అమ్మభాషను కాలరాస్తారా

  • 115 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన జరపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం మీద భాషావేత్తలు, మేధావులు, ఎమ్మెల్సీలు, పలు ప్రజా, భాషా, సాహితీ సంఘాల ప్రతినిధులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు.  పిల్లల మానసిక వికాసానికి, విద్యాభివృద్ధికి, అమ్మభాషకూ గొడ్డలిపెట్టు లాంటి ఈ నిర్ణయం మీద వారి అభిప్రాయాలు...
ఆంధ్రప్రదేశ్‌
ప్రభుత్వ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో భాషా దాస్యం, భావ దాస్యం తప్పవు. ఆంగ్ల మాధ్యమంలో బోధన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. జాతీయ విద్యావిధానం ముసాయిదా కూడా 1 నుంచి 8 వరకు మాతృ భాషలోనే విద్యా బోధన జరగాలని చెబుతోంది.  

- కె.ఎస్‌.రామకృష్ణ, ఎమ్మెల్సీ


మంచి విద్యను బోధించమంటే, మాధ్యమాన్ని మార్చడమేంటి? ‘ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని బళ్లను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చి, ఆంగ్లాన్ని తప్పనిసరి చేశాం. ఇంకేం కావాలి’ అని ప్రభుత్వ పెద్దలు అనడం హాస్యాస్పదం. 

- కె.ఎస్‌.లక్ష్మణరావు, ఎమ్మెల్సీ,
- వై.శ్రీనివాసులురెడ్డి, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ


పిల్లల్లో విజ్ఞానం వికసించాలంటే ప్రాథమిక విద్యను కచ్చితంగా మాతృభాషలోనే బోధించాలి. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ వారివారి భాషల్లోనే చదువును కొనసాగిస్తున్నారు. తల్లి ఒడి నుంచి నేర్చుకున్న భాషలోనే ప్రాథమిక విద్యను అందించడం ప్రభుత్వాల కర్తవ్యం. 

    - ద్వారపురెడ్డి జగదీశ్, ఎమ్మెల్సీ


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 350-ఎ మాతృభాషలో చదువుకునే హక్కుని కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయం దీనికి తూట్లు పొడుస్తోంది. ఇతర భాషలను సమగ్రంగా, వేగంగా నేర్చుకోవాలంటే ముందు మాతృభాషలో కనీస పరిజ్ఞానం తప్పనిసరి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య మాతృభాషా మాధ్యమంలోనే సాగాలి. మాతృభాషా మాధ్యమ హక్కుపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తాం. అమ్మభాషలో చదువు ప్రాధాన్యత, ఆవశ్యకత మీద సదస్సును ఏర్పాటుచేస్తాం. 

    - అప్పిరెడ్డి హరినాథరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కళ్యాణ దుర్గం ప్రజా సంఘాలు, అనంతపురం


 మాతృభాషలో విద్యాబోధన వల్ల పిల్లల్లో అవగాహనా శక్తి పెరుగుతుంది. వారి మేధ వికసిస్తుంది. ఆంగ్ల మాధ్యమ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.  

- ఐ.విజయసారథి, ఏపీటీఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి


ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రపంచం మొత్తం ఆంగ్లం వైపు ఉందనే భ్రమలో, ఎంతో చరిత్ర కలిగిన తెలుగు మాధ్యమంలో బోధనను రద్దు చేయడం బాధాకరం. 

- పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం జాతీయ కార్యదర్శి


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయం అమ్మ భాషకు మరణశాసనం. మాతృభాషను కాపాడుకుంటూనే ఆంగ్లంలో ముందున్న తమిళులు ఆదర్శంగా మనం ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలోనే బోధించాలి.  

- చలసాని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు, తెలుగుభాషా చైతన్య సమితి 


హైస్కూలు స్థాయి వరకు అమ్మభాషలోనే విద్యాబోధన జరగాలి. అదే పిల్లలకు మంచిది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. 

- నార్నె వెంకటసుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం అధ్యక్షులు


అమ్మభాషను కాదని ఆంగ్లాన్ని పిల్లల మీద రుద్దడం సరికాదు. ఇది తెలుగు భాషను నిర్వీర్యం చెయ్యడమే. మాతృభాషలో చదువుకున్న పిల్లల్లో మేధా వికాసం మెరుగ్గా ఉంటుందని యునెస్కో సర్వేలో వెల్లడైంది. 

- ఎం.రామకృష్ణ, పీడీఎస్‌యూ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు


కనీసం ప్రాథమిక విద్య వరకైనా అమ్మభాషలో చదువుకుంటే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ఆంగ్లంలో చదువుకుంటేనే ఉన్నతోద్యోగాలు లభిస్తాయనుకోవడం అవివేకం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారి పిల్లలు కష్టాలపాలవుతారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పశ్చిమబంగలో 33 తెలుగు ప్రాథమిక పాఠశాలలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తోంది. ఇకపై అవి అందే అవకాశం ఉండదు.

 - రాళ్లపల్లి సుందరరావు, అధ్యక్షులు, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, ఖరగ్‌పూర్‌


ప్రభుత్వ నిర్ణయం వల్ల అమ్మభాష ఉనికికే ముప్పు ఏర్పడుతుంది. దీన్ని స్వాగతించిన  అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చెయ్యాలి. నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే దశల వారీగా ఉద్యమాలు చేస్తాం.    

- వాసు, జనజాగరణ సమితి ఆంధ్రప్రదేశ్‌ సమన్వయకర్త, విశాఖపట్నం 


ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో మాతృభాష మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. కనీసం ప్రాథమిక విద్య వరకు తెలుగు మాధ్యమంలోనే కొనసాగించాలి. ఆ తర్వాత కళాశాల స్థాయి వరకూ తెలుగు ప్రథమ పాఠ్యాంశంగా ఉండాలి. జీవోను వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేస్తాం. 

   - పరవస్తు ఫణిశయన సూరి, పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపకులు, విశాఖపట్నం


ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే సాగాలని సాహితీవేత్తలు, భాషాభిమానులు ఒకవైపు పోరాటం చేస్తున్న సమయంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం బాధాకరం. అశాస్త్రీయమైన ఈ నిర్ణయం గురించి ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి. పాలన వ్యవహారాలు కూడా తెలుగులోనే సాగాలి. అమ్మభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.  

- ఎ.రాధాకృష్ణరాజు,  తెలుగు విజ్ఞాన సమితి, బెంగళూరు


ఆంధ్రప్రదేశ్‌లో నిర్బంధ ఆంగ్లమాధ్యమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీని ఉపసంహరణకు ప్రతి తెలుగువాడూ పోరాడాలి. 

- చలంచర్ల భాస్కర్‌రెడ్డి, తెలుగు భాషోద్యమ సమితి నాయకులు, నెల్లూరు


పశ్చిమబంగలో 33 తెలుగు ప్రాథమిక పాఠశాలలున్నాయి. పాఠ్యపుస్తకాలు ఉచితంగానే లభిస్తున్నాయి. జనవరి ఒకటి నుంచి ఇక్కడ కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు పాఠ్యపుస్తకాలు లభిస్తాయా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలి.  

- కె.హరిప్రసాద్, టి.వెంకటేశ్వరరావు, నింపూరా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, పశ్చిమబంగ 


రాష్ట్రేతర ప్రాంతంలో ఉంటున్న తెలుగువారు అమ్మభాషా సంస్కృతులను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాతృభాషాభివృద్ధికి సంస్కృతికి విఘాతం కలిగిస్తుంది.  

- రామలింగేశ్వరరావు, తెలుగు పాఠశాల కమిటీ కార్యదర్శి, కటక్, ఒడిశా.


తమిళనాడులో నిర్బంధ తమిళ విద్యాచట్టాన్ని తీసుకొచ్చి ఇతర ప్రాంతాల విద్యార్థులు వారి మాతృభాషలో చదువుకోలేని పరిస్థితి కల్పించారు. అయితే  ఆంధ్రప్రదేశ్‌లో అమ్మభాషకు, పిల్లల మేధో వికాసానికి నష్టం వాటిల్లేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆవేదన కలిగిస్తోంది. ఆంగ్ల మాధ్యమం కంటే ముందు మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. 

 - జి.మురళి, అధ్యక్షులు, పుళల్‌ కావంగరై తెలుగు వెల్ఫేర్‌ అసోసియేషన్, తమిళనాడు


ఉపాధ్యాయ సంఘాలు, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన కొనసాగించాలని నిర్ణయించడం సరికాదు. దాన్ని ఉపసంహరించుకోవాలి. విద్యార్థులు ఇష్టమైన మాధ్యమాన్ని తీసుకునే అవకాశం కల్పించాలి.

- బాబురెడ్డి, యూటీఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి, నంద్యాల


జాతీయ విద్యావిధానం ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన ఉండాలి. ఉన్నపళంగా తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం వల్ల ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మాతృభాషల్లోనే విద్యను బోధిస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.

 - పి.పాండురంగారావు, ఏపీటీఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి


జాతీయ విద్యా విధానానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బోధనలో తెలుగు మాధ్యమాన్ని లేకుండా చేయాలని చూడటం శోచనీయం. కొఠారి కమిషన్‌ సూచించిన విధంగా కామన్‌ స్కూలు విధానాన్ని ఏర్పాటు చేయడమే అన్ని సమస్యలకూ పరిష్కారం.

  - తులసీనాథం నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి, పలమనేరు, చిత్తూరు


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలోనే విద్యాబోధన జరగాలి. ప్రభుత్వం ఆంగ్లమాధ్యమాన్ని బలవంతంగా పిల్లలపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థుల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. 

- జాన్‌ ప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, రైల్వేకోడూరు, కడప


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విధానాలు విద్యను కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ధారాదత్తం చేసేలా ఉన్నాయి. ప్రపంచ అనుసంధాన భాష ఆంగ్లంతోపాటు జాతీయ భాష హిందీనీ నేర్చుకోవాలి. అదే సమయంలో తెలుగుకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. మాతృభాషను మృతభాష కానీయరాదు. 

- మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ ఉపసభాపతి


పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదవాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కూడా తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉండాలి. విద్యార్థులకు నచ్చినదానిలో బోధన జరగాలి. ప్రభుత్వాలు అమ్మభాషలను పరిరక్షించాలేగానీ కాలరాయకూడదు. 

 - బి.రాజగోపాల్, అధ్యక్షులు, శ్రీమైనం పాటి లలితకళాపీఠం, రైల్వేకోడూరు


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి విద్యను పూర్తిస్థాయిలో కార్పొరేట్‌కి ధారాదత్తం చేయాలని చూస్తున్నట్లుంది. ఆంగ్ల విద్యతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనడంలో మోసం దాగి ఉంది. ఈ విధానం వల్ల గిరిజన విద్యార్థులు విద్యకు దూరమైపోతారు. మొత్తం పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. 

- గొంటి గిరిధర్, యూటీఎఫ్‌ ఆంధ్రపదేశ్‌ కార్యదర్శి, పొందూరు అప్పారావు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు, శ్రీకాకుళం


ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి. పూర్తి ఆంగ్ల మాధ్యమం నిర్ణయం సరైంది కాదు. దీనివల్ల తెలుగు భాషాభివృద్ధికి విఘాతం ఏర్పడుతుంది. 

- కోట వెంకటేశ్వరరెడ్డి, జనవిజ్ఞాన వేదిక నాయకులు, బాపట్ల, గుంటూరు


ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే ఉండాలని ఒకవైపు అంటూనే మాతృభాషను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడమేంటి? ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. 

- తాళ్లూరు శ్రీనివాసులు నాయుడు,  జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్, ఎస్టీయూ అధ్యక్షులు, వెంకటగిరి, నెల్లూరు జిల్లా


సామాజిక శాస్త్రాలు మాతృభాషలోనే సులభంగా అర్థమవుతాయని గురజాడ, టాగోర్‌ వంటివారే చెప్పారు. జర్మనీ, రష్యా, కొరియా దేశాల్లో మాతృభాషకే పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల మాతృభాష మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. 

    - జి.ఎస్‌.చలం, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు, విజయనగరం


ప్రభుత్వం మాతృభాష ప్రాధాన్యాన్ని విస్మరించి ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని తేవాలనుకోవడం మన సంస్కృతి, సంప్రదాయాలకు గొడ్డలిపెట్టు. ఏమాత్రం ముందుచూపు, ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయం ఇది.  

- ఉన్నం హనుమంతరాయ చౌదరి, మాజీ ఎమ్మెల్యే, అనంతపురం


ఆంగ్లంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా పాఠశాలల్లో కొనసాగించాలి. రెండూ ఉంటే విద్యార్థికి నచ్చిన దానిలో చదువుకునే అవకాశం ఉంటుంది.  

- గొల్లు సూరిబాబు, పీఆర్‌టీయూ మండల శాఖ అధ్యక్షులు, శృంగవరపుకోట, విజయనగరంవెనక్కి ...

మీ అభిప్రాయం