ఎక్కడ ఉన్నా తెలుగువారమే!

  • 391 Views
  • 2Likes
  • Like
  • Article Share

తెలుగేతర రాష్ట్రాల్లోని తెలుగువారందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చే లక్ష్యంతో ఏర్పాటైంది ‘రాష్ట్రేతర తెలుగు సమాఖ్య’. అమ్మభాష కమ్మదనాన్ని, సంస్కృతిని ముందు తరాలకు అందించడానికి చిత్తశుద్ధితో శ్రమిస్తున్న సమాఖ్య సర్వసభ్య సమావేశం ఈ అక్టోబరులో కోల్‌కతాలో జరిగింది. దీనికి 19 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు భాషా సంస్కృతుల అభ్యున్నతుల మీద లోతైన చర్చలు జరిపారు.  
ఆంధ్ర, తెలంగాణలే
కాకుండా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారితో కలిపితే మొత్తం తెలుగు జనాభా పదిహేను  కోట్లకు పైనే. వృత్తులు, ఉద్యోగాలు, బతుకుతెరువు నిమిత్తం తెలుగువారు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు.. స్థిరపడుతున్నారు. ఎక్కడ ఉన్నా సరే, తెలుగు భాషా సంస్కృతుల్ని నిత్యం నెమరువేసుకుంటూ ముందు తరాలకు అందించడానికి వారు ఏర్పాటు చేసుకున్నదే రాష్ట్రేతర తెలుగు సమాఖ్య. 2015లో ఏర్పాటైన ఈ సమాఖ్య తొలి సమావేశాలు అదే ఏడాది జూన్‌లో గుజరాత్‌ తెలుగువారి ఆతిథ్యంలో అహ్మదాబాదులో వైభవంగా జరిగాయి. తర్వాతి సంవత్సరాల్లో హైదరాబాదు, తమిళనాడులోని హోసూరు, ముంబయి, పుణె, భువనేశ్వర్‌ (ఒడిశా), సూరత్‌ (గుజరాత్‌), చెన్నైల్లో సమాఖ్య తరఫున సదస్సులు, సమ్మేళనాలు, సాహిత్యోత్సవాలు నిర్వహించారు. తాజాగా ఈ అక్టోబరు 19, 20 తేదీల్లో కోల్‌కతాలో సమాఖ్య సర్వసభ్య సమావేశం జరిపారు. అక్కడి ఆంధ్రసంఘం దీనికి ఆతిథ్యం ఇచ్చింది. తెలుగు భాషా సంస్కృతులకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, అన్ని ప్రాంతాలతో ఎలా సమన్వయం చేసుకోవాలి, సామాజిక మాధ్యమాల్ని ఎలా ఉపయోగించుకోవాలి లాంటి అంశాల మీద ప్రతినిధులు చర్చించారు. ఖరగ్‌పూర్‌ (పశ్చిమబంగ) నుంచి వచ్చిన కళాకారుల కూచిపూడి, జానపద నృత్యాలతో ఈ సమావేశాలు అచ్చతెలుగు శోభను అద్దుకున్నాయి.   
      సమాఖ్య సర్వసభ్య సమావేశానికి 19 రాష్ట్రాల నుంచి 219 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాఖ్యకు నూతన కార్యవర్గం ఏర్పాటైంది. కొత్త అధ్యక్షుడిగా ఖరగ్‌పూర్‌ వాసి రాళ్లపల్లి సుందరరావు, ప్రధాన కార్యదర్శిగా అహమ్మదాబాదుకు చెందిన పి.వి.పి.సి.ప్రసాద్‌ ఎన్నికయ్యారు. ఆరుగురు ప్రాంతీయ అధ్యక్షులూ నియమితులయ్యారు. ఆయా ప్రాంతాల్లో తెలుగు స్థితిగతులు, సమాఖ్య కార్యచరణల మీద వారి అభిప్రాయాలూ.. ఆలోచనలు! 


మా వాణి వినాలి
పశ్చిమ బంగలో 55 ఏళ్లుగా ఉంటున్నాను. ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రేతర ప్రాంతాల్లో తెలుగు బోధన, అధ్యయనం లాంటి వాటి గురించి పట్టించుకునే వారు లేరు. ఆయా ప్రభుత్వాలను కలిసి మా ప్రతినిధులు చేస్తున్న విన్నపాలు బుట్టదాఖలు అవుతుండటం బాధాకరం. తెలుగు బోధించేవారు, పుస్తకాలు అందించేవారు కరవయ్యారు. తెలుగు భాషా వికాస సమితి పేరుతో మేము వివిధ ప్రాంతాల్లో ‘ఇంటింటా బడి’ లాంటి కార్యక్రమాలు నిర్వహించాం. మంచి ఫలితాలు రాబట్టాం. విద్యా వలంటీర్లు, విద్యావంతులైన మహిళలు, విశ్రాంత ఉద్యోగుల్ని సరైన ప్రణాళికతో వినియోగిస్తే ప్రాëÇÅ]మిక స్థాయిలోనే ఇతర ప్రాంతాల్లోని పిల్లలకు తెలుగు వర్ణమాల పరిచయమైపోతుంది. ఆ తర్వాత బాలల స్థాయి, వారి ఆసక్తికి తగిన వాచకాలు, పెద్ద బాలశిక్ష, బొమ్మల పుస్తకాలు లాంటివి అందుబాటులో ఉంచాలి. నిజానికి ఇవేవీ అసాధ్యం కావు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో తెలుగు బోధన, అధ్యయనం తదితరాలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యల మీద దృష్టి సారిస్తే చాలా వరకు పరిష్కారం అవుతాయి. రాష్ట్రేతర తెలుగు వారి వాణిని వినేందుకు ఆంధ్ర, తెలంగాణల్లో ప్రత్యేక విభాగాలు ఉండాలి. అలాగే ఏడాదికోసారి ఇతర రాష్ట్రాల తెలుగువారి కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలి. సమాఖ్య తాజా సభల్లో తెలుగువారైన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు సురేష్, రవీంద్రనాథ్‌లు పాల్గొనడం ఆనందకరం. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సభ్యులను కలుసుకోవడానికి 98251 14404, 94346 92453లో సంప్రదించవచ్చు.

- రాళ్లపల్లి సుందరరావు, అధ్యక్షులు


సమన్వయంతో సాగుతున్నాం
దేశంలోని చాలా రాష్ట్రాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాదాపు అన్ని చోట్లా తెలుగు బోధన, పుస్తకాలు, ఉపాధ్యాయుల సమస్యలున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వీటి గురించి నేరుగా ఏమీ చెయ్యలేకపోయినా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖలు రాసి, మాట్లాడి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో ఆయా రాష్ట్రాల తెలుగు సంఘాలు వేర్వేరుగా వెళ్లి ప్రభుత్వాన్ని కలిసి భాషా సమస్యలు చెప్పుకునేవి. రాష్ట్రం విడిపోయాక ఏ ప్రభుత్వాన్ని కలవాలన్న దాని మీద కొంత భేదాభిప్రాయాలున్నా, సమన్వయంతో సాగుతూ రెండు ప్రభుత్వాలకీ వినతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. గతంలో దేశంలో దాదాపు వెయ్యి తెలుగు సంఘాలుండేవి. ప్రస్తుతం వాటిలో మూడొందలకు మించి క్రియాశీలంగా లేవు. స్థానిక తెలుగు సంఘాలతో సమన్వయం చేసుకుంటూ మన సంస్కృతిని కాపాడుకునే విషయంలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య బాగా కృషిచేస్తోంది. నృత్యం, సంగీతం, సాహిత్యం, భాషకి సంబంధించిన అంశాల మీద దృష్టిపెడుతూ సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తోంది. తెలుగు కళాకారులతో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా స్థానిక తెలుగు పెద్దలను గౌరవిస్తోంది. 

- పి.వి.పి.సి.ప్రసాద్, కార్యదర్శి


అనాథలవుతున్నాం!
చక్కగా తెలుగు చదువుకుని రాసుకునే మా ప్రాంతంలో ఇప్పుడు తెలుగు మాట్లాడటమే నేరమైపోయింది. తెలుగు మూలాలున్న వారు 40 శాతం మంది నివసిస్తున్న తమిళనాడులో తెలుగు బాగోగుల పట్ల శ్రద్ధపెట్టేవారు లేనంతగా మేము అనాథలం అయిపోతున్నాం. నవతరం తెలుగు బిడ్డలు తప్పనిసరిగా పరాయి భాషలో చదువుకోవాల్సిన పరిస్థితి. ఈ విషయంలో న్యాయస్థానాల తీర్పులున్నా వాటి గురించి పట్టించుకునేవారు లేరు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని తమిళనాడులో తెలుగు దీపం వెలిగేలా చూడాలి. 

- ఎం.విజయకుమార్, ప్రాంతీయ అధ్యక్షులు, హోసూరు, తమిళనాడు


తెలుగు చదువుల మీద ఆసక్తి
కొత్త దిల్లీలో ఆంధ్రా ఎడ్యుకేషన్‌ సొసైటీ వాళ్లు ఏడు తెలుగు బళ్లు నడుపుతున్నారు. అయిదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదువుకోవచ్చు. వేెంకటేశ్వర తెలుగు కళాశాల కూడా ఉంది. దిల్లీ రాష్ట్ర విద్యాశాఖ పుస్తకాల ముద్రణ చేపడుతోంది. ఇటీవల కాలంలో ఇక్కడ చాలా మంది తెలుగువాళ్లు తమ పిల్లల్ని అమ్మభాషలో చదివించడానికే ఆసక్తి చూపుతున్నారు. ఈ బళ్లలో విద్యా ప్రమాణాలు బాగుంటున్నాయని వారు చెబుతున్నారు. మొత్తం నాలుగైదు వేల మంది పిల్లలు ఇక్కడ తెలుగు చదువుకుంటున్నారు. ఓ నేపాల్‌ వ్యక్తి తన పిల్లల్ని తెలుగు మాధ్యమంలోనే చదివించారు. హరియాణాలో కూడా తెలుగు సబ్జెక్టు చదువుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమ్మభాషలో చదువును దూరం చేయాలని చూడటం సరికాదు.

- ఎల్‌.సీత, ప్రాంతీయ అధ్యక్షులు, కొత్త దిల్లీ


ఆ నిర్ణయం శోచనీయం 
పశ్చిమబంగ మొత్తంలో 15 లక్షల మందికి పైగా తెలుగువారు ఉన్నారు. టిటాగర్, షాలిమాల్, ఖరగ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో దాదాపు 33 తెలుగు బళ్లు ఉన్నాయి. ఇక్కడ ఎనిమిదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదువుకోవచ్చు. ఆ తర్వాత తెలుగు సబ్జెక్టు ఒకటి ఉంటుంది. పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం ముద్రించి అందిస్తోంది. కోల్‌కతాలోని ఆంధ్రా అసోసియేషన్‌ స్కూల్లో కనీసం మూడో భాషగా అయినా తెలుగు నేర్చుకోవాలనుకునే వారి కోసం ఒక తెలుగు ఉపాధ్యాయుణ్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తరఫున ప్రసిద్ధ తెలుగు వ్యక్తుల జయంతులు, పండుగలు నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించడానికి నిర్ణయించడం శోచనీయం. కనీసం ప్రాథమిక విద్య వరకైనా మాతృభాషలో విద్యాభ్యాసం జరిగితే పిల్లల మానసిక ఎదుగుదలకు ఉపయుక్తంగా ఉంటుంది.  

- వేదుల శ్రీనివాస్, ప్రాంతీయ అధ్యక్షులు, కోల్‌కతా


తెలుగు పీఠాలు ఏర్పాటుచేయాలి
ముంబైలో తెలుగు పాఠశాలలు దాదాపు 12 ఉన్నాయి. పదో తరగతి వరకు ఇక్కడ తెలుగు మాధ్యమంలో చదువుకోవచ్చు. ఇక్కడ మినహా మహారాష్ట్రలో మరెక్కడా తెలుగు చదువులు కనిపించవు. ఒక్క పుణెలోనే సుమారు ఆరు లక్షల మంది తెలుగువారున్నారు. అయినా ఇక్కడ తెలుగు నేర్పించే దిక్కులేదు. తరాల కిందట ఇక్కడికి వలసవచ్చిన తెలుగువారి పిల్లలు క్రమంగా స్థానిక సంస్కృతిలో కలసిపోతున్నారు. వాళ్లకి తెలుగు చదవడం, రాయడం రాదు. ఒకప్పుడు దేశంలో మూడో స్థానంలో ఉన్న తెలుగు నాలుగుకి పడిపోవడానికి ఇదే కారణం. నిజానికీ, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలే అమ్మ భాషలో చదువులు వద్దంటుంటే ఇక ఇతర ప్రాంతాల్లో పరిస్థితి గురించి చెప్పేదేముంది! కానీ, తెలుగు భాష మన జాతి అస్తిత్వం. దాన్ని తప్పకుండా నిలబెట్టుకోవాల్సిందే. రెండు తెలుగు ప్రభుత్వాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తెలుగు పీఠాలు ఏర్పాటు చేసి భాషకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. అప్పుడే కొత్త తరానికి అమ్మభాష చేరువవుతుంది.

- రవీనా చవాన్, ప్రాంతీయ అధ్యక్షులు, పుణె


చొరవ తీసుకోవాలి
ఒడిశాలోని బెర్హంపూర్, కటక్‌లో తెలుగు బళ్లు ఉన్నాయి. కటక్‌లో తెలుగు చదువుకోవాలనుకునే పిల్లలకి సరైన పుస్తకాలు కూడా అందని పరిస్థితి. దీని గురించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదు. భువనేశ్వర్‌లో ఎక్కడా తెలుగు బడి కనిపించదు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తరఫున మేం తెలుగు సంస్కృతిని కాపాడుకుంటున్నాం. కానీ, కొత్త తరాలు అమ్మ భాషలో రాత, చదువుకి దూరమవుతున్నాయి. అందుకే, భాషా బోధన విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు చొరవ తీసుకుని ఇక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలి. 

- జి.ఆనందరావు, ప్రాంతీయ అధ్యక్షులు, భువనేశ్వర్‌


క్రమంగా తొలగిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న బళ్లారిలో ఒకప్పుడు తెలుగు పాఠశాలలు చాలా ఉండేవి. కళాశాలల్లో కూడా తెలుగు అధ్యాపకులు ఉండేవారు. కానీ, వారు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఇక్కడి ప్రభుత్వం కొత్త వారిని నియమించట్లేదు. అలా క్రమంగా తెలుగుకు ఎసరు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏదైనా సాయం అడుగుదామంటే అసలక్కడే తెలుగు మాధ్యమంలో చదువులొద్దు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని లాంటి చోట్ల కన్నడ బళ్లు ఉన్నాయి. అక్కడ కన్నడం ఉన్నప్పుడు ఇక్కడ తెలుగును తొలగిస్తే ఎలా? కర్ణాటకలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య తప్పనిసరిగా కన్నడ మాధ్యమంలోనే సాగుతుంది. ఈ పద్ధతిని తెలుగు రాష్ట్రాలు ఎందుకు అనుసరించవు? 

- కోటేశ్వరరావు, ప్రాంతీయ అధ్యక్షులు, బళ్లారి


సహకారం: జీఎల్ఎన్ మూర్తి, హైదరాబాదు.

 94412 69603


వెనక్కి ...

మీ అభిప్రాయం