బోధనా మాధ్యమంగా విద్యార్థి మాతృభాషను ఉపయోగించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలెన్నింటినో పరిశోధకులు పట్టిచూపారు. వాటిలో ముఖ్యమైనవి...
మాతృభాషా మాధ్యమం విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాలను, విద్యా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది.
* పిల్లలకు అర్థమయ్యే భాష బోధనా మాధ్యమంగా ఉంటే... ఉపాధ్యాయులు ప్రభావవంతమైన బోధనా పద్ధతులను ఎక్కువ సంఖ్యలో ఉపయోగించగలరు.
* స్థానిక భాషల్ని బోధనలో భాగంగా చేయడం వల్ల సిలబస్లో స్థానికత పెరుగుతుంది. తల్లిదండ్రులు, సమాజాన్ని తరగతి గది వనరులుగా ఉపయోగించుకోవచ్చు.
* తరగతి గదిని ఆహ్లాదభరితంగా ఉంచాలంటే మాతృభాషే మార్గం.
* అయిదు/ ఆరో తరగతి వరకూ మాతృభాషలో మౌలికాంశాలను నేర్చుకుని, అన్యభాషలో వాటి పదజాలాన్ని ఒంటబట్టించుకుని... అన్యభాషా మాధ్యమంలోకి మారితే మేలు. నేరుగా అన్యభాషా మధ్యమంలో చేరితే తేలిపోతారు.
* దాదాపు ముప్ఫై శాతం తక్కువ ఖర్చుతో (ట్యూషన్లు, ఎక్కువ పుస్తకాలు అవసరముండవు) చదువు పూర్తవుతుంది.
* మాతృభాషలో విద్యాబోధనలోనూ నాణ్యత ముఖ్యం. సొంత సమాజానికి చెందిన సాహిత్యాన్ని పిల్లలతో చదివించాలి. సృజనాత్మక రచనలు చేసేలా ప్రోత్సహించాలి. .
వైజ్ఞానిక, సాంకేతిక భావనలను సరిగ్గా వ్యక్తీకరించే పదజాలం తెలుగులో లేదు. తెలుగు మాధ్యమ చదువులకు అదే ఆటంకం అంటారు చాలామంది. కానీ, భాషను ప్రధాన స్రవంతిలో భాగంగా (పాఠశాలలో) ఉపయోగిస్తే కొత్త భావనలను చెప్పడానికి అవసరమైన కొత్త పదజాలం పుట్టుకొస్తుందని చెబుతోంది యునెస్కో. లేకపోతే భాషాభివృద్ధి జరగదన్నది ఆ సంస్థ వాదన. మన పాలకులు మాత్రం ఆ ప్రయత్నం చేయకుండా ఆంగ్లాన్ని నెత్తినపెట్టుకుంటున్నారు.