నది’’  - పాటిబండ్ల రజని (అబార్షన్‌ స్టేట్‌మెంట్‌)
♦ ‘‘నేను తప్పటడుగులేస్తూ/ అమ్మ చిటికిన వేలు పట్టుకొని/ జీవనరేఖల సరిహద్దుల కొలత వేస్తుంటాను’’  - పుట్ల హేమంత (జ్ఞాపకాల తెరలు)
♦ ‘‘అమ్మ కావాలి!/ నవ్వే నక్షత్రంలా అమ్మ కావాలి/ లాలించే జీవనది అమ్మ కావాలి/..../ నాన్న చేత తన్నులు తినని అమ్మ కావాలి’’  - బి.పద్మావతి (గుక్కపట్టిన బాల్యం)
♦ ‘‘అమ్మవై కూడా అమ్మ కోసం ఏడుస్తున్నావా?/ ఏం చెయ్యను తల్లీ/ ఎగిరొచ్చి నీ ముందు వాలాలనే ఉంది/ ఎదకు నిన్ను హత్తుకుని ఊరడించాలనే ఉంది...’’  - కె.వరలక్ష్మి (శృంఖలాల్లోంచి)
♦ ‘‘తాళికట్టిన మృగం/ తాగి ఇంటికి వచ్చి చేసే ఉన్మాదక్రియల్లో/ కంచం ఎగిరి దూరాన పడుతుంది’’  - తుర్లపాటి రాజేశ్వరి (ఊసరవెల్లి)
♦ ‘‘వాడు నాకు కలలైనా కల్పిస్తాడు/ వీడు నా కలలన్నీ చెరిపేస్తాడు/ వాడికి నేను మరను తిప్పే మనిషిని/ వీడికి నేను మనిషి రూపంలోని మరని/ ఎవడూ అన్నది? ఇది మిత్ర వైరుధ్యమని!’’  - మొక్కపాటి సుమతి (మిత్ర వైరుధ్యమా?)
♦ ‘‘ఆత్మ/ దేహాన్ని వదిలి/ అద్దం ముందుకెళ్లి నిల్చుని/ ఈల పాడుతూ కన్నుగీటుతుంది’’  - ఊర్మిళ (అంగార స్వప్నం)
♦ ‘‘నే పుట్టినట్టు అమ్మ కలగన్న పాపానికి/ తిండి లేకుండా కృశింపచేసినప్పుడు/ అమ్మ మౌనంగా కుళ్లిపోయినప్పుడు/ నేననుకున్నా/ నేనొక నిషిద్ధ జీవినే కాదు/ నిషిద్ధ స్వప్నాన్ని కూడా’’  - శ్రీమతి (నిషిద్ధ స్వప్నం)
♦ ‘‘సమాజం అంటుంది/ నువ్వు ఆడదానివి/ గీత దాటకూడని దానివి/ మచ్చపడితే మాయనిదానివి’’  - అబ్బూరి ఛాయాదేవి (విన్నావా?)
♦ ‘‘ఈ వంటిల్లొక వదలని మోహమై/ నా బాల్యాన్నంతా చుట్టేసుకుంది/ నాకు మా వంటిల్లొక అద్భుత మాయాబజారు’’ - విమల (వంటిల్లు)
♦ ‘‘బాల్యంలో/ చిన్నపిల్లవి నీకేం తెల్సు కూర్చో! అన్నారు/ యవ్వనంలో/ ఉడుకు రక్తం మంచీచెడూ తెలీదు కూర్చో! అన్నారు/ వృద్ధాప్యంలో/ ముసల్దానివి ఇంకేం చేస్తావ్‌ కూర్చో! అన్నారు/ అవకాశం రానందుకు కోపంగా లేదు నాకు/ కూర్చొని, కూర్చొని బద్ధకం వచ్చినందుకే బాధగా ఉంది’’ - ఎస్‌.రజియాబేగం (అలాగే అన్నారు)
♦ ‘‘ఈ శరీరం మూగవోయిన శతతంత్రుల రసవీణ/ ఆ శతసహస్ర ప్రకంపనల వేళ్లు మీటనిదే/ ఈ సెగ చల్లారదు’’  - రేవతీదేవి (అనురాగ దగ్ధ సమాధి)


వెనక్కి ...

మీ అభిప్రాయం