సాహిత్యంపై‘మనసు’నిస్వార్థ తపస్సు

  • 527 Views
  • 6Likes
  • Like
  • Article Share

    సీహెచ్‌.వేణు

  • హైదరాబాదు,
  • 9177004844
సీహెచ్‌.వేణు

సాహిత్యం అజ్ఞాన తమస్సును హరిస్తుంది. మనిషి మస్తిష్కంలో చైతన్య దీపాలు వెలిగిస్తుంది. జీవితాన్ని అర్థవంతంగా మారుస్తుంది. మదిలో ఆనందాన్ని, గాఢమైన అనుభూతులను నింపుతుంది. తెలుగువారికి అలాంటి అక్షరాల విందులను అందించి, మన సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన గొప్ప రచయితలెందరో ఉన్నారు. నేటి తరానికి వారి రచనలను అందించడం ఎలా? ఈ బృహత్‌ బాధ్యతను భుజాన వేసుకుని చిరకాలం గుర్తుండిపోయే సాహితీ సేవ చేస్తోంది ‘మనసు ఫౌండేషన్‌’. 
‘మంచి మానవ సమాజం కోసం మినహాయింపులు లేని జ్ఞాన సేకరణ జరగాలి. అది వితరణ కావాలి’.. ప్రచురణ రంగంలో 2006లో కొత్త కెరటంలా దూసుకొచ్చిన స్వచ్ఛంద సంస్థ ‘మ.న.సు. ఫౌండేషన్‌’ నినాదమిది. ఈ సంస్థ పూర్తి పేరు.. ‘మన్నం నరసింహం, సుబ్బమ్మ ఫౌండేషన్‌’. ముగ్గురు సోదరులు కలిసి దీన్ని స్థాపించారు. వారిలో అగ్రజుడు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరు, వ్యాపారవేత్త మన్నం వెంకట రాయుడు. మిగిలిన ఇద్దరూ హైదరాబాదుకు చెందిన ప్రముఖ హృద్రోగ శస్త్రచికిత్స నిపుణులు, స్టార్‌ ఆస్పత్రుల మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా।। మన్నం గోపీచంద్‌; పాత్రికేయులు, ప్రచురణకర్త డా।। మన్నం చంద్రమౌళి. వృత్తిరీత్యా సాంకేతిక నిపుణులైన రాయుడుకు సాహిత్యం, సినిమా, సమాజ సేవ అంటే ఇష్టం. ఆ అభిరుచికి తమ్ముళ్ల సహకారం తోడై మనసు ఫౌండేషన్‌ పురుడుపోసుకుంది. 
      తెలుగు భాషాసాహిత్యాలను సుసంపన్నం చేసిన రచయితల సమగ్ర రచనలను సేకరించి ముద్రించటం, ఆ సంపుటాలను అతి తక్కువ ధరకు పాఠకులకు అందించడం ‘మనసు ఫౌండేషన్‌’ చేస్తున్న కృషిలో విశిష్టమైంది. అలాగే తెలుగు కథలను ఉచితంగా అంతర్జాలంలో అందుబాటులో ఉంచటం, పందొమ్మిదో శతాబ్దానికి ముందు తెలుగు సమాజాన్ని ప్రతిఫలించిన రచనలను వెలుగులోకి తేవడం, తెలుగులో అచ్చయిన ప్రతి పుస్తకానికీ డిజిటల్‌ రూపం ఇవ్వటం, ఇతర భాషల్లోని గ్రంథాలను తెలుగులోకి తీసుకురావడం, తెలుగు సినిమా సమగ్ర సమాచారాన్ని సేకరించి డిజిటలీకరణ చేయడం (ఈ-చిత్రపురి), డాక్యుమెంటరీల నిర్మాణం, గ్రామీణాభివృద్ధి తదితరాలు ఈ సంస్థ నిర్దేశించుకున్న ముఖ్య కార్యక్రమాలు. 
నిరంతర యజ్ఞం
చిన్నప్పటి నుంచీ పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఉన్న రాయుడు, బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) విద్యార్థిగా ఉన్నప్పుడు షేక్‌స్పియర్‌ రచనా సర్వస్వం చదివారు. తెలుగు రచయితల రచనలూ అలా సమగ్రంగా అందుబాటులో ఉంటే  బాగుంటుందనిపించింది. ఆ ఆలోచన ఆయన మదిలో గట్టి ముద్రవేసుకుంది. అందులో భాగంగానే తన మిత్రుడు, ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత డా।। నరేంద్రనాథ్‌ ఆర్థిక సాయంతో 1998-99లో కాళీపట్నం రామారావు రచనా సర్వస్వాన్ని ప్రోగ్రెసివ్‌ పబ్లికేషన్స్‌ పేరుతో ముద్రించారు. ఒక విధంగా ‘మనసు ఫౌండేషన్‌’ ఆలోచనకు అప్పుడే బీజం పడింది. ‘రచనల సర్వస్వం’ అనే పేరును రచయిత ముళ్లపూడి వెంకటరమణ సూచించారు. 2006లో మనసు ఫౌండేషన్‌ ఏర్పడిన తర్వాతి నుంచి వరుసగా రచనా సర్వస్వాలు ముద్రించుకుంటూ వస్తున్నారు. గుంటూరు అరండల్‌పేటలో ఈ సంస్థ కార్యాలయం ఉంది. 
      ఫౌండేషన్‌ తరఫున 2007లో తొలిసారి రావి శాస్త్రి ‘రచనా సాగరం’ ముద్రించారు. తర్వాత ఆయన మరికొన్ని రచనలతో రెండో ప్రచురణ వెలువరించారు. ఒంగోలు ప్రాంత మాదిగల జీవితాల గురించి సామాజిక, మానవ శాస్త్రాల దృక్కోణంలో 1899లో ఎమ్మా రోషాంబు క్లౌ రాసిన ఆంగ్ల గ్రంథానికి వివిన మూర్తి అనువాదం ‘చెప్పులు కుడుతూ కుడుతూ’ను 2008లో తెచ్చారు. రెండేళ్లకు శ్రీశ్రీ రచనల సర్వస్వం ‘ప్రస్థాన త్రయం’, ఆ తర్వాతి ఏడాది బీనాదేవి రచనల సర్వస్వం, కాటన్‌ కుమార్తె లేడీ హోప్‌ ఆంగ్లంలో రాసిన జీవిత చరిత్రకు కవన శర్మ అనువాదం ‘సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జీవితం, కృషి’, మన్నం నరసింహం జీవిత విశేషాలతో ‘మార్గదర్శి మన పంతులుగారు’ (రచయిత కె.బాలాజీ) పొత్తాలు తెచ్చారు. ‘మార్గదర్శి’ గ్రంథానికి మరికొంత విషయాన్ని జోడించి 2012లో ‘వసుధైక కుటుంబీకుడు’ పేరుతో పునర్ముద్రించారు. ఆ సంవత్సరంలోనే గురజాడ అప్పారావు రచనల సర్వస్వం ‘గురుజాడలు’, పతంజలి సాహిత్యం (రెండు సంపుటాలు) వెలువరించారు. మరుసటి సంవత్సరంలో జాషువ సర్వలభ్య రచనల సంకలనం, ఆ తర్వాత మూడేళ్లకు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సర్వలభ్య రచనల సంకలనం (నాలుగు సంపుటాలు) ప్రచురించారు. 2016లో ‘పాతికేళ్ల కథ’, ఈ ఏడాదిలో ‘పఠాభి రచనలు’ (సర్వలభ్య రచనల సంకలనం) పొత్తాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు.
ప్రసిద్ధ చిత్రకారులు బాపు, చంద్రల ముఖచిత్రాలతో ముస్తాబైన ఈ ప్రచురణలు పరిమాణంలో బృహత్‌ సంపుటాలు. ముద్రణ ధరకన్నా అతి తక్కువకే అందుబాటులోకి తెచ్చిన ఈ పుస్తకాలు ప్రస్తుతం ఇంటింటి గ్రంథాలయాలకు కొత్త వన్నె అద్దుతున్నాయి. ఇవి వెలుగు చూడటం వెనుక ఎందరిదో కృషీ, దీక్షా, సహకారం ఉన్నాయి. ఈ అక్షర యజ్ఞం కోసం మనసు సంస్థ 20 మందితో కీలక బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ బృందం సాహితీవేత్తల రచనల పట్టిక రూపొందించి వాటి సేకరణకు అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా కళా అక్షరాభిమానులు ఎలాంటి ప్రతిఫలమూ ఆశించకుండా స్వచ్ఛందంగా ఈ సంస్థ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. పాత పత్రికల్లో ప్రచురితమై, ఇన్నేళ్లుగా పుస్తక ప్రచురణకర్తల దృష్టికి రాని జాషువ, శ్రీపాద లాంటి వారివి ఎన్నో రచనలు మనసు ప్రచురణల సందర్భంగా వెలికివచ్చాయి. ఆమేరకు తెలుగు సాహిత్యానికి మరింత పరిపుష్టి చేకూరింది.
లక్ష్యం.. వంద!
‘ప్రతి ఒక్కరూ సమాజం నుంచి లాభపడతారు. తిరిగి ఆ సమాజానికి ఎంతో కొంత ఇచ్చి రుణం తీర్చుకోవాలి’ అనే ఆలోచనతో మనసు ఫౌండేషన్‌ తరఫున విభిన్న కార్యక్రమాలకు అంకురారోపణ చేశారు మన్నం సోదరులు. విరాళాలేమీ సేకరించకుండా సంస్థ కార్యక్రమాలకు స్వయంగా నిధులు సమకూర్చుకుంటున్నారు. ప్రముఖ రచయితలు వివిన మూర్తి, కె.బాలాజీ, వికీపీడియన్‌ రహ్మానుద్దీన్‌ షేక్, ఆంధ్రభారతి ‘శాయి’, కథా విమర్శకులు రమణమూర్తి, సాహిత్య సంగీత నిధుల సేకర్త శ్యామనారాయణ మొదలైనవారందరి సహకారంతో మనసు ఫౌండేషన్‌ స్థిరంగా ఒక్కొక్క లక్ష్యాన్నీ అధిగమిస్తోంది.
      ప్రచురణల విషయంలో రచయితల ప్రథమ ముద్రణ ప్రతులను ఆధారంగా చేసుకోవడం మనసు ఫౌండేషన్‌ మరో ప్రత్యేకత. ఏళ్ల తరబడి పదేపదే వచ్చిన పునర్ముద్రణల మీద ఆధారపడితే, కాలక్రమంలో వాటిలో చేరిన దోషాలను కొనసాగించినట్లవుతుందన్నది ఫౌండేషన్‌ భావన. ఇలా చేయడం ద్వారా పదాలు, వాక్యాలు, శైలి లాంటి వాటికి సంబంధించిన దోషాలకు ఆస్కారం లేకుండా చూసుకుంటోంది. రచనా సర్వస్వాల ముద్రణ ఆలోచన గొప్పదే అయినా కాపీరైట్‌ ఇబ్బందులు రాకుండా చూసుకోవడం ముఖ్యం. ఈ సమస్యను అధిగమించేందుకు పూర్వరచయితల వారసులను వెతికి పట్టుకుని, ప్రచురణ హక్కులు సంపాదిస్తున్నారు. ఈ విషయంలో మనసు సంస్థ రాయుడి నేతృత్వంలో చిక్కులన్నిటినీ ఓపికగా దాటుతూ ముందుకుసాగుతోంది. అచ్చుతప్పులు లేకుండా ముద్రించడమూ సవాలే. మొదట్లో కొన్ని పుస్తకాల విషయంలో ఈ పొరపాట్లు జరిగినా, త్వరలోనే దాన్నుంచి బయటపడ్డారు. ఒక రచయిత సర్వలభ్య రచనల సేకరణకు తమకు ఒకటిన్నర సంవత్సరం నుంచి మూడేళ్ల వరకూ పడుతోందంటారు రాయుడు. ‘‘ఆర్థిక పరిమితులను బట్టి హక్కుల సమస్యలు లేకపోతే కనీసం వందమంది ప్రసిద్ధ రచయితల రచనా సర్వస్వాలు రూపొందించి డిజిటల్‌ గ్రంథాలుగా తీసుకురావాలన్నది మా ప్రయత్నం’’ అని చెబుతారాయన.   
ప్రత్యేక స్కానింగ్‌ కేంద్రం
తెలుగు సాహిత్యంలో కథానిక సేవకు అంకితమైన ‘కథా నిలయం’ సంస్థ వెబ్‌సైట్‌ను మనసు ఫౌండేషనే నిర్వహిస్తోంది. ప్రసిద్ధ రచయిత కారా మాస్టారు 1997లో కథానిలయాన్ని ఏర్పాటు చేసి గ్రంథాలు, వివిధ పత్రికల సేకరణ ప్రారంభించారు. రావిశాస్త్రి రచనా సర్వస్వం కోసం రాయుడు వివిధ గ్రంథాలయాలు తిరుగుతున్న సమయంలో కొన్ని రచనలు డిజిటలీకరణ అయినట్లు తెలిసింది. వాటిని సేకరించి కథానిలయానికి అందించారు. కథలను పీడీఎఫ్‌ రూపంలో అంతర్జాలంలో అందరికీ చేరువచెయ్యాలనే ఆలోచన కథానిలయానికి ఉన్నా తగిన సాంకేతిక, ఆర్థిక వనరులు లేని పరిస్థితి. దాంతో మనసు ఫౌండేషన్‌ kathanilayam.com ను ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. ప్రస్తుతం 43 వేలకు పైగా తెలుగు కథలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
      తెలుగులో ఒకప్పుడు ప్రచురితమైన ఎన్నో గొప్ప పుస్తకాలూ, పత్రికలూ కాలం గడిచేకొద్దీ కనుమరుగవుతున్నాయి. ఒకవేళ దొరికినా శిథిలావస్థకు చేరి ఉంటున్నాయి. కొన్ని పుస్తకాలైతే గ్రంథాలయాల్లోనూ అందుబాటులో లేని దుస్థితి. అలాంటి వాటిని పట్టుదలతో సేకరించి, డిజిటల్‌ రూపంలో వాటికి శాశ్వతత్వం కల్పిస్తోంది మనసు ఫౌండేషన్‌. అలా ఇప్పటి వరకూ డిజిటలీకరణ చేసిన, ఆ రూపంలో ఇతర సంస్థల నుంచి సేకరించిన గ్రంథాల సంఖ్య దాదాపు 40 వేలు. వీటితో పాటు దాదాపు 1500 పత్రికల వేలాది సంచికల్ని ఈ సంస్థ సంపాదించింది. సాహిత్యం నుంచి చలనచిత్రాల వరకూ ఎలాంటి పరిమితులు లేకుండా తెలుగులో ప్రచురితమైన ప్రతి పత్రికనూ, పుస్తకాన్నీ ఈ-రూపంలో భద్రపరచాలనే ఆశయంతో కృషి చేస్తున్నారు. మనసు ఫౌండేషన్‌ డిజిటలీకరణ చేసిన పత్రికల్లో భారతి, చందమామ, విజయచిత్ర, యువ దీపావళి, ఆంధ్ర పత్రిక ఉగాది సంచికలు లాంటివి ఉన్నాయి. రచయితలు, ప్రచురణకర్తల వాణిజ్య వ్యవహారాలకూ, కాపీరైట్‌ హక్కులకూ ఎలాంటి భంగం కలగకుండా వాటిని డిజిటలీకరణ చేస్తున్నారు. కథానిలయం నమోదు చేసిన గ్రంథాల్లో డిజిటల్‌ రూపంలో ఉన్నవన్నీ మనసు ఫౌండేషన్‌ కృషి వల్ల లభ్యమవుతున్నవే. ఇందుకోసం నెల్లూరు జిల్లా వరికుంటపాడు సమీపంలో మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్కానింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇరవై మంది సిబ్బంది ఇక్కడ విధుల్లో నిమగ్నమై ఉన్నారు.  
పరిశోధకులకూ తోడ్పాటు
సినిమా, సాహితీ రంగాలకు చెందిన ఛాయాచిత్రాల సేకరణను ప్రత్యేక అభిరుచితో చేపట్టింది మనసు సంస్థ. ఈ ఫొటోల సంఖ్య ఇప్పటికే పది లక్షలు దాటింది. అంతే కాకుండా యాభై వేల ఆడియోలూ, నాలుగు వేలకు పైగా వీడియోలను కూడా సేకరించింది. ఈ సేకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంత విస్తారమైన సమాచారాన్ని అంతర్జాలానికెక్కించి నిర్వహించడం అంత తేలికైన పనికాదు. అందుకే నిర్దిష్ట అభిరుచి ఉన్నవారు మనసు సంస్థను సంప్రదిస్తే, వారు కోరిన సమాచారాన్ని అందిస్తున్నారు. అవసరమైనవారు syamnarayana.t@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. పరిశోధక విద్యార్థులకు కూడా మనసు ఫౌండేషన్‌ తనవంతు సహాయం అందిస్తోంది. కథానిలయానికి వచ్చే పరిశోధకులకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటోంది. ఇలా ఇప్పటి వరకూ దాదాపు ఎనభై మంది ఈ సంస్థ సేవలు ఉపయోగించుకున్నారు. 
      తెలుగు సమాజం మీద చెరగని ముద్ర వేసిన రచయితలు కందుకూరి, పానుగంటి, త్రిపురనేని, బుచ్చిబాబు, కె.సభా, తిరుమల రామచంద్ర, చేకూరి రామారావుల సమగ్ర రచనలను ప్రచురించటం మనసు ఫౌండేషన్‌ భవిష్యత్‌ ప్రణాళికలు. సాహితీ రంగంలో ఇంత కృషి చేయడానికి కారణం ఏంటి? అని ఫౌండేషన్‌ నిర్వాహకులను ప్రశ్నిస్తే... ‘‘సాహిత్యం జాతి సంపద. దానిలో వేలమంది కృషి ఉంది. జాతి మనోస్థితి, నడత పట్ల సాహిత్యం పరిణామాత్మక ప్రభావం చూపుతుంది. దాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రపరచటం, అందరికీ అందుబాటులో ఉంచటం తప్పనిసరి కర్తవ్యం’’ అని చెబుతారు. తెలుగు సాహితీ యశస్సును నిస్వార్థంగా దిగంతాలకు వ్యాపింపజేస్తున్న మనసు ఫౌండేషన్‌ ఆశయం అద్భుతం! ఆచరణ అనన్య సామాన్యం!!


వెనక్కి ...

మీ అభిప్రాయం