చరిత్రపై చాళుక్యుల చేవ్రాలిదిగో...!!

  • 810 Views
  • 10Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్,

  • హైదరాబాదు.
  • 8008551841
చింతలపల్లి హర్షవర్ధన్,

అలంపురం... వెయ్యేళ్లకు పైబడిన ఎత్తుపల్లాల చరిత్రకు మౌనసాక్షి. ఇక్కడే కృష్ణవేణమ్మ ఒడిలో సేదదీరడానికి వడివడిగా సాగే నీలాల తుంగభద్ర ఒకవైపు... చాళుక్యుల శిల్పకళా వైభవానికి ప్రతీకలుగా ఒక వరసలో పేర్చినట్లుండే నవబ్రహ్మేశ్వరాలయాలు మరోవైపు! పది శతాబ్దాల కిందటి ఈ దేవళాల శిఖరాలు విశాల ఆకాశం నేపథ్యంతో, ఠీవిగా నిలబడి పురాతన సౌరభాలు వెదజల్లుతుంటాయి. కృష్ణా తుంగభద్ర నదుల నడిగడ్డలోని ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో అయిదోది. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి పశ్చిమద్వారం. అంతకు మించి జాతి చారిత్రక వారసత్వ సంపదలకే తలమానికం.
తెలుగునేల
మీద ఉన్న పురాతన ఆలయాల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా, అలంపురం క్షేత్రానిది విశిష్ట స్థానం. తుంగభద్ర కృష్ణా నదుల సంగమం సమీపంలో ఉన్న ఈ ప్రాంతం అలనాడు పేరెన్నికగన్న వ్యాపారకూడలి. నవబ్రహ్మ, జోగులాంబ, సంగమేశ్వర, పాపనాశేశ్వర, నరసింహ, సూర్యనారాయణ ఆలయాలు కొలువుదీరిన ఈ పట్టణం బ్రహ్మేశ్వర క్షేత్రం. నవబ్రహ్మ, జోగులాంబ  ఆలయాలు పెద్ద ప్రాకారంలో ఉంటాయి. వీటిని ఏడు, తొమ్మిది శతాబ్దాల మధ్య కర్ణాటక, తెలుగు ప్రాంతాలను పరిపాలించిన పశ్చిమ చాళుక్యులు నిర్మించారు. రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజుల పాలనలో- అంటే 16వ శతాబ్ది దాకా ఇక్కడ ఆలయాల నిర్మాణం, మరమ్మతులు జరిగాయి.
ఇక్ష్వాకు పాలకుడు రుద్రపురుషదత్తుని కాలంనాటి (క్రీ.శ.3వ శతాబ్దం) గురజాల శాసనంలో ‘హలంపుర స్వామి’ ప్రస్తావన కనిపిస్తుంది. హలంపురమే అలంపురమై ఉంటుంది. తొలి సాహితీ ఆధారం ‘బసవపురాణం’లో లభిస్తుంది. హతఃపురి, హేమలాపురం, ఆలంపూర్‌ అనే పేర్లూ వ్యవహారంలో ఉన్నాయి. ఇంకోవాదం ప్రకారం, ఎల్లమ్మపురం కాలక్రమంలో అలంపురంగా మారిందట. ఇక్కడ శాక్తేయం, శైవం, గాణాపత్యం, వైష్ణవ, స్కాంద, సౌర తదితర మతశాఖలు వర్ధిల్లాయి. రాష్ట్రాల పునర్విభజనకు ముందు అలంపురం తాలూకా కర్ణాటకలోని రాయచూరు (అప్పుడు హైదరాబాదు రాజ్యం) జిల్లాలో ఉండేది. తెలుగు మాట్లాడే ప్రాంతం కనుక దీనిని మహబూబ్‌నగర్‌లో విలీనం చేశారు. శ్రీశైలం ఆనకట్ట ముంపు ప్రమాదం పొంచి ఉండటంతో గడియారం రామకృష్ణశర్మ చొరవతో నదికి, ఊరికి మధ్య 30 అడుగుల కరకట్టను నిర్మించారు.
నవబ్రహ్మల నిలయం
ఇవి ఒకే ప్రాంగణంలో కొలువైన శివాలయాలు. ‘బ్రహ్మయలంపూర భక్తితో నిలిపి/ బ్రహ్మేశ్వరునిగాదె పాయక కొల్చు’ అని అలంపురాన్ని ప్రస్తావించాడు పాల్కురికి సోమనాథుడు. ఇది ‘బసవపురాణం’ ఆరో ఆశ్వాసంలోని శివలెంక మంచన కథలో వస్తుంది. రాముడు, ఇంద్రుడు తదితర దేవతలు శివుణ్ని అర్చించారు, కానీ శివుడు వేరెవ్వరికీ పూజ చేయలేదని చెబుతూ... అలంపురంలో బ్రహ్మదేవుడే శివుణ్ని ప్రతిష్ఠించి, బ్రహ్మేశ్వరుణ్ని పూజించాడంటాడు. వీటికి బ్రహ్మేశ్వరాలయాలు అనే పేరు రావడం వెనక వివిధ వాదాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించడం ఒకటి.
      మరొకటి... కాశీ నుంచి వచ్చిన రససిద్ధుడు నిర్మించిన విషయం. దీన్ని ఇక్కడి మహాద్వారం ముందున్న శిలా శాసనంలో నిక్షిప్తం చేశారు. ఆలయాల పేర్ల విషయానికి వస్తే... అవి ఆ రససిద్ధుడు పరుసవేది కోసం వాడుకున్న మూలికలనీ చెబుతారు. ఆలయాల నిర్మాణానికి అలంపురం సమీపంలో ఉన్న ఉండవెల్లి గనుల నుంచి తెచ్చిన ఇసుకరాయిని వాడారట. నవబ్రహ్మ ఆలయాల్లో ప్రధానమైంది బాల బ్రహ్మేశ్వరాలయం. ఇది ఎనిమిదో శతాబ్ది నాటిది. చాళుక్య విజయాదిత్యుడి కాలంలో నిర్మించారు. గర్భాలయానికి ముందున్న మండపంలో స్థానాపతులు, వీరభద్రుడు, నరసింహుడు, గర్భాలయం గోడల వెలుపలి గూళ్లలో గణపతి, వృషభారూఢ శివపార్వతులు, రెండు సింహాల మధ్యగా నిల్చున్న పార్వతీదేవి విగ్రహాలు కనిపిస్తాయి. అలంపురం ఒకప్పుడు ప్రముఖ విద్యా కేంద్రం. స్థానాపతుల విగ్రహాలు అప్పటి ఉపాధ్యాయులవేనట. స్థానిక శాసనాల నుంచి సోమాది భట్ట్టు, బ్రహ్మేశ్వర భట్ట్టు, మల్లికార్జున భట్టు అనే మఠాధిపతుల పేర్లు తెలుస్తున్నాయి. మల్లికార్జున భట్టు ఓ సూర్యగ్రహణం నాడు ఆత్మత్యాగం చేశాడట. 
      మిగిలిన కుమార, స్వర్గ, తారక, పద్మ, గరుడ, అర్క, వీర, విశ్వబ్రహ్మ ఆలయాల్లో ప్రతీది శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేదే. ఈ ప్రాంగణం భారత పురావస్తు శాఖ నిర్వహణలో ఉంది. బాలబ్రహ్మేశ్వర, జోగులాంబ ఆలయాలు ఉండటం, తుంగభద్ర ఉత్తరవాహిని కావడంవల్ల అలంపురం ‘దక్షిణకాశి’గా ప్రసిద్ధి చెందింది. 
      అలంపురం ఆలయ సమూహంలో పద్మబ్రహ్మ ఆలయం పెద్దది. ఈ గుడి శిఖరం పూర్తిగా శిథిలమైంది. స్వర్గబ్రహ్మ గుడి ఇక్కడి ఆలయాల్లో అత్యున్నత శిల్పకళతో అలరారుతోంది. పాక్షికంగా శిథిలమైన తారక బ్రహ్మ ఆలయంలో విగ్రహం లేదు. ఇందులో ద్రావిడ నిర్మాణ శైలి కనిపిస్తుంది. విశ్వబ్రహ్మ గర్భాలయానికి ముందున్న స్తంభాల కింది భాగంలో ఒకదాని వెనక ఒకటి ఉన్న నాలుగు సింహాల శిల్పాలు కనిపిస్తాయి. కప్పు భాగంలో నాగబంధం చెక్కి ఉంటుంది. పద్మబ్రహ్మ ఆలయంలో శివలింగం తళతళలాడుతూ కనువిందు చేస్తుంది. అర్కబ్రహ్మ ఆలయ శిఖరం కూడా శిథిలమైంది. ఈ ప్రాంగణంలో కుమార బ్రహ్మ మినహా, మిగిలిన అన్ని దేవాలయాలకు శుకనాసి (శిఖరం ఆధారంలో ముందుకు పొడుచుకు వచ్చిన చిలుక ముక్కులాంటి భాగం) ఉంటుంది. ఆలయాలు రేఖాంగ నాగర శైలిలో నిర్మితమై ఒడిశా ఆలయాల శైలిని పోలి ఉంటాయి. వీటిని చూసే ‘త్రిలింగం, కళింగం ఒక్కటే’ అన్నారు దాశరథి కృష్ణమాచార్య. 
విశృంఖలాదేవి...
అలంపురం అనగానే గుర్తుకువచ్చేది జోగులాంబనే. లలితా సహస్ర నామావళిలో ‘విశృంఖల’గా పేర్కొన్నారు. అంటే శృంఖలాలు, బంధనాలు లేనిదని. యోగులకు అమ్మ కనుక యోగాంబ, జోగాంబ, జోగులాంబ అయ్యింది. సతీదేవి మృతదేహాన్ని విష్ణుమూర్తి చక్రంతో ఖండించినప్పుడు ఆమె శరీరభాగాలు వివిధ ప్రదేశాలలో పడ్డాయి. పై దవడ భాగం అలంపురంలో పడిందట. అదే జోగులాంబ శక్తిపీఠంగా ప్రసిద్ధిలోకి వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి మాత్రం జోగులాంబను జైన దేవతేమో అంటారు ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో.
      14వ శతాబ్దం మధ్యకాలానికి గుల్బర్గా కేంద్రంగా బహమనీ సామ్రాజ్యం పురుడుపోసుకుంది. అప్పటినుంచి ఒకటిన్నర శతాబ్దాలపాటు బహమనీలకు... తెలుగు ప్రాంతాలను పరిపాలించిన ముసునూరి నాయకులు, రెడ్డి, విజయనగర రాజులకు మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల్లో 1390లో జోగులాంబ ఆలయం బహమనీల దాడిలో నేలమట్టం అయింది. అప్పటి నుంచి అమ్మవారి విగ్రహం బాలబ్రహ్మేశ్వరాలయంలో ఉండిందట. స్థానికుల చొరవతో జోగులాంబ ఆలయాన్ని, మొదట్లో ఉన్నట్లుగా భావిస్తున్న స్థలంలో కొత్తగా కట్టారు. నిర్మాణం 2005లో పూర్తయింది. 
      మెడలో కపాలమాల, చెవికి నాగాభరణం ధరించిన జోగులాంబ ప్రేతాసని, లంబస్తని, వికృతాక్షి. కురులు కూడా అంతెత్తుకు లేచి ఉంటాయి. వాటిని ఆశ్రయించుకుని బల్లి, గుడ్లగూబ, కపాలం, తేలు, పాము, కోతి ఉంటాయి. ఇల్లెప్పుడూ సంపద్వంతంగా కళకళలాడుతూ ఉండాలి. లేకపోతే ఆ ఇంట్లో బల్లులు, గుడ్లగూబలు, తేళ్లు, పాములు ఆశ్రయం ఏర్పరుచుకుంటాయి. క్రమంగా ఇల్లు కళ కోల్పోయి, చివరికి పాడుబడుతుంది. అలా జరగకుండా ప్రజలకు సుఖ సంతోషాలు ప్రసాదిస్తుందన్న దానికి ప్రతీక ఈ రూపం. 
చరిత్రకు దర్పణాలు
అలంపురం ఆలయాలు పశ్చిమ చాళుక్యులే నిర్మించిన కర్ణాటక బాగలకోట జిల్లాలోని పట్టడకల్‌ పాపనాథ, గలగనాథ ఆలయాలను పోలి ఉంటాయి. అలంపురం దేవాలయ సముదాయంలో చాళుక్యులు, కాకతీయుల కాలపు, విజయనగర సామంతుల శాసనాలు దొరికాయి. క్రీ.శ.1038 నాటి శాసనం మేరకు దారిశెట్టి, గండర మల్లిశెట్టి తదితర వ్యాపారులు బ్రహ్మేశ్వరునికి నందాదీపం కొనసాగించేందుకు వీలుగా కొన్ని దానాలు చేశారు. ఇది చాళుక్య జగదేకమల్లుడి కాలానిది. మహాదేవి మన్నెదేవి వేయించిన క్రీ.శ.1101 నాటి శాసనంలో... ఆలయ అవసరాల నిమిత్తం ఒక అగ్రహారాన్ని దానం ఇచ్చిన, బ్రహ్మేశ్వరాలయానికి సున్నం వేయించిన వివరాలు ఉన్నాయి. శాసనాధారాలను బట్టి ఆమె త్రిభువనమల్లుడి భార్య మలయమతీదేవి కావొచ్చు. 
      బాలబ్రహ్మేశ్వరాలయంలో క్రీ.శ.1526 నాటి రాగిరేకుల శాసనం ఒకటి లభ్యమైంది. దీన్ని వేయించింది స్థానిక పాలకుడైన చిన్నపెద్ద నాయనింగారు. ‘శ్రీస్వస్తి అలంపురవర ప్రతిత మహోదయ/ సకల భువనైకనాథ శ్రీబాలబ్రహ్మేశ్వరు దేవునికి...’ అని సాగే ఈ శాసనంలో అలంపురాన్ని హేమలాపురంగా పేర్కొన్నారు. నవబ్రహ్మల పేర్లున్న ఈ శాసనంలో జోగులాంబ పేరు లేదు. సంక్రాంతి సందర్భంగా రాయల పేరుమీద, తనతండ్రి పెద్దినాయనిం పేరుమీద చిన్నపెద్ద నాయనింగారు చన్నుపల్లెను దానం ఇచ్చిన వివరాలు ఉన్నాయి. ఇలాంటి శాసనాలు అలంపురం పరిసరాల్లో చాలానే వెలుగు చూశాయి.
నగ్నకబంధం
తలభాగంలో పద్మం ఉన్న నగ్న స్త్రీ రూపమే ఈ నగ్నకబంధం. ఇది పరుశురాముని తల్లి రేణుకాదేవి రూపం. ఈమె సంతాన దేవత. జమదగ్ని ఆదేశం మేరకు పరుశురాముడు తల్లి రేణుక తల నరికిన సంఘటనతో ముడిపడింది ఈ విగ్రహం. తలభాగాన్ని ఎల్లమ్మగా కొలుస్తారు. నగ్నకబంధం బాలబ్రహ్మేశ్వరాలయ ప్రాంగణంలో భూదేవి పేరుతో పూజలందుకుంటోంది. సంగ్రహాలయంలోనూ వీటిని చూడొచ్చు. పశ్చిమ చాళుక్యుల రాజధాని బాదామిలోనూ ఇలాంటిది ఉంది.
సంగమేశ్వరాలయం
ఇది కృష్ణా తుంగభద్ర నదుల సంగమస్థలం కూడవెల్లిలో నిర్మితం. క్రీ.శ.622లో పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేశి ఈ ఆలయాన్ని దర్శించుకున్నాడట. రేఖాంగ నాగర శైలిలో ఉన్న దీన్ని ఎత్తయిన అధిష్ఠానం మీద నిర్మించారు. శ్రీశైలం ఆనకట్ట ముంపు పరిధిలో ఉండటంతో ఈ ఆలయాన్ని అలంపురంలో యథాతథంగా పునర్నిర్మించారు. ఇలా నిర్మించిన ఆలయాల్లో ఇది ప్రపంచంలో రెండోది. మొదటిది ఈజిప్టులోని ఆబుసింబెల్‌. ఆలయ ద్వారపాలకులు శంఖనిధి, పద్మనిధి. వీళ్లు నవనిధుల రక్షకులు. తిరుమలలోనూ వీళ్ల విగ్రహాలు ఉన్నాయి. ఆలయం గోడల వెలుపల చుట్టూరా హరిహర, అర్ధనారీశ్వర, యమున, గంగ తదితర శిల్పాలు ఆనాటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడతాయి. ఆలయ ద్వారానికి ఎడమవైపు కోవెలలో ఉన్న బదరీనారాయణుని విగ్రహం, ముందున్న మంటపంలో ఉన్న నంది విగ్రహాలు ఆకట్టుకుంటాయి. 
      ఇక్కడికి దగ్గర్లోనే రాష్ట్రకూటుల కాలంనాటి పాపనాశేశ్వర ఆలయాల సముదాయం ఉంది. ఇవి 20 ఆలయాలు. వీటినీ సంగమేశ్వరం నుంచే తరలించారు. వీటిలో పెద్దది పాపవినాశేశ్వర ఆలయం. ఇందులో బుద్ధుణ్ని విష్ణుమూర్తి తొమ్మిదో అవతారంగా మలచిన శిల్పం ఉంటుంది. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారంగా చూపించే తొలి ఆధారాల్లో ఇది ఒకటి.
      తారకబ్రహ్మ ఆలయ ఆవరణలో షా అలీ పహిల్వాన్‌ దర్గా ఉంటుంది. దీనికి ప్రతి సంవత్సరం ఉర్సు నిర్వహిస్తారు. అలంపురం దర్శించే యాత్రికులు దీన్నీ దర్శించుకుంటారు. స్థానికులు కూడా మతాలకు అతీతంగా అలంపురం క్షేత్రాన్ని అపురూపంగా చూసుకుంటారు. స్థానికంగా పిల్లలకు జోగులమ్మ, జోగమ్మ, బ్రహ్మేశ్వర పేర్లు పెట్టుకుంటారు. చుట్టుపక్కల ప్రాంతాలైన కర్నూలు, మహబూబ్‌నగర్, హైదరాబాదు, కర్ణాటకల నుంచి యాత్రికులు ఎక్కువగా వస్తారు. అయితే మిగిలిన పెద్ద ఆలయాలతో పోల్చితే అలంపురానికి యాత్రికుల తాకిడి కాస్త తక్కువే.
      పశ్చిమ చాళుక్యుల కాలానివే అయిన బాదామి, పట్టడకల్‌ ఆలయాలకు యునెస్కో గుర్తింపు లభించింది. అలంపురం మాత్రం తన స్థాయికి తగ్గ గుర్తింపునకు దూరంగా ఉండిపోయింది. మహాబలిపురం, తంజావూరు, కోణార్క్, ఖజురహో తదితర సాంస్కృతిక స్థలాలకు ఏమాత్రం తీసిపోనిది అలంపురం. తమ గడ్డ మీద ఏమాత్రం చారిత్రక ప్రశస్తి ఉన్న స్థలాలున్నా, అవి ఎంత మారుమూల ప్రదేశాల్లో ఉన్నా చిత్తశుద్ధితో సంరక్షించుకుంటాయి కొన్ని దేశాలు. పైగా వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ పర్యటకులను ఆకర్షిస్తాయి. మరి అలంపురంలో ఏ రాయిని, ఏ స్తంభాన్ని, ఏ శిల్పాన్ని తాకినా అది కనీసం వెయ్యేళ్ల చరిత్రను వినిపిస్తుంది. అంతటి ఘనతను ఇంకెంత గొప్పగా చెప్పుకోవాలి మనం!


వెనక్కి ...

మీ అభిప్రాయం