ఏ ఊరే సినదానా ఏ పల్లె నీదీ

  • 439 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। గాది శ్రీనివాస్‌

  • తెలుగు ఉపన్యాసకులు, యన్‌.బి.కె.ఆర్‌. సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కళాశాల,
  • నెల్లూరు,
  • 9989079742
డా।। గాది శ్రీనివాస్‌

కోరిన వరాలిచ్చే కొండంత దేవుడిగా భక్తులు విశ్వసించే పరబ్రహ్మ స్వరూపం శ్రీవేంకటేశ్వరుడు. తిరుమల తిరుపతిలో ఏడేడు కొండల మీద వెలసిన ఈ దేవదేవుణ్ని తెలుగు జానపదులు తమ మధ్య తిరిగే ఆత్మీయుడైన సొంతగాడిలా భావించారు. ఆ తిమ్మప్ప చిలిపితనం, రౌద్రం, ఆనందం, ఉల్లాసం ఇలా అన్నింటిని తమ పాటల్లో నింపి, తమ భక్తిప్రపత్తులను తమదైన గొంతుకతో పలికించారు.. ఓ వినూత్న వేంకటేశ్వరుణ్ని ఆవిష్కరించారు. అష్టాదశ పురాణాలు, వరాహ, భవిష్యోత్తర, వేంకటాచల మహాత్మ్యం, స్కంధాది పురాణాల్లోని శిష్టుడు కాదాయన. జానపదుల గుండెల్లో అసామాన్య మానవుడిగా గూడుకట్టుకున్న  ఈ వెంకన్న మాటలూ, చేతలూ అంతా విభిన్నమే.. అద్భుతమే!
జానపదుల
కథనం ప్రకారం వేంకటేశ్వరుడి తండ్రి శేషాచలం. తల్లి పేరూరమ్మ. వీళ్లకు ఏడుగురు కొడుకులు. వారు పెద్దవోబిలన్న, చినవోబిలన్న, మద్దిలేటన్న, పెంచల నరసిమ్మ, కదిరి నరిసిమ్మ, గోవిందరాజులు. అందరికంటే చిన్నవాడు శ్రీవేంకటేశుడు ‘‘కందినమంత వర్ణంతోన కడబుట్టినాడు’’. ఎద్దుల బండ్ల చక్రాలకు వేసే కందిన అంత నల్లగా ఉన్నాడట ఆయన. నిలువు నామాలు, నాలుక మీద నక్షత్రాలు, భుజాన భూచక్రాలు, పాదాలకు పావుకోళ్లు, వీపున వింజామర, అరచెయ్యిలో తామరపువ్వు కలిగిన దేవుడాయన. ఈ లక్షణాలు జానపదుల దృష్టిలో అత్యంత శుభ సూచకాలు.
      వేంకటేశ్వరుడు యువకుడయ్యాడు. ఒకరోజు సూర్యుడు లేవకముందే లేచాడు. తలగుడ్డ హొయలుగా చుట్టాడు. చేతికర్ర తీసుకుని అమ్మ పేరూరమ్మ దగ్గరికి వెళ్లి కాళ్లకు మొక్కి దీవించమన్నాడు. అమ్మ దీవెన తీసుకుని నేరుగా గంగమ్మ గుడి దగ్గరకు వెళ్లాడు. ‘‘నేనెవురైంది ఎక్కడైంది నీకు దెలుసే గంగా, నీకు దెలుసు. నీయబ్బకు తెలుసు. మా ఆరుగురు అన్నదమ్ములకు చోట అమిరినాది. నా పాదానికి గట్టి చోటు చూపించు’’ అని అడిగాడు. ‘‘నీకు సముస్యానికి ఒక దినము జాతర జేపిస్తూ/ నీకు దున్నపోతులు గండ బియ్యము ఆహారమిస్తూ’’ అని గంగకు చెప్పాడు. 
      ‘‘నా యారు కొండలూ ఎక్కిపోరా వెయ్యంకటేశా/ నా ఏడు కొండల మీద హాయిలే నీపాదానికి గట్టిసోటు’’ అని ఏడుకొండల మీద ఆవాసం ఏర్పరచుకోమంది గంగ. వేంకటేశుడు ఏడుకొండలపైనెక్కాడు. అప్పుడు ఎక్కడ లేని వర్షం కురిపించాడు. ఆ వానలో ముద్దగా తడిసి గడగడా వణుకుతూ వచ్చి వరాహ స్వామి గుడి దగ్గర నిలిచాడు. ‘‘నాకు జానెడు తావివ్వకపోతే నే జచ్చిపోతా’’ అన్నాడు. ‘‘ఇదెక్కడి పీడరా.. ... నా గుడి వారన మానుండాది మాను కిందకి పోరా..’’ అన్నాడు వరాహ స్వామి. ‘‘ఒక పాదం చోటిచ్చినావు రెండో పాదం ఎక్కడ పెట్టేది వరాసామి తాత’’ అన్నాడు వేంకటేశుడు. ‘‘నా నెత్తిన పెట్రా...’’ అన్నాడాయన. అంతే! రెండో పాదంతో ఆయన్ని లోపలికి కుంగతొక్కాడు. ‘‘నా తాతరార ఓ తాత, నీవు వరాసామి తాత. నా ముందు పూజలు నీకు తాత వరా సామి తాత. నా ఎనక పూజలు తాత వరాసామి తాత’’ అని కృతజ్ఞత ప్రకటించాడు. ఇక అక్కడే తన స్థిరనివాసం ఏర్పరచుకొన్నాడు వేంకటేశుడు. కానీ ఆడతోడు లేని కొండ హంగుగా ఉండదని.. లక్ష్మి లాంటి స్త్రీ లేకపోతే ఏడుకొండల్లో శృంగారం లేదని వెంకన్నతో పాటు కొండకు వచ్చిన జనం నస పెట్టసాగారు.
ఆ కర్రోడికి ఎట్టిస్తామమ్మా!
వెంకన్న పిన్నల్ని పెద్దల్ని పిలిచాడు. వారంతా ఆయన పిలుపునకు కారణం అడిగారు. అప్పుడాయన ‘నేను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి ఉంది. ఆయమ్మి పేరు అలిమేలు మంగ. కొండ కింద చిరతన నెల్లూరు (చిత్తానూరు) ఏలుతున్న ఎల సాయిత్రమ్మ కూతురు. ఆమెకు నిలువెత్తు డబ్బు కన్యాశుల్కం ఇచ్చి పెళ్లాడతా’నని చెప్పిరమ్మన్నాడు.
      పెద్దలంతా కలిసి చిత్తానూరు సాయిత్రమ్మ ఇంటికి వెళ్లారు. వారందరికీ మజ్జిగలో నిమ్మకాయ నూరి కలిపి దాహానికిచ్చింది సాయిత్రమ్మ. అలిసెమ్మ, తులిశమ్మ, ఆదిలచ్చమ్మ వీరందరికీ కడగోటిది అలిమేలు మంగ. ‘‘అందరి కాడికి సిన్నాది అలిమేలు మంగ రామ/ అలిమేలు మంగాను అడగవస్తిమే రామ’’ అని చెప్పారు పెళ్లిపెద్దలు. ‘అబ్బె ఆ కర్రోడికి వడ్డికాసులవాడికి మా చెల్లెలిని ఎట్టిస్తామమ్మా. మేము ఇయ్యం’ అన్నారు తోబుట్టువులు. పెద్దలంతా తిరిగి వేంకటేశుడి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. వెంకన్న కాయా! పండా! అని అడిగాడు. ఆమె తోబుట్టులు మాట్లాడిన మాటలు చెప్పి, ‘మంగ నీతో పెళ్లికి ఒప్పుకోలేద’ని చెప్పారు పెద్దలు. వెంకన్నకి ఎక్కడలేని కోపం వచ్చింది. కుడి మీసం మెలేసి గుడ్లెర్రజేసి పళ్లు పటపటా కొరికాడు.
చెరుకు తుంటాలా చేతులు గల్లాదో
హరటిస్తంభాలాల కాళ్లేగల్లాదో
పెసల కాయలాల పెదములు గల్లాదో

      అంత అందగత్తయిన అలిమేలు, వాళ్ల తోబుట్టువులు అంత మాటన్నారా! నన్ను పెళ్లి చేసుకోనందా! చూపిస్తానేనేందో అని పన్నీరు కలిపిన వేణ్నీళ్లతో సీకాయ ముద్దతో తలంటి స్నానం చేశాడు. పసుపు కొమ్ములు దంచి తలకు పూసి స్నానం చేసి జాలారి బండెక్కి తలారబెట్టుకున్నాడు. వెండి దువ్వెనతో పాపిటి దీసి, సిద్దిలో నూనె శిరసు మీద అంటుకుని నున్నగా దువ్వి నునుపైన జడవేసి రెండు పక్కలా జారుముడి వేసుకున్నాడు.
హడవారి చీరలు సామీ గట్టెనో
హడవారి నగాలు సామీ గట్టెనో
కూలూరి కుంకుమలా గురుతుగా బెట్టు
నిలువుటద్దము ఎత్తి నీడారజూసో
నాయట్టి హడాది జగతందు లేదో

      అందమైన ఎరుకతలా తయారయ్యాడు వెంకన్న. నాలాంటి అందగత్తె ఎక్కడుంటుంది అన్నాడా జగన్మోహనాకారుడు. ఎరుకలసానికి కావల్సిన హంగుల కోసం ఏలూరి సీమ వెదురు ఎత్తుకుని, చిత్తూరు సీమ వెదురు తీసుకుని బుట్ట అల్లించాడు. మల్లెపూలతో బుట్టను నింపి, సింగారించి, బుట్టకు ముత్యాలు కుట్టించాడు. 
      ఆ బుట్టను నెత్తిన పెట్టుకుని, ఒక చేత్తో గిలకను పట్టుకుని, పసిబిడ్డను చంకలో ఉంచుకుని బిక్కిరి చూపులతో వయ్యారమైన హంస నడకలతో ‘‘ఎరుక ఎరుకాలోలన ఎరుకా జెప్పుదనమ్మా గజ్జ జెప్పెదను’’ ఓ.. బుంగ రెట్టా వన్నెచీరా..’’ అని పాడుకుంటూ ఎరుకలసాని మూడడుగులు వేసింది. నవ్వుతూ ఎరుకలసాని నాలుగడుగులు వేసింది. ఇంతలో అలిమేలమ్మ తల్లి సాయిత్రమ్మ ఆమెను పిలిచింది. ‘ఏవూరి నుంచి వచ్చినావు’ అని అడిగింది. ‘కొండపక్కన తంగేడుపల్లె నుంచి వచ్చా.. పెళ్లిగాని అమ్మాయిలకి గద్దె చెప్తా’నన్నది ఎరుకలసాని. ‘మా మంగకి చెప్పుమే’ అనింది సాయిత్రమ్మ. అప్పుడు ఎరుకలసాని తెల్లగుడ్డను తెరగట్టమని, పచ్చిబియ్యం, రెండు పసుపు కొమ్ములు తెమ్మంది. నూలు కండీ దారం కోసం తెమ్మని చెప్పింది. అలా వేంకటేశ్వరుడు ఎరుక చెప్పే హంగులన్నీ సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత..
ముత్యాల పీటైనా సామికేశారో
రత్నాల పీటైనా మంగమ్మకేశో
మంగమ్మ తొడమీద సామితొడ బెట్టో
మంగమ్మ కయితేనో మత్తు ఎక్కిందో
మరుగు మాటలతోనే బొట్టు కట్టినాడో
బొట్టుగట్టియా సామి మాయమైనాడో..

      ఇంకేముంది పెళ్లయిపోయింది! చేసేదేముంది పసుపు కొమ్ము మంగమ్మ మెడలో ఉండిపాయె!! సర్దుకున్నారందరూ. 
      వేంకటేశుడు అలిమేలమ్మను కాపురానికి తీసుకెళ్లాడు. మంచి స్థలం ఇరుగుపొరుగు చూసుకుని కాపురం పెడితే బాగుంటుంది. కానీ, వెంకన్న ఏడేడు కొండల మీద కాపురం పెట్టాడు. భర్త బయటకు వెళ్తే అలాంటి చోట భార్యలు పడే మానసిక వేదన అంతాఇంతా కాదు. అలిమేలమ్మ ఆవేదన ఇది.. ‘‘కొండ కొండ లెగరగొట్టి కొండలోన యిండ్లు గట్టి/ ఇరుగుపొరుగు లేని జన్మము శ్రీవెంకటేశ ఒక్కదాన్ని చేసిపోతివి’’.
      శొంఠి మిరియాలు నెయ్యి కలిపిన పాలన్నం తినే సమయమైంది. ‘ఒక్కదాన్నే ఎలా తినేది నాది కాకి శోకమైపోయిందే’ అని విచారపడుతోంది అలిమేలమ్మ. వేెంకటేశుడి మీద ఆమెకి ఎంత ప్రేమంటే- ‘‘తీయతీయని నామము తీరాని చుక్కబొట్టు/ అద్దములో చూసుకొంటినో ఇద్దరము ఒక్కపోలికే’’ అంటూ తాము ఏకశరీరులమని, శొంటి మిరియం నెయ్యి కలిపిన అమృతాన్నం కూడా తనకు విషంలా అనిపిస్తోందని వాపోతుంది. జానపదుల ఈ భావాలనే అన్నమయ్య ‘‘మేడలెక్కి నినుజూచి కూడినను ఆశతోడ’’ అన్న సంకీర్తనలో పొందుపరిచాడు.
అందరి మగాళ్లలానే..!
పెళ్లయ్యాక మగాడికి స్వేచ్ఛ పోతుందని భావిస్తారు! జానపద వేంకటేశుడూ దానికి అతీతం కాదు. భార్య కోసం తన ఇష్టాల్ని వదులుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్నే ఒక రోజు అలిమేలమ్మ దగ్గర సన్నగా ముదిగారంగా అడిగాడు. ‘‘నేను నిన్ను పెండ్లి యాడిందే మొదలు సక్కని అలిమేలు/ ఏడేడు కొండలకే మంగా ఏటలు కరువాయె’’నని తన బాధను పెళ్లాం దగ్గర వెళ్లబోసుకున్నాడు. కనికరించింది మంగమ్మ. మరుసటి రోజు పొద్దపొద్దన్నే వెంకన్నను నిద్ర లేపింది. ‘వేటకి వెళ్లిరా’ అంది. సంబరపడి వేంకటేశుడు దిగ్గున లేచాడు. తిత్తిరేణి పుల్ల ఇంచి పళ్లుతోముకుంటుంటే మంగమ్మ ఇంటి పనిలో మునిగింది. ‘‘ముత్యాల చేటల్తో ముందు సెత్తాదాశో/ పగడాల చేతుల్తో పైసెత్తాదాశో’’- కస్తూరి గంధం కలిపిన కళ్లాపి చల్లింది. ముత్యాల ముగ్గులెట్టి రత్నాల రంగు నింపింది. నదికెళ్లి నీళ్లుదెచ్చి బాయి దగ్గర గన్నేరు పువ్వులతో గిన్నెలు తోమింది. పల్లేరు పువ్వులతో పళ్లేలు తోమింది. వేంకటేశుడికి మంచిమంచి పదార్థాలతో భోజనం పెట్టి ఎదురుగా కూర్చుంది. అన్నం తిన్నాడు వెంకన్న. ఆకులు పోకలు సున్నం తీసుకుని వేటకు వెళ్లొస్తానంటూ.. బంగారు పావుకోళ్లు వేసుకుని రెండు వేటకుక్కల్ని తీసుకుని పోతూపోతూ అలిమేలు వంక చిలిపిగా చూస్తూ, ‘నీలాంటి అమ్మాయి వేటలో నాతో కలుస్తుంది’ అని చతుర్లాడుతూ వెళ్లాడు. 

      అలిమేలుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇంకోపక్క భయం.. భర్త ఇంకొకరి వలలోపడి తనకు దక్కకుండా పోతాడేమోనని. ఒక నిశ్చయానికి వచ్చి బ్రాహ్మణవీధికి వెళ్లి వాళ్లు కట్టే మంచి మంచి చీరలు కట్టింది. బాగా ముస్తాబైంది. వేంకటేశ్వరుడు వెళ్లిన వేట మార్గంలోనే వెళ్లి ఆయనకు ఎదురుగా నిలబడింది. ఆమె అలంకారం చేసుకోవ డంతో ఎలా మారిందంటే వెంకన్న కూడా గుర్తుపట్టలేనంత అందంగా తయారైంది. అంత అందమైన పిల్ల తనకెదురైనందుకు మురిసిపోయాడు వెంకన్న.
ఏ ఊరే సినదాన ఏ పల్లె నీదీ
నాతోను కాసేపు నిలిచి మాట్లాడే

      అని వెంటపడ్డాడు. దానికోసమే ఎదురు చూసిన అలిమేలు... ‘నాది ఏ పల్లె అయితే నీకెందుకుగాని నీ పచ్చలు పొదిగిన పతకం, వజ్రాలు పొదిగిన వస్త్రం ఇస్తే కాసేపు మాట్లాడతా’నంది. అంతటి అందగత్తె అడగడం ఇవ్వకుండా పోవడమూనా, ఇచ్చేశాడు వేంకటేశుడు. 
      మల్లెచెట్టు కింద పచ్చ దుప్పటి పరచిందామె. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఆకులతో కాసేపు ఆలస్యం చేసింది. వక్కలతో కాసేపు ఆటలాడింది. సున్నంతో కాసేపు జోల పాడింది. ఆ జోలపాటకు వేెంకటేశుడికి నిద్రొచ్చేసింది. మొగలి తుండుని తెచ్చి దిండుగా వెంకన్న తలకింద పెట్టి ఇంటికొచ్చేసింది. 
      నిద్ర లేచిన వెంకన్న చూసుకునే సరికి ఒంటి మీదున్నవన్నీ మాయమైపోయాయి. ‘దెబ్బకొట్టిందిరా ఆయమ్మి, ఈ ఆడోళ్లని నమ్మకూడదబ్బా’ అనుకుని కుక్కల్ని వెంటేసుకుని బంగారు పావుకోళ్లని ఉసూరుమంటూ ఈడ్చుకుంటూ ఇంటికొచ్చాడు. దూరం నుంచి వెంకన్న రాకను చూసింది అలిమేలమ్మ. కిలకిలా నవ్వుతూ తలుపు కింద గడిపెట్టింది. పకపకా నవ్వుతూ పై గడి కూడా వేసి తలుపులు మూసేసింది. 
      వాకిట్లో నిలబడిన వెంకటేశుడు అలిమేలమ్మని తలుపు తియ్యమని బతిమాలుతున్నాడు.
ఊరు ఊరూ దిరిగి యాకలౌతాదే
గడి దియ్యె మంగా గడి దియ్యే మంగా
నీ చిన్నలకు మొక్కేను గడి దియ్యె మంగా
నీ పెద్దలకీ మొక్కేను గడిదియ్యె మంగా

      అని దీనంగా ప్రాధేయపడ్డాడు. కడుపులో కోపం ఉన్నా అతని మాటలకు కరిగిపోయి గడులు తీసి తలుపులు తీసింది అలిమేలమ్మ. మాట్లాడకుండా దొడ్లోకి వెళ్లి దుగ్గళ్లాకు కోసి ఉలవ పప్పుకూర చేసింది. అరికె బియ్యంతో అన్నం వండి, జొన్నాకుతో విస్తరి కుట్టి నీళ్లు పెట్టి అన్నం వడ్డించింది. తిరిగి తిరిగి మంచి ఆకలి మీద కడుపునిండా తిన్నాడు వెంకన్న. తర్వాత అరుగు మీద మెల్లిగా నడుము వాల్చాడు. అలిమేలు అన్నం తిని తాంబూలం తట్ట తీసుకుని ఆకులు పోకలు సున్నం కలిపి వెంకన్న పక్కన కూర్చొని ఆయనకు అందిస్తోంది. అడవిలో తనను మోసం చేసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు వెంకన్న. అప్పుడన్నది అలిమేలమ్మ.. ‘ఏమబ్బా నీ పచ్చలు పొదిగిన పతకాలు, వజ్రాలు పొదిగిన వస్త్రాలు ఏవీ’ అని బిత్తరపోయాడు వెంకన్న. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ, క్షణంలో తేరుకొని అందంగా కథలల్లబోయాడు.
నా పచ్చలు దాపిన పతకాలేమో
బాపనోళ్లలో దానాలిస్తీనీ
నేనొచ్చే దోవల్లో బొమ్మలాటోళ్లు
బొమ్మలాటోళ్లకిచ్చి నిన్నుబొగిడిస్తీనీ

      అక్కడక్కడ పాపం అలిమేలమ్మను పొగిడించేందుకే బొమ్మలాట వాళ్లకి ఇచ్చానని చెబుతూ ఆమెకు కోపం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
      భార్య దగ్గర అబద్ధాలు చెప్పగలమా! దేవుడైతే మాత్రం!! పాపం సమాధానం కోసం రకరకాల కారణాలు వెతుకుతున్నాడు వెంకన్న. అప్పుడు అలిమేలమ్మ దేవుళ్లు కూడా అబద్ధాలాడితే ఎలా అని మెత్తగా మందలించింది.
నావంటి చిన్నదా ఇంకొక్క చెలియా
నావంటి సక్కనిదా ఇంకొక్క చెలియా
నీపచ్చలా దాపీనా పతకంబూలీగో
నీ వజ్రాలు దాపీనా వస్త్రంబులీగో

      అని తాను అడవిలో ఆయన దగ్గర నుంచి తెచ్చేసిన వస్తువులను కిలకిలా నవ్వుతూ చూపెట్టింది. బిక్కమొహం పెట్టిన వేంకటేశుడికి ఆమె నవ్వుతో శ్రుతి కలపక తప్పలేదు.
      లౌకిక వాతావరణంలోని ప్రాపంచిక విలాసాలన్నీ ఆ పరమేశ్వరుడికి అంటగట్టి.. తమ లోకానుభవాలన్నింటినీ భగవంతుడికి ఆపాదించి.. అపరిమితానందంతో తమ పాటల్లో ఆయన్ని సాక్షాత్కరింప చేసుకోవడం అనే సులభమైన ఉపాయం ఎవరికి తెలుసు? ఒక్క జానపదులకి తప్ప! అందుకే అన్నమయ్య, రామదాసాదులు కూడా వారినే స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో కీర్తనలు రాశారు. సాహిత్య భాండాగారంలో రత్నాల్లాంటి ఈ జానపదాలు.. కాలం మారినా వన్నెతరగని అచ్చతెలుగు పద వెన్నెలలు! 


వెనక్కి ...

మీ అభిప్రాయం