‘ఆశాజీవి’తం.. ‘అనంత’ ప్రజ్ఞామయం!

  • 151 Views
  • 3Likes
  • Like
  • Article Share

కథతో కదిలించినా..
నాటకంతో నవ్యత ఒలికించినా..
మాటల్లో చతురత, 
నటనలో విలక్షణతతో కట్టిపడేసినా.. 
‘జీవన కాల(ం) ధర్మం’ చెందేవరకూ అక్షర హాలికుడై ఆయన చేసిన సేద్యం ఆగలేదు. 
‘‘14వ ఏట
ఆశాజీవిగా మొదటి అడుగు వేశాను. 16వ ఏట అనంత నాటక ప్రస్థానం మొదలుపెట్టాను. 23వ ఏట దృక్పథం మార్చుకున్నాను. స్క్రీన్‌ప్లేలు, మాటలు రాశాను. నటించాను. నటిస్తూనే ఉన్నాను. కానీ, రోజూ కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాను’’ అన్న గొల్లపూడి మారుతీరావు మాటలతో ఆయన జీవితం ఎన్ని వైవిధ్యతలతో సాగిందో అర్థమవు తుంది. అడుగుపెట్టిన రంగం ఏదైనా వెనకడుగన్నది లేకుండా దూసుకుపోయిన ప్రతిభ గొల్లపూడి సొంతం. కథ, నాటకం, నవల, రేడియో, సినీ రచన, నటన ఏదైనా సరే అలవోకగా ఆయన విజయతీరాలను చేరుకున్నారు.   
      విజయనగరంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1939లో గొల్లపూడి జన్మించారు. ఏయూలో బీఎస్సీ చేశారు. 1954లో తొలికథ ‘ఆశాజీవి’ రాశారు. అది ప్రొద్దుటూరు నుంచి వెలువడే ‘రేనాడు’ పత్రికలో అచ్చయింది. 1959లో ఆంధ్రప్రభ దినపత్రికలో ఉపసంపాదకుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత ఆకాశవాణిలో ఇరవై ఏళ్లపాటు పనిచేసి సినీ రంగంలోకి వచ్చారు. 1963లో తొలిసారి డాక్టర్‌ చక్రవర్తి సినిమాకి స్క్రీన్‌ప్లే రాసి నంది పురస్కారం అందుకున్నారు. ‘ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య’తో నటుడిగా వెండితెర మీద కనిపించారు. అనంతర కాలంలో 250కి  పైగా చిత్రాల్లో నటించారు. పత్రికా శీర్షికలూ నిర్వహించారు. 
నిగూఢ కవికి ఆవిష్కరణ
‘అందమైన జీవితం, అద్దె బతుకు, ఆద్యంతాలు, కదిలే రైల్లోంచి కనిపించే చెట్టు, కాకీ చొక్కాలో కాఫీ చుక్క, కీర్తిశేషుడు, తెల్ల కాగితం మల్లెపూలు, పాత సీసాలో కొత్త విస్కీ, మరమ్మతు చేసే మనిషి’ లాంటి చాలా కథలు గొల్లపూడి కలం నుంచి జాలువారాయి. సౌందర్యం, ఆశలు లాంటి వాటిని పక్కనపెట్టి జీవితాన్ని వీలైనంత వరకూ ఉన్నదున్నట్లుగా ఆస్వాదించాలని, అప్పుడే బతుకులో ఆనందం వెల్లివిరుస్తుందని వివరిస్తుంది ‘అందమైన జీవితం’ కథ. నిజాయతీకి ప్రాణమిచ్చే ఒక మధ్య తరగతి మనిషి జీవితంలోని అలజడులని ‘అద్దెఇల్లు’ కథ చిత్రిస్తుంది. ‘చీకటిలో చీలికలు, ఎర్రసీత, సాయంకాలమైంది, పిడికెడు ఆకాశం’ తదితర నవలలు రాశారు గొల్లపూడి. ‘పిడికెడు ఆకాశం’ ఆధారంగా ‘ఓ సీత కథ’ సినిమా వచ్చింది. రేడియో నాటికగా కూడా ఇది ప్రసారమైంది. ‘సాయంకాలమైంది’ నవల ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికగా వచ్చింది. 20వ శతాబ్దం ఉత్తరార్ధంలో మానవ సంబంధాలు, అలవాట్లు, సంప్రదాయాలు, కుటుంబ బంధాల్లో వచ్చిన మార్పులను ఇది చిత్రిస్తుంది. ‘ఇడియట్‌’ నవలను పురాణం, కొమ్మూరిలతో కలిసి రచించారు. గొల్లపూడి ‘ఎలిజీలు’ కూడా మరో విశిష్ట రచన. తన మిత్రులు, సన్నిహితులు, హితులు దూరమైనప్పుడు రాస్తూ వచ్చిన స్మృతికవితలను ఈ పొత్తంలో పొందుపరిచారు. ‘ప్రేమపుస్తకం’ సినిమాకి దర్శకత్వం వహిస్తూ దుర్మరణం పాలైన తన కుమారుడు శ్రీనివాస్‌ పేరిట ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు మారుతీరావు. దాని తరఫున ఏటా ఓ నూతన దర్శకుడికి పురస్కారం అందిస్తున్నారు. ‘ఎలిజీలు’ పొత్తాన్ని తన కుమారుడికే అంకితం ఇచ్చారాయన. గొల్లపూడిలో నిగూఢంగా దాగి ఉన్న కవిని ఆవిష్కరిస్తూ వచ్చిన పొత్త ‘మారుతీయం’. 1960 నుంచి ఆయన రాస్తూ వచ్చిన కవితలను 2012లో పుస్తకంగా తెచ్చారు. 
నాటక రచనలోనూ మేటి
నాటకాలు, నాటికలు ప్రజల్లో రెండు రకాల భావజాలాన్ని చేర్చిన రోజులవి. ఒకటి.. నాటకాలు అభ్యుదయాన్ని ఆశిస్తాయి. రెండు.. నటుడిగా రంగు వేసుకున్నాడంటే వాడు చెడిపోతాడు అని. ఆ రెండో మాట అమ్మానాన్నల నోట విన్నా చలించని మనిషి గొల్లపూడి. తన ఉనికి, లక్ష్యం రెండూ కలిసేది ఎక్కడో తెలుసుకుని ప్రయాణం మొదలు పెట్టారాయన. నాటకాల్లో అంకాలను అలవోకగా నడిపిస్తూ భాష పరంగా, భావంపరంగా ధీరోదాత్తీకరించడం కత్తిమీద సాము. దాన్ని ఒడిసిపట్టుకున్నారు గొల్లపూడి. నాటకాల్లోనూ సముచిత రీతిలో మాండలికాలనూ ప్రయోగించారు. గొల్లపూడికి బాగా పేరుతెచ్చిన నాటిక ‘కళ్లు’. దాన్ని అక్షరీకరించేందుకు కేవలం ఒకట్రెండు రాత్రులే తీసుకున్నారంటే ఆయన అక్షరధాటి, వస్తువు మీద స్పష్టత, సునిశిత దృష్టి, విశ్లేషణాసామర్థ్యం, ఆలోచనా ఉధృతులను అర్థం చేసుకోవచ్చు. ‘ఆశయానికి సంకెళ్లు, రెండురెళ్లు ఆరు, ప్రశ్న’ వంటి నాటికలనూ ఇలానే పూర్తి చేశారు. రాసిన మనిషి ఊరికే ఉంటే మారుతీరావు మామూలుగానే ఉండేవారు. కానీ వాటికి రంగస్థలాన్ని ఎక్కించి రక్తి కట్టించేదాకా నిద్రపోని మనిషి కావటం వల్ల నాటక రంగంలో తన ముద్ర పడింది. రాఘవ కళానికేతన్‌ పేరిట ఓ నాటక సమాజాన్ని స్థాపించి దాని ఆలనా పాలనా చూసుకున్నారాయన. అవసరానికి నటించడమే కాదు.. నాటకాన్ని రాయడం, నటులతో సాధన చేయించడం, నటులను ఎంపిక చేసుకోవడం, టికెట్లు వేయించి అమ్ముకోవడం.. ఆఖరికి ముఖాలకు ఒకోసారి రంగులు వేయడంతో సహా ఎన్నో పనులు ఇష్టంగా చేశారు. డిగ్రీ చదివే రోజుల్లో పాఠ్యాంశంగా ఉన్న ‘ది మేయర్‌ ఆఫ్‌ కాస్టర్‌ బ్రిడ్జ్‌’  నవలను ఏకధాటిగా వారం రోజుల్లో ‘పరాజితుడు’ పేరిట అనువదించినంత వరకు ఆయన ఆత్మ శాంతించలేదు. ‘రాగరాగిణి’ నాటిక వ్యవహారభాష ప్రధానంగా సాగుతుంది. విభిన్న దృక్పథాల్లో జీవించే జంట మధ్య కల్లోల వాతావరణం నాటికలో ప్రతిబింబిం చేలా తీర్చిదిద్దారు. ఇందులో పతి పాత్ర సంభాషణల్లో ఒకింత ‘గిరీశం’ ఛాయలు కనిపిస్తాయి. ప్రేమించేటప్పుడు.. ఆమె నాకు సొంతమైన వస్తువు అన్న భావనే ఎక్కువగా ఉంటుందని చెబుతారు ‘పతిత’ నాటికలో. నిర్లిప్తత నిండిన పాత్రలు చివర్లో ఉద్వేగాలను నింపుకొని నాటికను రక్తికట్టిస్తాయి. గొల్లపూడి నాటక ప్రస్థానం కాలానుగుణంగా ఉండాల్సిన సహజత్వాన్ని, సరళత్వాన్నీ నూరుపాళ్లూ ఇముడ్చుకుంది. 
      రచన ఏదైనా, కథనంలో గొల్లపూడి శైలి విశిష్టమైంది. ఆయన వాక్యాలు మనసుకు హత్తుకుంటాయి. తెలుగు భాషాభిమానమూ గొల్లపూడిలో చాలా మెండు. ‘‘నేనెప్పుడూ చెబుతా ఉంటా. తెలుగు భాషను బాగు చేయాలంటే 40 ఏళ్ల వాడికి నీతిచంద్రిక ఇవ్వడమో, ఇంకేదో కాదు. తెలుగుభాష గొప్పదనం ఏంటో, దాని అవసరమేంటో, తెలుగు సౌందర్యమేంటో, దాన్ని ఎందుకు నేర్చుకోవాలో తెలియక్కర్లేని దశలో ఆ వ్యక్తి చేతికి దాని వైభవాన్ని మనసులోకి ఎక్కించే పుస్తకం చేతికివ్వాలి. నా చిన్నతనంలో మావాళ్లు బాలశిక్ష లాంటివి అలా ఇచ్చారు. ఈ తరానికి అలా చెయ్యాలి’’ అని ఓ సందర్భంలో అన్నారాయన. గొల్లపూడి భౌతికంగా దూరమైనా, ఆయన విరబూయించిన సాహితీపుష్ప పరిమళాలు ఎప్పటికీ వసివాడవు! 


అక్షర సవ్యసాచి
గొల్లపూడి విద్యార్థి దశలో ఉన్నప్పుడే ‘ఆశాజీవి’  కథతో  రచనకు  శ్రీకారం చుట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు రాసిన ‘అనంతం’ ఆకాశవాణి అంతర్విశ్వవిద్యాలయ నాటికల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. రచయితగా తన తొలి ప్రయత్నం కావడంతో అందులో కొన్ని చిరుదోషాలు దొర్లాయని, అయినాసరే- తర్వాత తాను ఎన్నో రచనలు చేసి పరిపక్వత సాధించినా  తనకు  అనంతం మీదే  మక్కువ ఎక్కువ అని గొల్లపూడి చెప్పేవారు.  ఆయన  తన రచనలకు పెట్టే పేర్లలో ఓ కొత్తదనం, ఆకర్షణ గోచరిస్తాయి.  ‘అవినీతికి ఐదు క్షణాలు, దొంగ గారొస్తున్నారు- స్వాగతం చెప్పండి..’ ఇలా ఉంటాయి అవి! మారుతీరావు ఆత్మకథ ‘అమ్మ కడుపు చల్లగా’ విశిష్టమైంది! ఆయన జీవన ప్రస్థానంలో ఎన్ని అందమైన మజిలీలు ఉన్నాయో ఇందులో చూడవచ్చు.  
      గొల్లపూడి కథల్లో ‘పాలు విరిగిపో యాయి’ ప్రత్యేకమైంది. ఓ మధ్యతరగతి కుటుంబం. భార్యాభర్తలు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి సంబంధాలు చూస్తుంటారు. కానీ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోడానికి ఇష్టపడదు. కొన్ని రోజులకు తల్లిదండ్రులు కాలం చేస్తారు. అప్పటికి తనకి వయసు మీరిపోవడంతో అవివాహితగా ఉండిపోవాల్సి వస్తుంది. ఒంటరి జీవితంలోని బాధ ఆమెకు అవగతమవుతుంది. పెళ్లికెదిగిన తన చెల్లికి విషయాన్నంతా చెప్పి, ఆమెకైనా వివాహం చేయాలనుకుంటుంది. కానీ, చెల్లి కూడా పెళ్లికి అనాసక్తి చూపిస్తుంది. దాంతో ఆమెకు తన జీవితానుభవాన్ని  చెబుతూ  ‘నిల్వ ఉంచిన పాలను కాస్తే ఎలా విరిగిపోయి పనికి రాకుండ పోతాయో, జీవితం లో కూడా వయసుకి తగ్గట్టు తగిన నిర్ణయం తీసుకోకపోతే  భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర వుతాయని’ హితవు చెబుతుంది. చెల్లిని పెళ్లికి ఒప్పిస్తుంది. చక్కటి కథ, కథనం. నాటకాలు, నవలలు, కథల నుంచి చలనచిత్రాలకు మాటలు, కథనాల వరకూ విభిన్న ప్రక్రియల్లో రచనలు చేసిన గొల్లపూడి.. ఓ అక్షర సవ్యసాచి. 

- ఓలేటి వెంకట సుబ్బారావు,
విజయవాడ


వెనక్కి ...

మీ అభిప్రాయం