కొల్లాయి గట్టితేనేమి కథన కౌశలం

  • 1357 Views
  • 7Likes
  • Like
  • Article Share

మహీధర రామమోహన్‌రావు కంటే ముందు తెలుగులో చారిత్రక నవలలు రాసినవారు చాలామందే ఉన్నారు. కానీ సాహిత్య విమర్శకుల దృష్టిలో తెన్నేటి సూరి ‘ఛంఘిజ్‌ఖాన్‌’, మహీధర ‘కొల్లాయిగట్టితేనేమి’ మాత్రమే చారిత్రక నవల అన్న నిర్వచనానికి నిలబడేవి అన్న అభిప్రాయం బలంగానే ఉంది.
      1885లోనే కాంగ్రెస్‌ ఏర్పడినా దాదాపు 30-35 ఏళ్లపాటు అది చదువుకున్న గుప్పెడు మందికే పరిమితమైంది. గాంధీజీ పూర్తిస్థాయిలో స్వాతంత్య్రోద్యమంలో దూకిన తర్వాత కాని సామాన్య జనానికి కాంగ్రెస్‌తో సంబంధాలు పెనవేసుకోలేదు. 1919-1920 ప్రాంతాల్లో తప్ప తెలుగునాట స్వాతంత్య్ర పిపాస బలంగా నాటుకోలేదు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర కాంక్ష పెరిగి బ్రిటిష్‌ ప్రభుత్వంపై అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలోనే కిరాతకమైన రౌలత్ చట్టం వచ్చింది. జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ రేపిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. బ్రిటిష్‌ వ్యతిరేకత సమాజంలోని ఉన్నత వర్గాల్లో వ్యాపిస్తోంది. సామాన్య జనంలో కూడా జాతీయతా భావాలు అంకురిస్తున్నాయి. ఈ వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి శ్రీకారం చుట్టారు. విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చారు. గాంధీ పిలుపు అందుకున్న విద్యార్థులు చదువు మానేసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. విదేశీ వస్త్ర దహనం ఒక ఉద్యమంగా మారింది. విదేశీ వస్త్రాలకు బదులు ఖద్దరు ధరించడం, రాట్నంపై నూలు వడకడం పవిత్ర కర్తవ్యాలైనాయి.
      ఆనాటి తెలుగునేలలో ఆర్థిక పరిస్థితిలో మౌలికమైన మార్పు లేకపోయినప్పటికీ కృష్ణా, గోదావరి నదులకు ఆనకట్టలు కట్టడం వల్ల ఆ ప్రాంతాల్లో కరవు కాటకాలు అంతమయ్యాయి. వ్యవసాయం ఊపందుకుంది. దీనితో వ్యావసాయిక సమాజంలోంచి మధ్య తరగతి వర్గం తయారు కావడానికి అవకాశం కలిగింది. కోస్తా ప్రజలకు ఆంగ్ల విద్య అందుబాటులోకి రావడంతో పాశ్చాత్య భావాలు కొందరినైనా ప్రభావితం చేశాయి. పాశ్చాత్య విద్య అబ్బితే ప్రభుత్వోద్యోగాల్లో చేరవచ్చుననే ఆశలు రేకెత్తాయి.
      ఆర్థిక పరిస్థితిలో మార్పు అమాంతం సాంఘిక పరిస్థితులను మార్చేయలేదు. సమూలమైన మార్పు ద్యోతకం కావడానికి కొంత సమయం పడుతుంది. మార్పును ఆహ్వానించే వారు ఉన్నట్టే మార్పును నిరోధించడానికి ప్రయత్నించేవారూ ఉంటారు. ఆ దశలో తెలుగునాట వర్ణధర్మాలు గ్రామసీమల్లో కొనసాగుతూనే ఉండేవి. దీనితోపాటు ఈ ధర్మాల నిరసన భావాలూ పరిమితంగానైనా పెల్లుబుకుతూనే ఉన్నాయి. అయినా మార్పును ఆహ్వానించే ఆలోచన కన్నా ఆచారబలం బలీయంగా ఉంటుంది. ఆచారాలను ధిక్కరించే సాహసం అంత త్వరగా అబ్బదు. హిందూ సమాజంలోని లోపాలను గుర్తించిన వాళ్లు ఆ లోపాలను సరిదిద్దలేక బ్రహ్మ సామాజికులుగా మారడం మొదలైంది. 
      సరిగ్గా ఈ దశలోని నూతన ఆకాంక్షలకు, స్వాతంత్య్రోద్యమ కాంక్ష బలపడుతున్న తీరును, పాశ్చాత్య విద్యా సంపర్కం వల్ల రూపు దిద్దుకుంటున్న బూర్జువా ఆలోచనా ధోరణులకు, అంతకుముందున్న యథాతథవాద భావజాలానికి మధ్య అంతస్సంఘర్షణను ఆధారంగా చేసుకుని మహీధర రామమోహనరావు 1920-22 మధ్య సమాజ రీతిని చిత్రిస్తూ 1964లో కొల్లాయిగట్టితేనేమి నవల రాశారు. నిజానికి ఆ సమయానికి గాంధీ కొల్లాయిగట్టడం ప్రారంభించలేదు. ఆ తర్వాత ఆరేడు నెలలకు గాని గాంధీ కొల్లాయికట్టలేదు.
      సమాజంలో వస్తున్న మార్పును ఆహ్వానించే తత్వం ఒకవైపు, ఆ మార్పును ప్రతిఘటించే శక్తుల యథాతథవాదాల బలం మరోవైపు అంతస్సంఘర్షణకు దారితీస్తుంది. ఒకే కుటుంబంలో ఈ రెండు లక్షణాలు ఉన్నవారూ ఉండొచ్చు. ఈ రెండు ఆలోచనా ధోరణుల మధ్య జరిగే అంతస్సంఘర్షణే కొల్లాయి గట్టితేనేమిలో ప్రధాన వస్తువు.
      ఛాందస భావాల నేపథ్యాన్ని వివరించడానికి మహీధర తన స్వస్థలమైన కోనసీమలోని ముంగండనే ఆధారంగా చేసుకున్నారు. రెండు రకాల భావాలకు ఆలవాలమైన బ్రాహ్మణ కుటుంబాలనే ఆలంబనగా చేసుకుని కథ నడిపించారు. 
      కథానాయకుడు రామనాథం ఆధునిక భావాలకు, స్వాతంత్య్ర కాంక్షకు ప్రతినిధి. జాతీయోద్యమం రాజకీయాలకు మాత్రమే పరిమితమైంది కాదు. కులమత భేదాలను నిర్మూలించడానికి జరిగిన ప్రయత్నం కూడా జాతీయోద్యమంలో భాగమే. స్త్రీ జనోద్ధరణ, వారికి సమానస్థాయి కల్పించడమూ జాతీయోద్యమ లక్ష్యాలలో ప్రధానమైందే. అస్పృశ్యతను నిరాకరించడం, అసమానతలను తొలగించి అవమానాలకు గురవుతున్న అణగారిన వర్గాల వారిని పంచములుగా భావించి వెలివేయకూడదన్న సమానత్వ దృక్పథమూ జాతీయ పోరాటంలో ఉంది. రాచరిక, భూస్వామ్య యుగం ఆలోచనలనూ, ఆచారాలనూ, అలవాట్లను విసర్జించి జనంలో అంకురిస్తున్న కొత్త ఆలోచనలకు, ఆచారాలకు బలం చేకూర్చడమూ స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగమే. మహీధర రెండేళ్ల నిడివినే నవలకు నేపథ్యంగా తీసుకున్న ఈ సంఘర్షణల నన్నింటినీ హృద్యంగా చిత్రించారు. ‘ఒక యుగ సంధిలో భిన్న చారిత్రక ధర్మాల మధ్య జరిగే చారిత్రక సంఘర్షణను వ్యక్తుల వ్యక్తిత్వాలలో జరిగే అంతస్సం ఘర్షణగా చిత్రించడానికి ప్రయత్నించాను’ అని మహీధర స్వయంగా చెప్పుకున్నారు.
      కొల్లాయి గట్టితేనేమి నవలను అద్భుత చారిత్రక నవలగా మలచడానికి, సగటు చారిత్రక నవలల్లో కనిపించే గతకాలాన్ని కీర్తించే ధోరణి ఇందులో ఇసుమంత కూడా కనిపించకపోవడానికి చరిత్రను అర్థం చేసుకోవడంలో మహీధర ప్రాపంచిక దృక్పథం ప్రధానపాత్ర పోషించింది. గతకాలపు ఘటనలను చారిత్రక దృక్పథంలో రచయిత అవగాహన చేసుకున్నారు. మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నందువల్ల గత చరిత్రను ఆయన కొత్త కోణంలో చూడగలిగారు. ‘అలాగే జీవితంలో అనుభవించినవీ, విన్నవి అవగాహన కావటం మార్క్సిజం చదివాకనే’’ అని ఆయన చెప్పుకున్నారు.  సామాజిక ధర్మాలను అవగతం చేసుకోవడానికి ఆయనకు చారిత్రక భౌతికవాదం తోడ్పడింది.
      కులాచారాలు పాటించడంలో ఏ మాత్రం పట్టు విడవని వారు గిరిజన, హరిజన సేవలకు తమ జీవితాలను అంకితం చేయడం, తమ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఆ వర్గాల అభ్యున్నతికి పాల్పడడానికి కారణం ఏమిటో మార్క్సిజం వెలుగులో మానవత్వాన్ని మహీధర దర్శించగలిగారు. ప్రజా జీవితంలోని ప్రత్యేకతలను అర్థం చేసుకోగలిగారు.
      ఒకవైపు స్వాతంత్య్రోద్యమం, మరోవైపు సంఘసంస్కరణ తెలుగునాట జమిలిగా సాగాయి. ఇంకా చెప్పాలంటే జాతీయోద్యమం ఊపందుకోకముందే సంఘ సంస్కరణోద్యమం ఉద్ధృతంగా సాగింది. సంఘ సంస్కరణోద్యమం సాంఘిక జీవనాన్ని ప్రభావితం చేస్తే స్వాతంత్య్ర కాంక్ష జాతీయ పోరాటంలోకి దూకడానికి తోడ్పడి రాజకీయాభిప్రాయాలు సంఘటితం కావడానికి దోహదం చేసింది.
      కొల్లాయిగట్టితేనేమి నవలలో ఏ పాత్రా రచయిత సృష్టించిన పాత్రలా ఉండదు. ప్రతి పాత్రకు సొంతముద్ర ఉంది. అన్ని పాత్రలు అత్యంత సహజంగా నడుచుకోవడానికి అనువైన రీతిలోనే మహీధర ఆ పాత్రలను చిత్రించారు.
      కథానాయకుడు రామనాథం మామ నారాయణమూర్తి పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌. ఆయనకు రాజభక్తి మెండు. ఆచారపరుడు. అధికారగర్వం తలకెక్కినవాడు. రామనాథం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం నారాయణమూర్తి దృష్టిలో రాజద్రోహం. అలాంటి అల్లుడి మీద విపరీతమైన ద్వేషంతో నారాయణమూర్తి కూతురు భవిష్యత్తును కూడా లెక్కచేయడు. ‘గోళ్లు విరగ బొడిచేసి బొక్కలో తోసేస్తే రోగం కుదురుతుంది’ అని అల్లుడి గురించి వియ్యంకుడితోనే అనగలిగిన నిఖార్సయిన పోలీసు బుద్ధి నారాయణమూర్తిది.
      అల్లుడిని దారిలోకి తెచ్చుకోవడానికి నారాయణమూర్తి భార్య కూతురుకు కార్యం చేసే ఆలోచన చేస్తే... ‘నా ఉద్యోగానికి సంబంధించినంత వరకూ అల్లుడు లేడు, కూతురూ లేదు. ఆ కుర్రవాడు నా యింట అడుగుపెట్టడానికి వీలులేదు. ఓ చీరపెట్టి పిల్లని పంపించెయ్యి. ఆ శుభకార్యం వాళ్లింట్లోనే చేసుకుంటారు’ అనగలిగిన రాజభక్తి ఆయన సొంతం.
      చారిత్రక నవలకు చారిత్రకత ప్రధానం. మహీధర దీనికెక్కడా భంగం కలగనివ్వలేదు. వాస్తవానికి, రచనా కాలానికి నాలుగు దశాబ్దాల అంతరం ఉంది. కేవలం చరిత్ర చెప్పడం మహీధర లక్ష్యం కాదు. చరిత్ర పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మార్క్సిస్టు దృక్కోణం బాగా ఉపయోగపడింది. భౌతికవాద దృష్టి చరిత్రను అవగాహన చేసుకోవడానికి ఎంతగా ఉపకరిస్తుందో ఈ నవల చదివితే అర్థం అవుతుంది.
      నవలలో కథాకాలం ఇప్పటికి దాదాపు శతాబ్దం పూర్వానిది. ఈ తరం పాఠకులు చదివినా ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయాలు పాఠకుడికి స్పష్టంగా రూపుకట్టించే రీతిలో మలచడంలో మహీధర అపురూపమైన శిల్పచాతుర్యాన్ని ప్రదర్శించారు. రచయితకు ఉన్న తాత్విక దృక్పథాన్ని ఆనాటి పరిణామాలను వింగడించడానికే ఉపయోగించుకున్నారు తప్ప తన భావజాలాన్ని రుద్దడానికి కాదు. మహీధర రాసిన ‘కత్తుల వంతెన’, ‘ఎవరికోసం’ నవలలు 1960 నాటి తెలుగు సమాజ జీవితాన్ని చిత్రించాయి. కొల్లాయి గట్టితేనేమితోపాటు ఈ రెండు చదివితే తెలుగువారి సామాజిక జీవితంలో నాలుగు దశాబ్దాల కాలంలో వచ్చిన మార్పులు రూపుగడ్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం