భామినీ...! మోహనా...!

  • 312 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పొట్టి వెంకటశివప్రసాదరావు

  • అద్దంకి ప్రకాశం జిల్లా
  • 9866391738
పొట్టి వెంకటశివప్రసాదరావు

అతడు: అన్నానా.. భామినీ
ఆమె: ఏమని
అ: ఎపుడైనా.. అన్నానా.. భామినీ
ఆ: ఏమని
అ: అర విరిసిన పూలలోన
నీదు మురుపె మెరసేనని ।।అర।।
మాట వరసకెపుడైనా ।।అన్నానా।।
ఆ: అన్నానా.. మోహనా
అ: ఏమని
ఆ: తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని ।।తొలి।।
ఆదమరచి ఎపుడైనా అన్నానా.. మోహనా

అ: లోకానికి రాజునైనా నీ ప్రేమకు దాసుడనని ।।లోకానికి।।
మాట వరసకెపుడైనా ।।అన్నానా।।
ఆ: నిన్నె నమ్ముకున్నానని నీవె నా దైవమని     ।।నిన్నె।।
ఆదమరచి ఎపుడైనా ।।అన్నానా।।        
ఇద్దరు: ఆ...ఆ...ఆ...

చతురతతో చిలిపిగా సాగే ఈ ప్రేమగీతం ‘సారంగధర’ (1957) చిత్రంలోది. సాహిత్యపరంగా కొత్తపుంతలు తొక్కారీ గీత రచనలో సీనియర్‌ సముద్రాల. మనసులో అనుకున్నదంతా ఓవైపు చెబుతూనే ‘నీతో ఆదమరచి ఎపుడైనా అన్నానా?’, ‘మాటవరసకెపుడైనా అన్నానా’ అని అంటుంటే చిలిపితనం కాక మరేమవుతుంది! ఎదుటివారిని ఆటపట్టించే ఇలాంటి మాటలు మామూలు వ్యక్తుల కన్నా ప్రేయసీ ప్రేమికుల మధ్యనైతే ఇంకా చాలా ఆకర్షణీయంగా తమాషాగా బాగుంటాయి. ఆ స్పందనను సమతూకంతో అందించడంలో సముద్రాల ఓహో అనిపించారు. సంగీత దర్శకులైన ఘంటసాల, హిందుస్థానీ సంగీతం నుంచి తీసుకున్న ‘రాగేశ్వరి’ రాగంతో ఈ పాటను స్వరపరచి లీలతో కలసి శ్రవణపేయంగా గానం చేశారు. పాటలో సరైన విరామాలు ఉంటే మనసుకు ఎంత చక్కటి ప్రశాంతత లభిస్తుందో అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలంటే ఈ పాటను ఓసారి వింటే చాలు. ‘మాటవరసకెపుడైనా అన్నానా.. ఆదమరచి ఎపుడైనా’ మాటల మధ్య ‘లయ’ని పూర్తిగా ఆపేసి ‘సంభాషణల రూపంలో’ ఆ పంక్తులను రాగయుక్తంగా పలికించడంతో రసోత్పత్తి అవధులు దాటింది. గాయకుడే సంగీత దర్శకుడైతే సమకూరే కొత్త అందమిది.. ఓ సౌలభ్యం కూడా. ఇక గానమాధుర్యాన్ని అందించడంలో ఆ రెండు గళాలూ అనర్గళాలే కదా. తెరవెనుక ఇంత కృషి ఉంటే తెర మీద మెరిసిన నందమూరి తారక రామారావు, రాజసులోచనల ప్రేమ వ్యక్తీకరణ భావాల అందం తక్కువేం కాదు. లాంగ్‌ షాట్‌లో ఏమోకాని, భావాలను పలికించటంలో నటుల సత్తా క్లోజప్‌ల్లోనే తెలుస్తుంది. మరి ఆ రోజుల్లో పాటలంటే ఇప్పటి మాదిరిగా గెంతులు కాకుండా సోగ్గా, వయ్యారంగా నడకలు.. ముఖంలో ముఖం పెట్టి కొంటె చూపులను క్లోజప్స్‌లో చూపించాలంటే టైమింగ్‌ చక్కగా కుదరాలి. ఎక్కువ షాట్స్‌ పడినా ‘మూడ్‌’ పాడవ్వకూడదు. వాటిని, ఆ భావాలను ఎన్టీఆర్, రాజసులోచన బాగా పండించారు. అలా సముద్రాల అక్షరాలు, ఘంటసాల స్వరాలు, నటీనటుల ప్రతిభా వ్యుత్పత్తులు కలగలిసి ఓ సుమధుర గీతాన్ని అందించాయి.. దాన్ని అజరామరంగా నిలిపాయి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం