తందనాన.. ఓ  పొడుపుకథ

  • 560 Views
  • 2Likes
  • Like
  • Article Share

తందనాన.. ఓ  పొడుపుకథ
తెలుగులో జానపద పొడుపు కథలూ, సాహిత్యపరమైన పొడుపుకథలు అని రెండు రకాలుగా ఉంటాయి. ఇందులో జానపద పొడుపుకథల వినోద స్థాయి విస్తృతమైంది. కొన్ని వచనరూపంలో ఉంటాయి. మరికొన్ని పద్యరూపంలో ఉంటాయి. గేయరూపంలో... అంటే తందాన రూపంలో కూడా కొన్ని పొడుపుకథలున్నాయి. ‘తాన తందాని తాన’ అన్నది జానపదగేయాల్లో వాడుకునే ఊతపదాల్లో ఒకటి. అందువల్ల బహుశా అది పొడుపుకథలో కూడా ప్రవేశించి ఉండవచ్చు.
తాన తందాని తాన
తక్కలై తాన తందాని తాన
నల్లనల్లని పక్షి యొకటి
నడినెత్తిన రెక్కలు వచ్చె 
చెవుల సందున కొమ్ములొచ్చె  
తాన తందాన తాన
దాని పచ్చ రత్నములు
కత్తి కత్తిన కోసి
బ్రాహ్మలన బంటులన
బంతిన బోంచేసిరంట    
తాన తందాన తాన
ఇంత చెప్పిన వేదశాస్త్రం
తెలియదాయె దాని భావం
దాని భావం బట్టబయలు  
ఇలా.. తందాన రూపంలో లయాత్మకంగా సాగే ఈ పొడుపుకథని లోతుగా ఆలోచిస్తే చాలు అరటిపండు అని సమాధానం చెప్పేయవచ్చు.


తాయెతు ఎక్కడిది?
‘‘తాయెతు అనగా రక్షార్థముగాని, అలంకార్థముగాని సిగనో, కంఠముననో, సందిటనో, మొలనో కట్టికొను వస్తువిశేషమని నిఘంటువుల నిర్వచనము. ఆంధ్ర నిఘంటువులో ఈ పదము తాయిత, తాయితు, తాయిత్తు, తాయెత, తాయెతు, తాయెత్తు, తాయోదు, తావితి, తావీజు, తావేజు, దాయతి, అను రూపములతో ఉల్లేఖింపబడినది. శ్రీనాథకృతముగా చెలామణి యగుచున్న పల్నాటి వీరచరిత్రము దీనికి తొలి ఆకరము. ఆ వెనుక రాయల యుగమునుండియు దీనికి విశేషవ్యాప్తి కలిగినది. కొన్ని ఆకరములను పరిశీలించినచో ఆయాదేశకాలములలోని దీని వ్యాప్తి తెల్లము కాగలదు. మేనికి రక్షయైమించు తాయెతులు (పల్నాటి వీరచరిత్ర), తాయెతుల బాహులు (మనుచరిత్ర), మందల తాయెత్తులు (కాళహస్తి మాహాత్మ్యము), సంది తాయెతుల దండ (అష్టమహిషీ కల్యాణం), నెలవంక తాయెతుల్‌ (పరమ యోగి విలాసము) వంటి అనేక కావ్యాలలో తావీజు ప్రస్తావన కనిపిస్తుంది. ఈ పదము తెలుగు పదమేకాదని నా భావము. ఇది తావీజ్‌ అను అరబ్బీ పదమైయుండును. ఖురాన్‌ మంత్రాలను రాసి రక్షగా ముస్లింలు కట్టుకొందురు. దీనినే మనవాళ్లు స్వీకరించినట్లున్నది అని సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో అభిప్రాయపడ్డారు. అరబ్బీలో త అవీజ్‌ అనగా రక్షణార్థము సర్వేశ్వరుని ప్రార్థించుట, ఆశ్రయించుట అని అర్థము’’  

- తూమాటి దొణప్ప


అల్లో నేరేళ్లు
అల్లో నేరేళ్లు.. అల్ల నేరేళ్లు అనే పదాలు అన్నమయ్య సంకీర్తనల్లోనూ, కొన్ని జానపద గేయాల్లోనూ కనిపిస్తాయి. అల్లోనేరేళ్లు అంటే వెన్నెలలో ఆడుకునే ఒక ఆట మాత్రమే కాదు జానపదులు పాడుకునే పాట అని కూడా అర్థం చెబుతారు. దీన్నే అన్నమయ్య ‘‘నెయ్యము లల్లోనేరేళ్లో.. వొయ్యన వూరెడి వువ్విళ్లో’’ అంటూ ప్రయోగించాడు. తన పాటల్లో చాలా చోట్ల ఆయన దీన్ని వాడాడు.  
నిజానికి ‘అల్లోనేరేళ్లు’ అనేది జానపద సంగీతంలో అనుపల్లవితో పాడే పదం. ఇది శివ సంబంధమైంది. అల్లో - నేరేళ్లు అనే రెండు పదాల కలయిక. హాలాహల శబ్దభవం ఆలమ్‌... అంటే విషం. ద్రవిడ కన్నడ భాషల్లో దీనికి ఈ అర్థమే ఉంది. తెలుగులో ఇది అల్లోగా మారింది. నేరేడు పండు వర్ణం కలిగిన విషాన్ని కంఠంలో ధరించినవాడు శివుడు అని వ్యుత్పత్తి. నీలమైన విషాన్ని దిగమింగకుండా, తన తెల్లని కంఠంలో దాన్ని పట్టి ఉంచడంతో ఆ భాగంలో ఈ విషం నేరేడు పండులా కనిపిస్తుందని అంతరార్థం. క్షీర సముద్రాన్ని మధిస్తున్న సమయంలో అమృతానికి ముందు హాలాహలం పుట్టింది. దేవతలు మొరపెట్టగా ఈశ్వరుడు ఆ విషాన్ని మింగి గరళకంఠుడు అయ్యాడని అందరికీ తెలిసిందే. ఆ విష భక్షణగాథనే గేయరూపంలో తెలుపుతూ ఈ అల్లోనేరేళ్లు అనే పదం తెలుగులోకి వచ్చి చేరింది. ‘‘మొదట శివ పరమున వెలసిన ఈ అల్లో నేరేళ్లో పదము యక్షగానములలో పల్లవి గల పాటగా పరిణమించింది’’ అని నిడుదవోలు వేంకటరావు ‘జానపదగేయాలు-కొన్ని విశేషాలు’ వ్యాసంలో ప్రస్తావించారు.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం