తిమ్మడు...కోతిమ్మడు

  • 695 Views
  • 35Likes
  • Like
  • Article Share

    కట్టా నరసింహులు,

  • తిరుపతి
  • 9441337542

తిమ్మడు శబ్దానికి కోతి అని శబ్దరత్నాకరం అర్థమిస్తోంది. ఈ శబ్దాన్ని ‘తిరుమల + డు’ అని విడమరిచి కూడా చెబుతోంది. అలా విడమరచినప్పుడు ‘తిరుమల + డు’ అంటే తిరుమల దేవర వెంకటేశ్వరుడు అవుతున్నాడు. ఆ స్వామిని ‘తిమ్మప్ప’ అంటూ మూర్తికవి ‘రాజవాహన విజయం’లో చెప్పి ఉన్నాడు. నిఘంటువులో ‘తిమ్మడు’కు కోతి అనే అర్థం ఇచ్చినప్పటికీ ఆమేరకు కావ్య ప్రయోగాలు కనిపించట్లేదు. మరి ఈ తిమ్మడు అంటే కోతి అనే అనుకుందామా! సందేహించాల్సి వస్తోంది. అలాగే, మరో పద బంధం ‘కోతిమ్మడు’ అని లోక వ్యవహారంలో ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
      తెలుగువాళ్లకు రెండు గొప్ప క్షేత్రాలున్నాయి.. తిరుమల, శ్రీశైలం. వాహన సౌకర్యాలు లేని మునుపటి కాలంలో ఎవరైనా ఆ క్షేత్రాలకు నడిచి వెళ్లాల్సిందే. ఎగుడుదిగుళ్ల రాళ్లూరప్పల మధ్య నడక కష్టసాధ్యంగా ఉండేది. తిరుమలకు అయితే కొంతమేలు. మెట్ల దారులు ఒకటి కాదు రెండు ఉన్నాయి. అయినా తుంబురు కోన ప్రాంతం నడకదారి నుంచి నడిచే వారికి అగచాట్లే. ఇలాంటి దారులు ఉన్న కాలంలో కొండమీదికి ఆ దేవుడి మీద భారం వేసి నడిచేవారు. వారు అలసట లేకుండా ఆ స్వామిని వేడుకుంటూ వెళ్లేవారు. ‘చేదుకో మల్లన్న చేదుకో స్వామి!’ అంటూ ఇంకా ఏమేమో పాడుకుంటూ మార్గాయాసం పోగొట్టుకుంటూ కొండపైకి నడిచేవారు. ఈ మల్లన్న శ్రీశైలం మీద కొలువైన మల్లికార్జున స్వామి. అలాగే తిరుమల కొండకు నడిచే వారు కూడా ‘చేదుకో తిరుమలప్పా చేదుకో స్వామి!’ అని వేడుకుంటూ కొండపైకి ఎగబాకేవారు. తిరుమలప్ప ఉచ్చారణ వేగంలో తిమ్మప్పగా మారిపోయాడు. చేదుకో అంటే చేదుకొనుము అని. ఇందులోని చేదు తొలగిపోయినా అర్థం మారదు. కొను అంటే తీసుకో అనే కదా అర్థం! ఇలా రెండు కొండల్లోనూ ‘కో మల్లన్న’, ‘కో తిమ్మప్ప’/ ‘కో తిమ్మన్న’ పదాలు మారుమోగుతూ ఉండేవి. వీటిలో ‘కోమల్లన్న’తో ఇబ్బంది రాలేదు కానీ ‘కోతిమ్మన్న’తో ప్రమాదం వచ్చిపడింది. అది భ్రమ ప్రమాదం. కోతిమ్మన్న కోతిగానూ, తిమ్మన్నగానూ విడిపోయింది. కోతిని, కోతిమ్మన్నను ఒకే అర్థంలో జనం వాడటం ప్రారంభించారు. బతుకుతెరువు కోసం ఆడించుకోడానికి పల్లెల్లోకి ఎవరైనా కోతిని తీసుకువస్తే ‘కోతిమ్మన్న వచ్చింది’ అనేవారు. అలాగే ఎవరైనా వెకిలి చేష్టలు చేస్తూ ఉంటే వాడినీ ‘కోతిమ్మన్న’ అంటూ ఎగతాళి చేసేవారు. 
      చూశారా! కోతిమ్మన్న అంటూ కొండపైకి నడిచి వెళ్లే భక్తులు మొరపెట్టుకునే మాట కాలక్రమంలో ఎంతటి భ్రమకు లోను చేసిందో. కోతిమ్మన్న లోంచి పుట్టిన తిమ్మడు- కోతిమ్మడు రెండు పదాలూ కోతి అనే అర్థంలో జనసామాన్యంలో రూఢిగా మారిపోయాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం