కొత్త కలాల కమనీయ సంగమం

  • 206 Views
  • 0Likes
  • Like
  • Article Share

నవతరం సాహితీ సేవకుల కవితా గానాలు, పద్య పఠనాలు, రచనా అనుభవాల కలబోతతో హైదరాబాదు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కొత్త సందడి నెలకొంది. అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో 2019 డిసెంబరు 14న మన దేశంలో ఏర్పాటు చేసిన తొలి అంతర్జాతీయ సాహితీ సదస్సు నాటి, నేటి కలం యోధులని ఒక వేదిక మీదకి తెచ్చింది. అనుభవజ్ఞులైన రచయితలు అందించిన సూచనలు నేటి తరంలో కొత్త స్ఫూర్తి నింపాయి.
కొత్త, ముందుతరాల మధ్య ఓ వారధిని నిర్మించేందుకు ఆటా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి. సదస్సులో భాగంగా సిధారెడ్డి అధ్యక్షతన ‘ముందు తరాలతో సంభాషణ’ కార్యక్రమాన్ని ఉదయం నిర్వహించారు. పలువురు ప్రసిద్ధ కవులు, రచయితలు, సాహితీవేత్తలు దీనికి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని సాహిత్య సంస్థలు కూడా ఇలాంటి కార్యక్రమాల గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా సిధారెడ్డి సూచించారు.
      కొత్తతరం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలూ చాలా ఉన్నాయని, అదే సమయంలో ముందుతరం సలహాలు ప్రస్తుత తరానికి అవసరమని ప్రముఖకవి కె.శివారెడ్డి వ్యాఖ్యానించారు. కొత్త తరం రచయితలు సాహిత్య అధ్యయనాన్ని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారాయన. ‘అంత కడివెడు పాలపై ఒకింత మీగడ పేరినట్లు మనకు మిగులును గతము లోపలి మంచి అదియె సంప్రదాయము’ అన్న సి.నారాయణరెడ్డి మాటల్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. పాత నుంచి నేర్చుకోవాల్సిన మంచి ఎప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సాహిత్యం నిత్యయవ్వనంలోనే ఉంటుందని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ అన్నారు. లోతైన అధ్యయనం సృజనాత్మక సాహిత్యానికి బలాన్ని చేకూరుస్తుందని చెప్పారాయన. వయసురీత్యా ముందుతరానికి చెందిన వాడినే అయినా అధ్యయనం, రచన, జ్ఞానసముపార్జనలో ఇప్పటి తరంతో కలిసి నడుస్తున్నానని రాచపాళెం అన్నారు. రచయిత దృక్పథం ఏంటో, రచనల ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. 
తెలుగువారి ఆస్తి
తొలి కార్యక్రమం తర్వాత ప్రముఖ కవి, రచయిత కోడూరి విజయ్‌కుమార్‌ సారథ్యంలో ‘నవ కవి సమ్మేళనం’ నిర్వహించారు. యువ కవులు, కవయిత్రులు శ్రీరామ్‌ పుప్పాల, బాల సుధాకర్‌ మౌళి, నందకిశోర్, మోహన్‌ రుషి, మెర్సీ మార్గరెట్, మోహన్‌ రుషి, అనిల్‌ డ్యాని, రత్నశ్రీ తదితర పన్నెండు మంది కవులు ఇందులో కవితాగానం చేశారు. ‘‘ఎందుకొస్తాయి రాబందులు నిన్ను వెతుక్కుంటూ?/ నీచుట్టూ పంచలోహాల సముద్రం ఉందనా?’’ అంటూ మానవుడు తన చుట్టూ అల్లుకున్న భయాల్ని అధిగమించాలని పిలుపునిస్తూ ‘నువ్వు తిరిగొస్తావ్‌’ కవిత వినిపించారు మెర్సీ మార్గరెట్‌. ‘‘జోలపాట పదాలు/ జానీ జానీ ఎస్‌ పాపా అంటే/ ఊ కొట్టడానికి కూడా అదే భాష అంటే/ ముంగాళ్లమీద కూర్చుని ఏడుస్తోంది తెలుగు భాష’’ అంటూ ప్రస్తుత భాషా పరిస్థితిని అనిల్‌ డ్యానీ తన కవితలో వివరించారు. ‘‘చావు గురించి భయపడ్డానికేమీ లేదు/ ఇప్పుడది ప్రత్యేకంగా ఒక రోజున వస్తుందన్న భ్రమలూ లేవు/ పగలూ రాత్రి ఒకదాన్నొకటి చంపుకుంటాయి’’ అంటూ ‘చంపుడు పందెం’ కవిత వినిపించారు మోహన్‌ రుషి. ‘‘పిల్లా.. నిన్ను పెళ్లికూతుర్ని చేసుడు ఎట్లాంటిదో ఎరకనా?/ నిండారబోసిన బంతిపువ్వుని/ సూదికి ఎక్కించి దండగుచ్చుడసొంటిది!’’ అంటూ ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతుంటే ఏమీచేయలేని నిస్సహాయ ప్రేమికుడి ఆవేదనను ‘నిన్నుసాగదోలుతాంటే’ కవితలో వినిపించారు నందకిశోర్‌. 
      రచయిత్రి కె.ఎన్‌.మల్లీశ్వరి అధ్యక్షతన మధ్యాహ్నం నిర్వహించిన ‘ఇప్పటి కథకులు - ఆలోచనలు - అనుభవాలు’ సదస్సుకు యువతరం కథకులు వెల్దండి శ్రీధర్, పూడూరి రాజిరెడ్డి, వెంకట్‌ సిధారెడ్డి, వి.మల్లికార్జున్, పూర్ణిమా తమ్మిరెడ్డి, స్వాతికుమారి బండ్లమూడి తదితరులు హాజరయ్యారు. కథకుని భావాలను పాఠకుడు ఆకళింపు చేసుకొని చదివితే ఆ కథకు సార్థకత అని వెల్దండి శ్రీధర్‌ అన్నారు. సమకాలీన సామాజిక పరిస్థితులు తనని కథకుడిగా మార్చాయని చెబుతూ తన రచనా నేపథ్యాన్ని పంచుకున్నారు. రచనా సామర్థ్యం ఏ ఒక్కరి సొత్తో కాదని, తెలుగు భాష మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ కథలు రాయొచ్చని అన్నారు పూడూరి రాజిరెడ్డి. ఆ తర్వాత ప్రముఖ కవి, జానపద గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ అధ్యక్షతన ‘పద్యం, పాట, జానపదం’ మీద కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీగేయ రచయితలు అనంత శ్రీరామ్, శ్రేష్ఠ, మాట్లాడారు. సినీ గేయ రచయిత్రిగా తన ప్రయాణాన్ని, అనుభవాలను శ్రేష్ఠ పంచుకున్నారు. పాటలు రాయడానికి తనకు పద్యమే ప్రేరణ కలిగించిందని అనంత శ్రీరామ్‌ చెప్పారు. సినీ గీత రచయితకు స్వరకల్పన, గానం మీద అవగాహన ఉండాలన్నారు.   ఊహాత్మకతను, లయాత్మకతను కలిగించే పద్యం తెలుగు వారి ఆస్తి అని దేశపతి అన్నారు. ప్రాచీన కవుల పద్య రచనను ఆయన విశ్లేషించారు. జానపద సాహిత్య విశిష్టతను తెలియజేస్తూ దేశపతి శ్రీనివాస్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తెలంగాణ రచయితలకు, జానపద సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. నన్నయ్య నుంచి సినారె వరకూ సాగిన పద్య ప్రస్థానాన్ని పొద్దుటూరి ఎల్లారెడ్డి వివరించి చెప్పారు. పాత, కొత్త రచయితల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ సదస్సు నవతరంలో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు రచనకు సంబంధించి విలువైన విషయాలనూ వివరించే ప్రయత్నం చేసింది.


అమెరికాలో రెండేళ్లకోసారి సాహితీ సభలు నిర్వహిస్తున్నాం. మనదేశంలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఒక్కరోజు కార్యక్రమమే అయినా ప్రయోగాత్మకంగా జరిగింది. భవిష్యత్తులో సాహితీసేవా కార్యక్రమాలు మరింత విస్తరిస్తాం. 

- భీంరెడ్డి పరమేశ్వర్, ఆటా అధ్యక్షులు


సమాజంలో నెలకొన్న జడత్వాన్ని రూపుమాపేలా యువతరం రచనలు చేయాలి. సామాజిక సమస్యలకి మూలాల్ని విశ్లేషించే కథకులు తయారు కావాల్సిన అవసరం ఉంది. మారుమూల ప్రాంతాలకి కూడా సాహిత్యాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కొత్త తరానిదే.  

- ఓల్గా, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత


కొత్తతరం కథకులు ఎంతవరకు సామాజిక బాధ్యతతో రాస్తున్నారో విశ్లేషించుకోవాలి. పుస్తక పఠనంతో పాటు, సీనియర్‌ రచయితలు, విమర్శకుల సలహాలు తీసుకోవడం ముఖ్యం. సునిశిత విశ్లేషణ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడానికి సాహిత్య పఠనం తోడ్పడుతుంది.  

- అఫ్సర్, కవి, విమర్శకులు 


వెనక్కి ...

మీ అభిప్రాయం