యెంత మంచి దాతకరువన్నా!

  • 588 Views
  • 2Likes
  • Like
  • Article Share

    ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
  • అనంతపురం
  • 9440222117
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

ఎటుచూసినా నెర్రెలిచ్చిన నేల, మోడువారిన చెట్లు, అస్థిపంజరాలు బయటపడ్డాయా అన్నట్లున్న జీవజాలం, వీచే వేడిగాలి, తాగేందుకు సైతం నీళ్లు దొరకని స్థితి, అక్కడక్కడా పడి ఉన్న జంతువుల కళేబరాలు, వాటిని తినేందుకు పొంచి ఉన్న రాబందులు, శ్మశాన నిశ్శబ్దం... ఇది కరవుబారిన పడిన ప్రాంతం నైసర్గిక స్వరూపం. మనదేశం వ్యవసాయ ప్రధాన దేశం. పంటలు బాగా పండాలంటే వర్షాలు పుష్కలంగా కురవాలి. మనదేశంలో నీటికి జూన్‌ సెప్టెంబరు నెలల మధ్య వర్షాన్నిచ్చే నైరుతి రుతుపవనాలే ఆధారం. ఏ కారణంచేతనైనా అవి విఫలమైతే సేద్యం గిడసబారుతుంది. తద్వారా దేశ సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో సంక్షోభం అలుముకుంటుంది. వర్షపాతంలో తగ్గుదల అలాగే ఒకటి రెండేళ్లు కొనసాగితే పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయి. వాతావరణం పొడిబారుతుంది. నెమ్మదిగా కరవు పరిస్థితులు ముమ్మరిస్తాయి.
      దేశంలో దాదాపు సగానికి పైగా భూభాగం కరవుబారిన పడుతుందని అంచనా. అయితే కొన్ని ప్రాంతాలు మాత్రం తరచుగా కరవు ప్రభావానికి లోనవుతాయి. అలాంటివాటిలో ఒకటి రాయలసీమ. దేశంలో వచ్చిన కరవులకు సంబంధించి సమాచారం రెండువేల ఏళ్ల కిందినుంచి తెలుస్తోంది. అయితే, బ్రిటిష్‌పాలన స్థిరపడ్డాక 1775 నుంచి 1943 బెంగాల్‌ కరవు వరకు ఎన్నో కరవులు మనదేశాన్ని పట్టిపల్లార్చాయి. వర్షాలు సరిగా కురవకపోవడం ఒక కారణం కాగా, తమ ఆర్థిక ప్రయోజనాలే తప్ప, ఈ దేశ ప్రజల ఇక్కట్లు పట్టని వలసపాలన ఈ వైపరీత్యానికి ప్రధాన కారణం. ఆంగ్లేయుల 190 ఏళ్ల పాలనలో కరవుకాటుకు గురై మరణించినవాళ్ల సంఖ్య ఆరుకోట్లు ఉంటుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలా వచ్చిన వాటిలో 1876- 78ల మధ్య సంభవించిన ధాతకరవు ముఖ్యమైంది. స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రల పుటలు తిప్పితే ధాతకరవు ప్రస్తావన తరచుగా కనిపిస్తుంటుంది. ఇది హైదరాబాదు సంస్థానం, మద్రాసు మైసూరు బొంబాయి ప్రెసిడెన్సీలు, యునైటెడ్‌ ప్రావిన్సెస్, రాజస్థాన్‌ ప్రాంతాలను పీడించింది. దీని తీవ్రతకు 55 లక్షల ప్రాణాలు తుడిచిపెట్టుకు పోయాయట! దీని ఆర్థిక, సామాజిక ప్రభావం, సంభవించిన దైన్యం ‘యెంత మంచి ధాత కరువన్నా!’ పాట రూపంలో సీమలో ప్రాచుర్యంలో ఉంది.
యెంత మంచి దాతకరువన్నా!
భూమిలో జనులకు యేమి కష్టము కలిగెరోరన్నా    ।।యెంత।।
మూడురూపాలిస్తమంటే ముప్పావు కొర్రాలివ్వరూ
పది రూపాలిస్తమంటే పావు జొన్నాలివ్వరన్నా    ।।యెంత।।
సేరు బంగారిస్తమంటే సేరు రాగూలిచ్చిరన్నా
సేరుయెండీ యిస్తమంటే సేరు జొన్నాలిచ్చిరన్నా    ।।యెంత।।
సేరు గింజలిసురుకోనీ అంబలైనా గాసుకుంటే
మంచిమంచికి వంతులేస్తే గరిటెడైనా రాదురన్నా     ।।యెంత।।
సేసుకొన్నా పెండ్లాలను సెట్లకిందా పండబెట్టి
సెప్పకుండా పారిపొయ్యే సెడ్డకాల మొచ్చెరన్నా    ।।యెంత।।
కలిగినమ్మా కనికరించీ పిడికెడన్నం పిలకు బెడితే
కన్నబిడ్డల డొక్క జించే కానికాల మొచ్చెరన్నా    ।।యెంత।।

