నెట్టింట్లో ‘నవగీతం’

  • 2394 Views
  • 505Likes
  • Like
  • Article Share

    భాను ప్రకాష్ కర్నాటి

  • మక్కపేట, కృష్ణా
  • 9533657132
భాను ప్రకాష్ కర్నాటి

‘‘నటరాజ పాదముల గజ్జల మోతకు పాటలు కూర్చే కవులుంటే కావాలి! చిలువతాలుపు గరళ కంఠమున కాలసర్పం జోల పాటలో సొక్కిపోవగ నాగస్వరమూదే కవులుంటే కావాలి! విలయవేళల ప్రళయ తాండవం చేసే శివునకు వెనక పాట పాడే కవులుంటే కావాలి’’ అన్నారు శ్రీరంగం నారాయణబాబు. ఇలాంటి వారితో పాటు చిరుజల్లులు మోసుకొచ్చే ఆహ్లాదకర వాతావరణంలో పురివిప్పే మయూరపు ఆటకు పాటను కూర్చగలిగిన కవులూ కనిపిస్తారు యూట్యూబ్‌లో. ఆనందం, ఆవేశం, ఆక్రోశం.. ఉద్వేగమేదైనా పాటతో వ్యక్తీకరించే యువ స్వరాలు వారివి. జాతీయ యువజన దినోత్సవం (జనవరి 12) సందర్భంగా స్వతంత్ర తెలుగు సంగీతానికి చిరునామాగా నిలుస్తున్న నవతరం పాటల ముచ్చట్లివి!
మనసును స్పందించేలా చేయగలిగేది సంగీతం మాత్రమే. తన్మయత్వాన్ని కలిగించడమే కాదు.. సాంత్వన చేకూర్చగలిగేదీ సంగీతమే! ప్రపంచం అధునాతన సాంకేతికత వైపు ఎంత వేగంగా పరుగులు తీస్తోందో అంతే వడిగా సంగీతమూ కొత్తహంగులు అద్దుకుని హృదయాలకు మరింత చేరువవుతోంది. ప్రధాన వినోదంగా భావించే చలనచిత్రాల్లోని పాటలు ప్రసార మాధ్యమాల ద్వారా సులువుగా అందరికీ చేరుతున్నాయి. అయితే అన్ని సందర్భాల్లోనూ చిత్రాల్లో పాటల్ని పెట్టడం సాధ్యం కాదు. అలాగే కొన్ని పాటలూ చిత్రాల్లో ఇమడలేవు. అప్పుడెలా? ఈ ప్రశ్నకు యూట్యూబ్‌ సమాధానమిస్తోంది. ఈ సామాజిక మాధ్యమం వేదికగా వివిధ నేపథ్యాల్లో వందలకొద్దీ స్వతంత్ర పాటలు అందుబాటులోకి వస్తున్నాయి. విశేష ఆదరణ పొందుతున్నాయి. ఆయా ప్రాంతాల మాండలికాలు, పదసంపదను గుర్తుచేస్తూ అందరూ పాడుకునేలా చేస్తున్నాయి. అంతేనా.. ప్రతిభ ఉన్న సంగీత దర్శకులు, గాయనీ గాయకులు, పాటల రచయితలకు ‘ఒక్క అవకాశం’ అంటూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే కష్టాల్ని తీరుస్తున్నాయి. ప్రతిభకు తగిన గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. యూట్యూబ్‌ వేదికగా తెలుగువారికి బాగా చేరువైన పాటల్లో కొన్నింటిని చూద్దాం.
      పాట అంటే పదాలన్నీ జనాల నాలుకల మీద ఆడాలి. ఇట్టే అర్థమయ్యేలా అట్టే ఆకట్టుకునేలా ఉండాలి. కాలమేదైనా జానపద గీతాలకు శ్రోతలు జైకొట్టడానికి కారణమిదే. ఇదే ఒరవడిలో నెట్టింట్లో స్వతంత్ర జానపద పాటలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. జానపద శైలిలో ఏ పాటను యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచినా కొద్ది రోజుల వ్యవధిలో లక్షల వీక్షణలు సొంతం చేసుకుంటోంది.
      తనకు బావతో లగ్గం కుదిరింది. బోలెడన్ని పనులు.. మంచం తయారీ వాటిలో ఒకటి. కాబోయే వధువు తనకూ తన మనసైన వాడికి కావల్సినట్టు మంచం చేయించడానికి నేరుగా వడ్రంగి దగ్గరికెళ్తుంది. అక్కడ తమకెలాంటి మంచం కావాలో చెప్పే పాటే ‘మదనా సుందరీ’. ‘‘సంగడి మంచాపుకోళ్లు.. సప్పుడు చేయని కాళ్లు.. చెక్కు చెదరని బెండ్లు.. చెదరాలి ఊరి కండ్లు’’ అంటూ సాగే ఈ పాట మల్లిక్‌తేజ కలం నుంచి జాలువారింది. సంగీతమూ తనే సమకూర్చారు. మామిడి మౌనిక స్వరంలో జీవంపోసుకున్న ఈ గీతం 2019 మార్చిలో విడుదలైంది. 3.28 కోట్ల వీక్షణలను సొంతం చేసుకుంది. అలాగే, కొత్తగా అత్తారింట అడుగుపెట్టే కోడలి సంబురాన్ని కళ్లకు కట్టే పాట ‘అత్తగారింటికి కొత్తగవోతున్న ఉయ్యాలో’. కొత్త రవిక, రంగురంగుల గాజులు, చెవి దిద్దులు, ముక్కుకు ముక్కెర, అద్దాల పెట్టె.. అంటూ కొత్త పెళ్లికూతురి ఆనందాన్ని చక్కగా చూపిస్తుందీ గీతం. 2.97 కోట్ల వీక్షణలను పొందిన ఈ పాట నిరుడు జులైలో యూట్యూబ్‌లోకి వచ్చింది. ‘‘బుజ్జమ్మ బుజ్జమ్మ బుద్ధిగబొయిరావే ఉయ్యాలో టుంగుటుయ్యాలో.. సూడంగ నీ బావ సూపులకి నచ్చేను.. ఉయ్యాలో టుంగుటుయ్యాలో’’ అంటూ అందరూ కొత్తకోడలికి కితాబిచ్చే ఈ పాటకు జి.ఎల్‌.నాందేవ్‌ సంగీతం అందించారు. గడ్డం రమేష్, శిరీష ఆలపించారు. బొల్లెద్దు పాల్‌ సాహిత్యం సమకూర్చారు. 
      అత్తా కోడళ్ల వాగ్వాదం ఒక్కోసారి రోజులు, నెలల తరబడి కొనసాగుతూనే ఉంటుంది. మధ్యలో ఉండే తండ్రీ కొడుకులు మాత్రం కిమ్మనకుండా చూస్తూ ఉంటారు. ఈ గొడవలకు జానపదం తోడైతే.. అదే ఈ ‘అత్తా ఓ అత్తా’ పాట. ‘‘నువ్వుగూడ ఓనాడు అత్తకు కోడలివేగదా ఓ అత్తా మరిసిపోయినవా..’’ అంటూ కోడలు చురకలంటిస్తే, ‘నేనేం నీలా కాదు’ అంటూ అత్త వాతలు పెడుతుంది. నాలుగేళ్ల కిందట నెట్టింట్లో మొదలైన వీళ్లిద్దరి గొడవ 2.32 కోట్ల వీక్షణలను సొంతం చేసుకుంది. బావ కోసం ఎదురుచూపులు.. మరదలి మనసులో గూడుకట్టుకున్న భావాలు, ఆమె తపన ‘బావా ఓ సారి రావా..’ పాటలో అందంగా కనపడతాయి.. హృద్యంగా వినపడతాయి. ‘‘నా కంట కన్నీరు నీకంత మంచిది కాదు బావో... ఓసారి రా బావా’’ అంటూ సాగే ఈ పాట గతేడాది ఆగస్టులో విడుదలైంది. ఇప్పటికే రెండుకోట్లకు పైగా వీక్షకులు చూసి నాలుగువేలకు పైగా వ్యాఖ్యలు పెట్టేశారు. మాట్ల తిరుపతి రాసిన ఈ గీతాన్ని మౌనిక పాడారు. 
      అప్పు తెచ్చి సాగు చేసిన పంట నష్టం మిగిల్చింది. నీటిజాడ కోసం తవ్విన బావి వడ్డీ రూపంలో వెక్కిరించింది. కష్టానికి తండ్రి గుండె ఆగింది. పూట గడవని స్థితిలో అప్పు తీర్చడానికి కొడుకు పట్నానికి వెళ్తాడు. ఏడాదైనా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. కొడుకుని విడిచి ఉండలేని తల్లి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ రాసే లేఖే ‘‘ముద్దుల రాజాలో కొడుకో’’ పాట. ‘‘అప్పులొడ్డి తాళలేక అయ్య ఆత్మ సచ్చిపాయె’’ అంటూ పరిస్థితిని వివరిస్తూ, ‘‘ఇసిరిపడితె వరం మీద కాళ్లూ రెక్కలిరిగిపాయే.. లేసెదెట్లరో కొడుకో, చేసేదెట్లరో కొడుకో!’’ అంటూ కంటతడి పెడుతుంది ఆ తల్లి. కోదరి శ్రీను సాహిత్యం గుండెను మెలిపెడుతుంది. పైలం సంతోష్‌ గానం చేసిన ఈ గీతం 2014 జూన్‌లో యూట్యూబ్‌ వీక్షకుల ముందుకు వచ్చింది. 44.68 లక్షల వీక్షణలను పొందింది. 
ర్యాప్‌.. పాప్‌ జోరు
తెలుగులో ఇదో సరికొత్త సంగీత ప్రవాహం. నోయల్, రోల్‌రైడా, కమ్రాన్, ఎమ్‌సీ మైక్, ఎమ్‌సీ ఉకీన్, సృజన్‌ లాంటి వారు తెలుగు ర్యాప్‌ ప్రపంచంలో తమదైన బాణీలు వినిపిస్తూ యువతను ఉర్రూతలూగిస్తున్నారు. ఈతరం సంగీత ప్రియులు అమితంగా ఇష్టపడుతున్న ఈ శైలిలో ఇటీవలి కాలంలో ఎక్కువ సంఖ్యలో పాటలు విడుదలవుతున్నాయి.
      హైదరాబాదీ యువత జీవనశైలిని ర్యాప్‌లో చెప్తే ఓ కిక్కు ఉంటుంది. ఎన్ని బాధలొచ్చినా సరే, ఏమాత్రం భయపడొద్దనే పాట ‘జింపక్‌ చిపక్‌’. సన్నీ అస్టీన్‌ సంగీతం సమకూర్చారు. ఎంసీ మైక్, యునీక్, ఓం శ్రీపతి, సన్నీ అస్టీన్‌ల బృందం ఆలపించింది. ఈ పాట ప్రభావం ఎంతంటే ‘జింపక్‌’ అనగానే మొత్తం హైదరాబాదీ యువతంతా చిందులేస్తుంది. 2016 మార్చిలో విడుదలైన ఈ పాటకు 3.62 కోట్ల వీక్షణలు వచ్చాయి. 
      సంక్రాతి పండగంటే తెలుగుదనం ఉట్టిపడే రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలే కాదు.. గాలిపటాలు కూడా. హైదరాబాదు జంటనగరాల్లో ఆ సందడి గురించి అందరికీ తెలిసిందే. ఆ హడావుడిని ర్యాప్‌లో వినిపించిన పాట ‘పతంగ్‌’. రోల్‌రైడా గాత్రం, కమ్రాన్‌ అందించిన సంగీతం, ర్యాప్‌ ఇష్టపడనివారిని కూడా ఆకర్షిస్తుంది. ఇప్పటికీ తెలుగులో ర్యాప్‌ అనగానే ఈ పాట ప్రస్తావన తప్పనిసరి. మూడేళ్ల కిందట యూట్యూబ్‌లోకి వచ్చిన ఈ పాటకు 2.71 కోట్ల వీక్షణలు లభించాయి. ‘టిపిరి టిపిరి’, ‘హేపిల్ల’ వంటి ర్యాప్‌ పాటలూ ఇదే స్థాయిలో అలరించాయి.
డీజే వాద్యాల హోరు
మంచి జోష్‌ ఇచ్చే పాటలను ఈతరం కుర్రాళ్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తొలి నుంచి చివరి దాకా ఎక్కడా తగ్గకుండా వాద్యాలు మోగుతుంటే.. పరవశంతో పదానికి పాదం కలిపే యువత కోకొల్లలు. వీళ్లకు ఇంతలా నచ్చేస్తున్న ఇలాంటి వాటినే డీజే పాటలంటూ పిలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ఆదరణ సంపాదించుకున్న పాట ‘కానాల కోకదానా.. హిప్పీ కటింగుదాన’..! ‘‘రజితో అడగాలనున్నదే రజితా..’’ అంటూ జానపదం, డీజే శైలిలో రూపొందించిన ఈ పాటను హనుమంత్‌ యాదవ్‌ ఆలపించారు. ప్రేమించిన అమ్మాయిని ఎన్నో అడగాలనుందని చెబుతూనే పొగడ్తలతో ముంచెత్తుతాడు ఆ ప్రేమికుడు. ఏడాదిన్నర కిందట విడుదలైన ఈ పాటకు రికార్డు స్థాయిలో 9.10 కోట్ల వీక్షణలు వచ్చాయి. 
      ‘‘చార్‌మీనారు చార్‌ కమాన్‌ సూపీ మావయ్యో.. లాడ్‌ బజార్లో రవ్వల గాజులు వేపీ మావయ్యో’’ అంటూ సాగే ‘పలుగురాళ్ల..’ పాటకు దక్కిన ఆదరణ కూడా తక్కువేమీ కాదు. యశ్‌పాల్‌ సాహిత్యం, రవి కల్యాణ్‌ సంగీతం ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి. ‘రేలా రేలారే’ కార్యక్రమంతో గుర్తింపు పొందిన గాయని గంగ ఈ పాటను పాడారు. తెలంగాణ చారిత్రక సంపదను, సంస్కృతిని గుర్తుచేస్తూ సాగుతుందీ గీతం. సెప్టెంబరు 2018లో ఈ పాటను యూట్యూబ్‌లో ఉంచితే 1.5 కోట్లకుపైగా వీక్షణలు వచ్చాయి. రెండు నెలల తర్వాత ఇదే పాట డీజే శైలిలో విడుదలయ్యి ఇంకా విజయవంతమైంది. 7.15 కోట్ల వీక్షణలను దక్కించుకుంది. 
కదిలించేవీ...
రాన్రానూ పెళుసుబారిపోతున్న మానవ అనుబంధాలను, సమాజంలో పెరుగుతున్న అంతరాలని ప్రతిబింబించే స్వతంత్ర గీతాలూ వస్తూనే ఉన్నాయి. మాతృ, పితృ, స్నేహితుల దినోత్సవాలు.. సందర్భాన్ని బట్టి పాటల్ని రూపొందిస్తున్నారు ఔత్సాహికులు. అమ్మ ఔన్నత్యాన్ని వర్ణిస్తూ ‘సృష్టికి జీవం పోసింది అమ్మ’ అనే పాటను రాసి, తానే ఆలపించారు మాట్ల తిరుపతి. ‘‘ఒంటిలో సత్తువ వత్తిగా చేసి.. నెత్తుటి చుక్కలు చమురుగాబోసి పసిబిడ్డలోన ప్రాణదీపాన్ని వెలిగించబూనినావు’’ అంటూ సాగే ఈ గీతం మాతృమూర్తి ఔన్నత్యానికి అద్దంపడుతుంది. 2017 మహిళా దినోతవ్సం సందర్భంగా విడుదలైన ఈ పాట 2.51 కోట్ల వీక్షణలు పొందింది. 
      ఎంతో శ్రమకోర్చి రాయిని విగ్రహంగా మార్చిన శిల్పి.. ఆ విగ్రహం గుడిలో చేరాక అంటరానివాడయ్యాడు. సంబురంగా భగవంతుడికి వస్త్రాలు నేసిన చేనేత కార్మికుడికి కట్టుకోడానికి జత బట్టలు కరువయ్యాయి. ఇదేం విచిత్రమంటూ వివక్షను ప్రశ్నించే పాట ‘నువ్వో రాయి.. నేనో శిల్పి’. చరణ్‌ అర్జున్‌ పాటను రాయడమే కాకుండా స్వరపర్చారు. ‘‘మా పుట్టుకబట్టి చేసే పనులకి ఏవేవో పేర్లు పెడితివి. ఉన్నోడు లేనోడంటూ తేడాలే చూపి నువ్‌కూడా మనిషైపోతివీ’’ అంటూ సమాజం పోకడను విశ్లేషించే ప్రయత్నం చేశారు. 1.17 కోట్ల వీక్షణలు పొందిన ఈ పాట నిరుడు మార్చిలో విడుదలైంది. 
ప్రేమ.. ప్రణయం.. విరహం 
రెండక్షరాల పదమే అయినా నూరేళ్ల బంధాన్ని నిలిపి ఉంచగలిగేది ప్రేమ. అలాంటి ప్రేమ మీద స్పందించని కవులు ఉంటారా! ప్రేమను వ్యక్తపరిచే సందర్భం, బంధం, విరహం, వేదన.. ఇలా ఎన్నో ఇతివృత్తాలతో వచ్చిన స్వతంత్ర పాటలు అనేకం! వారానికి ఓ పాట రూపొందుతూనే ఉంటోంది. 
      ‘‘పాదం వెదికిన ప్రతి తీరం తెలిపిన శశిదీపం నీ స్నేహమే!’’ అంటూ యువత మదిని గెలుచుకుంది ‘నీవే.. ఎటు కదిలిన నీవే’ పాట. దీన్ని శ్రీజో రచించారు. ఫణి కల్యాణ్‌ సంగీతం అందించారు. నృత్యరూపకంగా సాగే ఈ గీతానికి గోమతేష్‌ దర్శకత్వం వహించారు. నిరుడు మార్చిలో యూట్యూబ్‌లోకి వచ్చిన ఈ పాట 3.28 కోట్ల వీక్షణలను అందుకుంది. అలాగే, ఈమధ్య కాలంలో బాగా ఆదరణ పొందిన పాట ‘గుర్తుకొచ్చినప్పుడల్లా’. లక్ష్మణ్‌ సాహిత్యానికి కల్యాణ్‌ స్వరాలద్దారు. ‘‘నువ్వంటే పిచ్చే.. నీకోసం చచ్చే ప్రాణం నీది కాదా!’’ అంటూ విఫలమైన ప్రేమను తలచుకునే ఓ కుర్రాడి ఆవేదనే ఈ గీతం. దీన్ని రాము పాడిన తీరు యువతను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 2019లో విడుదలైన ఈ పాటకు 3.38 కోట్ల వీక్షణలు వచ్చాయి. ఇలాంటిదే మరో పాట.. ‘ఎల్లిపోకే’. ‘‘మాయమయ్యే చందమామ నీలా.. ఒంటరయ్యే చుక్కలన్నీ నాలా’’ అంటూ ప్రేయసి లేని ఒంటరి జీవితాన్ని తట్టుకోలేని ప్రేమికుడి మనసులోని మాటలే ఈ గీత సాహిత్యం. దిలీప్‌ దేవగణ్‌ రాసి పాడిన ఈ పాటకు ఇంద్రజిత్‌ సంగీతం సమకూర్చారు. నిరుడు మేలో విడుదలైన ఈ పాటకు 3.39 కోట్ల వీక్షణలు వచ్చాయి.
      ఇవేకాదు ‘చలో చలో కమలమ్మ, ఎన్నాళ్లకు వచ్చినాయి జొన్నల బండ్లు, వదినె నువ్వొచ్చే, ఓ పిల్లో మౌనికో, అందాల నా మొగుడు, రాములో రాములా, ఏమిచ్చావని నిందించకురా నాన్నను, గల్లీ కా గణేష్‌’.. ఇలా లెక్కకు మించి స్వతంత్ర గీతాలు నిత్యం యూట్యూబ్‌ వీక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రతిభావంతులైన కవులు, కళాకారులని వెలుగులోకి తీసుకువచ్చే వారధులుగా నిలుస్తున్నాయి. అన్నిటికీ మించి చక్కటి వ్యవహారిక తెలుగులో కవితాత్మక భావ వ్యక్తీకరణలతో సాగే ఈ పాటలు.. ఈతరానికి నచ్చే పద్ధతిలో అమ్మభాషను వారికి చేరువ చేస్తున్నాయి.
హిజ్రాల మీద పాట 
భిన్నమైన నేపథ్యం, సరికొత్త రీతిలో గాత్రం, ప్రతి పాటలో వైవిధ్యం కలిస్తే రాహుల్‌ సిప్లిగంజ్‌. తన పాటకు వినసొంపైన సంగీతం తానే సమకూర్చుకుంటాడు. తన గాత్రంతో పాటను మరోస్థాయికి తీసుకెళ్తాడు. సొంత యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ పాటలను విడుదల చేస్తుంటాడు. ప్రతి వీడియో కూడా వీక్షణల సంఖ్యలో వేగంగా కోటి మైలురాయిని దాటిపోతూంటుంది. ఇటీవలే హిజ్రాల మీద ఓ పాటను విడుదల చేశాడు రాహుల్‌. సమాజంలో అంతులేని వివక్షకు గురవుతున్న వర్గంతో సహానుభూతి చెందుతూ తను రూపొందించిన ఈ గీతానికి మంచి ఆదరణ లభించింది. 


మట్టిలో మాణిక్యం 
మైమరపింపజేసేలా పాడటం ఆమె ప్రతిభ. అదే ఊళ్లో ‘ఓ చెలియా.. నా ప్రియ సఖియా’ అంటూ పాడుకున్న బేబీని గాయని బేబీని చేసింది. ఈవిడతో సంగీత దర్శకుడు, గాయకుడు రఘు 
కుంచె ఓ పాట రూపొందించారు. ‘‘మట్టిమనిషినండి నేనూ.. మాణిక్యమంటారు నన్ను’’ అంటూ బేబీ పాడిన పాట 30 లక్షలకు పైగా వీక్షణలను సాధించింది. లక్ష్మీ భూపాల ఈ పాట రాశారు. 


స్పందించే గళం
చెప్పాల్సిన విషయాన్ని నేరుగా మనసుకే తగిలేలా ర్యాప్‌ శైలిలో చెబుతాడు రోల్‌రైడా. తన ర్యాప్‌ నైపుణ్యం సినిమా అవకాశాల్ని తెచ్చిపెట్టింది. అయినా సామాజిక స్పృహతో సొంతంగా పాటలు రూపొందిస్తుంటాడు. ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల మీద తను విడుదల చేసిన ‘అరుపు’ ర్యాప్‌ గీతం మనసుల్ని బరువెక్కిస్తుంది. ‘‘క్యాండిల్‌ పట్టుకొని వాకింగ్‌ చేస్తారు.. క్యాండిల్‌ ఆగిపోగానే ఇంటికెళ్లిపోతారు!’’ అంటూ సమాజం తీరును ఆక్షేపిస్తుందీ గీతం. 


మాది జగిత్యాల. 2004 నుంచి సంగీత రంగంలో ఉన్నాను. యూట్యూబ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత పల్లెపాటల్ని అందుబాటులోకి తీసుకోవడం సులువైంది. కళాకారులందరికీ గొప్ప వేదిక ఇది. ప్రేక్షకుల ఆదరణే మా బలం. మా ప్రాంతంలోని మాండలికాలు, పదాల్ని పరిచయం చేసేందుకు అవకాశం దొరికింది. కైలాటకం అనే పదాన్ని నా పాటలో రాస్తే, ఎంతోమంది ఆ పదం కోసం నన్ను సంప్రదించారు. ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను.. ఈ వేదిక ద్వారానే కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకోవడం సులభమైంది. సరిగ్గా ఉపయోగించుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. 

- మల్లిక్‌ తేజ, పాటల రచయిత, గాయకుడు, సంగీత దర్శకులు


పనులు చేసుకుంటూనో, కాలక్షేపం కోసమో పల్లెల్లో పాడుకునే పాటలు ఇప్పుడు వినిపించట్లేదు. కలం పట్టకుండానే ఊపిరిపోసుకున్న వేలకొద్దీ పాటలు మన ముందుతరాల వారి దగ్గర ఉన్నాయి. వాటిని ఇప్పటితరాల వారికి అందించే ప్రయత్నం చేస్తున్నా. అలాగే, సొంతంగా యాభైకి పైగా పాటలు రాశాను. సినిమా అవకాశాలూ బాగానే వస్తున్నాయి. ఒక్కోపాటను వీడియోగా రూపకల్పన చేసేందుకు సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ ఖర్చవుతోంది. సినిమాల్లోనూ ఈమధ్య కాలంలో జానపద ఛాయలున్న పాటలు రావడం మంచి పరిణామం.    

- గడ్డం రమేష్, పాటల రచయిత, గాయకుడు, సంగీత దర్శకులు


ఇప్పటివరకు 200 పాటలకు పైగా రాశాను. ఒక దశలో తెలుగునాట జానపదానికి ఆదరణ తగ్గిపోయింది. అయితే, యూట్యూబ్‌ వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఈ ధోరణి మళ్లీ జానపదానికి ఊతమిచ్చింది. పల్లెపాటలంటే ప్రజలు ఎంతగానో మక్కువ చూపిస్తున్నారు. పాట బాగుందంటే చాలు.. బ్రహ్మరథం పడుతున్నారు. కళాకారులు సంతోషంగా ఉంటున్నారు. ఇప్పటివరకు ఆరు సినిమాలకు పాటలు రాశాను. ఇంకా అవకాశాలు వస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పాటల రూపకల్పన కూడా సులువైంది. మొత్తమ్మీద తెలుగుపాటకు ఇది మంచి సమయం. 

- లక్ష్మణ్, పాటల రచయిత, గాయకుడు 


స్వతంత్ర గీతాలకు మంచి ఆదరణ వస్తోంది. సామాజిక స్పృహ ఉన్న పాటలను యువత కూడా బాగా  స్పందిస్తున్నారు. ‘నువ్వోరాయి, నేనో శిల్పి’ లాంటి పాటలకు వస్తున్న ప్రశంసలు సంతృప్తినిస్తున్నాయి. సందర్భానుసారంగా సినిమాల్లో పాటలు రాస్తాం. కొన్ని అంశాల్ని సినిమాల ద్వారా చూపించడానికి అవకాశం ఉండదు. ఆ అంతరాన్ని  యూట్యూబ్‌ భర్తీ చేసింది. నేరుగా ప్రేక్షకుడికి పాటల్ని చేర్చే వేదికగా కీలకపాత్ర పోషిస్తోంది. సినిమా అవకాశాలు పెరిగినా, స్వతంత్ర పాటల రూపకల్పన ఆపను.

- చరణ్‌ అర్జున్, పాటల రచయిత, సంగీత దర్శకులు


వెనక్కి ...

మీ అభిప్రాయం