అనిశము దలచరో అహోబలం

  • 1210 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

నల్లమల కొండల వరసను ఆదిశేషుడు అనుకొంటే తోకభాగంలో ఉండేది శ్రీశైలం. తలభాగంలో కొలువైంది తిరుమల. నడుము భాగంలో నెలవైంది అహోబిలం. చుట్టూ కొండలు, దట్టమైన అడవులు, భవనాశినీ జలధారలు, వన్య మృగాలు, చెంచుపెంటలతో రమ్యమైన ప్రకృతి ఒడిలో కొలువైన నవ నారసింహ క్షేత్రం అహోబిలం. అన్నమయ్య కీర్తనల్లో నిండుగా కనిపిస్తూ.. విజయనగర శిల్పకళతో అలరారే ఈ ప్రాచీన దేవాలయ సముదాయం.. తొలి తెలుగు స్థలపురాణ రచనకు స్ఫూర్తిగా నిలిచిన పుణ్యభూమి!
హిరణ్యకశిపుడు
ఎంతగా చెప్పినా ప్రహ్లాదుడు మాత్రం హరిభక్తి మార్గాన్ని వీడలేదు. ఎన్ని శిక్షలు విధించినా ఆ పసిబాలుడు మాత్రం ‘‘చక్రి చింతలేని జన్మంబు జన్మమే?/ తరళ సలిల బుద్బుదంబు గాక/ విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే/ పాదయుగము తోడి పశువుగాక!’’ అని తండ్రికే ధర్మాన్ని బోధిస్తాడు. విసిగి వేసారిన హిరణ్యకశిపుడు ‘ఇంతకూ నీ హరి ఎక్కడరా?’ అని అడిగాడు. ‘‘ఇందుగలడందు లేడని/ సందేహము వలదు చక్రి సర్వోపగతుం/ డెందెందు వెదకి చూచిన/ అందందే గలడు దానవాగ్రణి వింటే!’’ అంటాడు ప్రహ్లాదుడు. అంతే నరసింహావతార ఘట్టానికి అంకురారోపణ జరిగింది. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. మిగిలిన అవతారాల్లో విష్ణువుకు తనకు ఇష్టం వచ్చినట్లు స్వయంగా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కానీ ఈ ఘట్టంలో అలా కాదు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి అవతరించాలి. దీన్నే ‘‘ఎన్నడి ప్రహ్లాదుడు ఎక్కడ జూపునో యని/ లోకమెల్ల నృసింహ గర్భములై’’.. నరసింహుడికి జన్మనిచ్చేందుకు లోకమంతా గర్భంగా మారిపోయిందంటాడు అన్నమయ్య. 
      కొడుకు మాటలు విన్న హిరణ్యకశిపుడు ‘ఓరీ! నీ హరి అంతటా ఉన్నాడంటున్నావు. మరి ఈ స్తంభంలో కూడా ఉన్నాడా?’ అంటే ‘ఉన్నాడు నాన్నా’ అంటాడు ప్రహ్లాదుడు. దాంతో హిరణ్యుడు వజ్రాయుధంతో సమానమైన తన కఠిన హస్తంతో స్తంభాన్ని ఒక్క చరుపు చరుస్తాడు. భూనభోంతరాలు దద్దరిల్లేలా స్తంభం బద్దలవుతుంది. ‘‘నరమూర్తిగాడు కేవల/ హరిమూర్తియు గాడు మానవాకారము కే/ సరి యాకారమునున్నది/ హరి మాయా రచితమగు యథార్థము చూడన్‌’’... అలా స్తంభంలోంచి నరకేసరి రూపంతో విష్ణువు అవతరిస్తాడు. వరగర్వంతో మిడిసిపడు తున్న హిరణ్యకశిపుణ్ని, అతని ఊహకు అందని రీతిలో సంహరిస్తాడు. తర్వాత ప్రియభక్తుడి కోరిక మేరకు శాంతిస్తాడు. అలా ఉగ్రసింహుడు శాంతమూర్తిగా మారి ప్రహ్లాద వరదుడయ్యాడు.
అహోబలం అహోబలం
హిరణ్యకశిపుణ్ని చంపేయడంతో దేవతలు, మునులు నృసింహుడి బలానికి ఆశ్చర్యపోయి ‘‘అహో వీర్యం అహోశౌర్యం అహోబాహు పరాక్రమం/ నారసింహం పరందైవం అహోబలం అహోబలం’’ అని ప్రస్తుతించారట! అలా నరసింహుడు వెలసిన ప్రదేశానికి అహోబలం అనే పేరువచ్చింది. కాలక్రమంలో జనసామాన్యం నోటిలో అది అహోబిలంగా మారిపోయింది. ఇక్కడి స్వామిని అహోబలేశుడు అని కూడా పిలుస్తారు. ఈయనే సామాన్యుల పలుకుల్లో ‘ఓబులేశుడు’ అయ్యాడు. క్రీ.శ. ఎనిమిదో శతాబ్దానికి చెందిన తిరుమంగై ఆళ్వారు అహోబిలాన్ని ‘సింగవేల్‌ కుండ్రం’ అని పేర్కొన్నాడు. తమిళులు ఇప్పటికీ ఇలాగే పిలుస్తారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎగువ- దిగువ అహోబిలంగా పేరుగాంచిన ఈ వైష్ణవ దివ్యక్షేత్రంలో ఎగువ అహోబిలానికి చేరుకోవడం ఒకప్పుడు కష్టసాధ్యం. ఈ విషయాన్ని తిరుమంగై ఆళ్వారు కూడా పేర్కొన్నాడు. అయితే అహోబిలం మఠం 44, 45వ మఠాధిపతులైన ముక్కూర్‌ అళగీయ సింగర్, విల్లివలం అళగీయ సింగర్‌ చొరవ వల్ల అక్కడికి వెళ్లడం ఇప్పుడు సులభ సాధ్యమైంది. ప్రస్తుత మఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ 46వ వారు.
విజయనగర శిల్పకళ
అహోబిలం నవ నారసింహ క్షేత్రం. వీటిలో ఎగువ అహోబిలంలోని ఉగ్ర నరసింహ, దిగువ అహోబిలంలోని ప్రహ్లాద వరద నరసింహ ఆలయాలు ప్రధానమైనవి. ఈ రెండూ ద్రావిడ శైలిలో, విజయనగర రాజుల పోషణలో ప్రవర్ధమానమయ్యాయి. ముఖ్యంగా దిగువ అహోబిలం ఆలయం విశాల ప్రాంగణంలో అత్యున్నత శిల్పకళతో అలరారుతోంది. ఆలయంలోకి ప్రవేశించడానికి రెండు ద్వారాలను దాటి వెళ్లాలి. మొదటి ద్వారం మీదున్న గోపురం తక్కువ ఎత్తుతో ఉంటుంది. అది దాటితే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ తర్వాత ఎత్తయిన గాలి గోపురాన్ని కలిగిన మహాద్వారం వస్తుంది. రెండువైపులా గోడల మీది నరసింహావతారం, దశావతారాలు, బల్లి, ఉడుము, అన్నమయ్య శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ద్వారం మొదటినుంచీ ఉన్నప్పటికీ గోపురాన్ని మాత్రం 1960లలో 44వ మఠాధిపతి నిర్మింపజేశారు. 
      రెండో ద్వారాన్ని దాటుకొని లోపలికి ప్రవేశిస్తే దర్శనమిచ్చేది ఆలయ ముఖమండపం. నరసింహావతార కథలు, చెంచులక్ష్మిని అనునయిస్తున్న నరసింహుడు, రామాయణ ఘట్టాలు, వ్యాళాలు, ప్రధాన స్తంభాల్లో మలచిన చిన్న చిన్న స్తంభాలతో విజయనగర శిల్ప కళా వైభవాన్ని ఇది కళ్లముందు నిలుపుతుంది. 82 స్తంభాలతో ఉండే ఈ మండప నిర్మాత శ్రీకృష్ణ దేవరాయలు. మండపం వెలుపల ఆలయ పీఠం మీద గజదళం, ఆశ్వికుల తోరణాలు కనువిందు చేస్తాయి. ఇవి నాటి సైన్యంలో గజ, తురగ, పదాతి దళాల ప్రాధాన్యాన్ని చాటిచెబుతాయి. అయితే అసంపూర్తిగా ఉన్న రంగమండపం పైకప్పును 1930ల్లో రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్‌ రామ్‌ కుమార్‌ బంఘత్‌ అనే వ్యాపారి నిర్మింపజేశాడట. రంగమండపం దాటుకుని ముందుకు వెళ్తే అంతరాళం, ఆ తర్వాత వచ్చేది ప్రహ్లాద వరదుడు కొలువైన గర్భాలయం. ఇందులో నరసింహస్వామి, తొడమీద స్వామివైపు తిరిగి కూర్చున్న అమృతవల్లీ తాయారు మూర్తి దర్శనమిస్తుంది. మామూలుగా దేవీదేవుళ్లు ఇద్దరూ భక్తులను చూస్తున్నట్లు ఉంటారు. ఇక్కడ మాత్రం తమ దగ్గరికి వచ్చిన వారి తరఫున అమ్మవారు స్వామికి ఏదో చెబుతున్నట్టు ఉంటుంది. 
      నరసింహ ఆలయం పక్కనే అమృతవల్లీ తాయారు (లక్ష్మీదేవి) గుడి కొలువైంది. రెండు ఆలయాలకూ విమాన శిఖరాలు ఉంటాయి. గర్భాలయ నిర్మాణం కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో జరిగినట్లుగా చెబుతారు. మిగిలిన నిర్మాణాలు రెడ్డిరాజులు, విజయనగర రాజుల కాలంలో పూర్తయ్యాయి. దిగువ అహోబిలం ఆలయ ప్రాంగణంలోనే శ్రీవేంకటేశ్వర, కోదండ రామాలయాలు కూడా ఉంటాయి. ఆలయ ప్రాంగణానికి వెలుపల ఒక విజయస్తంభం కనిపిస్తుంది. తురుష్క దండయాత్రల నుంచి ఆలయాన్ని కాపాడిన సంఘటనకు గుర్తుగా 1584లో శ్రీరంగరాయలు ఈ స్తంభాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి శాసనం ద్వారా తెలుస్తోంది. వెలుపలి భాగంలో విశాలమైన పుష్కరిణి... అక్కడే అహోబిలం మఠం కూడా ఉంటాయి. ఏటా లక్ష్మీనృసింహ కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు పంపిస్తారు. అన్నమయ్య జయంతి రోజున అహోబిల మఠాధిపతిని సత్కరిస్తారు.
నవ నారసింహులు
జ్వాలా నరసింహ:
ఎగువ అహోబిలం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో అచలచల మేరు పర్వతం మీద చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే పరిసరాలతో అలరారే ఆలయమిది. గుహలో స్వామి స్తంభోద్భవుడిగా, హిరణ్య కశిప సంహారకుడిగా రెండు రూపాల్లో దర్శనమిస్తాడు. ఆ రూపం భయానకంగా ఉంటుంది కాబట్టి ఆయన జ్వాలా నరసింహుడు అయ్యాడు. కొండమీది నుంచి భవనాశినీ నది ఆవిర్భవిస్తుంది. మార్గమధ్యంలో మరిన్ని జలధారలను తనలో కలుపుకుంటుంది. దగ్గర్లోనే హిరణ్యకశిపుణ్ని చంపిన తర్వాత నరసింహ స్వామి తన నెత్తుటి చేతులను కడుక్కున్నట్లుగా చెప్పే ‘రక్తకుండం’ ఉంటుంది. మరోవైపు తన స్వామిని మోసుకెళ్లేందుకు స్వయంగా గరుత్మంతుడే నేలకు దిగివచ్చినట్లుగా ఉండే గరుడాద్రి కనువిందు చేస్తుంది. 
అహోబల నరసింహ: నవ నారసింహ ఆలయాల్లో ప్రధానమైంది, బహుశా ప్రాచీనమైన ఆలయం ఇదే. దిగువ అహోబిలం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవుల్లో వేదాద్రి, గరుడాద్రి కొండల మధ్య కొలువైంది. ఇక్కడ స్వామి స్వయంభువు, ఉగ్రరూపుడు. విజయనగర శైలిలో నిర్మితమైన ఆలయంలో ఉగ్ర నరసింహుడితో పాటు లక్ష్మీదేవి, చెంచులక్ష్మి మూర్తులతో పాటు అహోబిల మఠం తొలి అధిపతి శ్రీవణ్‌ ఆదివణ్‌ శఠకోప యతీంద్రులు, ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన సుదర్శన చక్రం, శివాలయం ఉంటాయి.
మాలోల నరసింహ: ఎగువ అహోబిలానికి దగ్గర్లో వేదాద్రి మీద కొలువుదీరిన ఆలయం ఇది. ‘మా’ అంటే లక్ష్మి, ‘లోల’ అంటే ప్రియుడు. పేరులో ఉన్నట్లుగానే ఇక్కడ లక్ష్మీదేవి నరసింహస్వామి తొడమీద ఆసీనురాలై ఉంటుంది. అహోబిలం మఠం జీయర్లు తమ సంచారంలో వెంట తీసుకెళ్లే ఉత్సవమూర్తి మాలోల నరసింహుడే. అన్నమయ్య ‘‘గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె/ సిరులొసగె చూడరో చింతామణి ఈపె’’ అని ఇక్కడి లక్ష్మీదేవిని కీర్తించాడు.
క్రోడ నరసింహ: అంటే వరాహ నరసింహుడు. ఎగువ అహోబిలం ఆలయానికి దగ్గర్లో ఉండే ఈ గుడిలో స్వామి వరాహ ముఖం, సింహం తోక, మానవశరీరంతో భూదేవిని ఉద్ధరిస్తున్న రూపంలో దర్శనమిస్తాడు.
కారంజ నరసింహ: కారంజం అంటే కానుగుచెట్టు. అంటే కానుగుచెట్టు కింద వెలసిన దేవుడన్న మాట. పద్మాసనంలో ఉన్న నరసింహ మూర్తి శిరసును ఆవహించి ఆదిశేషుడు ఉంటాడు. ఆంజనేయుడు రాముడి గురించి తపస్సు చేయగా నరసింహుడు సాక్షాత్కరించాడట. తనకు రాముడి రూపమే కావాలనడంతో.. నరసింహస్వామి తనకూ రాముడికీ అభేదాన్ని చూపుతూ ధనుర్బాణాలను ధరించాడట. అంతేకాదు ఇక్కడి స్వామికి ఫాలనేత్రం ఉంటుంది. దిగువ నుంచి ఎగువ అహోబిలానికి వెళ్లే మార్గంలో కొలువైన కారంజ నరసింహుణ్ని అన్నమయ్య ‘కానుగుమాను నరసింహుడు’ అన్నాడు.
భార్గవ నరసింహ: పరశురాముడు (భార్గవ రాముడు) తపసు చేసిన చోట వెలసిన దేవుడు. ఒకచేతిలో శంఖం, మరో చేతిలో చక్రం, మిగిలిన రెండు చేతులతో హిరణ్యుడి పొట్ట చీలుస్తున్న మూర్తి ఇక్కడి స్వామిది. విగ్రహం ముందు నిల్చున్న భంగిమలో ప్రహ్లాదుడి విగ్రహం ఉంటుంది. స్థానికంగా భార్గవూటి నరసింహుడిగా పిలిచే ఈ ఆలయం దిగువ అహోబిలానికి దగ్గర్లో అడవిలో ఉంటుంది.
యోగానంద నరసింహ: దిగువ అహోబిలం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. నరసింహుడు యోగాసనంలో ఉంటాడు. 
ఛత్రవట నరసింహ: ఛత్రవట- అంటే మర్రిచెట్టు నీడలో వెలసిన నరసింహుడని అర్థం. తమ మధురమైన గాత్రం, మైమరపించే నాట్యంతో తనను మెప్పించిన ‘హాహా- హూహూ’ అనే గంధర్వులకు ముల్లోకాలలో సాటిలేని కళాకారులు అవుతారని నరసింహస్వామి వరమిచ్చాడట. పద్మాసనంలో, ప్రసన్న వదనంతో ఉండే ఛత్రవట నరసింహుడు సంగీతప్రియుడు. ఈ ఆలయం దిగువ అహోబిలానికి దగ్గర్లో ఉంటుంది.
పావన నరసింహ: ఎగువ అహోబిలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో పావన నదీతీరంలో వెలసిన దేవుడు. చెంచులక్ష్మీ సమేతుడైన ఇక్కడి స్వామి మానవులను జన్మజన్మల పాపాల నుంచి విముక్తి చెందించి, పావనం చేస్తాడని ప్రతీతి. బ్రహ్మోత్సవం, నృసింహజయంతి సమయంలో పావన నరసింహుడి దర్శనానికి భక్తులు ఎక్కువగా తరలివస్తారు. స్థానికులు ఈ స్వామిని ‘పాములేటయ్య’ అని పిలుచుకొంటారు. 
ఈ కోవెలలన్నీ కొండల మీద, అడవిలో కొద్ది కొద్ది దూరాల్లో కొలువుదీరాయి. దిగువ, ఎగువ అహోబిలాల్లోని ప్రధాన ఆలయాలు రెండు. అందుకే మిగిలిన ఆలయాలను దర్శించుకోలేని వారు దిగువ అహోబిలంలో యోగానంద నరసింహ ఆలయానికి దగ్గర్లో ఉన్న మరో ఆలయంలో నవ నారసింహు లను ఒకే దగ్గర చూడొచ్చు. ఎగువ అహోబిలం ఆలయానికి చుట్టుపక్కల ఉన్న గుళ్లను ‘చుట్టుగుళ్లు’ అని పిలుస్తారు. 
పార్వేట
ఇది లక్ష్మీ నరసింహుడు భక్తులను అనుగ్రహించేందుకు వారి ఊళ్లకు వెళ్లి, అక్కడ విడిది చేసే మహోత్సవం. ఏటా పుష్యమాసంలో కనుమ రోజున ప్రారంభమయ్యే పార్వేట వేడుక ఆళ్లగడ్డ మండలంలోని 33 గ్రామాల్లో 45 రోజుల పాటు సాగుతుంది. ఫాల్గుణ మాసంలో పంచమి నుంచి పౌర్ణమి వరకు పదిరోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహుల కల్యాణానికి ఆహ్వాన పత్రికలను ఇచ్చే ఘట్టంలో స్థానిక చెంచులు ముఖ్యపాత్ర పోషిస్తారు. చెంచుల ఆడపడుచు చెంచులక్ష్మిని పెళ్లాడినందుకు నరసింహస్వామిని వాళ్లు ‘బావా’ అని పిలుచుకుంటారు. ఉత్సవాల్లో తొలి ప్రసాదం చెంచులకే ఇస్తారు. 
సాహితీ నృసింహుడు
‘‘నవమూర్తులైనట్టి నరసింహము వీడె/ నవమైన శ్రీకదిరి నరసింహము।।/ నగరిలో గద్దెమీది నరసింహము వీడె/ నగుచున్న జ్వాలా నరసింహము/ నగముపై యోగానంద నరసింహము వీడె/ మిగుల వేదాద్రి లక్ష్మీ నారసింహము।।/ నాటుకున్న భార్గవూటి నరసింహము వీడె/ నాటకపు మట్టెమళ్ల నరసింహము/ నాటి ఈ కానుగుమాని నరసింహము వీడె/ మేటి వరాహపు లక్ష్మీ నారసింహము।।/ పొలసి యహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలోన/ నలిరేగిన ప్రహ్లాద నరసింహము/ చెలగి కదిరిలోన శ్రీవేంకటాద్రి మీద/ మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము।।’’ 
      కదిరి నరసింహుడికీ, అహోబలేశుడికి అభేదం చాటుతూ అన్నమయ్య చేసిన సంకీర్తనా గానమిది. పదిహేనో శతాబ్దానికి చెందిన అన్నమాచార్యులు కొంతకాలం అహోబిలంలో గడిపాడు. అహోబిల మఠం తొలి అధిపతి శ్రీవణ్‌ ఆదివణ్‌ శఠకోప యతీంద్రుల దగ్గర నాలాయిర దివ్యప్రబంధం, రత్నత్రయ సారం, శ్రీభాష్యం తదితరాలు నేర్చుకొన్నాడు. అందుకే సంకీర్తనల్లో తన గురువును దైవసమానుడిగా పేర్కొన్నాడు. పదివేలకు పైగా దొరికిన అన్నమయ్య కీర్తనల్లో సుమారు అయిదు వందలు నరసింహ స్తుతులు. వాటిలో నూటయాభై వరకు అహోబలేశుడి మీద రాసినవి ఉంటాయి. అయితే ఇక్కడ కూడా తాను అహోబిలంలో ఉన్నప్పటికీ కొలిచింది మాత్రం వేంకట నరసింహుణ్నే. పై సంకీర్తనతో పాటు ‘‘అనిశము దలచరో అహోబలం/ అనంత ఫలదం బహోబలం’’ (అనిశం అంటే ఎల్లప్పుడూ; నిరంతరం అహోబలేశుణ్ని తలచుకోమని అర్థం), ‘‘నవ నారసింహ నమోనమో’’, ‘‘ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా’’, ‘‘ఘోర విదారణ నరసింహ నీ/ వీ రూపముతో అపుడెట్లుండితివొ’’, ‘‘నరులార నేడువో నారసింహ జయంతి’’, ‘‘కంభమున వెడలె ఘన నరసింహము’’, ‘‘వేదములే నీ నివాసమట’’ తదితర సంకీర్తనల ద్వారా అన్నమయ్య నరసింహ వైభవాన్నీ, మాహాత్మ్యాన్ని కళ్లకు కడతాడు. 
తొలి స్థలపురాణం
అన్నమయ్యకు ముందే బ్రహ్మాండాది పురాణాల్లో, కావ్యాల్లో, స్తోత్రాల్లో నరసింహస్వామి ప్రస్తావన ఉంది. ఆది శంకరాచార్యుల నృసింహ ‘కరావలంబ’ స్తోత్రం జగత్ప్రసిద్ధి చెందింది. విశిష్టాద్వైత స్థాపకుడు రామానుజాచార్యులు, ఆ తర్వాతికాలపు వేదాంత దేశికులు తదితరులు అహోబలేశుణ్ని స్తుతించారు. ఇక తెలుగులో తొలిసారిగా స్థలపురాణం వచ్చింది అహోబిలం క్షేత్రం గురించే. అది ‘నృసింహ పురాణం’. రచయిత పద్నాలుగో శతాబ్దానికి చెందిన ఎర్రాప్రెగడ. కవిత్రయంలో తృతీయుడైన ఎర్రన తన అయిదు ఆశ్వాసాల నృసింహ పురాణం కావ్యాన్ని ‘లక్ష్మీ నృసింహావతారం’గా పేర్కొన్నాడు. పేరుకు స్థలపురాణమే అయినా రచన ప్రబంధ శైలిలో సాగింది. అలా నృసింహపురాణం ఎర్రనకు ‘ప్రబంధ పరమేశ్వరుడు’ బిరుదును సార్థకం చేసింది. పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రలో ఎర్రన ముద్ర కనిపిస్తుంది.
      అహోబిల మఠం ఏడో అధిపతి శ్రీవణ్‌ శఠకోప యతీంద్ర మహాదేశికన్‌ సంస్కృతంలో ‘వాసంతికా పరిణయం’ నాటకం రచించాడు. అహోబలేశుడు, చెంచులక్ష్మిల పరిణయమే ఈ నాటకం ఇతివృత్తం. పదిహేడో శతాబ్దానికి చెందిన ఓబయ మంత్రి నరసింహస్వామి, చెంచులక్ష్మి పెండ్లి గురించి ‘గరుడాచల విలాసం’ అనే యక్షగానం రాశాడు. ఆధునిక కవుల్లో డా।। సి.నారాయణ రెడ్డి ‘కర్పూర వసంతరాయలు’ కావ్యంలో రెడ్డిరాజు కుమారగిరి రెడ్డి, లకుమాదేవితో అహోబిలం తీర్థయాత్ర జరిపించారు. 
నల్లమల కొండల్లో, దట్టమైన అడవుల్లో వెలసిన ఆదిమసింహం అహోబల నారసిం హుడు. దిగువ అహోబిలం ఆలయం శిల్పకళా నైపుణ్యానికి ప్రతిరూపం. ఇక ఎగువ అహోబిలం ఆలయం, మిగిలిన ఆలయాలు అచ్చెరువొందించే ప్రాకృతిక అందాలకు నెలవులు. అందుకే ఈ క్షేత్రం కేవలం నరసింహ ఆరాధకులకే కాదు పర్వతారోహకులకు, పర్యావరణ ప్రేమికులకు ఆకుపచ్చటి స్వర్గధామం. అహోబిలాన్ని దర్శించడం అంటే పురాతన వారసత్వ వైభవాన్ని తెలుసుకోవడమే. 


ప్రహ్లాద బడి/ మెట్టు
ఎగువ అహోబిలానికి సమీపంలోనిది. ఇక్కడ ప్రహ్లాద వరద నరసింహుడి గుడి ఉంటుంది. ఈ గుడి ముందు ఒక జలధార ప్రవహిస్తుంది. ఆలయం ముందున్న పెద్ద బండమీద వృత్తాకారపు ముద్రలు ఉంటాయి. అవి ప్రహ్లాదుడు దిద్దిన అక్షరాలు అంటారు. చుట్టూ కొండలు, అడవులు, స్వచ్ఛమైన జలధారతో కనువిందు చేసే ఈ ప్రాంతం ధ్యానానికి అనువైన స్థలం.


ఉగ్ర/ ఉక్కు స్తంభం
అచలచల మేరు పర్వతం నుంచి ముందుకు పొడుచుకు వచ్చిన శిలా భాగమిది. దీని నిర్మాత హిరణ్యకశిపుడే అంటారు. స్తంభం అగ్రభాగంలో నరసింహస్వామి పాదాలు, ఒక జెండా పాతి ఉంటాయి. ఇక్కడి నుంచి చూస్తే ఆకుపచ్చటి దుప్పటి కప్పుకున్నట్లుగా ఉండే అహోబిలం కొండలు కనువిందు చేస్తాయి. అయితే ఉగ్రస్తంభానికి చేరుకోవడం కొంచెం కష్టసాధ్యం.   ‘‘అటమరి పెటపెటమని బేట్లెగసి/ చిటచిట రవముల చిరుత పొగలెగసి/ తటతటమనుచును తరలి వ్రయ్యలై/ పటపటమనుచును పగిలె కంభము’’ అని స్తంభంలోంచి స్వామి రావడాన్ని అన్నమయ్య పేర్కొన్నాడు.


వెనక్కి ...

మీ అభిప్రాయం