      రెండు మూడు వందలేళ్లుగా సీమది కరవుల చరిత్రే. బ్రిటిష్‌ పాలనా కాలం నుంచి వీటి తీవ్రత అధికమైంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ప్రాంతాన్ని కరవు పలకరిస్తుంది. వీటిలో సాధారణమైనవి కొన్నయితే, అసాధారణమైనవి ఇంకొన్ని. కరవు ఉచ్ఛదశలో ఉన్నప్పుడు అక్కడి దృశ్యాలను పరికిస్తే జుగుప్స కలుగుతుంది. అలాంటి బీభత్సకర కరవుల్లో ఈ ‘ధాత’కరవు అగ్రగామి. దీన్నే ‘డొక్కల కరవు’ అని కూడా వ్యవహరిస్తారు. ‘ధాత’నామ (1876) సంవత్సరంలో వచ్చింది కనుక, దీనికాపేరు. ‘ధాత’ అంటే పోషించేవాడు. కానీ ఆ సమయంలో ఇక్కడివాళ్లకు ‘ధాత’ కరవయ్యాడు. ప్రభుత్వం ప్రయత్నం చేసినా చేయగలిగింది కొంతే. రెండేళ్లు (1876- 78) కొనసాగిన కరవు మూలాలు ఒక ఏడాది ముందూ (1875-76), ప్రభావం ఓ ఏడాది తర్వాతా (1878-79) ఉన్నాయి.
      దీనివల్ల దత్తమండలం నిర్మానుష్యమయింది. 1876-77లో సాధారణ వర్షపాతంలో సగం కంటే తక్కువ కురిసింది. 1877-78లో ఆ మాత్రమూ కురవలేదు. జనం తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. అవసరానికి తగిన సరఫరా లేకపోవడంతో ధరలు చుక్కలనంటాయి. డబ్బు విలువ పడిపోయింది. ఉన్నదంతా అమ్ముకున్నా బతుకు గడవడం కష్టంగా మారింది. 
      కరవువల్ల పంటలు పండలేదు. పండిన గింజలు ప్రజలకు అందుబాటులో లేవు. కొనుక్కొని గంజి కాచుకొని తాగి ప్రాణం నిలుపుకుందామంటే అలవిగాని ధరలు. అంతో ఇంతో డబ్బు, బంగారు, వెండి ఉన్నవాళ్లకు కూడా అందనంతగా పెరిగిపోయాయి ధరలు. ఈ స్థితిలో మొదటి రెండు చరణాలు కరవు కలిగించిన ఆర్థిక సంక్షోభాన్ని వర్ణించగా, మూడో చరణం అది సృష్టించిన జీవన దైన్యాన్ని, నాలుగు అయిదు చరణాలు జీవన బీభత్సాన్ని ఆవిష్కరించాయి.
      మూడు రూపాయలిస్తామన్నా ముప్పావు కేజీ కొర్రలు, పది రూపాయలిస్తామన్నా పావుకేజీ జొన్నలు ఇవ్వలేదు వ్యాపారులు. ఉన్న డబ్బులు ఖర్చయిపోగా, సేరు బంగారానికి బదులుగా (24 తులాలు) సేరు రాగులు (కిలో కంటే కొంచెం ఎక్కువ) ఇచ్చారు. సేరు వెండికి బదులుగా సేరు జొన్నలు ఇచ్చారు. ఇది కరవు సృష్టించిన ఆర్థిక సంక్షోభం. 1878లో ఒక రూపాయి అంటే సామాన్యమేమీ కాదు. అప్పటి లెక్కల ప్రకారం సాధారణ పరిస్థితుల్లో కనీసం సగం మూట కొర్రలు వచ్చేవి. అలాంటిది మూడు రూపాయలకు ముప్పావు కిలో అంటే చాలా ఎక్కువ ధరే. జొన్నలు ఇంకా ఎక్కువ. 240 గ్రాముల బంగారం ఇస్తే కానీ సేరు రాగులు వచ్చేవికావు. ఇప్పుడు తులం బంగారం వేలల్లో ఉంది!
      ఇక కరవు సృష్టించిన జీవన దైన్యం... అంత ఖర్చుపెట్టి కొనుక్కొచ్చిన సేరు గింజల్ని ఉడికించి గంజి కాచుకుంటే ఇంట్లో ఉండేవాళ్లందరికీ సరిపోదు. మనిషికి ఒక గరిటె కూడా దక్కలేదు. ఆకలి అన్ని బంధాలనూ, సంబంధాలనూ తెంచి పారేస్తుంది. బీభత్సాన్ని సృష్టిస్తుంది. 
      ఉన్నవన్నీ అమ్ముకొని గంజి తాగి బతకడానికి కూడా వీలులేని స్థితిలో కుటుంబానికి మిగిలింది వీధిలో పడటమే. అంతపనీ చేసినా కరవులో ఆదుకొనేదెవరు? భార్యాబిడ్డలను సంరక్షించాల్సిన వ్యక్తి కరవు కారణంగా పెళ్లాన్ని ఎక్కడైనా ఓ చెట్టుకింద నిద్రపుచ్చి తప్పించుకుపోవాలనుకున్నాడు. ఎంతఘోరం! భార్యను నడి దారిలో వదిలేసి పలాయనం చిత్తగించే దుస్థితి కల్పించింది ‘ధాత’కరవు. అంతకన్నా దారుణమైన అంశం ఉన్నదంతా కరిగిపోతే యాచనచేసి కడుపు నింపుకునే స్థితి రావడం. అప్పుడైనా తినేంత భిక్షం దొరకదు. కన్న కొడుక్కి ఎవరైనా కలిగినమ్మ తినేందుకు ఇంతపెడితే, ఆకలి భరించలేని తండ్రి ఆ మెతుకులనూ లాక్కుని తినే పరిణామం భీతావహం. 
      ఈ పాట ఓ కరవు ఇతిహాసం. ఇందులో అలంకారాలు, భావచిత్రాలు, ప్రతీకలు లేవు. ‘మనిషి’ అనే పదాన్ని ‘మంచి’ అని ఉచ్చరించే జానపదులు పలికిన పాట రాయలసీమ నిర్దిష్ట జీవన సమరానికి అక్షరచిత్రం.


వెనక్కి ...

మీ అభిప్రాయం