బాలల అభినం..ఆనందమయం

  • 252 Views
  • 4Likes
  • Like
  • Article Share

మానవ జీవితంలో దశలను వ్యక్తీకరించడానికీ, భావోద్రేకాలను దృశ్యమానం చేయడానికీ నాటకం ఓ విలువైన సాధనం. సాంకేతిక విశృంఖలత, ప్రాపంచిక పెనుమార్పుల తాకిడితో మరుగునపడిపోతున్న ఈ కళకు జీవం పోయాలనే లక్ష్యంతో రాష్ట్రస్థాయి బాలల నాటకపోటీలు తలపెట్టింది తెలంగాణ సంగీత నాటక అకాడమీ. చిన్నారుల దృష్టిని రంగస్థలం వైపు మరల్చడానికి ఉద్దేశించిన ఈ పోటీలు విజయవంతమయ్యాయి.
మొక్క
దశలోనే పిల్లలకు కళల పట్ల ఆసక్తిని కలిగించాలి.. వారిని కళాజీవులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఉన్నతపాఠశాల స్థాయి నాటకపోటీలను ఏర్పాటు చేసింది. జిల్లా, మండల స్థాయిల్లో పోటీలను నిర్వహించి ఎంపిక చేసిన నాటకాలను సెప్టెంబరు 24, 25, 26 తేదీల్లో హైదరాబాదు రవీంద్రభారతిలో ప్రదర్శింపజేసింది. నాటకపోటీల ప్రకటన వెలువడగానే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 249కి పైగా పాఠశాలల నుంచి నాటకాలు పరిశీలనకి వచ్చాయి. ప్రాథమికంగా 109 నాటకాలు ఎంపికయ్యాయి. వాటిలో ఉత్తమమైనవిగా న్యాయనిర్ణేతలు ఎంచిన 26 నాటకాలు రవీంద్రభారతి వేదికగా ఈ మూడురోజుల్లో ప్రదర్శితమయ్యాయి.   
      తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారి జ్యోతి ప్రజ్వలన చేసి నాటక పోటీలను ప్రారంభించారు. ‘‘పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నాటకపోటీలను ఏర్పాటు చేసింది. తెలుగు నాట కళారంగంలోని గొప్పవారంతా ఈ రవీంద్రభారతి కళావేదిక మీద తమను తాము నిరూపించుకున్నారు. అలాంటి వేదికమీద ఈ చిన్నారుల నాటకాలు ప్రదర్శించడం వారి పూర్వజన్మసుకృతం’’ అంటూ చిన్నారులకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ట  మాట్లాడుతూ ‘‘రేపటి వికసిత కళలకు ఇది అంకురారోపణ. ఇలాంటి పోటీల వల్ల జాతి సంస్కృతి నిలబడుతుంది’’ అని చెప్పారు. ‘‘ఈ వేదిక మీద నటించడం ఓ అపూర్వ అనుభూతి. బహుమతుల ప్రమేయం లేకుండా ఇక్కడదాకా వచ్చి తమ ప్రతిభను ప్రదర్శించడం ఓ తీపిజ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అంటూ సంగీత నాటక అకాడమీ కార్యదర్శి డా।।కె.లక్ష్మి పిల్లలను ఉత్సాహపరిచారు.
అశోకుడి కథతో ఆరంభం
హైదరాబాదు డిఫెన్స్‌ ల్యాబ్స్‌ పాఠశాల విద్యార్థుల ‘బుద్ధం శరణం గచ్ఛామి’ ఈ పోటీల్లో తొలి నాటకంగా ప్రదర్శితమైంది. చండాశోకుడు దమ్మాశోకుడిగా మారిన క్రమాన్ని ఇది బొమ్మకట్టింది. కె.వి.ఎస్‌. కామేశ్వరి దర్శకత్వం వహించిన ఈ నాటకంలో పిల్లల నటన, బుద్ధవచనాలను చెప్పిన తీరు ఆకట్టుకున్నాయి. అవినీతిరహిత సమాజ నిర్మాణం జరగాలంటే పిల్లలకు విలువలతో కూడిన జీవితాన్ని అలవరచాలని చెప్పే ‘పెద్దలకు మాత్రమే’ నాటకాన్ని హన్మకొండ ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించారు. బాధ్యత లేని తల్లిదండ్రుల వల్ల భావిభారత పౌరుల పరిస్థితి అంధకారంలోకి జారిపోతున్న పరిస్థితిని దర్శకులు మూడు పాత్రలతో చూపించారు. పిల్లల పెంపకంలో పెద్దలు చేసే పొరపాట్లను ఈ నాటకం ఎత్తిపట్టింది. మహబూబ్‌నగర్‌ బాడేపల్లి ఉన్నతపాఠశాల విద్యార్థులు ఆకెళ్ల సూర్యనారాయణ దర్శకత్వంలో ప్రదర్శించిన ‘వీధి నాటకం’.. సమాజంలో విభిన్న మనస్తత్వాలనూ, భావజాలాలను ప్రతిబింబిస్తూ సాగింది. సామాజిక పోకడలను, పరిణామాలను ఆరుగురు పిల్లలతో చెప్పించి ఒక నూతన దృష్టిని కలిగించారు దర్శకులు. సుదీర్ఘ సంభాషణలను ఆ పసివారు అలవోకగా చెప్పిన తీరూ.. ఆ నటనా విలక్షణత ప్రేక్షకులను అబ్బురపరచాయి. 
      ‘దమయంతి స్వయంవరం’ పౌరాణిక నాటకాన్ని హైదరాబాదు హయత్‌నగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత  పాఠశాల విద్యార్థులు ప్రదర్శించి, పద్యం పాతబడలేదని నిరూపించారు. మహాభారతంలోని కథను తీసుకుని అవసరమైన చోట్ల పిల్లల స్థాయికి తగ్గట్టు స్వరాలు సమకూర్చి గొప్ప రంగస్థల అనుభవాన్ని రూపుకట్టించారు దర్శకులు సోమా అంజిరెడ్డి. ఇందులోని పాత్రలన్నింటినీ బాలికలే పోషించి మెప్పించడం విశేషం. ఈ నాటకానికి పోటీల్లో ద్వితీయ బహుమతి లభించింది. ఇక ‘వెన్నెల’.. పూర్తిగా సామాజిక చైతన్యంతో సాగిన నాటకం. వల్లభాపురం శ్రీనివాసులు దర్శకత్వంలో వనపర్తి జిల్లా జగత్‌పల్లి జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల విద్యార్థులు దీన్ని ప్రదర్శించారు. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేస్తే బరువు తీరిపోతుందని భావించే తల్లిదండ్రులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అమ్మాయిల ఆరోగ్య పరిస్థితి, మానసిక ఎదుగుదల గురించి వారికి ఏమాత్రం ఆలోచన ఉండదు. దాంతో ఆ ఆడపిల్లలు ప్రసవ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. బాలింతల చావులకు ప్రధాన కారణం బాల్యవివాహాలేనని, చిన్నతనంలో పెళ్లి చేస్తే జీవితాలు అధ్వానమైపోతాయనే సందేశాన్ని ఇచ్చిందీ ‘వెన్నెల’! అలాగే, ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడమే లక్ష్యంగా మంచిర్యాల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం చిన్నారులు ‘వైనాట్‌ ఏ గర్ల్‌’ నాటకాన్ని ప్రదర్శించారు.
ఓ యథార్థ గాథ ఆధారంగా..
నిజామాబాదు జిల్లా ఆర్మూరు విజయ్‌ హైస్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన ‘మేమే మంచోళ్లం’ నాటకం, దుష్టశక్తుల కంటే మానవుడే ప్రమాదకరమనే ప్రతిపాదన చేసింది. రచయిత్రి కిరణ్‌బాల దర్శకత్వం వహించిన ఇందులో ‘‘భూతం దెయ్యం పిశాచం’’ అనే పాట విలక్షణంగా సాగి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
      రెండోరోజు ప్రదర్శించిన నాటకాల్లో ‘అశ్వత్థామ’ మొదటిది. హైదరాబాదు ఆర్‌.ఎన్‌.రెడ్డి నగర్‌ స్లేట్‌ పాఠశాల విద్యార్థులు మహాభారతంలోని యుద్ధగాథని ఇతివృత్తంగా తీసుకుని ఈ పద్యనాటకాన్ని రక్తికట్టించారు. మల్లయుద్ధంలో భీముడి చేతిలో ఓడిపోయిన దుర్యోధనుడు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంటాడు. తన దగ్గరున్న అస్త్రాన్ని ప్రయోగించమని అశ్వత్థామను అడుగుతాడు. ఆ అస్త్ర ప్రభావంతో ఉపపాండవులు చనిపోతారు. దుర్యోధనుడి పగ ఎలాంటి పరిణామాలకు దారితీసిందో ఈ నాటకం కళ్లకుకట్టింది. ‘టిఫనీ’ నాటకాన్ని టీటీడబ్ల్యూయూఆర్‌జేసీ ఫైన్‌ ఆర్ట్స్‌ స్కూల్‌ (పిర్జాదిగూడ, హైదరాబాదు) పిల్లలు ప్రదర్శించారు. కేరళలో జరిగిన యధార్థ ఘటనలకు ఇది రంగస్థల రూపం. టిఫనీ మారియా బ్రార్‌ అనే పాప పుట్టుకతోనే చూపును కోల్పోతుంది. ఎదిగే క్రమంలో తోటిపిల్లలు, ఉపాధ్యాయుల నుంచి అవమానాలను ఎదుర్కొంటుంది. తల్లి మాటల ద్వారా ప్రేరణ పొంది తనలాంటి అంధులకు రక్షణగా ‘జోతిర్గమయ ఫౌండేషన్‌’ స్థాపిస్తుంది. ప్రభుత్వం నుంచి ‘కరేజియస్‌ డాటర్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారాన్ని అందుకుంటుంది. నాటకంలో టిఫనీ పాత్రను ఎనిమిదో తరగతి చదువుతున్న పి.ఐశ్వర్య పోషించింది. ‘‘నేను చూడలేని లోకం నావైపు చూసేలా చేస్తా’’ వంటి ప్రభావపూరిత సంభాషణలు రాయడంతో పాటు కావలి మనోహర్‌ ఈ నాటకానికి దర్శకత్వమూ వహించారు. పోటీల్లో ఇది ప్రథమ బహుమతిని గెలుచుకుంది.
భువన విజయం
జడ్చర్ల అక్షర కాన్సెప్ట్‌ హైస్కూల్‌ విద్యార్థులు శ్రీకృష్ణదేవరాయల సాహిత్యగోష్ఠి భువనవిజయాన్ని అదే పేరుతో నాటకంగా ప్రదర్శించారు. ఈ చిన్నారులంతా చమత్కారభరిత పద్యాలతోనూ, సమస్యాపూరణాలు వల్లిస్తూ ఒకనొక చారిత్రక వైభవాన్ని కళ్లకుకట్టారు. వనజ దర్శకత్వంలో పిల్లలంతా పద్యాలను ధారాళంగా పాడారు. తెనాలి రామకృష్ట పాత్రధారి సాత్విక స్వరమాధుర్యంతోనే కాదు ఆంగికాభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న నిత్యాక్షరి, మాదయగారి మల్లన పాత్రలో అమ్మవారి శాంత స్వభావాన్ని వెల్లడించే పద్యాన్ని రసరంజకంగా పాడింది. ‘‘కొప్పుపై నొప్పెడు కొదుమ చంద్రునితోడ..’’ అనే ఈ పద్యం సాహిత్యంలో విశిష్టమైంది.
      కడుపులో పెరుగుతోంది ఆడపిల్ల అని తెలియగానే ఓ వివాహిత కుటుంబపరంగా ఎలాంటి వివక్షను ఎదుర్కొంటుందో తెలిపే నాటకం ‘బంగారు తలి’్ల. వరంగల్లు గ్రీన్‌వుడ్‌ పాఠశాల పిల్లలు ప్రదర్శించిన ఈ నాటకానికి కూడా ద్వితీయ బహుమతి లభించింది. ఆడది ఆదిశక్తి, సకల భువనాలనూ పోషించే తల్లి అని కొనియాడే వాళ్లే ఆడపిల్ల పుడుతోందనగానే అమాంతం దూరం జరిగిపోతారనే సంగతిని దర్శకులు ఎస్‌.సురేష్‌.. నాలుగు ప్రధాన పాత్రలతో చూపించిన విధానం ఆలోచింపజేసింది. అలాగే, ఆడపిల్లలకు సమాజంలో ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి! ఈడొచ్చిన అమ్మాయిల పట్ల సమాజ వైఖరి ఎలాంటిదీ! కుటుంబపరమైన ఒత్తిడిని ఎదుర్కొని వారు ఎలా నిలదొక్కుకోవాలనే విషయాలని ‘అమ్మాయిలకు కాపాడుకుందాం!’ నాటకం కళ్లకు కట్టింది. దీన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డి.ఎ.వి. మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించారు. 
చాకలి ఐలమ్మ స్ఫూర్తి
దొరల ఏలుబడికి ఎదురొడ్డిన చాకలి ఐలమ్మ కథను అదేపేరుతో నాటకంగా ప్రదర్శించారు మిర్యాలగూడ ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌బీసీఆర్‌ పాఠశాల చిన్నారులు. ‘‘హే పట్వారీ! నీ అసోంటి బుడతపాములు నన్నేంచేయలేవు. ఊకే ఉర్లకు. మా రెక్కల కష్టంమీద మేం బతుకుతున్నం. మురికిబట్టలు ఎట్లా ఉతకాలో తెల్సూ! నీ అసోంటోల్ల మురికి ఎట్లా ఇరగ్గొట్టాలో తెల్సూ!’’ లాంటి సంభాషణలతో దర్శకులు శ్యాంకుమార్‌ నాటకాన్ని రక్తికట్టించారు. ఐలమ్మ పాత్రలో తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘన జీవించింది.  
టాగోర్‌ కథతో..
మూడోరోజు పోటీల్లో భాగంగా మహబూబాబాదు జిల్లా అయోధ్యపురం జిల్లాపరిషత్‌ ఉన్నతపాఠశాల విద్యార్థులు ‘పాండవోద్యోగం’  పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. తిరుపతి వెంకటకవుల పద్యాలను పిల్లలు పాడిన తీరు మెప్పించింది. నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ‘పరమానందయ్య శిష్యులు’ నాటకంతో అందరినీ నవ్వించారు.
      మానవత్వంతో జీవించాలి.. మనిషిలో మానవత్వ విలువలు పెరగాలనే సందేశ మిచ్చిన నాటకం ‘మనిషి’. భూనాథాచారి దర్శకత్వంలో కరీంనగర్‌ జిల్లా వావిలాల పల్లి ఆల్‌ఫోరేస్‌ టైనిటాట్్స స్కూల్‌ పిల్లలు ఇచ్చిన ప్రదర్శన ఇది. సిద్ధిపేటజిల్లా వర్గల్‌ ఎంజేపీబీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘సావిత్రీబాయి’ నాటకం చారిత్రక యధార్థతత్వాన్ని కళ్లకుకట్టింది. తల్లిదండ్రుల ఒత్తిడి, ఉపాధ్యాయుల హింస నుంచి బయటపడలేక.. చదువుకునే క్రమంలో పిల్లలు ఎలా బలహీనపడిపోతారో ‘ద పారెట్స్‌ టేల్‌’ విడమరిచింది. ఓ చిలుకని ప్రతీకగా చేసుకుని రవీంద్రనాథ్‌ టాగోర్‌ రాసిన కథలో కొద్దిపాటి మార్పులతో హైదరాబాదు తెల్లాపూర్‌ మంథన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన ఈ నాటకం తృతీయ బహుమతి పొందింది. విలక్షణ నాట్యశైలితో సందేశాత్మకంగా సాగిన దీనికి కేశవ్‌ దీపక్‌ దర్శకులు. తెలిసో తెలియకో చిన్నతనంలో చేసిన తప్పులే పెద్దయ్యాక ప్రభావం చూపుతాయనీ.. పిల్లల కొంటెచేష్టలను గమనిస్తూ పెద్దలు వారిని ఎప్పటికప్పుడు హెచ్చరించాలని చెప్పింది ‘పావు టికెట్‌ పరేషాన్‌’ నాటకం. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ టీఎస్‌డబ్ల్యూఆర్‌ లలితకళా పాఠశాల చిన్నారులు రంగస్థల ప్రదర్శన, ప్రేక్షకులను ఉల్లాసపరచడంతో పాటు సామాజిక బాధ్యతనూ గుర్తుచేసింది. ఎన్‌.దీన బాంధవ దర్శకత్వం వహించిన ఈ నాటకంతో పోటీలు        

      పిల్లలందరూ ఈ నాటకోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న చిన్నారులు సైతం పద్యాలను రాగయుక్తంగా ఆలపించారు. ఇలాంటి ప్రదర్శనలు పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతనూ.. కళల పట్ల అభినివేశాన్నీ వెలికితీస్తాయి. వారి సర్వతోముఖాభివృద్ధికి బాటలు పరుస్తాయి. అదే సమయంలో రంగస్థలానికీ కొత్తవన్నెలద్దుతాయి.ముగిశాయి.     


వెనక్కి ...

మీ అభిప్రాయం