మాతృభాషలో విద్యాబోధన

  • 371 Views
  • 1Likes
  • Like
  • Article Share

‘‘విజ్ఞానమంతా ఇంగ్లీషులోనే వుందనే’’ ఆధునిక ఛాందస్సులు, సమస్తం సంస్కృతంలోనే వుందనే సనాతుల మధ్య మన మాతృ భాష నలిగి పోతుంది. ప్రజలంతా నిత్యం మాట్లాడేది తెలుగు. కాని విద్యాలయాల్లో బోధించేది ఇంగ్లీషు. ఇలాంటి దురవ్యవస్థ ప్రపంచంలో అరుదు. వలస దేశాల్లో తప్ప స్వతంత్రం వచ్చి నాలుగు దశాబ్దాలు నిండుతున్నా మన మాతృభాషలో బోధించే స్థితికి రాలేదంటే సిగ్గుపడాలి.
      స్వతంత్రం వచ్చిన మరు సంవత్సరమే దేశంలోని యూనివర్సిటీల వుపాధ్యక్షులంతా మాతృభాషలోనే విద్యాబోధన సాగడం వుత్తమమని కేంద్రానికి సూచించారు. దేశంలోని రాజకీయ పక్షాలు, విద్యావేత్తలు ప్రభుత్వం నియమించిన విద్యాకమిషన్లు, డా।। రాధాకృష్ణన్‌ మాతృభాషలోనే విద్యావిధానం సాగాలన్నారు. ప్రయివేటు, పబ్లిక్, కాన్వెంటు, స్కూళ్లను రద్దు చేసినపుడే మాతృభాష అమలులోకి రాగలదని నివేదికలు సమర్పించారు.
      ఈ కృషి ఈనాటిదే కాదు. జాతీయో ద్యమ రోజుల్లోనే ఏ భాష మాట్లాడే వారికి ఆయా భాషా రాష్ట్రాలు కావాలని, మాతృ భాషలోనే విద్యాబోధన, పాలన, వ్యవహా రాలు సాగాలని ఆనాడే నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం గాలికెగిరిపోయింది.  ఇది ప్రజాస్వామిక పద్ధతికి విరుద్ధమైంది. ఇది ప్రజలను అగాధంలో దింపడమౌ తుంది. బోధించేది ఇంగ్లీషయితే పాలించేది కూడా అదే అవుతుంది. అందువల్ల ప్రజలకు తీరని హాని జరుగుతుంది.
      ఈనాటి విద్య సంపన్నులకు అనుకూలం గాను, సామాన్యులకు వ్యతిరేకంగాను వుంది. అంతేకాదు. శ్రమజీవులను అవమాన పర్చేదిగాను వుంది. ఆరుద్ర గారన్నట్లు ‘‘భాషాసాహిత్యాలు, శ్రమజీవుల నుండే పుట్టాయి, దీన్ని గుర్తించనంత కాలం ప్రగతిశూన్యం’’. విజ్ఞానశాస్త్రమంతా ఇంగ్లీషులోనే వుందన్నమాట నిజమే. అంతమాత్రాన సామాన్యులంతా ఇంగ్లీషు నేర్చుకోవాలా? భారతం మహాకావ్యమే. దాన్ని చదవడం కొరకు జనమంతా సంస్కృతం నేర్చుకోమంటే అది అజ్ఞానమే అవుతుంది. తెలుగులోకి తర్జుమా చేశారు కనుక అందరికీ తేలికయ్యింది. ఆటోమెటిక్‌ పద్ధతిలో అభివృద్ధి చెందిన నేటి అచ్చుయంత్రాల కాలంలో అనువాదం కాపీలు లక్షలు సృష్టించుకోగలం. దీనివల్ల శ్రమ- కాలం- డబ్బు కలిసివస్తుంది. అంతేకాదు, మాతృభాషలోనే సమస్త శాస్త్రాలు వంటబడతాయని శాస్త్రజ్ఞులు పదే పదే ఘోషిస్తున్నారు. భాషా పరిశోధకుడు ప్రొఫెసర్‌ హాలైన్‌ ‘‘ఇతర భాషల పదాలను సులభంగా స్వీకరించి తనలో ఇముడ్చుకొనేశక్తి తెలుగు భాషకుంది. వైద్యం, ఇంజనీరింగ్‌ విజ్ఞాన శాస్త్రాలను బోధించడానికి తెలుగు భాష, హిందీభాషకు పోటీగా నిలబడగలదని’’ వివరించారు. 
      మన తెలుగువారిలో బహుభాషా పండితులు చాలామంది వున్నారు. వారంతా విద్యాలయాల్లో నేర్చుకున్నవారు కారు. ఎప్పుడయినా ఎక్కడయినా పరాయి భాషలు నేర్చుకోవచ్చు.
      పూర్వంలాగ ఈనాడు విజ్ఞానమంతా ఇంగ్లీషుభాష గుత్తాధిపత్యంలో లేదు. రష్యా, చైనా, జర్మనీ, జపాన్, ఫ్రెంచి వగైరా భాషల్లోకూడ అభివృద్ధి చెందుతుంది. కనుక అవసరమైన వారికి ఆయా భాషలను మన యూనివర్శిటీ లలోను, కాలేజీస్థాయిల్లోను ఇచ్ఛాపూర్వ కంగా నేర్చుకొనే అవకాశం తప్పకుండా కల్గించాలి. ఎవరికి నచ్చిన భాష వారు నేర్చుకునే హక్కు వారికి వుండాలి. నిర్బంధ అధికార భాష అంటూ ఏదీ వుండకూడదు. భాష నేర్చుకోవడం ఒక కళ లాంటిది. అనువాద బృందాలను తయారుచేయడానికి ప్రత్యేక కోర్సుగా పలుభాషలుండవచ్చు. మాస్కో యూనివర్శిటీలో మన తెలుగు బోధిస్తుండగా, ఇక్కడ మనం రష్యాభాష నేర్చుకోవడం తప్పుకాదు.
      వెనుకటికి మన ఆంధ్ర యూనివర్శిటీకి రష్యానుండి జంతు శాస్త్రము బోధించడానికి ఒక మహాపండితుణ్ని రప్పించారు. ఆయనకు ఇంగ్లీషురాదు. రష్యా భాషలోనే బోధించారు. మనవారు ఇంగ్లీషులోకీ తర్జుమా చేయించుకున్నారు. ఆయన తన మాతృభాషలోనే మహా పండితుడయ్యారు. ప్రపంచంలోని అనేకమంది మహా కవులు, రచయితలు, ప్రవక్తలు, తత్వవేత్తలు తమ తమ మాతృభాష లోనే ఘనతకెక్కారు. ఏ దేశానికాదేశమే తన మాతృభాషను అభివృద్ధి చేసుకోవడంతోపాటు సాంకేతిక రంగాలలో ముందుకు వస్తుంది. మనదేశంలో ఇంగ్లీషు భాష వచ్చినవారు నూటికి ఇద్దరు మాత్రమే. మనం ఏ ఇతర రాష్ట్రాలు వెళ్లాలన్నా ఆయా రాష్ట్రాల భాషల్లోనే మాట్లాడవలసి వుంటుంది. హిందీకిగాని, ఇంగ్లీష్‌కి గాని ప్రాముఖ్యత యివ్వడంలేదు. ఎవరి మాతృభాష వారే అభివృద్ధి పరుచుకుంటున్నారు.
      ఏ భాషకాభాషే లింకుభాష. లింకుభాష అంటూ ఏదో ఇక భాషను నిర్ణయించే దశలో లేము. ఇది రాజ్యాంగము ఏర్పడ్డప్పుడే తేల్చి చెప్పారు. ఇండియాలో 845 ప్రాంతీయ భాషలున్నాయి. 15 జాతీయ భాషలున్నాయి. దీనిలో దేనినైనా తమకు ఇష్టం వచ్చినదాన్ని లింకుభాషకు ఎన్నుకోవచ్చునని రాజ్యాంగం ఆదేశిస్తుంది. దీన్ని మరుగుపర్చి హిందీ- ఇంగ్లీషుని రుద్దడం ఘోరమైన తప్పిదం. 
      భాష కేవలం విద్యావేత్తల గుత్తసొత్తు కాదు, అది ప్రజలందరు కూడబెట్టుకున్న సంపద. దానిమీద ఇతరుల పెత్తనం పనికిరాదు. పాలితుల భాష పాలకులు నేర్చుకోవాలి. ఇదే నేటి న్యాయం.
      ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జాతులు, భాషల గురించి శాస్త్రీయ దృక్పథంతో పరిష్కారం చూపిన మహానాయకుడు లెనిన్‌. రష్యా సమైక్యంగా వుండాలంటే రష్యన్‌ భాషే అధికారభాషగా వుండాలనే వాదనను ఖండిస్తూ లెనిన్‌ ఇలా అన్నారు. ‘‘మేము కోరేదేమిటంటే బలవంతంగా లాఠీతో మనుష్యులను స్వర్గంలోకి తోలడం మేము కోర[ం. ఎందుకంటే సంస్కృతిని గురించి మీరు ఎన్ని మనోహరమైన మాటలు మాట్లాడినా నిర్బంధ అధికార భాషలో బలవంతం వుంది. లాఠీని ప్రయోగించడం వుంది. గొప్ప శక్తివంతమైన రష్యన్‌ భాషకు దానిని ఎవరైనా పట్టి బలవంతంతో అధ్యయనం చేయవలసిన అవసరం వుందని మేము అనుకోవడంలేదు’’. ఆయన యింకా యిలా వ్రాశారు. ‘‘అందుకనే నిర్బంధ అధికార భాష అనేది వుండకూడదని, స్థానిక భాషలన్నిటిలోను విద్యాబోధన జరిగే పాఠశాలలు ప్రజానీకానికి సమకూర్చాలని, ఏ ఒక్క జాతికైనా గల అధిక సౌకార్యాలన్నీ జాతీయ పార్టీల హక్కుల వుల్లంఘించుట చెల్లవని ప్రకటించే మౌలిక శాస్త్రాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టాలని రష్యన్‌ మార్క్సిస్టులు చెప్పేదిదే’’. 
      ఈనాడు ప్రపంచం అంతా ఇంగ్లీషును అంతర్జాతీయ భాషగా గుర్తించినా చైనా, సోవియెట్‌ యూనియన్, జపాన్, యూరప్‌ లోని పెక్కుదేశాలు, దక్షిణ అమెరికా దేశా లలో ఇంగ్లీషు రెండవ భాషగా నేర్పబడు తుంది. అదికూడా ఐచ్ఛికంగానే, బలవంతం గా కాదు. ఈ దేశాలన్నిటిలోను బోధన ఆయా మాతృభాషల్లోనే సాగుతుంది. తమ మాతృభాషకు ఇంగ్లీషు ఏమాత్రం అడ్డు వచ్చినా వారు సహించజాలరు. అలాగే జపాన్‌ గతంలో ఇంగ్లీషు బోధనాభాషగా వున్నప్పుడు శాస్త్ర, సాంకేతికాభివృద్ధి సాధిం చలేకపోయిందని, వారి మాతృ భాష బోధించినప్పుడే వారు అన్ని విధాల అభి వృద్ధిలో అమెరికాకు పోటీగా నిలబడగలు గుతున్నారని విద్యావేత్తలు చెప్పుతున్నారు.
      కనుక విషయాధ్యయనం ప్రధానంగాని భాషాధ్యయనం కాదు. తెలియని భాషల్లో తెలియని విజ్ఞానం నేర్చుకోవడం అసాధ్యం. తెలిసిన భాషలో సమస్తం తేలికగా నేర్చుకోవచ్చు. ఉదా।। యమ్‌.బి.బి.యస్‌. లాంటి వైద్యవిద్య ఆరు సంవత్సరాలు పడుతుంది. వైద్యం నేర్చుకోవడానికి బదులు వైద్యానికి సంబంధించిన ఇంగ్లీష్‌ పదాలు, వాటి స్పెల్లింగ్, వాటి వుచ్చరణ నేర్చుకోవడమే ఒక పెద్ద సమస్యగా వుంది. ఇంగ్లీష్‌ వైద్యంతో ఇంగ్లీష్‌ రాని అశేష తెలుగు ప్రజలకు వైద్యం చేయాలా? అదే విద్య తెలుగులో బోధిస్తే 3 సం।।లలో నేర్చుకోవచ్చునని అనుభవజ్ఞులు చెప్పుచున్నారు. అలాగే అన్ని శాస్త్రాలుకూడా ఈ ధోరణిలోనే వున్నాయి. మన తెలుగులో ఇమడని టెక్నికల్‌ పదాలను మనం యితర భాషలనుండి ఎరువు తెచ్చుకోవచ్చు, ఇది దోషంకాదు. మంచిది కూడాను. శాస్త్రవేత్తలు కనిపెట్టిన శాస్త్ర సాంకేతిక పదాలు వున్నవి వున్నట్లుగానే ఉపయోగిం చుకోవాలి. ఇప్పుడు అనేకం వుపయోగించు కుంటున్నాము కూడాను. ఉదా।। రాకెట్, రేడియో, రైలు, బస్, టెలివిజన్, ఫోన్‌ వగైరా. అలాగే బ్రిటీష్‌ పాలన క్రింద వున్నప్పుడు మనకు వాడుకలో వున్న అనేక ఇంగ్లీషు పదాలను ఈనాడుకూడ వాడుకుంటున్నాము. ఉదా।। రోడ్, ప్లీడర్, జైలు, కోర్టు, గేటు, స్టేషన్‌ వగైరా పదాలను సామాన్యులు తేలికగా వాడుచున్నారు.
      అలాగే తెలంగాణ జిల్లాలలో మహమ్మదీయ పాలనలో తెలుగు భాషపై ఉర్దూ ప్రభావం పడి అనేక ఉర్దూ పదాలు తెలుగులో చొచ్చుకువచ్చాయి. వాటిని నిరభ్యంతరంగా నిలుపుకోవలసిందే. అప్పుడే మనభాష ప్రజల భాషగా వ్యవహరించ గలదు. ప్రజల వాడుకలోను, ప్రజలకు అర్థమయ్యేదిగాను వుండేదే ప్రజల భాష. ప్రజల వాడుకే కొలబద్ద. ఇంగ్లీషు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల నుండి అనేక పదాలను ఎరువుతెచ్చుకుని అభివృద్ధి అయ్యింది.
      ఇక్కడ ఒక విషయం విస్మరించరాదు. జాతీయ దురహంకారంతోను, మాతృభాషాభిమానంతోను యితర భాషలను కించపరచడం తగని పని. ఏ భాషకు ఆ భాషే గొప్ప. భాషలో ఉచ్ఛ- నీచం లేవు. ప్రపంచంలో ఏ భాషలో గొప్ప సాహిత్యం వున్నా, మన భాషలోకి అనువదించుకుందాం. భారతీయ సాహిత్యంలోని ఉత్తమోత్తమ గ్రంథాలను యితర అభివృద్ధి చెందిన దేశాలు తమ భాషలోకి అనువదించుకున్నట్లే మనము చేసుకోవాలి. అంతేగాని ప్రపంచభాష పేరుతో ఇంగ్లీషుగాని, అధికారభాష పేరుతో హిందీనిగాని, వైదికభాష పేరుతో సంస్కృతాన్నిగాని మన నెత్తిన రుద్దకోవడం ప్రమాదకరం. పైగా ఈనాటి ప్రజాస్వామిక యుగధర్మానికి విరుద్ధం.

- భూపతి నారాయణమూర్తి

‘తెలుగు జాతి తెలుగు జాతీయత’ పుస్తకం (1986) నుంచి..


వెనక్కి ...

మీ అభిప్రాయం