చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో

  • 296 Views
  • 31Likes
  • Like
  • Article Share

    సురా

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్‌ ఠావుల్‌ దప్పెను, మూర్చ వచ్చె, దనువున్‌ డస్సెన్‌.. ఎన్ని కష్టాలు గజేంద్రుడికి. అంత లావున్న గజేంద్రుడి అర్జీని ఏ న్యాయవాదీ మళ్లీ వినిపించక్కర్లేకుండా పోయింది. ఎకాఎకీ శ్రీమహావిష్ణువు దిగి తీర్పు ఇచ్చేశాడు. అది ఆనాడు గానీ, ఇప్పుడైతేనా ప్రాణంబులు ఠావులు అరఠావులు తప్పి ఎంత లావెక్కి అరిచినా అంత తేలిగ్గా న్యాయం దొరుకుతుందా? న్యాయవాదుల కొరత, వాళ్లతోనే కలత ముడిపడిపోయాయి!
      కలహప్రియుడు, వాక్‌చాతుర్యంతో వివాదాలను నడిపేవాడూ అయిన నారదుడు బారిస్టర్లకు బారిస్టరు. నేనేం చేసినా లోక కల్యాణం కోసమే అంటూ ఆయన చేసేది చేసుకుపోతాడు. ప్లీడరీకి కావాల్సిన విజ్ఞత, చతురత, సమన్వయం ఆయనలో అపారం. అందుకనే యుగాలుగా రాక్షస సమూహంలోకి కూడా చొచ్చుకుపోయి ఆధారాల సేకరణ, శత్రు సంహారానికి కావాల్సిన సమాచారం కూపీ లాగటం వంటివి ఇట్టే చేసిపెట్టాడు. ఇరువర్గాల వాదననూ విష్ణువుతో విన్నవించి తీర్పును ఆయనకే వదిలేయడం ఆయనలోని విజ్ఞత. నేరాలు హద్దు మీరినప్పుడు రాక్షసులను రెచ్చగొట్టి తప్పు చేయించి మరీ వాళ్ల న్యాయ శాసనాన్ని రాయిస్తుంటాడు.. అదీ చతురత. హిరణ్య కశిపుడి పొట్ట చీలింది ఈ చతురత వల్లే కదా... ‘నీ కొడుక్కి ఆ నామ జపం అబ్బిందీ అంటే నీ కన్నా ఆ విష్ణువు గొప్పవాడని విపరీతంగా అనుమాన పడాల్సి వస్తోందని వాపోతూ ఎంత రెచ్చగొట్టాడాయన? శిక్ష వేయడానికి సరైన మార్గంలో నడిపే నారదుడు ఎంత గొప్ప న్యాయవాది? కలియుగంలో నారదుడి పరపతి తగవులు పెట్టే తింగరోళ్ల వల్ల సన్నబడిపోయింది గానీ.. ఆ యుగాల్లో ఆయన లావైన లాయరు. 
      ఈ కాలంలో అడ్వకేట్ల గురించి చెప్పాలంటే కొన్ని వింత తర్కాలను ఒప్పుకోవాల్సి వస్తుంది. లాయరుగారి కూతుళ్లకు ఓ పట్టాన పెళ్లి సంబంధాలు కుదరవు. కుదుర్చుకోవాలంటే ఒకే తానులో నల్లకోట్లు కుట్టించుకున్న వియ్యపువారితోనే కలుపుకోవాలి. ఎందుకిలా అంటే.. అలా లా చదివినవాళ్లలా తలా మొలా లాగడం చాలా గోలా.. ఇదల్లా మనకేలా.. వేరేలా పోతే పోలా.. అంటూ తప్పుకుంటారు. ఊ అంటే వాళ్ల దృష్టిలో ఊసు కాదు.. కేసు..! ఇక ఊహూ అంటే చెప్పేదేముందీ?!  మొన్నటికి మొన్న ఒక లాయరు గారిని వాట్సప్‌ గ్రూపులోకే చేర్చలేదు. ఏ పోస్టు పెడితే ఎవరి పోస్టు ఊడగొడతాడో అంటూ గుసగుసగా వాదులాడుకున్నారు. ఆయనకేనా.. ఆయన కూతురికి కూడా వాళ్ల స్నేహితుల గ్రూపులో చేర్చుకోమని చెప్పకుండా చెప్పారు. ఆమె ఉన్న గ్రూపు ఒకటి, ఆమె లేని గ్రూపు ఒకటి! అందరూ వాడేది రెండోది!! ఎందుకు చెయ్యరూ ఇలాంటి పనులూ.. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో.. అంటూ రింగు టోన్లు పెట్టుకుంటే? సర్లే ఈమాత్రానికేనా అనుకోకండి.. లాయర్లకు గింజుకున్నా అప్పూ పుట్టదూ అరువూ పుట్టదు తెలుసా..? ఇంతకు మించిన విపత్తులున్నాయా ఈ ప్రపంచంలో?
      న్యాయవాదుల నల్లకోట్లు వెనక తెల్ల చొక్కాలు ఉంటాయి కానీ.. అందరివీ ఉతికి ఇస్త్రీ చేసినవి కాదు. నానా కష్టాలూ పడి చెట్టుకింద ప్లీడరన్న అపవాదులు భరిస్తున్న వాళ్లూ ఉంటారు. ఇంట్లో బైండు పుస్తకాలు తప్ప ఏ బాండు పేపర్లూ లేని అమాయక చక్రవర్తులూ ఉంటారు. నారద రహస్యం తెలియక అల్లాడిపోతూ నిర్దోషుల మధ్య నలిగిపోతుంటారు. దోషితోనే సంపాదన గానీ బడుగు బలహీన వర్గాల గొడుగు కింద ఏముంటుందీ? ఆ చెట్టుకింద నీడే ఎక్కువ అలాంటి నిరాడంబరులకు. బారిస్టరు చదివిన గాంధీజీ దేశ స్వాతంత్య్రం కోసం ప్రజల తరఫున మూడు దశాబ్దాల పాటు వాదించారు. అంత ఓపిక అందరికీ సాధ్యమా..?
      తీర్పు కోసం ఓర్పుగా నేర్పుగా వ్యవహరించాలి. అందుకోసం న్యాయవాది ప్రాక్టీసు పెట్టడానికి ముందే అనుభవం గడించాలి. ఈ న్యాయపోరాటంలో త్యాగరాజుని కూడా ప్రసన్నం చేసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. ‘బంటు రీతి కొలువు ఈయవయ్యా అయ్యా..’ అంటూ బతిమాలి బామాలి కీర్తించి వేడుకోవాలి. అంతే కాదండోయ్‌.. బారిస్టరు చదివినందుకు బ అనే అక్షరాన్ని ఒంట బట్టించుకోవాలి. సహాయకుడిగా చేరి అయ్యవారి ఆజ్ఞ మేరకు బట్టలుతకడం, బజారుకెళ్లడం, బల్లతుడవడం, బండి నడపడం.. వంటి భీకర ‘బ’కార కార్యాలన్నీ  బకరాలము కాదనుకుని బహు చక్కగా చేసి భళీ అనిపించుకోవాలి. అయ్యో.. ఎంతన్యాయం అని ఎవరన్నా అంటే, కేసుల్లో కిటుకులు లింకులు లిటిగేషన్లు ఊరకనే చెప్పేస్తారా మరీ.. అంటుంటారు.
      అంత మాత్రాన ప్లీడరంటే అంత చులకనేం కాదు. నల్లకోటేసుకున్నవాళ్లకి ఓ జోక్‌ చెప్పి నవ్వించే దమ్ముందా మీకు? మనకెందుకురా బాబూ అనుకుని ఆయనకు హేపీ న్యూ ఇయర్‌ సార్‌ అనో విష్యూ హేపీ పొంగల్‌ సార్‌ అనో ఏడాదికి రెండు మూడు మెసేజులు పెడతారు. అదీ గుండెల నిండా గాలి పీల్చిమరీ. పొరపాట్న ఆయనతో కలిసి టీ తాగారే అనుకోండి.. మీ వీధి వాళ్లు ‘ఏం వెధవ పని చేశావేంటీ? కేసీయినకు అప్పజెబుతున్నావా?’ అని వాట్సప్‌ గ్రూపులో అడుగుతారు.
      నిజానికి ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ చెబుతూ న్యాయాన్ని తేల్చే తక్కెడలో లెక్క సరిపెట్టేలా చేయడానికి లాయరు గారి నాలుక ఎంత అవస్థ పడుతుందో ఆయన్ను ఆశ్రయించిన ముద్దాయికే తెలియాలి. తిమ్మిని బమ్మి చేసి న్యాయాన్ని గెలిపించినా తప్పులేదు కదా. అది కృష్ణనీతి. పెళ్లి చెయ్యడానికి వెయ్యి అబద్ధాలు ఆడొచ్చన్న సామెతను అన్ని విభాగాల్లోనూ పాటించొచ్చని, అది న్యాయ సూత్రం అనీ వాదించి వక్కాణిస్తారు. 
      లా చదివినోళ్లను తగిలించి తమాషా చూస్తాడన్నా.. జిత్తులమారి నక్క అన్నా.. అంతా కోటు వెనకేగానీ ముందుకు రారు. అసలు కోర్టుసీను సాక్షిగా చెప్పాలంటే తొంభైశాతం మంది అమాయకపు బారిస్టరు పార్వతీశాలే ఉంటారు. ఏ కొద్దిమందో గంటకు లక్ష తీసుకుని వాదించే ‘లా’భ జాతకులు ఉంటారు. అయితే ఇక్కడో లాపాయింటు ఉందండోయ్‌.. చాన్నాళ్లుగా లా చదివినోళ్లను మినహాయించని మగ వాళ్ల జాబితాలోని ఇంటి ఇల్లాలే న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ద్విపాత్రాభినయం చేస్తోంది! ఇల్లాలు అనే పదంలోనే లా ఉందిగా. 
       ఇంతకీ న్యాయవాది మనవాడా పరాయి వాడా అంటే.. అలా ఏమీ కాదు.. న్యాయం తరఫున నిలబడేవాడు అని చెప్పానే అనుకోండి.. మీరేమంటారు.. ‘అయితే వీడితో జాగ్రత్తగా ఉండాల్రోయ్‌’ అనరూ! (డిసెంబరు 3, అడ్వకేట్స్‌ డే సందర్భంగా). 


వెనక్కి ...

మీ అభిప్రాయం