మల్లెలు తూరుపెత్తిన ‘వేణు’గానం

  • 293 Views
  • 10Likes
  • Like
  • Article Share

    నాగరాజ పరాంకుశ

  • ఉపాధ్యాయులు, పుంగనూరు
  • చిత్తూరు జిల్లా
  • 9963460211
నాగరాజ పరాంకుశ

తన రచనలనే ఛాయాచిత్రాలుగా మలచి పల్లె బతుకుల్లోని వెలుగునీడలను ప్రభావవంతంగా ఆవిష్కరించారు సి.వేణు. ఒకనాటి రాయలసీమ.. ముఖ్యంగా చిత్తూరు జిల్లా జానపద జనజీవనాన్ని పట్టిచూపించే ఆయన కథలు, కవితలు ఈనాటికీ చెక్కుచెదరని అక్షరశిల్పాలే! ‘‘భావవేదికపైన కథలు పాడేవాడా... పదిమంది మనసులకు ప్రమిదమిచ్చేవాడా... కలికికోయిల పాటల రుచులు ఎరిగినవాడా... కమ్మతెమ్మరవంటి నెమ్మనము కలిగినవాడా’’ అన్న మధురాంతకం రాజారాం మాటలు వేణు రచనాశైలితో పాటు ఆయన వ్యక్తిత్వానికీ అద్దంపడతాయి. 
తెలుగునాట
మిగిలిన ప్రాంతాల కంటే చిత్తూరు జిల్లాలో కథా ప్రక్రియ కొంత ఆలస్యంగానే మొదలైంది. కె సభా, మధురాంతకం రాజారాం, సి.వేణు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య తదితర తొలితరం రచయితలు ఇక్కడి గ్రామీణ వాస్తవాలకు కథల రూపమిచ్చారు. క్షామంతో ఎండిపోతూ, వానొస్తుందా అని ఆకాశంవైపు మోరలెత్తి ఎదురుచూస్తూ సాగిపోయే రైతులతో మమేకమైపోయి, వారి యాసలోనే కథలను సృజించారు. వీళ్లలో సి.వేణు చదువుకునే రోజుల్లోనే చిత్తూరు నగరం మీద ఓ విప్లవ కవిత రాసి కారాగారవాసం అనుభవించారు. బడికి ఖద్దరు టోపీ పెట్టుకుని వెళ్లినందుకు వారంపాటు తరగతుల నుంచి బహిష్కృతులయ్యారు. అలా దేశభక్తి భావాలతోనే పెరిగి పెద్దవాడైన సి.వేణు తర్వాత కాలంలో ఉపాధ్యాయుడుగా గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్దారు. బోధనను, సాహితీ సృజనను సమాంతరంగా కొనసాగించిన ఆయన దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు తీరికలేని జీవితాన్ని గడిపారు. 
      వేణు స్వభావమే గ్రామీణం. ఆయన మనసే పచ్చనిపైరు. ‘‘పొద్దుగట్లా నిద్దర్లేసి యాప్పుల్తో పల్దోమి, సెరువుకాడిబోయొచ్చినాక మొగంగడుక్కుని, నాయాల్ది జేసిన యేడేడి కూడింతదిని, దెల్లార్తే రెడ్డోరి మడికాడ్కిబోతే మల్లొచ్చేది పొద్దుగూకేప్పటికే’’ అంటూ సాగే చిత్తూరు గ్రామీణ యాస ఆయన కథల్లో జీవనదిలా పారుతుంది. వేణు కథకుడే కాదు, మంచి కవి కూడా. ‘‘కానల్లో, కొండల కోనల్లో/ గడ్డీగాదం మొలవని/ గొడ్డుబోతు గుండెల్లో/ కాంతిరేఖ మొలకెత్తేదెప్పుడు?’’ అంటూ నీటిచుక్క కోసం అల్లాడే రాయలసీమ వెతల నుంచి విభిన్నాంశాల మీద కవితలు సృజించారాయన. 
కులాన్ని దాటి...
ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్య పదాతిదళాలు వేలూరు కోట నుంచి చిత్తూరు- బెంగళూరు మార్గంలో అనేక గ్రామాలను దాటుకుంటూ తిరుపతికి వచ్చేవి. ఆ దారి మధ్యలోని పల్లెల్లో ఒకటి ‘మండి కృష్ణాపురం’. విజయనగర సేనలకు చెందిన అనేక వస్తువులు, ఆయుధ సామగ్రిని కృష్ణాపురంలో ఒకచోట నిలవుంచేవారు. గ్రామీణులు దాన్ని ‘మండీ’ అని పిలిచేవారు. క్రమంగా అది ‘మంది’ అయ్యింది. ఊరు పేరు కూడా ‘మంది కృష్ణాపురం’గా మారింది. ఆ గ్రామంలోని ఓ సాధారణరైతు కుటుంబంలో వేణు జన్మించారు. స్వగ్రామానికి సమీపంలోని బొమ్మ సముద్రంలో ఏడో తరగతి చదివేటప్పుడు శంకరంబాడి సుందరాచారి బోధనలతో తెలుగు మీద మమకారం పెంచుకున్నారు. మధుర గాయకుడు ఎ.ఎం.రాజా ఆ సమయంలో వేణు సహచరుడు. ఎనిమిదో తరగతికి చేరే సరికే గాంధీ భావాలు ఆయనలో నాటుకుపోయాయి. అస్పృశ్యతను నిరసిస్తూ హరిజనవాడలో నీళ్లుతాగారు. దానికి పెద్దవాళ్ల మందలింపులను ఎదుర్కోవాల్సి వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. తర్వాత కాలంలో కులాన్ని సూచిస్తుందని తన పేరునే కుదించుకున్నారు. సీకల వేణుగోపాలరెడ్డి ‘సి.వేణు’ అయ్యారు. ఈ పేరుతోనే సాహితీలోకంలో గుర్తింపు పొందారు. 
      వేణు చిత్తూరులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. ఆ సమయంలోనే నాటి చిత్తూరు ఎంపీ పొలకల నర్సింహారెడ్డి సారథ్యంలో వెలువడుతున్న ‘నాగేలు’ పత్రికకు ‘చిత్తూరు’ పేరిట ఓ కవితను పంపారు. నగరంలో జీవనం ఎంత ప్రమాదకరంగా మారిందో చెబుతూ, ప్రజల సంక్షేమం కోసం పాలకులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అందులో ప్రశ్నించారు వేణు. ప్రభావపూరితమైన శైలిలో సాగిన ఆ కవిత చూసి పోలీసులు మండిపడ్డారు. ‘‘ఎద్దుకాల్లో ముల్లంత లేవు... రెచ్చగొట్టేలా రాస్తావా’’ అంటూ వేణును తీసుకెళ్లి కారాగారంలో పడేశారు. ఆ దశలోనే ఆయనలోని కవి ఆవిష్కృతమయ్యాడు. వాస్తవానికి ఆయన కవి కాకముందే మంచి వక్తగా, గాయకుడిగా పేరుపొందారు. అసాధారణమైన వేణు వాక్చాతుర్యాన్ని గమనించి అధ్యాపకులూ ప్రోత్సహించారు.
ఎన్జీ రంగా అభినందన
స్వాతంత్య్రోద్యమం బలంగా సాగుతున్న ఆ రోజుల్లో ఆచార్య ఎన్జీ రంగా రాజకీయ శిక్షణ శిబిరాలు యువకులను బాగా ప్రభావితం చేసేవి. అలాంటి ఓ శిబిరం అరగొండలో ఏర్పాటైంది. ఈ సభలో వేణు వినిపించిన ‘పెట్టవోయ్‌ పొలికేక’ గీతం యువత రక్తాన్ని వేడెక్కించింది. ‘‘పెట్టవోయ్‌ పొలికేక... ఊదవోయ్‌ తొలిబాకా/ ముందుకే... ముందుకే... ముందుకే నీ నడక/ ఆబోతులే ప్రళయఘీంకారములు చేసె/ వడిసెలలో రాయి రివ్వురివ్వున మ్రోసె/ పంటలే విప్లవగీతాలు పాడాయి/ మ్రోడులే రాజుకుని మంటలు రేపాయి/ పలుగులతో కులగిరులు దుల్ల పొడువగదోయి/ హలముతో లోకాలు చీల్చి మీరగదోయి’’... అంటూ సాగే ఈ గేయాన్ని వేణునే రాసి పాడారు. ఎన్జీ రంగాకు బాగా నచ్చడంతో ఈ పాటను ఉద్యమగేయంగా స్వీకరించారు. 
      ఉపాధ్యాయ శిక్షణ అయ్యాక తెలుగు పండిత పట్టా కోసం ప్రాచ్య కళాశాలలో ప్రైవేటుగా చదివారు వేణు. అప్పటికే మంచి కథకులైన పలువురి దగ్గర శిష్యరికం చేశారు. సహజపండితుడు పైడిపాటి అప్పిరెడ్డి, పూతలపట్టు శ్రీరాములురెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, ‘వ్యాకరణకేసరి’ చేబ్రోలు సుబ్రహ్మణ్యంశర్మల దగ్గర అప్పట్లో నేర్చుకున్నవి తన రచనా జీవితాన్ని ములుపు తిప్పాయని వేణు చెబుతుంటారు. అలా ఆయన ప్రైవేటుగానే చదివి ‘విద్వాన్‌’ వేణు అయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయనలోని కథకుడు సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.
ఆణిముత్యాల్లాంటి కథలు
సి.వేణు 1961లో తన మొదటి కథ ‘మారెమ్మగుడి’ రాశారు. ఇందులో నాయిక గంగు ఓ రైతు కూతురు. మల్లు అనే యువకుణ్ని ప్రేమిస్తుంది. అయితే, ఊరి కామందు కొడుకు రాఘవులు పట్నంలో చదువుకుంటూ, పల్లెకొచ్చి గంగును మోహిస్తాడు. సమయం  చూసి ఆమెను కాటేస్తాడు. ఆ బాధతో గంగు నీళ్లు లేని బావిలోకి దూకి మరణిస్తుంది. ప్రేయసి చావు చూసి తట్టుకోలేక మల్లు కూడా అదే బావిలోకి దూకుతాడు. విషాదాంతమైన ఈ కథలో నాయకానాయికల ప్రేమ సన్నివేశాలను వర్ణించిన తీరు, కథను కక్షల మధ్య నుంచి కారుణ్యం వైపు నడిపించిన ఒడుపు అద్భుతంగా ఉంటుంది. ‘‘కొష్ఠముల్లో పశువుల పలుపులు సడలించి మందబైలుకు తోల్తున్నారు. కుమ్ముకోవటాలు, తుమ్ముకోవటాలు, అంబా!యని పిలుచుకోవటాలు, లేగల కుప్పిగంతులు, చితచితలాడే చిత్తడితో, తొక్కిడితో తొణికిసలాడే జీవకళతో ఆ వుదయం సుప్తావస్థను వీడి కనులువిప్పింది. చారికలు గట్టిన క్షీరధారలను తుడుచుకుంటూ పాలునిండిన ‘పిళదుత్తల్ని’ యింటికి తెస్తున్నారు పాలేళ్ళు’’ అంటూ సాగే వేణు రచనాశైలి పాఠకుణ్ని వెంటనే గ్రామీణ వాతావరణంలోకి తీసుకెళ్లిపోతుంది. ‘ఆంధ్రప్రభ’ కథల పోటీకి వెళ్లిన ఈ కథను చూసి, ఎంతో వైవిధ్యంగా ఉందని  తిరుమల రామచంద్ర ప్రశంసించారు. వేణు రెండో కథ ‘నవ్విన ధాన్యరాశి’ ఆంధ్రప్రభ దీపావళి కథలపోటీలో మొదటి బహుమతి పొందింది. ఈ రచనతో కథకుడిగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ‘‘ఈ ప్రాంతపు సాహితీ వికాసానికి మీ ‘నవ్విన ధాన్యరాశి’ ఒక మజిలీ. తియ్యందనాలకు మీ కలం కాణాచి. మీరు మట్టిని సైతం బంగారంగా మార్చగలరు’’ అంటూ మధురాంతకం రాజారాం వేణును అభినందించారు. ఈ ‘నవ్విన ధాన్యరాశి’ని బాలశౌరిరెడ్డి హిందీలోకి అనువదించారు.
కథారచన ప్రారంభించిన తొలిరోజుల్లో సి.వేణు ప్రధాన వస్తువు ప్రేమ. అయిదారు దశాబ్దాల కిందట గ్రామాల్లో అభ్యంతరాల మధ్య పెనవేసుకుపోయే ప్రేమలను ఆయన ఒడిసిపట్టుకున్నారు. పచ్చనిపైర్లు, కొండవాగులు తదితర పల్లె అందాలన్నింటినీ ఆయన తన కథానాయికకు అలంకరిస్తారు. గ్రామాల్లో జరిగే పందెపు ఆటల మొనగాళ్లు, ఒక్కచేత్తో సేద్యాన్ని నడిపించి, ధాన్యపురాశుల మధ్య బతుకులీడ్చే సాధారణ రైతు యువకులే ఆయన కథానాయకులు. వాస్తవానికి వేణు రాసిన కథలు తక్కువే. వాటిలో తొలి రెండు కథలైన ‘మారెమ్మగుడి, నవ్విన ధాన్యరాశి’లు అమాయక ప్రేమల విషాద ముగింపులతో గుండెను గొంతులోకి తెస్తాయి. వేణు కథలన్నింటినీ రెండు సంపుటాలుగా ఆయన కుమారుడు భానుమూర్తి వెలువరించారు. తొలిసంపుటి ‘నవ్విన ధాన్యరాశి’లో పన్నెండు కథలుంటాయి. ‘చంద్రగిరి దండుబాట, కనువిప్పు, చితాభస్మం, మూడుతరాలు, రెడ్డప్పతీర్పు, గూడుచేరిన పిట్ట’ లాంటి ఇందులోని కథలు పాఠకులకు అలనాటి సంగతులను ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. మరో సంపుటం ‘అక్షరభిక్ష’లోని కథలూ వైవిధ్యంగా సాగుతాయి. ‘‘సి.వేణు కలాన్ని చేతబట్టి మరిన్ని కథలు వ్రాయడానికి కూర్చుంటే పాఠకలోకం ఇతణ్ణి వద్దన్నా ప్రథమశ్రేణి కథల రచయితల్లోకి నెట్టేస్తుంది’’ అని ఆచార్య జీఎస్‌ రెడ్డి లాంటి వారు ప్రశంసించినా... వాసే ముఖ్యమనుకున్నారో ఏమోగానీ, రాశి గురించి వేణు ఆలోచించలేదు. అందుకేనేమో, ‘‘వేణు కథలు చదివినంతసేపూ నాకు వర్డ్స్‌వర్త్‌ రాసిన మైకేల్‌, లూసీగ్రే కవితలు  చదువుతున్నంత అనుభూతి కలిగేది’’ అనేవారు మధురాంతకం రాజారాం. పల్లె పెద్దల బతుకుల్లోని లొసుగులు, పేదల ఇళ్లలోని ఆప్యాయతలు, సామాజిక కట్టుబాట్లు.. ఇవన్నీ వేణు కథల్లో కనిపిస్తాయి. అలాగే, తరచూ కరవు బారినపడే రాయలసీమ రైతుల వెతల్ని కథలుగా మలచిన రచయితల్లో వేణు ముఖ్యులు. ‘వానొచ్చె గంగు’ లాంటి కథలు ఇందుకు తార్కాణాలు. 
కవిగా... గురువుగా...
వేణు కథల్లో మాదిరిగానే కవితల్లో కూడా పూర్తిగా తెలుగుదనం కనిపిస్తుంది. ‘‘ఈనాటివారా తెలుగువారు/ రెండువేలేండ్ల కావల/ రాజ్యరమను ఏలినవారు/     ఈనాటివారా? తెలుగువారు??/ ధార్మికుడు, దక్షుండు/ నిర్మాణ కుశలుండు/ నిత్యకళ్యాణమ్ము పచ్చతోరణముగా/ దేశమును నిర్మించినాడు తెలుగోడు’’ అంటూ జాతికేతనాన్ని ఎగరేస్తారాయన. ‘‘ఆమె వచ్చిందంటే/ ఎంతో సందడి.../ అశోక, పలాశ వృక్షాల/ తలలూగుతాయి/ కోయిలల కుహు కుహూరాగాలు/ వనాంతరాలను మేలుకొలుపుతాయి’’ అంటూ మైమరిచిపోతారు. ‘‘ప్రభాతసమీరం గిలిగింతలు పెట్టే/ నా రతనాలసీమలో/ నన్ను జీవింపచేసే కవితనై/ మనుగడ సాగించాలని ఉంది/ ఉచ్ఛ్వాస, నిశ్వాసాల మధ్య/ కవితనై ఆవిర్భవించాలనుంద’’ని కోరుకుంటారు. వేణు కవితలన్నీ ‘మల్లెలు తూరుపెత్తిన వేళ’గా సంకలనమయ్యాయి. కథలు, కవితలతో పాటు ఇతర ప్రక్రియల్లోనూ రచనలు చేశారు. ‘బాపూ దండకం’, ‘బాలభటుడు’ గేయసంకలనాలను వెలువరించారు. ‘తెలుగు పలుకుల వేల్పుగిడ్డి సురవరం ప్రతాపరెడ్డి’, ‘ఆదర్శ అధ్యాపకుడు కొండా మునిరెడ్డి’ అనే రెండు జీవితచరిత్రలు, ‘కాలచక్రం, బడిపంతులు’ నాటకాలనూ రచించారు. 
 ఉపాధ్యాయుడిగా సి.వేణు ఎక్కడ పనిచేసినా, ఆయా ప్రాంతాల జానపదుల పాటలను నమోదు చేసేవారు. అలాగే ప్రతి బడిలోనూ పిల్లల కోసం కథల పత్రికను నడిపేవారు. చిన్నపిల్లలకు కథలతో మంచిని బోధించేవారు. కొత్తపల్లి గ్యారంపల్లి, ఎర్రచెరువుపల్లి, శ్రీరంగపల్లి పాఠశాలల్లో వేణు కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత బొమ్మ సముద్రం ఉన్నతపాఠశాలలో బాధ్యతలు నిర్వహించారు. అనంతరం కలిచెర్లకు వెళ్లారు. అక్కడి ప్రజానాయకుడు కలిచెర్ల సుధాకరరెడ్డి సాయంతో స్థానిక విద్యావ్యవస్థను తీర్చిదిద్ది ‘బడే ఆద్మీ’గా పేరుపొందారు. 
      సి.వేణు, జయలక్ష్మి దంపతులకు ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు. ప్రస్తుతం వాళ్లంతా బెంగళూరులో స్థిరపడ్డారు. వేణు కూడా అక్కడే పిల్లలతో పాటు ఉంటున్నారు. తొంభై ఏళ్లకు పైబడిన వయసులోనూ ఆయన ఇప్పటికీ కలాన్ని పక్కనపెట్టేయలేదు. అలా అస్త్రసన్యాసం చేయడం ఆయనకు అసాధ్యం కూడా! 
పల్లెపదాలను ఒకనాడు రసరమ్యంగా పలికించిన ఆ వేణువు ఇప్పటికీ సాహితీ బృందావనంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది!!


వెనక్కి ...

మీ అభిప్రాయం