నీ తెలుగు ఇంగ్లీషుగాను

  • 907 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

ఆనాటి పెద్దలకు ముందుచూపు లేకుండా పోయింది. తెలుగు జనం బాగుపడాలన్న కోరికే వారికి కొరవడింది. లేకపోతే పనిగట్టుకుని, పెన్నుపట్టుకుని తొలి తెలుగు భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు ఏర్పాటు చేశారు? వాళ్లమీద అవిశ్వాసతీర్మానం పెట్టడానికి ఇప్పుడు అవకాశం కూడాలేదు. అది దురదృష్టం. అదే గనక ఆంగ్ల భాషాప్రయుక్త రాష్ట్రంగా చేసి ఉంటే మనం ఎంత బాగుపడి ఉండేవాళ్లం. ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్లం! తెలుగుమాట వినపడకుండా శాసనం చేసి ఉంటే అడుగుజాడ లండన్‌ది అనుకుంటూ అప్పటి ముక్కోటి ఆంధ్రులు మొదలుకుని కోటి కాస్త అటూఇటుగా పదముక్కోటి ఆంధ్రుల వరకు లండన్‌గా పాట పాడేవాళ్లు. అప్పుడు ఎంత వీనుల ‘మందు’గా ఉండేది! అంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఉండి తెలుగు రాష్ట్రాన్ని అంతా ‘మందే’ అనుకునేవారు. మొత్తం మీద చారిత్రక తప్పిదం జరిగిపోయింది.
తెలుగువాడు మహాబలుడు కావచ్చునేమో గానీ ‘గ్లోబలుడు’ అయ్యే అవకాశం తప్పిపోయింది. గిరీశమేమన్నా పిచ్చాడా? వెంకటేశానికి ఆంగ్లమాధ్యమంలో చదువు చెప్పి అంతటి వాణ్ని చేయడానికి. ఆ ఆంగ్లభాష ఘోషకు అగ్నిహోత్రావధానులే బిత్తరపోలేదూ! అందువల్ల కూడా జ్ఞానోదయమై ఆంగ్లవిషయంలో ముందుకు సాగకపోతే మనల్ని ఎవరు ఉద్ధరిస్తారు? వెనకటికి పెద్దచదువులు చదవడానికి జనం ఇక్కడి నుంచి పొలోమని ఇంగ్లాండుకు వెళ్లేవాళ్లు. మన నోటి గుండా తెలుగుముక్క వినపడకుండా, చేతిమీద తెలుగు రాత కనబడకుండా నిషేధాజ్ఞలు విధించుకుని ఉంటే అన్ని ఆంగ్లదేశాల నుంచి మన రాష్ట్రానికి ఆంగ్లం నేర్చుకోవడానికి తోసుకుని వచ్చేవాళ్లు.
      అవసరమైతే మనం గాంధీ తాత కోతుల్లాంటి తాతల్లాంటి కోతుల్ని ఏర్పాటు చేసుకుని తెలుగు వినకు, తెలుగు మాట్లాడకు, తెలుగు రాయకు అనే సందేశాన్ని గనక ఇప్పించి ఉంటే తెలుగువాడి సేవల్ని చూసి తెల్లదొరలు ‘దొర’కునా ఇటువంటి సేవ అనుకునేవాళ్లు. వాళ్లు ఎంత ఆనందం ‘బొంద’ గలిగేవాళ్లు!
   ఇంతటితో ఆగరాదు..
      తెల్లవాక సాగారోరన్నో
      చిన్నన్నా
      తెలుగు మూకసాగారోరన్నో
      పెద్దన్నా
అని తెల్లవాక సాగకపోతే తెలుగుమట్టి కొట్టుకుపోతాం:
      శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడని చంకలు గుద్దుకొని ఎంత పొరపడ్డాం! ఆయన తెలుగు తెలుగని ఎందుకు అన్నాడో తెలుసుకోలేకపోయాం! ఆయన ‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’ అని అన్నాడాయన స్పష్టంగా! ఈ ఒక్కముక్క చాలదా ఆయన ఏ పార్టీవాడో చెప్పడానికి!
ఇంకా ఎందరో ‘మహానుభావులు’! తెలుగువాళ్లకు ఎంత అన్యాయం చేశారో! కాళోజీ నారాయణరావు జనంకవి అంటారు కానీ ఆయన తెలుగువాళ్లకు శ్రేయోభిలాషి కానేకారు: లేకపోతే..
   అన్య బాషలు నేర్చి
      ఆంధ్రమ్ము రాదంచు
      సకిలించు ఆంధ్రుడా
      చావవెందుకురా!
అంటాడా? అన్యభాషలు కావాలి కానీ మనకు ఆంధ్రం ఎందుకు? ఆంగ్లం... ఆంధ్రంలో ఒక్క అక్షరమేగా తేడా! దాంతో కొంపలు ఏం మునుగుతాయి?
      తెలుగు గర్భిణులందరికీ ప్రత్యేక ‘శిబి’రాలు ఏర్పాటు చేసి ‘నిర్బంధ ఆంగ్ల బోధన’ చేస్తే వాళ్లకు పుట్టే పిల్లలు ఇంగ్లీషులోనే ఏడుస్తారు. జీవితాంతం అలాగే ఏడుస్తారు. ఉగ్గుపాలతో ఆంగ్లం వస్తే పిల్లవాడికి ఎదురేముంది? బెదురేముంది? ఎంతపెద్ద కుంభకోణం చేసి ఇంగ్లాండుకు పారిపోయినా ఇబ్బంది ఏముంటుంది? అయినా మనకు రవి అస్తమించని తెల్లసామ్రాజ్యం ఉండగా, ‘కవి’ అస్తమించని తెలుగు సామ్రాజ్యం ఎందుకు? మహాకవి సి.నారాయణరెడ్డి తెలుగువాడి గురించి అన్న మాటలన్నీ మన ప్రగతికి గోతులు తీసేవేగా!
   తెలుగువాడు
      ‘పంచభక్ష పరమాన్నాలు
      తనకంచాన
      వడ్డింప
      గోంగూర
కోసమై గుటక లేసేవాడు! అంటాడా? ఇలా ఉండబట్టే తెల్లవాడు మనల్ని ‘పచ్చడి.. పచ్చడి’ చేశాడు. మనం గోంగూర ‘ఫుడ్‌బై’ కాకుండా ‘గుడ్‌’బై చెబితే తెల్లవాడి పిజ్జాలు, బర్గర్లు నాలుకల మీద ఎంతగా తళతళలాడేవి! అప్పుడు ఇంగ్లీషు దడదడా వచ్చేది! బట్లర్‌ ఇంగ్లీషు పుట్టేదేకాదు.
      తెలుగువాడికి సంపూర్ణ సంస్కరణలు చేస్తే తప్ప బతుకు బాగుపడదు. ‘కండువాలేనిదే గడప దాటనివాడు’ అని కూడా సి.నారాయణరెడ్డి అన్నారు. మనం కండువాలు వేసేంతకాలం మండువాల్లోనే ఉంటాం. అదికాదు మనం మండుటెండల్లో తెగ ఉక్కబోస్తున్నా ఇంట్లోకూడా సూటూ బూటు వేసుకుని ఉండాలి. సూటు బూటు వేసుకునే మంచం మీద పడుకుని నిద్రపోవాలి. వరండాలోకి వెళ్లినా కోర్టుకు వెళ్లే న్యాయవాదిలాగా కోటు వేసుకునే వెళ్లాలి. అప్పుడు మనం ఎంత ధీమాగా ఉండవచ్చు.
      తెలుగుభాషను విస్మరిస్తే అది ఏమవుతుందని లేతబుర్రలు ‘ఏమనకపోయినా’, ‘తాత బుర్రలు’ కొక్కిరించవచ్చు. అలా ఉండకుండా ఉండడానికి ‘రాజకీయ పరిష్కారం’ ఉంది. ఏ పార్టీ ఏ పార్టీలో విలీనమైనా ఎవరైనా ఏమైనా అనుకుంటారా? భాషకు కూడా ఈమార్గమే శరణ్యం.. ‘దుర్మార్గం’ అని నిందించినా సరే! తెలుగు భాష మొత్తాన్ని కట్ట కట్టి ఇంగ్లీష్‌ భాషలో కలిపితే సరి! ఈ ప్రస్థానాన్ని తెలుగువాడు ‘నామ’ మాత్రంగా ఎప్పుడో మొదలుపెట్టాడు. తెలుగు అజంత భాష అన్నది నామవాచకాల్లో ఎక్కడో తప్ప కనబడటం లేదు. సురేశ్, రమేశ్, అవినాశ్‌ లాంటి పేర్లలో అజంతం ఎక్కడుంది. అంతా హలంతమేగా! దీనికి తోడు భవిష్యత్తులో పేర్లలో అయ్యా, అమ్మ, అక్క కనబడకుండా నిషేధించాలి. శిక్షార్హమైన నేరంగా ప్రకటించాలి.
ఇక ప్రతి భాషా నదిలాంటిదే కాబట్టి ‘భాషానుసంధాన ప్రక్రియ’ను తక్షణం చేపట్టాలి. దీనికి విధి విధానాలు కానీ, నిధి నిదానాలుగానీ అవసరం లేదు. భాషబండి సాగుతోంది క్రియాపదాలతోనే కాబట్టి వాటన్నిటిని తక్షణం ‘ఇంగ్లీకరిస్తే’ పోనీ ఆంగ్లీకరిస్తే మంచిది! నువ్వు చేశావా? అనడానికి సింపుల్‌గా ఆర్‌యు ‘చేసింగ్‌’? అంటే సరి! ఎంత చదువుకున్నావు అనడానికి హౌమచ్‌ యు హావ్‌ ‘చదువ్‌డు’? అంటే చాలు! అన్నం తింటున్నావా? అని అడగడానికి ఆర్‌యు ‘తినింగ్‌’? అని అంటే బ్రహ్మాండం. ఇందువల్ల ఇంగ్లీష్‌కేంటి నష్టం. మన పందికొక్కును బ్యాండీ‘క్యూట్‌’గా మారిస్తే రాని నష్టం ఇందువల్ల వస్తుందా! ఇంగ్లీషు ఉన్నంత కాలం చచ్చినట్టు తెలుగు బతికి తీరుతుంది. ఇంగ్లీష్‌ వచ్చిన ప్రతివాడికీ తెలుగు కూడా వస్తుంది!
      తెలుగువాడికి కోపమొస్తేనే ఇంగ్లీష్‌ వస్తోంది. అలా కాకుండా ‘లిప్‌’వాత్మకమైన మార్పులు తీసుకురావాలి. ఇంగ్లీష్‌ కాన్వెంట్లలో ఎలాగూ తెలుగు మాట్లాడకుండా చేస్తున్నారు.. బడితె పట్టుకుని చూస్తున్నారు. గవర్నమెంట్‌తో సహా అన్ని రకాల స్కూళ్లలో, కాలేజీల్లో అంతెందుకు గవర్నమెంటు ఆఫీసుల్లోనూ ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటే భళిభళి! వీధుల్లో ఇంగ్లీషు బోర్డులు తప్ప తెలుగు కనబడరాదు. ఉద్యోగ నియామకాల్లో తెలుగురాని వాళ్లకు ఇంగ్లీష్‌ వచ్చినవాళ్లకూ మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంతకు మించిన మార్గం తెలుగురాని వాడికే ఓటుహక్కు అంటే ఎవ్వరికైనా ఇంగ్లిష్‌ తన్నుకుంటూ వస్తుంది! చివరగా ప్రజలకు మార్గదర్శకులైన నాయకులు పత్రికా సమావేశాల నుంచి ఎన్నికల ప్రచారం వరకూ ఇంగ్లిష్‌లోనే టాకింగ్‌ చేస్తూ ముందుండి నడిపిస్తే ఫ్యూచర్‌ అంతా బ్రైటు.. బ్రైటు!  
      తెలుగువాడు సొమ్ము పెంచుకుని రొమ్ము విరుచుకుని తిరగడానికి ఇదే అదను. ఇదేపదును. ఆలస్యమెందుకు? థేమ్స్‌ రివర్‌ సాక్షిగా ఇంగ్లీష్‌ డ్రీమ్స్‌ కందాం. 


వెనక్కి ...

మీ అభిప్రాయం