‘తెలుగెత్తి జైకొట్టిన’ సాహితీ పండగ

  • 80 Views
  • 3Likes
  • Like
  • Article Share

ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్తల జీవితాలు, అక్షరసేద్యాలు మరొక్కసారి కళ్లముందు కదలాడాయి. పరిశోధక విద్యార్థులు ఆయా సరస్వతీ పుత్రుల మీద సమర్పించిన పరిశోధన పత్రాలు లోతైన విశ్లేషణలకు వేదికలయ్యాయి.  తెలుగు సారస్వత గొప్పదనం, వైవిధ్యాన్ని చాటిచెప్పాయి. ‘తెలుగెత్తి జైకొట్టు’ పేరుతో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  ‘తెలంగాణ సాహితి’ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సాగిన ‘శతాధిక సాహితీవేత్తల జీవితం-సాహిత్యం’ అంతర్జాతీయ సదస్సు.. అమ్మభాష కోసం నినదిస్తూనే సాహితీ పరిమళాలను దశదిశలా వ్యాపింపజేసింది. 
ప్రముఖ
కవులు, రచయితలు, విమర్శకులు, సాహితీవేత్తల స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఓవైపు, ఆయా విశ్వవిద్యాలయ విద్యార్థుల పత్రసమర్పణలు మరోవైపు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సాహితీప్రియుల సందడి ఇంకోపక్క... ఇలా ‘తెలుగెత్తి జైకొట్టు’ సదస్సు నవ్య సాహితీ లోకాన్ని ఆవిష్కరించింది. ఈ అంతర్జాతీయ సదస్సులో భాగంగా 2019 డిసెంబర్‌ 14, 15, 16 తేదీల్లో నిర్వాహకులు పదికిపైగా సమావేశాలు నిర్వహించారు. 
      ‘సాహితీ స్రవంతి’గా 1999లో ఏర్పడిన సంస్థ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ‘తెలంగాణ సాహితి’గా పేరు మార్చుకుంది. 2015 నుంచి ఏటా సాహిత్యోత్సవాలు నిర్వహిస్తోంది. 2017లో తెలుగు మహా సభల నేపథ్యంలో సాహిత్యోత్సవం జరగ లేదు. 2018 మేలో మూడో సాహిత్యోత్స వాన్ని తెలుగు విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించారు. అప్పుడు ‘తెలంగాణ భాష- సాహిత్య వికాసం’ పేరుతో పరిశోధక విద్యార్థుల వ్యాసాల సంకలనం తీసుకొచ్చారు. ప్రస్తుతం నాలుగో సాహిత్యోత్సవం నిర్వహించారు. 
అన్ని విధాలుగా ప్రయత్నించాలి
తొలిరోజు ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ హిందీ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మంగలేష్‌ దబ్రాల్‌ వచ్చారు. ‘‘దేశంలో విభిన్న సంస్కృతీ సంప్రదాయాలున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా పాలకులు వారికి అనుకూలమైన వారిని పిలిపించుకుని పాఠ్యపుస్తకాలు రాయిస్తున్నారు. వారికి నచ్చినవే పాఠ్యాంశాలుగా పెట్టాలనుకుంటున్నారు. ప్రజల ఇష్టాలను అభిప్రాయాలను లెక్కచేయడం లేదు. ఇప్పుడు మతోన్మాదం సంస్కృతి సంప్రదాయాల రూపంలో వస్తోది. ఏం తినాలో ఏం చదవాలో కూడా వాళ్లే చెబుతున్నారు. సాహిత్యాన్ని కాపాడటం పాలకుల బాధ్యత కాదు. ఆ బాధ్యత సాహిత్యకారులది’’ అని వ్యాఖ్యానించారు దబ్రాల్‌. అంతకు ముందు ఈ సదస్సు లక్ష్యం గురించి నిర్వాహకులు అనంతోజు మోహన్‌ కృష్ణ మాట్లాడుతూ ఒకే జాతి ఒకే భాష అనే నినాదం వస్తున్న తరుణంలో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. కొత్త రచయితలు, కవులు, కళాకారులు, కథకులు, తెలుగు ప్రజలు ‘తెలుగెత్తి జైకొట్టు’ నినాదంతో ముందుకు సాగాలని, రాబోయే తరానికి మన భాషను సజీవంగా అందించడం అందరి కర్తవ్యమని చెప్పారు.
      ‘‘కొత్త తరాన్ని పరిశోధన, భాషా సాహిత్యాల వైపు మళ్లించడానికి తెలంగాణ సాహితి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం’’ అన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి. తొలి రోజు సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్లమాధ్యమం దూసుకొస్తోంది. ఇలాంటి సమయంలో తెలుగెత్తి జైకొడతాం అనే శీర్షికను ఎంచుకోవడం మంచి విషయం. ఆంగ్లంలో చదువుకుంటేనే ఉద్యోగాలొస్తాయనేది సరైన ఆలోచన కాదు. ఆంధ్రప్రదేశ్‌ ఆంగ్లంవైపు పరిగెత్తడం పాలకుల అజ్ఞానానికి ప్రతీక. పూర్తి ఆంగ్లభాషా చదువులను తెలుగు ప్రజానీకం ప్రతిఘటిం చాలి. భాషను బతికించుకోవడమంటే ప్రజల్ని బతికించుకోవడం, సంస్కృతిని బతికించుకోవడం’’ అని అన్నారాయన. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విశిష్ట అతిథి, ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌ మాట్లాడుతూ... ‘‘పాలకులు తెలుగును భూస్థాపితం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సందర్భంలో  మేధావులు, రచయితలు భాషను బతికించుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాల’’న్నారు. 
తీవ్రంగా స్పందిస్తారు  
‘‘ప్రపంచ వ్యాప్త రచనలు.. కవితలు చూస్తే ఏకసూత్రత ఉండదు. కానీ అందరినీ ఒకచోట చేర్చి సమూహాన్ని నిర్మించే శక్తి సాహిత్యానికి ఉంటుంది’’ అని విశ్లేషించారు ప్రముఖ కవి కె.శివారెడ్డి. 135 మంది విద్యార్థుల పరిశోధక పత్రాలతో తెచ్చిన ‘తెలుగెత్తి జైకొట్టు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. మరో విశిష్ట అతిథి, వాగ్గేయకారులు గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రపంచీకరణ వల్లే స్థానిక భాషలకు ముప్పు వాటిల్లుతోందని అన్నారు. ‘‘తెలుగు భాష బతకాలంటే ముందు పునాది నుంచి చర్యలు మొదలుపెట్టాలి. కింది వర్గాల భాష గురించి ఈ రోజు ఎవరూ పట్టించుకోవట్లేదు. పాలకుల భజన చేయకుండా ప్రజల భాషకు జరుగుతున్న అన్యాయాన్ని మేధావులు ప్రశ్నించాల’’ని పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం తెలంగాణ సాహితి మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి ఖాజా మొయినుద్దీన్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. హైదరాబాదు విశ్వవిద్యాలయం ఆచార్యులు పిల్లలమర్రి రాములు, ఎన్‌బీటీ సంపాదకులు పత్తిపాక మోహన్‌ ముఖ్య అతిథులుగా వచ్చారు. 
      రెండోరోజు తొలి సమావేశానికి ‘తెలంగాణ సాహితి’ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథి, ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె.శ్రీనివాస్‌ ‘ఉరేనియం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దీని ద్వారా నల్లమల భౌగోళిక స్వరూపాన్ని, అక్కడి ఉద్యమ నేపథ్యాన్ని సమాజం ముందుకు తెచ్చారని కొనియాడారు. మరో విశిష్ట అతిథి, సాహితీ విమర్శకులు గుడిపాటి మాట్లాడుతూ... అడవులంటే సమస్త మానవాళి మనుగడకు మూలధాతువులని, నల్లమలని ధ్వంసం చేస్తామంటే సున్నిత మనస్కులైన కవులు, రచయితలు తీవ్రంగా స్పందిస్తారని హెచ్చరించారు. నల్లమలను కాపాడుకుందామనే నినాదంతో తెలంగాణ సాహితి, ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో 35 మంది కవులు, కళాకారులు నల్లమల పరిసర గ్రామాల్లో పర్యటించారని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి చెప్పారు.  బాధితుల కన్నీళ్లను తుడిచే కర్తవ్యాన్ని కవులు చేపట్టాలని సూచించారాయన. రెండోరోజు మధ్యాహ్న భోజన విరామం అనంతర సదస్సుకు తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపా ధ్యక్షులు స్ఫూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా కాకతీయ విశ్వవిద్యా లయం నుంచి పంతంగి వెంకటేశ్వర్లు, తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఎస్‌.త్రివేణి హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులు, సినీ నటుడు జెన్ని తన ప్రసంగంతో అందరినీ అలరించారు. 
పరిధి విస్తరించాలి
‘‘తెలంగాణ సాహిత్యాన్ని ప్రజల్లోకి, ఇతర భాషల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ విశేష కృషి చేస్తోంది. తెలంగాణ ప్రాతినిధ్య కథ పేరుతో ముప్పై అయిదు కథల సంకలనాన్ని అకాడమీ ముద్రించింది. దాన్ని ‘అస్తిత్వ’ పేరుతో హిందీ, ఇంగ్లీషులోకి అనువదింపజేశాం. ప్రస్తుతం చాలా వరకు తెలంగాణ కథలకు హిందీ, ఇంగ్లిష్‌ అనువాదాలొస్తున్నాయి’’ అన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి. మూడో రోజు తెలంగాణ సాహితి నాగర్‌ కర్నూలు జిల్లా కార్యదర్శి వహీద్‌ ఖాన్‌ అధ్యక్షతన కొనసాగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. త్వరలో ‘పరంపర’ పేరుతో పాల్కురికితో మొదలుపెట్టి ఆధునిక కవుల వరకు 150 మందితో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో గ్రంథం తేబోతున్నామని, తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర కూడా రాయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు మన పౌరసత్వాలు, హక్కులు ప్రశ్నార్థకమవు తున్నాయి. రేపు మన బతుకులే ప్రశ్నార్థక మయ్యే పరిస్థితి! కాబట్టి సాహిత్యం ఇంకా పదునుదేలాలి. శక్తిమంతమైన విమర్శ రావాలి. ఇలాంటి సాహితీ సదస్సులు మరిన్ని జరగాల’’ని రచయిత, సాహిత్య విమర్శకులు అఫ్సర్‌ ఆకాంక్షించారు .
      మూడోరోజు మధ్యాహ్నం సదస్సుకు తెలంగాణ సాహితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కటుకోజ్జ్వల రమేష్‌ అధ్యక్షత వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన రంగస్థల నటులు, సామాజిక కార్యకర్త శాంతారావు మాట్లాడుతూ... పరిశోధన అంటే పరిశ్రమ అని, ఇందులో పరిశోధకుడు తనదైన ముద్ర వేయాలని చెప్పారు. ‘‘ఈ రోజుల్లో పరిశోధన అంటే ఎత్తి రాయడం అనే భావం ఏర్పడిపోయింది. ఒక పుస్తకం చూసి రాస్తే కాపీ. పది పుస్తకాలు చూసి రాస్తే అదే పరిశోధన అని చెప్పిన ఆరుద్ర మాటని కొట్టిపారెయ్యలేం. పరిశోధనలో కొత్త ప్రతిపాదనలు చేయాలి. అప్పుడే ఆ పరిశ్రమకి విలువ’’ అని అన్నారాయన. ఆ తర్వాత కొనసాగిన మరో సదస్సుకు తెలంగాణ సాహితి నగర అధ్యక్షులు జి.నరేష్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి రాజా మాట్లాడుతూ.. మాతృభాషలో విద్యాబోధన సాగితేనే పిల్లల మేధస్సు వికసిస్తుందన్నారు. ఆంగ్ల వ్యామోహంతో పిల్లలను అమ్మభాషకు దూరం చేయడం తగదని చెప్పారు. ప్రజా కవులంతా సామాన్యులతో మమేకమై వారి సాహిత్యాన్ని సామాజపరం చేశారని అన్నారు తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి.
      చివరి రోజు ‘తెలుగెత్తి జైకొట్టు’ అంతర్జాతీయ సదస్సు ముగింపు సభకి తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్దన అధ్యక్షత వహిం చారు. ‘‘శతాధిక సాహితీవేత్తల జీవితాలనీ, సాహిత్యాన్నీ మూల్యాంకనం చేసుకునే దిశగా సాగిన ఈ సదస్సు చరిత్రాత్మకం. భాష ఉనికి ప్రశ్నార్థకమవుతున్న ఈ సమయంలో ఇలాంటి సదస్సు ఆవశ్యకం’’ అన్నారు ఆచార్య టి.గౌరీశంకర్‌. ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథి. ‘‘సాహిత్య మంటే కొందరి రచనలే కాదు. దాని పరిధి విస్తరించాలి. సాహిత్యం మట్టిదాకా వెళ్లాలి. అప్పుడే ఆ సాహిత్యానికి పరిమళముం టుంద’’న్నారు మరో ముఖ్య అతిథి, ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర.
      ఈ మూడు రోజుల పాటు 135 మంది పరిశోధకులు ఆయా సాహితీవేత్తల మీద పత్రసమర్పణలు చేశారు. చివరి రోజు తగుళ్ల గోపాల్, కన్నోజు ఫణి మాధవి, సిలువేరు లింగమూర్తి నిర్వహణలో కవిసమ్మేళనం నిర్వహించారు. ఔత్సాహిక, వర్ధమాన కవులు సమకాలీన సంఘటనల మీద కవితలు వినిపించారు. ఈ సదస్సు ఎందరో ప్రఖ్యాత సాహితీ వేత్తల్ని నేటితరానికి పరిచయం చేసింది. తెలుగును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బలంగా నినదించింది. 


తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యతని, బోధనా భాషగా తెలుగు ప్రాధాన్యతని ప్రజలకు తెలియజెప్పడానికి, ప్రభుత్వాల్లో కదలిక తేవడానికి దీన్ని ఏర్పాటు చేశాం. తెలుగు ప్రాంతంలోని కవుల గురించి నేటి తరానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. 

   - వల్లభాపురం జనార్దన, తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షులు


ఈ సదస్సులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది. తెలుగు మాధ్యమంలో చదివేందుకు వీలు లేకుండా చేయడం, జాతీయవాదం పేరుతో హిందీనీ స్థానిక భాషలమీద రుద్దడం లాంటి వాటికి వ్యతిరేకంగా సాహిత్యకారులు నినదించాలి తరుణమిది.

- కె.ఆనందాచారి,తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


విద్యార్థులను విమర్శకులుగా తయారుచేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. దక్షిణాఫ్రికా, లండన్, అమెరికా లాంటి దేశాల నుంచి కూడా పరిశోధన పత్రాలు అందాయి. ఆయా సాహితీవేత్తల కృషిని సమగ్రంగా ఆవిష్కరించాయి.

- అనంతోజు మోహనకృష్ణ, తెలంగాణ సాహితి రాష్ట్ర కోశాధికారి


వెనక్కి ...

మీ అభిప్రాయం