దైవం - స్వర్గం

  • 481 Views
  • 0Likes
  • Like
  • Article Share

అనితరసాధ్యమైన నటనా కౌశలానికి మారుపేరు అక్కినేని నాగేశ్వరరావు. అయితే, అది ఆయనలోని ఒక పార్శ్వం మాత్రమే. అక్కినేని ఆంతర్యంలోకి తొంగిచూస్తే ఓ తత్వవేత్త కనిపిస్తాడు. స్వర్గనరకాల మిథ్యను ప్రశ్నించే హేతువాది దర్శనమిస్తారు. వాస్తవంలో బతకమనే ఆ తార్కికుణ్ని ‘దైవం - స్వర్గం’ గురించి రాయమంటే ఏం రాస్తారు?  దైవాన్ని నమ్మని ఆ మనిషి దైవత్వానికి ఎలాంటి నిర్వచనం ఇస్తారు? నమ్మకమే మనిషిని నడిపించే ఇంధనమని నమ్మే ఆయన, దైవం విషయంలో ప్రజల విశ్వాసాల గురించి ఏం చెబుతారు? అలాగే తన వృత్తిని ఈసడించే వాళ్లకి ఆయన చెప్పే సమాధానమేంటి? 
      ఇదిగోండి ఈ వ్యాసమే ఆ ప్రశ్నలన్నింటికీ జవాబు! జనవరి 13, 1960 ఆంధ్రపత్రిక (వారపత్రిక) సంక్రాంతి సంచికలో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా రాసిన ఈ వ్యాసం ఓ వ్యక్తిత్వ వికాస పాఠం. మీరూ చదవండి...

ఇందు గలడందు లేడని సందేహము వలదు అంటూ ధైర్యంగా చెప్పినవారూ ఉన్నారు; ఉన్నావా? లేవా?... అంటూ ఉన్నాడో లేడో తెలియని ఆయన్నే ముఖాముఖిగా అడిగేసినవారూ ఉన్నారు; జగదీశ్వరుడంటూ ఒకడున్నట్టా లేనట్టా అని అనుమానించిన వారూ ఉన్నారు. లేడు అని క్లుప్తంగా తేల్చిపారేసినవారూ ఉన్నారు - ఆలోచించకుండా. నమ్మిక లేకపోయినా ఉన్నాడు అని ఒప్పేసుకున్నవారూ ఉన్నారు - ఎందుకైనా మంచిదనీ, ఏమో మనకెందుకనీ.
      ఇన్ని వాక్యాలకీ కర్త అయిన ‘వాడి’ గురించి, ఈ మాటలు ఏనాటినుండో వినబడుతున్నాయి. సాక్షాత్తూ శ్రీరాముడికే ‘దేవుడూ లేడు, దెయ్యమూ లేదు’ అని చెప్పాడట ఒకాయన.
      మరి ఈ విషయంపై మహర్షులు, మహావేదాంతులు, పండితులు ఎందరెందరో ఎన్నెన్నో వాదనలు చేశారు, చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు... దేవుడు ఆదిమధ్యాంత రహితుడు అని పెద్దలు చెప్పగా విన్నాను. ఈ చర్చ కూడా అలాంటిదే. దీనికి తుదీ మొదలూ లేదు. అంతు చిక్కదు.
ఈ అన్వేషణలో కొందరు అసలు సంగతేదో తెలుసుకున్నామనుకుంటున్నారు. కొందరు తెలుసుకోబోయి తప్పుకుంటున్నారు. తెలుసుకోవడానికి భయపడుతున్నారు. తెలుసునని తమను తాము నమ్మించుకొంటున్నారు. దోబూచులాడుతున్నారు. ఆత్మవిశ్వాసం పెరిగినపుడు దేవుడు లేడంటున్నారు. తిరిగి కష్టాలు కమ్ముకొచ్చినప్పుడు ఉన్నాడంటున్నారు. నాస్తికులు ఆస్తికులను చూచి మూఢులు అనుకుంటున్నారు. ఆస్తికులు నాస్తికులను చూసి అజ్ఞానులు అనుకొంటున్నారు. పెద్దవాళ్లు రాసే పుస్తకాలు చూసీ, చెప్పే ఉపన్యాసాలు వినీ కొందరు కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు. అప్పుడు మహాపురుషులు అవతరించి ధైర్యం చెబుతున్నారు. ఇది అనంతమైనది. అందనిది.
      ఇటువంటి పెద్ద విషయాలపై మాట్లాడగల శక్తిసామర్థ్యాలు నాకు లేవని తెలుసు. కానీ, సామాన్య మానవుడిగా నాకు కూడా వీటి గురించి - అందినంతవరకు ఆలోచించుకోగల అధికారం ఉంది. అవసరమూ ఉంది. ఎందుకంటే ఆస్తికుడికైనా నాస్తికుడికైనా అటైనా ఇటైనా విశ్వాసం (కన్విక్షన్‌) అనేది ఉండాలి.
      ఒక మిత్రుడు ఒకసారి ఈ విషయమై చర్చ వచ్చినప్పుడు ఒక ఆంగ్లకవి రాసిన ఈ మాటలను చెప్పాడు.
      ‘‘ఐ యామ్‌ ది కెప్టెన్‌ ఆఫ్‌ మై సోల్‌. ఐ యామ్‌ ది మాష్టర్‌ ఆఫ్‌ మై ఫేట్‌’’
      (నా ఆత్మకు నేనే కర్మధారిని, 
      నా కర్మకు నేనే కర్తను.)
      ఆయనెవరో చాలా ధైర్యశాలి. ఆత్మవిశ్వాసం గలవాడు. ఇంత చక్కని మాట విన్నందుకు నేను చాలా సంతోషపడ్డాను. మొత్తానికి ఏదో ఒకవిధంగా నమ్మకం ఉండాలి గదా, నమ్మి చెడినవారు లేరు మరి.
      ఉన్నాడనుకుంటే ఆయననే నమ్ముకోవచ్చు. లేడనుకుంటే మననో, మరొకర్నో నమ్ముకోవచ్చు. తాడు తెగిన గాలిపడగలా తేలలేముగదా. నమ్మిక ఉండాలి. దైవం, స్వర్గం, నరకం ఇవన్నీ ఉన్నాయన్న నమ్మకం వల్ల మానవులలో పాపభీతి ఉండి ఒకరొకరిని హింసించుకోకుండా ఉంటారని పెద్దలు చెప్పారు. ఐతే దైవభీతి లేనివాడికీ పాపభీతి ఉంటుంది. వాడికీ పవిత్రమైనది, పూజనీయమైనది ఉంటుంది. వాడికీ నీతినియమాలు ఉంటాయి. ఒక స్వర్గం, ఒక నరకం ఉంటాయి. వాడినీ వీడినీ కూడా నడిపించేది - దేవుడు ఉండటం, ఉండకపోవడం కన్న, ఉన్నాడా లేడా అన్న నమ్మకం, దాని బలం. దేవుడు నమ్మకాన్ని బట్టే కనిపిస్తాడంటారు - రాముడుగా, కృష్ణుడుగా, అల్లాగా, అమ్మవారుగా, క్రీస్తుగా... నాకు తెలీదు. ఈ విశాల విశ్వాన్ని పరిపాలిస్తున్నదెవరో, రాముడో, అల్లానో, క్రీస్తో, ఓంకారమో. ఒకటిమాత్రం నమ్ముతాను. అంతటినీ పాలించి నడిపించే మహత్తరశక్తి - మానవుడి బుద్ధికి అందనిది ఏదో ఒకటి ఉంటుంది. అదేదో తెలీదు. తెలియని దానిని, తెలియతగిన దానిని తెలుసుకోవాలని తపనకొద్దీ; నా బుద్ధికి తోచిన పద్ధతిలో నేను ప్రయత్నిస్తున్నాను. నాకు అన్న వస్త్రాలిచ్చి, అపారమైన ఆనందాన్ని ప్రసాదించే విద్యలోనే, దాని శక్తిలోనే నేను ప్రపంచ పాలకుడిని, ఆ శక్తిని చూడాలని కృషి చేస్తాను.
      గణిత శాస్త్రజ్ఞుడిని భగవంతుడెవరు అనీ, సత్యమేది అనీ అడిగితే స్క్వేర్‌రూట్‌ ఆఫ్‌ మైనస్‌వన్‌ కనిపెట్టండి అక్కడ దొరుకుతుంది అంటాడు. గాయకుడిని నీ దైవం స్వర్గం ఎక్కడ అని అడిగితే సప్తస్వరాలలోనూ అని చెప్తాడు. చిత్రకారుడిని అడిగితే రంగుల సంయోగంలో ఎక్కడో దాగి ఉన్నాడు అంటాడు. దైవాన్ని అన్నిటా చూడవచ్చునన్నారు. గురువే దైవము, తల్లియే దైవము... తండ్రియే దైవము... ప్రేమయే దైవము... సత్యమే దైవము... ఆనందమే దైవము. ఆనందం, ఆలోచనవల్ల, ఆరాధన వల్ల సిద్ధిస్తుంది. ఆరాధించేది ఏ విశ్వాసాన్ని అయినా కావచ్చు. ఏ విద్యనైనా కావచ్చు. సంగీతం, నృత్యం, నటన...
      నా స్వంత వేదాంతాన్ని ఇక్కడ పేజీలకొద్దీ రాయడం నా ఉద్దేశం కాదు. నా వృత్తి నటన. సినిమాలో నటన, సినిమా అనేది లక్షలాది ప్రజల వినోద వికాసాలకు సాధనం. అందువల్ల చలనచిత్ర కళాకారులలో ఒకడుగా, నా జీవితానికి, జీవనానికీ కూడా ఉపాధి, దైవం అయిన నా వృత్తివిద్యను గూర్చి, నేను పనిచేసే చోటు నా పాలిట స్వర్గం అయిన సినిమా పరిశ్రమ గురించి, అభిమానులతో మాట్లాడుకోవడమే.
      సినిమాను స్వర్గంతో పోల్చడమేమిటని కొందరు అనవచ్చు. సినిమా గురించి అపోహలు గలవారూ, సినిమా వారిపట్ల చులకన భావం గలవారూ ప్రతిఘటించవచ్చును. సినిమాలో నీతి నిజాయతీలు లేవని, ఒకరినొకరు వంచించుకొంటూ, పోటీలు పడుతూ ఒకరి మీద ఒకరు ఈర్ష్య పడుతూ ఉంటారని నమ్మి, పవిత్రమైన స్వర్గాన్ని దీనికి సామ్యం చెప్పానని ఆ అపోహవల్ల ఆగ్రహించవచ్చు.
      కానీ ఒకమాట, కొందరు విమర్శ చేసినంత పతనావస్థలో సినిమా లేదు. ఇక్కడ ఉన్నన్ని గొప్ప విషయాలు, గొప్ప బుద్ధులు ఎన్నో చోట్ల లేవు. అయితే ఇక్కడ లోపాలనేవేవీ లేవని నేను అనటం లేదు. లోపాలు ఎక్కడయినా ఉంటాయి. లోపాలు లేకపోతే, మంచి గుణాలకు విలువేముంటుంది గనక.
      ఆ మాటకు, పురాణాలు వర్ణించిన స్వర్గలోకంలోనే లోపాలున్నాయి. మహనీయులైన దేవతలలోనే లోపాలు ఉన్నాయి. శ్రీమహావిష్ణువు - లోక కల్యాణం కోసమే కానీయండి - దుష్టశిక్షణకే కానీయండి - మాయ వేషాలూ మారువేషాలూ వేయవలసి వచ్చింది. తపస్సు చేసి, యుద్ధాలు చేసి, గొప్పవాడొకడు స్వర్గానికి బయల్దేరవచ్చే ప్రయాణం ఉన్నప్పుడల్లా ఇంద్రుడు తన పదవి కాపాడుకోవడానికై ఆ వచ్చే పెద్దమహర్షికి తపస్సు భంగం అయ్యే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇలాగే దేవత లనేకులు, ఏవేవో కారణాల వల్ల ప్రమత్తులు అయినందువల్ల శాపాలు పొందారు. 
      నారదుడు కలహాలు కల్పించి, లోకకల్యాణానికి ముఖ్యమైన మహత్కార్యాలు జరిపించాడు. మరి స్వర్గాన్ని దైవాన్ని నమ్మేవారు ఇవన్నీ చూసి దేవతలను పూజించడం మానేస్తున్నారా? ఇంద్రుడిని గౌరవించడం మానేశారా? అలా ఎవరూ చెయ్యరు, చెయ్యలేరు. ఇంద్రుడైనవాడు ఆ పదవికి రావడానికి ఎన్నో ధర్మాలు, యాగాలు చేయాలంటారు. అతడు మహాపురుషుడై ఉంటాడు. సద్గుణాలకు నిధి అయి ఉంటాడు. పరాక్రమశాలి అయి ఉంటాడు. అన్ని గొప్ప లక్షణాలు,  గుణాలు ఉన్న వాడివల్ల కొన్ని పొరపాట్లు జరిగినా అతడిలో కొన్ని లోపాలు ఉన్నా అతడు పూజనీయుడే.
అసలు లోటు లేనిదేదీ ఉండదు. మంచివాళ్లు - చెడ్డవాళ్లు అని ప్రత్యేకించి ఎవరూ ఉండరు. మంచిచెడ్డలు పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని లోపాలూ అంతే.. చూసేవాడిని బట్టి ఉంటాయి.

* * *

      సినిమాలను స్వర్గంతోనూ, ఇందులో వ్యక్తులను అందులో ఇంద్రాది దేవతలతోనూ పోల్చి చూసుకుంటే పోలికలు చాలా కనిపిస్తాయి. సంతోషించదగినవీ - తగనివీ కూడా.
      సినిమా స్వర్గంకన్నా గొప్పది కాదు. అంచేత అక్కడా లోపాలు ఉంటాయి. 
      అసలు స్వర్గనరకాలనేవే వేరే ఎక్కడో ఉంటాయనుకోవడంకన్న, నిత్యం మనతోనే మనలోనే ఉంటాయని నమ్మడం మనం సంతోషంగా జీవనం సాగించి, యథాశక్తిన ఇంకొకళ్లను సంతోషపెట్టడానికి అవకాశం కల్పిస్తుందని నేను అనుభవం మీద తెలియచెప్పుకున్నాను. నేను ఆరాధించే విద్యా, దానిమీద నాకు ఉన్న విశ్వాసం నా దైవం కాబట్టి, నా స్వర్గం నరకం కూడా ఈ నా దైవాన్ని అనుసరించే ఉంటాయి. ఈ దైవ పాలనలోనే ఉంటాయి. నాతోను, నాలోను, నా చుట్టూరానూ ఉంటాయి. నేను నిత్యం పనిచేస్తూ తిరిగేదే దైవభూమి. అందులో స్వర్గనరకాలు నా మనస్థితినిబట్టి, నా దృష్టిని బట్టి, నేను ధరించే రంగుటద్దాలనుబట్టీ ఉంటాయి.
నేను సెట్‌ మీద ఒక పాత్ర నిర్వహిస్తున్నప్పుడు ఒక షాట్‌లో శ్రద్ధాసక్తులతో శక్తివంచన లేకుండా నటిస్తున్నప్పుడు నేను ఆ క్షణంలో ఆ పాత్రకు న్యాయం చేకూర్చ గలుగుతున్నాననీ, అందులో పూర్తి ఫలితాన్ని సాధించగలుగుతున్నాననీ అనిపిస్తే - 
అదే నాకు స్వర్గసుఖం ప్రసాదిస్తుంది. ఆ క్షణంలోనే నేను, భాషలో వాక్యాలలో చెప్పలేని ఆనందాన్ని అనుభవిస్తాను. ఆనందో బ్రహ్మ అని పెద్దలు చెప్పారు. నాకు ఆ క్షణంలో కలిగే ఆనందమే ఈశ్వర సాక్షాత్కారం. అదే నేను నమ్మిన దైవం. నేను ఆరాధించే దైవం. ఆ దైవం తర్వాతనే నాకు మిగతావన్నీ.
      నేను కనుక ఒక రోజున సెట్‌ మీద ఒక పాత్ర నిర్వహిస్తున్నప్పుడు నాకు శ్రద్ధ కుదరకగాని, చేతగాకగాని - నేను సరిగ్గా నటించలేకపోతే, నేనాశించిన ఫలితం లభించకపోతే, నటన నాకు తృప్తి కలిగించకపోతే - 
నేను పడే క్షోభ చెప్పరానిది. అదే నాకు నరకం. పురాణాలు వర్ణించే నరక బాధలు నాకు ఆ క్షణంలో అనుభవమవుతాయి. నన్ను నేనే విమర్శించుకుంటాను. నాకు తృప్తికలిగి సబబు అనిపించేస్థాయిలో నటించడానికి కృషి చేస్తాను.

* * *

      అలా అయితే, నువ్వు నటించిన పాత్రలు అన్నీ లోపాలు లేకుండా సంతృప్తికరంగా ఉన్నాయా? అని మీరు అడగవచ్చు. ఆ విషయం నిర్ణయించవలసినవారు మీరే. అలాగని నేను సమాధానం చెప్పక తప్పించుకుంటున్నాననుకోకండి. నేను ధరించిన పాత్రలలో లోపాలు ఉన్న మాట నిజమే. నలుగురూ బాగుందని మెచ్చుకున్న పాత్ర నిర్వహణలో నాకు నచ్చని అంశాలూ ఉన్నాయి; నలుగురు విమర్శించిన పాత్రలలో నాకు చాలా తృప్తి కలిగించినవీ ఉన్నాయి. 
      లోపాలు ఉన్నాయని, తెలిసి కూడా ఊరుకోవడం, ఆత్మవంచన, పరవంచన కాదా? నీవు దైవం అని చెప్పుకొంటున్న విశ్వాసాలను త్రోసిరాజనడం, దైవవంచన చేయడం కాదా? అన్న ప్రశ్న కూడా ఉంది.
      సినిమాది విచిత్రమైన స్వభావం. ఇది వందమంది కలసి పాల్గొనే పరిశ్రమ. ప్రతి ఒకరూ మరొకరి మీద ఆధారపడి ఉంటారు. అందరి కళాకారుల ప్రజ్ఞలూ ఇందులో అందంగా కలసిపోవాలి. ఇవికాక, కొన్ని లక్షల రూపాయల పెట్టుబడి ఉంటుంది. ఆ పెట్టుబడి ఇచ్చేవారు ఒకరుకాక నలుగురు అయిదుగురు ఉంటారు. వారి అభిరుచులు, వారి విశ్వాసాలూ వేర్వేరు కావచ్చు. అవన్నీ కూడా కలవాలి. కలిసి ఒక తాడుమీదకి రావాలి. ఇదంతా చాలా పెద్ద తతంగం. అందువల్ల ఇందులో ఏ ఒకరు అనుకున్నదీ పూర్తిగా సాగడం కష్టం. అందువల్ల ఇష్టం వున్నవి కొన్ని జరగకపోవచ్చు. ఇష్టం లేనివి జరగనూవచ్చు. ఈ విధంగా కొన్ని సందర్భాలలో నేను, నాలాగే నాతోటి కళాకారులూ తమ హృదయం పూర్తిగా ఆమోదించని స్థితిగతులకు, కళా ప్రమాణాలకు అంగీకరించవలసి వస్తోంది. ఫలితాలు కనిపించనంత మాత్రాన సదాశయాలు కావని భావించడం తగదు.
      పరిస్థితుల ప్రభావానికి భగవంతుడంతవాడు లొంగుతూ ఉంటాడు. అలాగే సినిమా పరిశ్రమ పరిస్థితులూ పద్ధతులూ, సినిమావారు అనుసరించిన పద్ధతుల వల్ల ఏర్పడినవే అయినా మళ్లీ వాటిని ఎదుర్కొని సంస్కరించుకోవడం అనుకునేంత సులభం కాదు మరి. అయినా ఉన్న అన్ని రంగాలలోనూ - పెద్ద పెద్ద జలపాతాలను భరిస్తూ, ఉత్పాతాలవంటి నష్టాలను భరిస్తూ, ప్రవాహానికి ఎదురీదుతూ, ఎన్నో ప్రతికూల శక్తులను ఎదుర్కొంటూ, మరొక పక్క జీవనం సాగిస్తూ తలపెట్టిన పని సాధించడం అనేది చలనచిత్ర నిర్మాణ యజ్ఞంలోనే ఎక్కువగా ఉన్నదని నా నమ్మకం. ఇక్కడే కఠినమైన పరీక్షలు ఉంటాయని నా నమ్మకం.
      అందువల్ల, కొందరు ‘సినిమా భూలోక స్వర్గం’ అంటున్నప్పుడు (స్వర్గంలో సర్వం సుందరంగా లోపరహితంగా ఉంటుందన్న నమ్మకంతో) నేను నవ్వుకుంటాను;
      కొందరు సినిమా స్థితిగతులు తెలుసుకోకుండా మిగతా రంగాలతో దీనిని పోల్చి చూడకుండానే ఇది మంచీ మర్యాదలేని చోటు అని అపనింద వేస్తున్నప్పుడు బాధపడతాను.
      కొందరు పెద్దలు, నాయకులూ ఏడాదికొకమారైనా సినిమాకు పోకపోయినా, సినిమాలు దేశాన్ని భ్రష్టం చేస్తున్నాయి అనీ.. అవినీతిని పెంచుతున్నాయి అనీ తీవ్రంగా ఖండిస్తే ఆశ్చర్యపోతాను.
      సాధక బాధకాలు, మంచిచెడ్డలు అర్థం చేసుకోకుండా ఒక వృత్తిలో ఒక రంగంలో ఉన్నవారు మరొక రంగాన్ని చులకన చేయడం, విమర్శించడం భావ్యం కాదు.
మానవులందరూ సమానులని ఒప్పుకుంటూ, భగవంతుడు ఒకడే అని చెప్పుకుంటూ ఒక మతం వేరొక మతాన్ని, ఒక జాతి మరొక జాతిని తేలికగా చూసి హేళన చేయడం విమర్శించడం వంటిదే ఇది.
      ఇంతకీ విమర్శించేవారు - సినిమా తమ అందరి జీవితాలను హృదయాలను ప్రతిబింబించేదని గుర్తు చేసుకోవాలి. అందుకనే ప్రపంచమంతటా కోట్లాది ప్రజలు దీనిని ఆదరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అందువల్ల దానికి హాని కలిగేలా విమర్శించడం తమను విమర్శించుకోవడమే.
      ఒక రంగంలోని వారు తమ విశ్వాసాలనూ, మార్గాలనూ పవిత్రంగా ఎంచుకొంటున్నట్టే సినిమాలో ఉన్నవారికీ గొప్పవైన విశ్వాసాలూ, ఉన్నతమైన లక్ష్యాలూ, ప్రశస్తమైన మార్గాలూ ఉంటాయి.
      రాజకీయ నాయకుడికి అతని విశ్వాసాలు లక్ష్యాలూ భగవంతుడు అయితే, నా మటుకు నాకు నా కళపట్ల, వృత్తిపట్ల నాకుగల విశ్వాసమే దైవం. నేను నా కళను ఆరాధించే ప్రదేశమే స్వర్గం. అందులో తిరిగేవారే దేవతలు.


వెనక్కి ...

మీ అభిప్రాయం