వామ్మో! చలి

  • 146 Views
  • 0Likes
  • Like
  • Article Share

శారద రాత్రుల ధవళ కాంతులను పుడమి పూర్తిగా ఆస్వాదించే లోపే, ఆ తెల్లదనంతో పోటీ పడుతున్నట్లుగా మంచు బిందువులు మహీతలాన్ని ముంచేస్తాయి. వాటిని మోసుకొచ్చే హేమంత రుతువు ప్రత్యేకత ఏంటో తన ‘ఉత్తర రామాయణం’లో ఇలా చెప్పాడు కంకంటి పాపరాజు.. 
కాచె నుసిరికలు తఱుచుగఁ;
బూచెం జేమంతి విరులు భూమికి బరువై 
తోఁచెఁ జణకాదిసస్యము,
లేచెన్‌ బలుమంచు చదల హేమంతమునన్‌

      ఆరోగ్య ప్రదాయినిగా అందరూ భావించే ఉసిరికలు ఎక్కువగా కాసే హేమంత రుతుకాలమిది. సమస్త ప్రాణికోటిని అహర్నిశలు మోసే భూమాతకే బరువనిపించేంతగా చేమంతి పూలు పూస్తూ, శనగలు కవ్విస్తూ ఉంటే ఆకసానికి తెల్లటి మంచు తెరలు ముసుగును అలంకరిస్తాయట. అలా ప్రవేశించిన హేమంత రుతువుకు ఆబాలగోపాలం ఉహుహు అని వణుకుతూ స్వాగతం చెబుతుందంటాడు పోతన ‘భాగవతం’లో.. అహములు సన్నము లయ్యెను/ దహనము హితమయ్యె దీర్ఘదశలయ్యె నిశల్‌;/ బహు శీతోపేతంబై/ యుహుహూ యని వడఁకె లోకముర్వీనాథా!            
      ఈ రుతువులో పగటి వేళలు తగ్గి రాత్రి సమయం పెరుగుతుంది. చలిమం టలు వేస్తూ ఒంటిని వెచ్చబెట్టుకునే ఉపాయాలు ఎక్కువవుతాయి. ఈ చలి బాధలకు ఆ సూర్యుడే తట్టుకోలేక పోతాడని ఇలా వర్ణిస్తాడు పోతన.. పొడుపుఁగొండ మీఁదఁ బొడుచుట మొదలుగాఁ/ బరువు వెట్టి యినుఁడు పశ్చిమాద్రి/ మఱుఁగుఁ జొచ్చెఁగాక మసలినఁ జలిచేతఁ/ జిక్కెఁజిక్కెననఁగ జిక్కకున్నె?
      భానుడు ఉదయించింది మొదలుగా చలికి చిక్కకుండా పరుగులు పెడుతూ వేగంగా పశ్చిమాద్రి చేరుకుని హమ్మయ్య అనుకుంటాడట ఈ శీతాకాలంలో! ప్రచండ భాస్కరుడే కాదు, అంతటి అగ్నిదేవుడిదీ ఇదే పరిస్థితి అన్నది ‘భాగవతం’లోని మరో చమత్కారం.. 
శంభుకంట నొకటి జలరాశి నొక్కటి
మఱియు నొకటి మనుజ మందిరముల 
నొదిగెఁగాక మెఱసియున్న మూడగ్నులు 
చలికి నులికి భక్తి సలుపకున్నె? 

      ఆహవనీయాగ్ని ముక్కంటి మూడో కంటిలో దాగింది. దక్షిణాగ్ని సముద్ర గర్భంలోకి వెళ్లిపోయింది. గార్హపత్యాగ్ని  గృహపతుల ఇళ్లలో తలదాచుకుందట. త్రేతాగ్నుల గతే ఇలా ఉంటే, చలికి జడిసి కుంపటిని ఎత్తుకునే    మనుషుల పరిస్థితేంటి!!
      హేమంతం ఇటు ముగిసీ ముగియకముందే శిశిర రుతువు ముందుకొస్తుంది. దీని గురించి బుడిబుడి బుడతలనడిగినా ఆకులు రాలిపోయే కాలమని టక్కున చెప్పేస్తారు. సూర్యుడి ప్రతాపాన్ని శిశిరం నీరసింపజేస్తుంది. తామర లాంటి పూబాలల్ని ముకుళింప చేస్తుంది. పగటి వేళలను ఇంకా తగ్గించేస్తుంది. సకల ప్రాణికోటిని వణికించేస్తుంది. ఈ చలికి సమస్త జీవజాలం గజగజలాడిపోతున్నా తన విద్యుక్త ధర్మం నుంచి ఏ మాత్రం చలించని భూమాత ధర్మజ్ఞతను మెచ్చి శీతల రుతు రాజు వజ్రాల్లాంటి మంచు బిందువులను కానుకలుగా ఇస్తాడని వర్ణిస్తాడు కంకంటి పాపరాజు.. 
ప్రాతర్వేళల మంచుచిన్కుగుమి జొంపం బైనలేఁబచ్చికల్‌
శ్వేతశ్రీఁ దుళకించు టెంతయు రహించెన్‌ సర్వ భూతంబులున్‌
శీతశ్రాంతి వడంకఁ దానచలయై చెల్వొందుభూదేవికిన్‌
శీతర్తుప్రభుఁ డిచ్చువజ్రములరాశిం బోలి నల్వంకలన్‌

      మొత్తమ్మీద హేమంత శిశిరాలు సార్థక నామధారులు! ఎలా అంటారా?
      హేమంతం అంటే మంచుతో జనాన్ని హింసించేది; శిశిరం అంటే శీతంతో దేహాన్ని అల్పంగా చేసేది అని అర్థం.


వెనక్కి ...

మీ అభిప్రాయం