భాషాయణం

  • 1078 Views
  • 15Likes
  • Like
  • Article Share

తెలుగులో కన్నడ సొగసులు 
దబ్బపండును అనంతపురం జిల్లాలో ‘ఎళ్లికాయ’ అంటారు. ఇది కన్నడ మాతృకలైన ‘హెరళికాయ, ఎరశికాయ, ఎర్శికాయ’లకు రూపాంతరం. అలాగే, ఈ ప్రాంతంలో గబ్బిలాన్ని ‘గనుగప్పరగాడు’ అని పిలుస్తారు. దీని అసలు రూపం కన్నడ ‘కణుకప్పడి’. అలాగే, జేబును ‘కిసిలి, కీస, కిసాయి’గా పిలుచుకుంటారు. ఇవి కూడా కన్నడ ‘కిసె’ లోంచి వచ్చినవే. తలుపు గొళ్లాన్ని కన్నడంలో చిలుకు అంటారు. అదేమాట అనంతపురం తెలుగులో ‘చిలకడ’ అనే పదంగా రూపుదిద్దుకుంది. కత్తిపీటకు ఇక్కడి మాండలికంలో ఈలకత్తి అనేది వ్యవహారం. కన్నడిగుల ‘ఈలుకత్తి’ దీనికి స్ఫూర్తి. భౌగోళిక కారణాలు, వర్తక వాణిజ్యాల విస్తృతి, సోదరభాషల ప్రభావం తదితర కారణాలతో ఏ భాషలోనైనా అన్యభాషా పదాల వ్యాప్తి జరుగుతుంది. అలా తెలుగులోకి వచ్చి చేరిన ఇతర భాషా పదాలు కోకొల్లలు. కోస్తా ప్రాంత భాషలో సంస్కృత, ఆంగ్ల పదాల వినియోగం ఎక్కువ. అలాగే, రాయలసీమ తెలుగు మీద తమిళ, కన్నడ భాషలు, తెలంగాణలో ఉర్దూ, ఉత్తరాంధ్రలో ఒడియా భాషల ప్రభావం కనిపిస్తుంది. అయితే, ఆ అన్యదేశ్యాలన్నీ మనవారి ఉచ్చారణకు తగ్గట్టుగా మారిపోయి అచ్చమైన తెలుగు పలుకులు మాదిరిగానే భాషలో స్థిరపడిపోయాయి. ఆంగ్లం నుంచి తామరతంపరగా వస్తున్న మాటలు మాత్రం ‘నీళ్లలో కలిసిన నూనెలా’ మిగిలిపోతున్నాయి. 


పాలి భారతం- ఆలి రామాయణం
రాజ్యభాగం కోసం- అంటే ‘పాలి’ కోసం పాండవులు చేసిన పోరాటమే భారతం. ‘ఆలి’(భార్య)ని రక్షించుకోవడం కోసం రావణుడితో రాముడు తలపడటమే రామాయణం. ఈ ఇతిహాసాల గురించి తెలుగువాళ్లు సూక్ష్మంలో మోక్షంగా చెప్పుకునే జాతీయమిది.


చికిలి
మెరుగుపెట్టడం అని అర్థం. ఇది సక్‌ల్‌ అనే అరబ్బీపదం నుంచి పుట్టింది. సక్కాల్‌ అంటే మెరుగుపెట్టేవాడు. తెలుగు ‘చికిలి’ ఇప్పుడు ఎక్కడా వినిపించట్లేదు కానీ, ప్రాచీన కవులు ఈ మాటను విరివిగా వాడారు. ‘‘చిఱుసానంబట్టించి చికిలిసేయించిన గండ్రగొడ్డలి’’ అని కాశీఖండంలోనూ, ‘చికిలిసేసిన యడిదంబు’ అని శివరాత్రి మాహాత్మ్యంలోనూ శ్రీనాథుడి ప్రయోగాలు కనిపిస్తాయి.


సకినల మంచం
సకిన అంటే రత్నాలు వంటి విలువైన రాళ్లతో చేసిన కృత్రిమ పక్షి. అలాంటి వాటిని అలంకారాలుగా పొదిగిన మంచాన్ని ‘సకినల మంచం’ అని పూర్వం వ్యవహరించేవారు. సకినె అంటే కీచుబిళ్ల అనే మరో అర్థం కూడా ఉంది. పడుకుంటే కీచుకీచుమనే పడకని ‘సకినల సజ్జ’ అని పిలిచేవారట. ‘‘జగడపు చనవుల జాజర/ సకినల మంచపు జాజర’’ అంటూ అన్నమయ్య ఓ జాజరపాటలో ఈ మంచాన్ని ఉట్టంకించాడు.   


కల్హారం
ఎర్ర జీరలున్న తెల్లకలువ. కలహరం, కలుహరం, కహ్లారం, సౌగంధికం అనే నిఘంటు అర్థాలు ఉన్న ఈ పదం కల్హార అనే ప్రాకృత పదం నుంచి వచ్చింది. ‘‘ఆ కిటికీలో విచ్చిన రెండు కల్హార సరస్సులు’’ అంటూ తపాలా బంట్రోతు కవితలో తిలక్‌ ఈ పదానికి లోతైన అర్థాన్ని స్ఫురింపజేశారు.


శ్లేష పదశరాలు
రథం మీద ప్రయాణిస్తున్న సుభద్రార్జునులు ఎలా ఉన్నారో చెబుతూ ‘విజయ విలాసం’లో చేమకూర వేంకటకవి చేసిన వర్ణనలో కొన్ని పదాలకు అనేక అర్థాలు కనిపిస్తాయి. అంటే శ్లేష అన్న మాట. 
అటులదేరెక్కి దంపతులరుగ జూచి
జనులు రతిమన్మథులు వీరలని తలచిరి
హరితురంగములించువిల్లలరుతూపు
లంద యుండగ సందియమందనేల?

హరి తురంగాలంటే మన్మథుడి పరంగా చిలుక గుర్రాలనీ, కృష్ణుడి పరంగా పచ్చటి గుర్రాలనీ అర్థం. ‘ఇంచువిల్లు’కు మన్మథుడి చెరకువిల్లుతో పాటు అందమైన విల్లు అనే అర్థభేదమూ ఉంది. అలరుతూపులు.. దీనికీ రెండు అర్థాలున్నాయి. మన్మథుని పూల బాణాలూ/ సొగసైన బాణాలూ అని. ఎంతైనా చేమకూర శ్లేషాలంకార చక్రవర్తి కదా! 


అనగనగా ఒక ఈగ
‘‘కట్టుకథల్లో ఒక విశిష్ట గుణమున్నది. అది బాలుర జ్ఞాపకశక్తిని వృద్ధిచేయడానికి ఏర్పాటైనది. శబ్ద సంబంధం వల్లనూ, అర్థసంబంధం వల్లనూ గ్రహణ ధారణశక్తులు పెద్దవి కాగలవని సైకాలజీ చెప్పుతోంది. ఇట్టి శబ్దార్థ సంబంధాలీకథలలో గోచరిస్తవి. ఉదాహరణమునకు ఈగ కథ.. ఒక ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరచిపోయిందట. సర్వ దేశాలలోనూ సర్వచిక్కులను విడగొట్టే పేదరాలి పెద్దమ్మ దగ్గరికి వెళుతుంది. తనకు తెలియదు కొడుకును అడగమంటుందామె. ఈ విధంగా ఒకరినిబట్టి ఒకరిని అడుగుతూ పోయింది. చిట్టచివరికి ఈగ గుర్రం కడుపులో పిల్ల దగ్గరికి వెళ్లి అడుగుతుంది, ఏమనీ- పేదరాసి పెద్దమ్మా, పెద్దమ్మకొడకా, కొడుకుచేతిలో గొడ్డలీ, గొడ్డలి కొట్టే మానా, మానుమీదుండే పక్షుల్లారా, పక్షులు తాగే నీళ్లల్లారా, నీళ్లల్లో ఉండే చేపల్లారా, పట్టే పల్లెవాడా, వండే వంటలక్కా, తినే రాజా, రాజెక్కే గుర్రమా, గుర్రం కడుపులో పిల్లా, నా పేరేమిటీ అని. గుర్రం పిల్ల నవ్వుతుంది - ఈ ఈ ఈ అని. అప్పుడు ఈగకు తనపేరు జ్ఞాపకం వస్తుంది. ఈగకు ప్రాచీన రూపం ‘‘ఈ’’ అని పరిశోధకులు చెప్పుతారు. ఒకమారు పిల్లవాడు ఇట్టి కథవింటే ఇక మరచిపోడు’’

- ‘ప్రజా వాఙ్మయం’లో చింతా దీక్షితులు


చెప్పుకోండి చూద్దాం
ఒక్క విడుపున్నవి.. అనేక విడుపులున్నవి అని పొడుపు కథల్లో రెండు విధాలు. ఇలాంటి వాటితో వినోదమే కాదు, విజ్ఞానమూ అందుతుంది. ఈ పొడుపు కథల్లో గృహ జీవనానికి సంబంధించిన ‘కతలు’ ప్రత్యేకమైనవి. 
అనంతపురంలో తప్పెట కొడితే
అంతకు తగులు, ఇంతకు తగులు
చెరువులో ఉండే చేపకు తగులు
గాళ్లలో ఉండే గొడ్డుకు తగులు 
బాలింతకు తగులు

ఈ పొడుపునకు విడుపు ‘పసుపు’. పచ్చి పసుపును ఇంట్లో వాడుకునే పసుపుగా మార్చడమే తప్పెట కొట్టడం. ఇంతకూ అంతకూ తగలడం అంటే ఇంట్లో అన్ని అవసరాలకీ వంటలకూ, వైద్యానికీ ఉపయోగపడుతుందని అర్థం. చేపలను ముక్కలుగా కొట్టాక పాడవకుండా ఉండటానికి ఉప్పూ, పసుపూ రాస్తారు. అలాగే, పశువులకు వచ్చే గాలి వ్యాధి నివారణకి వాటి కాళ్లు, నాలుకకి పసుపు పూయడం ఇప్పటికీ కనిపిస్తుంది. క్రిమిసంహారకాలైన వేప ఆకులు, పసుపును నీళ్లలో కలిపి బాలింతలకు స్నానం చేయించే ఆచారమూ అనాదిగా వస్తోంది. ఇదండీ ఈ పొడుపు ‘కథ’!


వెనక్కి ...

మీ అభిప్రాయం