ప్రతి కథా కరుణరసాత్మకమే

  • 649 Views
  • 0Likes
  • Like
  • Article Share

దేశానికి గ్రామమే వెన్నెముక. తెలుగునేల కూడా ఇటీవలి వరకు పల్లె ప్రధానమైందే. మరి పల్లె అంటే అంతా ప్రశాంతమేనా అంటే... అదేం కాదు. మనుషుల్లో, మనసుల్లో విషబీజాలు నాటుతున్న కుల వ్యవస్థ, మూఢనమ్మకాలు, పెత్తందారుల ఆధిపత్యం, పురుషాధిక్యం అడుగడుగునా కనిపించే సామాజిక నిర్మితి, భూముల తగాదాలు, చిన్న విషయాలకు సైతం పంతాలు, అరకొర సౌకర్యాలు... లాంటివి పల్లె జీవితంతో పెనవేసుకుపోయిన కొన్ని వాస్తవాలు. వీటి నేపథ్యంగా గ్రామీణ వాతావరణాన్ని సమర్థంగా చిత్రిస్తూ కథలు అల్లిన రచయిత కరుణకుమార. ఆయన కథలకు ప్రధాన నేపథ్యం పల్లెనే.
అలియుణ్ని బలీయుడు కొడితే...
ఓ మోతుబరికి చెప్పులు ప్రాణాంతకంగా పరిణమించిన ఇతివృత్తంతో సాగిన కథ ‘కొత్త చెప్పులు’. చిన్నపరెడ్డి మోతుబరి రైతు. ఊళ్లో అతనంటే హడల్‌. తనకు ఓసారి చెప్పులు అవసరమై వంతుదారైన నరిసికి ఆ పనిని పురమాయిస్తాడు. చెప్పులు తెచ్చేందుకు కాస్త ఆలస్యమవుతుంది. రెడ్డి అసహనానికి గురవుతాడు. చెప్పులు తీసుకొచ్చాక, కావరంతో చేతికర్రతో నరిసిని తలమీద కొడతాడు. దెబ్బ బలంగా తాకడంతో నరిసి చనిపోతుంది. నేరం తన మీదికి రాకుండా శవాన్ని దూరంగా వేయిస్తాడు రెడ్డి. ఊరంతటికీ విషయం పొక్కుతుంది. కానీ, రెడ్డి పలుకుబడి అతణ్ని రక్షిస్తుంది. అయితే ఆముదం సరిగా అంటకపోవడంతో చెప్పులు రెడ్డి కాళ్లను కరుస్తాయి. దాన్ని అతను తేలిగ్గా తీసుకోవడంతో అది పుండవుతుంది. చివరికి భరించలేని స్థితికి చేరుకుంటుంది. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తారు. చికిత్స జరుగుతున్న సమయంలోనే బాధ భరించలేక రెడ్డి శరీరంలోని ‘హంస లేచిపోతుంది’ అని కథ ముగిస్తారు కరుణకుమార. అల్పుణ్ని బలవంతుడు కొడితే, బలవంతుణ్ని భగవంతుడు కొడతాడన్న నీతిని ఇందులో అంతర్లీనంగా చెప్పారు.
      ‘పశువుల కొఠం’ కథకు సంపన్నుడి చేతిలో ఓడిపోయిన సామాన్యుల ప్రేమకథ నేపథ్యం. పెంచెలి, రొబ్బడు దళితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే పెంచెలి ఉండే ఊళ్లో నివసించే సంపన్నుడైన రాయుడు ఎలాగైనా సరే ఆమెను పొందాలనుకుంటాడు. పెంచెలికి, రొబ్బడికి పెళ్లి కుదిరిన విషయం తెలుసుకుంటాడు. దాన్ని చెడగొట్టడానికి పెంచెలి మీద పుకార్లు పుట్టించి, రొబ్బడికి తెలిసేలా చేస్తాడు. దాంతో పెంచెలి నిందకు గురై, రొబ్బడి చేతిలో చావు దెబ్బలు తింటుంది. మమకారం చావని పెంచెలికి పిచ్చిపడుతుంది. ఆ స్థితిలోనే రాయడి పశువుల కొట్టం దగ్గరికి వెళ్లి కుప్పకూలుతుంది.
      ఇక ‘బిళ్ళల మొలత్రాడు’లో వచ్చే రమణిది పెంచెలికి భిన్నమైన పాత్ర. తల్లి చనిపోయిన యానాది సుబ్బణ్ని పల్లిపోతు కృష్ణారెడ్డి, లక్ష్మమ్మలు తమ సంతానం రామిరెడ్డితోపాటు పెంచి పెద్దచేస్తారు. కృతజ్ఞతగా సుబ్బడు కూడా రెక్కలు దాచుకోకుండా వాళ్ల దగ్గర కష్టం చేస్తాడు. సుబ్బడికి మేనమామ కూతురు రమణితో పెళ్లవుతుంది. పుత్ర వాత్సల్యంతో లక్ష్మమ్మ వాళ్లకు తమ కొబ్బరితోటలో ఇల్లు కట్టిస్తుంది. రామిరెడ్డి ఎలాగైనా రమణిని అనుభవించాలనుకుంటాడు. రెడ్డి దుర్బుద్ధిని గ్రహించిన రమణి సుబ్బడితో కలిసి తమ పాలేనికి వెళ్లిపోతుంది. చివరికి భూమి తగాదాలో సుబ్బణ్ని బిళ్లల మొలతాడు దొంగతనం నేరంమోపి జైలుకు పంపుతాడు రెడ్డి. లక్ష్మమ్మ కోర్టుకు వచ్చి దాన్ని తానే సుబ్బడికి ఇచ్చినట్లు చెబుతుంది. కోర్టు సుబ్బణ్ని విడుదల చేసి, రెడ్డికి శిక్ష విధిస్తుంది. ఈ కథలో రమణి గాంధేయ మార్గాన్ని అనుసరించి తన భర్తలో మంచితనాన్ని, ధైర్యాన్ని పెంచి, సంసారాన్ని కాపాడుకుంటుంది. లక్ష్మమ్మ తన కొడుకు వైపు కాకుండా న్యాయం వైపు ఉండటం విశేష పాత్రచిత్రణ. సరిగ్గా ఈ లక్ష్మమ్మకు వ్యతిరేకంగా నిలిచే పాత్ర ‘కయ్య కాలువ’ కథలో కనిపిస్తుంది. ఆ పాత్ర పేరు కూడా లక్ష్మమ్మే. కూటికి లేని కొండడికి దక్కిన అరెకరం కయ్య కోసం కళ్లలో నిప్పులు పోసుకునే వందెకరాల ఆసామి ఆమె. వ్యవస్థ సాయంతో కొండణ్ని సాధించే ఆమె మనస్తత్వం, పల్లె పెత్తందారుల తీరుకు ప్రతిరూపం. రెవెన్యూ అధికారుల కుట్రలు, ఉదాసీనత, నిర్లక్ష్యం అన్నీ ఈ కథలో కళ్లకు కడతారు కరుణకుమార. సాగుకు పనికిరాని బీడు భూములను పేదలకు పంచడం, కింది పొలాలకు నీళ్లివ్వని పెద్దమనుషుల తీరు, లేనివాళ్ల దగ్గర కూడా లంచాలు మేసి- చివరికి ఉన్నవాళ్లకే వంతపాడే అధికార యంత్రాంగం... ఇలా ఇప్పటికీ రాజ్యమేలుతున్న అవ్యవస్థను ఇందులో చిత్రించారు రచయిత. అధికార వ్యవస్థ అన్యాయానికి మరో ఉదాహరణ ‘చలిజ్వరం’ కథ.
      ‘మొక్కుబడి’ కథలో కరుణకుమార కథా విశ్వరూపం కనిపిస్తుంది. గ్రామదేవతల ఉత్సవాలు జరిగే సందర్భంలో వాతావరణం ఎలా ఉంటుందన్న దానిని ఇందులో కళ్లకుకట్టినట్లు వర్ణిస్తారు. ఉద్యోగరీత్యా గ్రామదేవతల జాతరల ఏర్పాట్లను పర్యవేక్షించిన అనుభవం అంతా ఇక్కడ కనిపిస్తుంది. బాలయ్య రెడ్ల పిల్లాడు. మొక్కుబడి కింద తన పెంపుడు మేకను బలి ఇస్తున్నప్పుడు దాన్ని తప్పించేందుకు చేసే ప్రయత్నంలో, గణాచారి కత్తి మేకకు బదులుగా బాలయ్య గొంతు మీద పడుతుంది. ఇక్కడ ‘అతని తలా మొండెమూ నేలమీద పడి గిలగిల కొట్టుకుంటున్నవి. మే, మే అని అరుస్తూ మేకపిల్ల బాలయ్య చుట్టూ తిరుగుతున్నది. బాలయ్య కళ్ళు మేకను చూసుకుని నవ్వి మూసుకుపోయినవి’ అంటూ ఊహించని విధంగా ముగింపునిస్తారు.
అధికార రోగపీడితులు
ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న కుక్కల్ని తెప్పించి పెంచుకునే అలవాటు ఓ జమీందారుది. ఆయన ప్రాణప్రదంగా చూసుకునే జాకీ అనే కుక్క ఓ యానాది పిల్లాణ్ని కరుస్తుంది. కొన్నాళ్లకు ఆ పిల్లాడు మరణిస్తాడు. జాకీకీ విషం ఎక్కుతుంది. నిజానికి దీనికే ముందునుంచే విషం ఉందా, ఆ పిల్లాడి నుంచి సంక్రమించిందా అన్నది తెలియదు. పిచ్చి ముదిరి కుక్క చనిపోతుంది. జమీందారు తత్వాన్ని గ్రహించిన ఆయన దివాన్‌ జాకీ విగ్రహం తయారు చేయించి కూడలిలో ప్రతిష్ఠిద్దామంటాడు. దానికి ప్రజల నుంచి చందాలు చేద్దామని ఓ సలహానూ పారేస్తాడు. జనానికి అభివృద్ధిని ఎరగా చూపి దండుకున్న డబ్బులు ఏమైపోయాయో తెలియని వ్యవస్థ ఈ కథలో కనిపిస్తుంది.
      గ్రామాల్లో అగ్రకులాలు, అణగారిన వర్గాల మధ్య అంతరం ఓ ప్రధానోపాధ్యాయుణ్ని బలిపశువుగా మార్చిన నేపథ్యం ఉన్నది ‘టార్చిలైటు’ కథ. భారంగా బతుకుబండి ఈడుస్తున్న ఓ రిక్షా కార్మికుడి జీవితాన్ని చిత్రించేది ‘రిక్షావాలా’. పై అధికారి వికృతత్వాన్ని కళ్లకుకట్టే ‘512’, పనికిమాలిన ఆదర్శాలతో బతికేవాళ్ల వ్యక్తిత్వాన్ని పట్టిచూపే ‘కనువిప్పు’, అంటరానితనం తీవ్రతను తెలియజేసే ‘పోలయ్య’; స్వరాజ్య ఉద్యమంలో పాల్గొన్న కొడుకును వదులుకోమని ప్రభుత్వం నుంచి రాంసింగ్‌ అనే సైనికాధికారికి ఉత్తర్వు రావడం, ఆ అబ్బాయి పోలీసు కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో మరణించిన సంఘటనతో సాగే ‘సేవాధర్మం’... ఇలా ప్రతీ కథా కరుణ రసాత్మకంగా సాగేదే. ‘ఉన్నతోద్యోగాలు’ కథలో రెండో ప్రపంచ యుద్ధంనాటి సామాజిక స్థితిగతులు చర్చకు వస్తాయి. గ్రాంథిక భాషనే తెలుగు నేల అంతటా వాడాలి, ఆ దిశగా ప్రయత్నాలు జరగాలనుకుని... అదీ ముందుగా తన ఇంటినుంచే ప్రారంభించాలని ప్రయత్నించి భార్య, కొడుకు, శిష్యుడి చేతిలో అభాసుపాలైన ఓ పండితుడి కథ ‘గ్రాంథిక భాషావాది’. ఇది నాటకంలా సాగుతుంది.
      కరుణకుమార కథల్లో పల్లె జీవితాల సమస్త చిత్రణ కనిపిస్తుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా గ్రామాలు, అక్కడి భాష ప్రముఖంగా ఉంటుంది. అగ్రహారాలు, కమ్మ, రెడ్డి, యానాది పాలేలు, దళిత వాడలు, కళ్లాలు, బేలగా కనిపించే పాత్రల పక్కనే ఉదారత్వం, ధైర్యం నిండిన మహిళలు, పొట్ట గడవని రిక్షావాలాలు, జట్కావాళ్లు, అధికారం, ధనగర్వం తలకెక్కినవాళ్లు, అవకాశం వచ్చినప్పుడు సహాయ నిరాకరణ చేసే సామాన్యజనం ఆయన కథల్లో దర్శనమిస్తారు. సికస్తు, దురస్తు, జమాబంది, లాయఖు లాంటి రెవెన్యూ పదాలు; అడుమానం (తాకట్టు), మంచి సెబ్బరలు లాంటి నెల్లూరు వాడుక పదాలు తారసపడతాయి. తెలుగునేల మీద స్వాతంత్య్రానికి ముందు, సమకాలీనంగా ఉన్న గ్రామాల జీవితాన్ని చూపించే కాలయంత్రంగా పనిచేస్తాయి కరుణకుమార కథలు.


తెలుగువారి ప్రేమ్‌చంద్‌ 
కరుణకుమారగా ప్రసిద్ధి చెందిన కందుకూరి అనంతం 1901లో పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు. తణుకులో పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. విజయనగరం మహారాజా కళాశాలలో ఇంటర్‌లో చేరినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఆయన చదువుకు ఆటంకమయ్యాయి. 1920లో నెల్లూరు జిల్లా సింగరాయకొండ- కనిగిరి మధ్య తిరిగే ప్రైవేటు బస్సు కండక్టరుగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత కనిగిరిలో రెవెన్యూ విభాగంలో ఉద్యోగం చేశారు. అక్కడ ఉన్నప్పుడే శ్రీరామభక్త నాటక సమాజం స్థాపించి నాటకాలు వేశారు. నెల్లూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టరుగా, డిప్యూటీ తహశీల్దారుగా ఉద్యోగాలు చేశారు. అక్కడే ప్రముఖ కథకుడు చింతా దీక్షితులు, యానాదుల ఉద్ధరణకు కృషి చేసిన వెన్నెలకంటి రాఘవయ్య లాంటివాళ్లతో స్నేహం ఏర్పడింది. ఆయన కథల్ని తన బావగారైన మల్లంపల్లి సోమశేఖరశర్మతో చదివించేవారట. ఆయనే కరుణకుమార అనే పేరును స్థిరపరచాడట. ఆయన మీద ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధీజీ ప్రభావం ఎక్కువ. ఇది ఆయన కథల్లోనూ కనిపిస్తుంది. ప్రభుత్వోద్యోగిగా ఉంటూనే వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపిన కరుణకుమార 1956లో మరణించారు. ‘పల్లెలకు, పల్లెటూరివాళ్లకు, పల్లె మాటలకు తన సాహిత్యంలో ప్రాధాన్యం ఇచ్చి, పీడిత తాడిత వర్గాల బాధలకు బాకా పట్టిన ప్రజారచయిత కరుణకుమార. ఆయన మన గొప్ప కథకుల్లో ఒకరు. గ్రామీణ జనజీవనం గురించి రాసిన కథకుల్లో గణనీయుడు’ అంటారు మధురాంతకం రాజారాం. ఆయన అన్నట్లే కరుణకుమార నిజంగా తెలుగువారి ప్రేమ్‌చందే. 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం