తిండి‘తిప్పలు’

  • 194 Views
  • 0Likes
  • Like
  • Article Share

    హాబ్ర

తిండి కలిగితె/ కండ కలదోయ్‌/ కండ కలవాడేను/ మనిషోయ్‌’’ అని మహాకవి గురజాడ అప్పారావు గొప్పగా చెప్పాడుగానీ  ఆ తిండి శాకాహారమో, మాంసాహారమో ఎందుకు చెప్పలేదో? లిటిగేషన్‌ చక్రవర్తి గిరీశాన్ని సృష్టించిన ‘మగానుభావుడు’ అంత తేలిగ్గా చెబుతాడేటి? పోనీలే ఈ విషయం మీద బుర్ర తినడం ఎందుకులే! అయినా బుర్ర శాకాహారమో మాంసాహారమో తేల్చి చెప్పిన మొనగాడు ఇప్పటికి లేడు. ఇందులో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ బుర్రకు మించిన బలవర్ధకమైన ఆహారపదార్థం లేదన్నది యథార్థం. దీన్ని మోకాలిలో బుర్ర ఉన్నవాడు కూడా కాదనడు. పోనీ కాదన్న మాదన్న ఎవడన్నా ఉంటే వాడి బుర్ర రామకీర్తన పాడటం ఖాయం!
      ‘‘ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ ఆలజాతికిన్‌ తిన్నది పుష్టి’’ అని అద్యతనాంధ్ర కవిత్వ ప్రపంచ నిర్మాతలు తిరుపతి వెంకట కవులు చెప్పారు. కానీ మనుషులకు కూడా తిన్నదే పుష్టి.. అది తిండీ కావచ్చు.. డబ్బూ కావచ్చు! అయినా ఏదో ఒకటి తిని ఎప్పటికైనా చావాల్సిందే కదా! మితాహారం అమితానందం అని ఎవరన్నారో తెలీదు. చెరువుకు అలుగువస్తే ఇబ్బంది లేదు కానీ కడుపునకు అలుగు వస్తే తెగులు తప్పదు. తినే తిండి గురించి అవగాహన లేక తిన్నా తినకున్నా కన్నీళ్లేనా అని బాధపడేవాళ్లూ ఉంటారు. వాళ్ల సంగతి బోధపడదు.
      ఎవరైనా తిండి తినేది ఆరోగ్యం కోసమన్నది ఎంతతిరిగినా తిరుగులేని సత్యం! అరిగే తిండి అమృతం.. అరగని తిండి విషం అంటారు. ఈ విషయంలో తెల్లవాడి తెలివి తెల్లారినట్టే ఉంది. అతడు one man's food is another man's poison అని చావు తెలివితేటలు ప్రదర్శించాడు. ఆ లెక్కన శివుడు మింగిన విషం ఎవరి ఆహారమో తెల్లవాడు చెప్పగలడా? అయినా ఆహారం వదలడానికి మార్గం ఏమయినా ఉందా? ఉంది! ఆహారం కావాలా? హారం కావాలా? అని పతిదేవుడు అడిగితే గయ్యాళిగంప అయినా, సతీసావిత్రి అయినా ఏమాత్రం సిగ్గుపడకుండా హారం వైపే మొగ్గు చూపుతుంది. అవసరమైతే కోరుకున్న నగ కోసం రిలేనిరాహార దీక్షకయినా, ఆమరణ నిరాహారదీక్షకైనా ‘నగలాడి’ సిద్ధమవుతుంది. ‘‘లక్షాధికారైన లవణమన్నమెకాని మెరుగు బంగారంబు మింగబోడు’’ అని పతి నెత్తీనోరూ బాదుకున్నా యావత్‌ ప్రపంచంలో ఏ ఆడదీ క్షమించదు. అంతెందుకు? పారిజాత పుష్పం ఇవ్వలేదని సత్యభామ ఎంత యాగీ చేసిందీ శ్రీకృష్ణుడికి తెలుసు, మనకు తెలుసు. ఇంకెవ్వరికీ తెలీదు.
      శివుణ్ని పెళ్లి చేసుకోవడానికి పార్వతిదేవి తపస్సు చేసింది. ఆకులు తినడం కూడా మానేసి అపర్ణ అయి కూర్చుంది. ఇంతకుమించిన స్థితి, గతీ లేవు. అంతవరకు కాకున్నా ఆకులు అలములు తినడం వల్ల కాదూ.. మన మునులు, మహర్షులు గొప్పవాళ్లయింది అన్నది సాత్వికసత్యం.. తాత్విక సత్యం.. తార్కిక సత్యం!
      ఇప్పుడు ఆహారప్రపంచం అంతా తన చుట్టూ తాను తిరుగుతూ శాకాహారం చుట్టూ తిరుగుతోంది. శాకాహారం ఆరోగ్యకరమని తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు అంతా ఘోషిస్తున్నారు. ప్రత్యేకించి ఆకుకూరల్లో విటమిన్లు ఎక్కువ ఉంటాయట. దీనికితోడు వీటినికొంటే విటమిన్‌ ఎం (డబ్బు) ఎక్కువగా ఖర్చుకాదట. అది మాత్రం ఆరోగ్యకరం కాదేమిటి? పైగా ‘‘కూరలేని తిండి కుక్కతిండి’’ అన్న పద్యం (పాదం) కూడా ఉంది. పద్యాల్లో కొస్తే ఇంకో పేచీ కూడా ఉంది.
      ‘‘కుక్క తిన్నవాడు గురులింగజంగంబు/ పంది తిన్నవాడు పరమయోగి’’ అని మన వేమన యోగి ఎప్పుడో చెప్పాడు కదా అనేవాళ్లూ ఉన్నారు కానీ అవి ఆయన వేదాంతార్థంలో చెప్పిన ‘ముక్కలు’ తప్ప మామూలు అర్థంలోకాదు. అందువల్ల ఆ ‘ముక్కల్ని’ చెవిలో వేసుకుని అన్యాయంగా హడావుడి చేయకూడదు. శాకాహార ప్రాధాన్యం గురించి ‘మెక్కి’చెప్పడానికి కొంతమంది దానిని శాఖాహారం అంటారు. ఎవరి భాష, ఎవరి ఘోష వారి ఇష్టం!
      ‘‘వంకాయ వంటి కూరయు/ పంకజముఖి సీతవంటి భార్యామణియున్‌’’ అన్న పద్యం ఉంది. సీతమ్మ కన్నా ముందు వంకాయకూర గురించి చెప్పిన ‘కూరాత్ముడు’ అయిన కవిపుంగవుని గురించి ఎంత ‘సొల్లినా’ తక్కువే. ఒక్కసారి మహాకవులకు కూడా సమయానికి మంచి ఆలోచనలు రావు. శ్రీనాథమహాకవి పల్నాటి పల్లెటూళ్ల గురించి చెబుతూ ‘సజ్జ జొన్న కూళ్లు’ అని తేలికజేసి చెప్పాడు. ఇప్పుడు ఆ కూళ్లు ఎంత ఆరోగ్యకరమో అనుకుంటూ పెద్దపెద్ద ధనికులు కూడా వాటికోసం లొట్టలు వేసుకుంటూ పొట్టలు చూసుకుంటూ తెగ క్యూ కడుతున్నారు. ‘‘వెల్లుల్లిన్, తిలపిష్టమున్‌ మెసవితిన్‌’’ అని కూడా శ్రీనాథుడు తన అదృష్టాన్ని తెలుసుకోలేక బాధపడిపోయాడు. వెల్లుల్లిని తింటే హాయిగా గుండె మీద చేయి వేసుకుని పడుకోవచ్చు. ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు. మరి వెల్ల్లుల్లి ఇంకెంత గొప్పదో! అందరినీ ఉల్లి తినవద్దని హరిదాసు ఎందుకు చెప్పాడంటారు? ‘అందరికీ చెప్పాను.. నా గురించి కాదే’ అని భార్యకు ఎందుకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది? తనను తాను ‘గిచ్చు’కోవాల్సి వచ్చింది? అందరూ ఉల్లిపాయల మీదపడితే దాని గిరాకీ పెరిగి తనకు దొరకదని ఆయన భయం, బాధ. 
      తెలుగువాడికి శాకాహారానికి అవి‘నా’భావ సంబంధం ఉంది. కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, బందరులడ్డు, గుంటూరు కొరివికారం, బంగినపల్లి మామిడిపండ్లు, అనకాపల్లి బెల్లం, తెలంగాణ సకినాలు, రాయలసీమ రాగిసంగటి, గోదావరి పనసపొట్టుకూర.. ఇలా ఒక్కొక్కటి తినని బతుకు ఎందుకు అనిపిస్తాయి. ఇటువంటివన్నీ కవులకు ప్రేరణమయ్యాయి. ‘గుత్తివంకాయ కూరోయ్‌ మావా.. కోరి వండినానోయ్‌ మావా’ అన్న పాట వింటే మామగారికి ప్రేమ వరదలైపారుతుంది. అంతెందుకు మహాకవి సి.నారాయణరెడ్డి... ఎవడయ్య ఎవడువాడు/ ఇంకెవడు? తెలుగువాడు/ పంచభక్ష్యపరమాన్నాలు/ తన కంచాన వడ్డింప/ గోంగూర కోసమై/ గుటకలేసేవాడు అన్నారు. గోంగూర తెలుగు (నాలుక) ‘వాడి’కి మారుపేరు. గోంగూరను ఆంధ్రమాత అని కూడా పిలుస్తారు. సినారె మాటల్లోనే చెప్పాలంటే తెలుగువాడు ‘ఆవకాయ వియోగమసలె సైపనివాడు’. అంతేకాదు. తెలుగువాడి రుచికి, అభిరుచికి ప్రత్యేకత ఉంది. అప్పుడప్పుడు ‘పాతచింతకాయ పచ్చడి’ అని ఎగతాళి చేసినా చింతకాయ పచ్చడి కనబడకపోతే అతడి చింత అంతా ఇంతా కాదు. సినిమాలో సైతం ‘చింతచెట్టు చిగురుచూడు.. చిన్నదాని పొగరుచూడు’ అని పాడుకుంటాడు. వేపకాయ చేదుగా ఉన్నా దానిమీద తెలుగువాడికి ఎంతో మమకారం. ‘తినగతినగ వేము తియ్యనుండు’ అంటాడు. ఇదంతా ఎందుకు? షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి లేకపోతే తెలుగువాడికి సంవత్సరాది పండగలేదు.. అంతా దండగ!
      శాకాహారానికి జీవులే కాదు, దేవుళ్లు కూడా ప్రచారకర్తలే. శాకాహారం భక్తిలో భాగమైపోయింది. భగవంతునికి భక్తునికి అనుసంధానమైపోయింది. వేంకటేశ్వరునికి ఇష్టమైన శనివారంనాడు, సాయిబాబాకు ఇష్టమైన గురువారంనాడు ఇంకా ఇతర దేవుళ్లకు ఇష్టమైన రోజుల్లో మాంసాహారం జోలికిపోని భక్తవరేణ్యులు అసంఖ్యాకంగా ఉన్నారు. ఆదిదేవుడయిన వినాయకుడు ప్రకృతి దేవుడు కూడా. పత్రివల్ల ఒనగూరే ప్రయోజనాలు పత్రి కలవారిని కదిలించినా చెబుతారు. పత్రికల వారిని కదిలించినా రాసి చూపిస్తారు.
      మంచి ఆరోగ్యానికి పీచుపదార్థాలు ముఖ్యమని అంటారు. తత్వం ‘వంట’ పడితే కానీ తలకెక్కదు. చావుదగ్గరపడ్డ ఓ పాపాలపుట్ట అయినా పెద్దమనిషి దగ్గరికి వచ్చి ఆయనకు పుణ్యం సంపాదించి పెట్టాలని ఆయన బంధువులు ఓ ప్రయత్నం చేశారట. నార చూపించి ఇదేమిటి అన్నారట. అతడు నార అంటాడని, అది నారాయణలో భాగమని అందువల్ల అతడికి పుణ్యం వస్తుందని వారంతా ఆశపడ్డారట. కానీ ఆ మహానుభావుడు సామాన్యుడా? ‘పీచు’ అనేశాడట. బంధువులందరూ నిరాశపడ్డారట. కానీ మరణశయ్య మీద ఉన్న అతగాడు ప్రబోధించిన ఆరోగ్యసూత్రం వారికి అర్థంకాలేదు. నాయనా! పీచుపదార్థాలు తింటే తొందరగా ‘నారాయణ’ అనే అవసరం ఉండదన్నది అతడి ఉద్దేశం.
      కష్టకాలంలో ఎవరైనా కలోగంజో తాగమంటారు. బలుసాకు తిని బతకవచ్చునంటారు. అంతేగానీ మసాలా దోశనో, మటన్‌ బిర్యానీనో తినమని చెప్పరు. సాటి మనుషుల్ని ఎంత పీక్కుతినేవాడైనా ఈ పనిచేయడు. పీక్కు తినడమంటే బకాసురుడు గుర్తొస్తాడు. అడుగుజాడ బకాసురుడిది అనొచ్చుగానీ వాడు తిన్నది నరమాంసం కాబట్టి వాడు పనికిరాడు. ఏ పూరీనో చపాతీనో తిని ఉంటే అతగాణ్నీ గౌరవించవచ్చు. ఒక్కోసారి ఆహార ఎన్నికల్లో పూరీ చపాతీ పోటీపడవచ్చు. ఈ పోటీ చూసిన ఒకాయన నేను పూరీకే ఓటు వేస్తాను. నన్ను పాతిపెట్టినా చపాతీ అక్కర్లేదు. ‘పూరీ’లో భగవంతుడు (జగన్నాథుడు) ఉన్నాడు. చపాతీలో లేడు అన్నాడు. డొక్కల విషయంలోనయినా ఎవరి లెక్కలు వారివి.
      శిబిచక్రవర్తి గొప్పవాడే కానీ తొడకోసి ఇవ్వడం వల్ల మాంసాహారానికి ప్రచారం చేసినట్టయింది. అలాగే విశ్వామిత్రుడు కుక్కమాంసం తిని మాంసాహారాన్ని ప్రోత్సహించినట్టయింది. వాళ్లు ఈ పనులు చేయకుండా ఉంటే బాగుండేది.
      ‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’ అని ఎవరినైనా ఎగతాళి చేస్తారు. ఎగతాళి ఎందుకు? మెతుకు లేకపోతే ఎంత ఆరోగ్యం! బతుకు ఎంత విలాసంగానైనా ఉండవచ్చు! నిజానికి ఉపవాసానికి మించిన పౌష్టికాహారం లేదు! మంచి ఆరోగ్యానికి ఉపవాసమూ ఓ మార్గం. ఉపవాసం పేరు చెప్పి అన్నం తినకుండా 8 చపాతీలు, 16 ఇడ్లీలు తినేవాళ్లు కూడా దేవుడి అనుగ్రహాన్ని ఎలా చూరగొంటారో తెలియదు. అయినా ఉపవాసం తప్పదు. ఉపవాసం అంటే దేవుడికి సమీపంగా జీవించడం. దీనికి కూడా పరిమితులున్నాయి. ఉపవాసం మరీ శ్రుతిమించితే నేరుగా దేవునిలో లీనమై జీవించే పరిస్థితీ రావచ్చు. మనం ఇడ్లీలు, చపాతీలు తిని దానికి ఫలహారం అని ముసుగు వేస్తుంటాంగానీ అది ఫలాహారం. ఇందువల్ల ఎన్నెన్ని ఇతరేతర ప్రయోజనాలో ప్రత్యేకించి చెబితేకానీ తెలియదు. ఒకమ్మాయిని ఒక డాక్టరుగారూ, ఒక ఇంజినీరుగారూ ప్రేమిస్తున్నారట. ఇద్దరిమధ్య పోటాపోటీ. ఇంజనీరేమో తన ప్రేమ ‘ఫలించ’డానికి ఆ అమ్మాయికి రోజూ ఒక ఆపిల్‌ను ఇస్తున్నారట. ఎందుకు బాబూ అలా చేస్తున్నావు అని ఈ వ్యవహారం గమనించిన ఒకాయన అడిగితే రోజూ ఆపిల్‌తింటే డాక్టర్‌ను దూరంగా ఉంచవచ్చునంటారు కదా! ఆ అమ్మాయి డాక్టర్‌ను దూరంగా ఉంచుతుంది అని అన్నాట్ట! ఫలహారాన్ని ‘ప్రేమించడానికి’ ఇంతకుమించి ఏమికావాలి? ఎవరయినా శాకాహారి అయినా అవుతారు! మాంసాహారి అయినా అవుతారు! అనుకుంటే పొరపాటే. మీరు శాకాహారా? మాంసాహారా? అని లాలూప్రసాద్‌ యాదవ్‌ను అడగ్గా ఆయన నేను శాకాహారినీకాను.. మాంసాహారినీకాను బిహారీని అని నవ్వుతూ ఠక్కున జవాబిచ్చారు. దీని భావమేమి బిహారీశ!
      శాకాహారంలో పప్పు విశిష్టత గురించి ఎంత డప్పు కొట్టినా తప్పులేదు. పప్పును పేదవాడి మాంసం అంటారు. పదునుగ మంచికూర నలపాకము చేసిననైన ‘అందున్‌ ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగనేర్చునటయ్య భాస్కరా’ అని భాస్కరశతకం చెబుతుంది. ఇది బి.పి ఉన్నవాళ్లు ససేమిరా ఒప్పుకోరు. రుచికాదు బి.పి పుడుతుందయ్యా జాగ్రత్త అంటారు. అందుకేగా వేమన కవి 
ఉప్పు కప్పురంబు ఒక్కపోలికనుండు 
చూడ చూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ 

      అని పద్యం రాశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆరోగ్యం బాగుండాలనుకునేవాళ్లు తెల్లగా (బియ్యం, ఉప్పు) చల్లగా (శీతలపానీయాలు, ఫ్రిజ్‌లలో నీరు) తియ్యగా (లడ్లు, చక్కెర, మిఠాయిలు) ఉండేవాటికి దూరంగా ఉండాలట! అయినా ప్రాణానికి మించిన తీపి పదార్థం ఇంకోటిలేదు. ఈ తీపి కోసం ఏ తీపినైనా వదులుకోవాల్సిందే. ముప్పును తప్పించుకోవడానికి ఏ ఉప్పు ముందయినా గప్‌చిప్‌గా ఉండాల్సిందే. ఆకారం బాగుండటానికి కారం వద్దు అనుకోవాలి. శరీరం మీద మమకారం ఉంటే ఇదంతా అవసరం. ‘శరీరమాద్యంఖలు ధర్మసాధనం’ అన్నారు. ధర్మసాధనాల్లో శరీరం మొదటిదని తెలుసుకోవాలి. కాపాడుకోవాలి.
      ఆహారం అనేది కేవలం కడుపు నిండటానికి కాదు, పదికాలాలపాటు ఆరోగ్యంగా ఉండటానికి. ఇప్పుడు మనుషులకు ఆకలి కావడంలేదు.. మందులకు ఆకలి అవుతోంది. సమయానికి మందుబిళ్లలు వేసుకోవడానికి తింటున్నారు. తిండి తిప్పలు అంటే ఇవే. మనం గోమాతను పూజిస్తాం. ఆరాధిస్తాం. గోవుపాలు అమృతంతో సమానం.
      ‘గంగిగోవుపాలు గరిటెడైనను చాలు/ కడివెడైననేమి ఖరము పాలు’ అనే పద్యం ఇందుకు ఉదాహరణం. ఆవు పాలల్లో ఉన్న పౌష్టిక విలువలు అందరికీ తెలుసు. చిత్రమేమిటంటే గాడిద పాలల్లో కూడా మంచి ఆహార లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. శ్రీకృష్ణుడి డాడీ వసుదేవుడు గాడిద కాళ్లు పట్టుకోవడానికి ఇది కూడా ఒక కారణమేమో.
      ఆహారం-ఆరోగ్యం గురించి మన పెద్దలు ఎప్పుడో పరిశోధన చేశారు. నెయ్యి అనగానే ఇప్పటివాళ్లు మానెయ్యి అంటున్నారు. అది సరికాదని ఒక శ్లోకం వల్ల తేలుతుంది.
      ‘ఘృతేన వర్ధతే బుద్ధిః/ క్షీరేణ వర్ధతే ఆయుః/ శాకేన వర్ధతే రోగం/ మాంసం మాంసేణ వర్ధతే’ అన్న శ్లోకం ఉంది. నెయ్యి బుద్ధిని, పాలు ఆయుర్దాయాన్ని, శాకం రోగాన్ని, మాంసం మాంసాన్ని పెంచుతాయని దీని అర్థం. ఇందులో ఎవరికి కావాల్సింది వారు పెంచుకుంటారు. ఎవరు చెప్పగలరు? ఎవరు అడ్డు చెప్పగలరు? ఇంకో ముఖ్యవిషయం. తిండి కోసం బతకాలా? బతకడం కోసం తినాలా? అన్నది అతిముఖ్యమైన అంతర్జాతీయ సమస్య. బతకడం కోసం తినడం మంచిది. మంచి తిండి తినడం మరీ మంచిది. అందువల్ల శాకాహార దినోత్సవం ఏడాదికి ఒక్కరోజు (అక్టోబరు 1) ఉంటే ఏం బాగుంటుంది. రోజూ ఉండాలి.. అది మితాహార దినోత్సవం కూడా కావాలి. కాదంటారా?


వెనక్కి ...

మీ అభిప్రాయం