విశ్వమానవ కవన ఘోష

  • 329 Views
  • 2Likes
  • Like
  • Article Share

    ఎల్‌.ఆర్‌.స్వామి

  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
  • విశాఖపట్నం
  • 9949075859
 ఎల్‌.ఆర్‌.స్వామి

‘‘పరుల కోసం/ నేనొక బాష్పకణం రాల్చినప్పుడు/ నాలో ఉదయిస్తాయి/ వేల వేల సూర్య మండలాలు’’ అంటూ ప్రతి గుండెలో మానవత్వాన్ని, కరుణని ప్రోదిచేసేలా అక్షర యజ్ఞం సాగించిన మలయాళ కవితా రుషి అక్కిత్తం అచ్యుతన్‌ నంబూదిరి. ఇతరుల దుఃఖాన్ని తనలోకి ఆవహింపజేసుకునే ఈ కవిని ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ పురస్కారం వరించింది. 
మలయాళ
మహాకవి పి.కుంజిరామన్‌ నాయర్‌ చెప్పినట్టు అక్కితం కవిత్వం ‘సదా రగిలే మంట, ఆరని కమ్మరి కొలిమి’. ప్రపంచం ఇలా ఉండాలనే కవి సంకల్పం ఒకవైపు, ఇది మరోలా ఎందుకుందనే ఆవేదన మరోవైపు... ఈ రెండింటి సంఘర్షణ నుంచే అక్కిత్తం కవిత ప్రవహిస్తుంది. మలయాళీలు మహాకవి అని ఆప్యాయంగా పిలుచుకునే అచ్యుతన్‌ ద్వారా మలయాళ సాహిత్యానికి ఆరో జ్ఞానపీఠ పురస్కారం దక్కింది.
      పాలక్కాడ్‌ జిల్లాలోని కుమరనల్లూర్‌ సమీపంలో బ్రాహ్మణ కుటుంబంలో 1926 మార్చి 18న జన్మించారు అక్కిత్తం. సంస్కృతం, జ్యోతిషం, రుగ్వేదం లాంటివి ఇంట్లోనే నేర్చుకున్నారు. తర్వాత బడిలో చేరారు. ఇంటర్‌ వరకు చదివారు. అనారోగ్యం వల్ల ఆపై చదువు సాగలేదు. పదిహేనో ఏట నుంచి యోగక్షేమ సభ (నంబూదిరి సమాజం సంఘం) సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. చిన్నతనం నుంచే అభ్యుదయ భావాలను అలవర్చుకున్న అచ్యుతన్‌.. అస్పృశ్యతకి వ్యతిరేకంగా 1948లో జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నంబూదిరి సమాజంలో తిష్ఠ వేసిన ప్రాచీన దురాచారాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాలుపంచుకున్నారు. వాటికి సంబంధించి ప్రదర్శించిన నాటకాల్లో కూడా నటించారు. కేరళ మొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి ఈ.ఎం.ఎస్‌. నంబూదిరికి కార్యదర్శిగా (ముఖ్యమంత్రి కాక ముందు) కొంతకాలం వ్యవహరించారు. ఇరవై ఏళ్ల పాటు కోళికోడ్, త్రిస్సూర్‌ ఆకాశవాణి కేంద్రాల్లో పనిచేసి పదవీ విరమణ చేశారు. అచ్యుతన్‌ దాదాపు 55 పుస్తకాలు రచించారు. భాగవతాన్ని మలయాళంలోకి అనువదించారు. ‘బలిదర్శనం’ కావ్యంతో 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. 
నేర సమ్మత పత్రం
అక్కిత్తం అభ్యుదయ కవి. తొలి దశలో మార్క్స్‌ వల్ల ప్రభావితులయ్యారు. కొంత కాలం కమ్యూనిస్టులతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. కానీ, నిజమైన సామ్యవాదం అంటే మానవత్వం, కరుణ అని తెలుసుకుని తర్వాతి కాలంలో మానవత్వపు విశాల మైదానంలోకి ప్రవేశించారు. తొలి దశలో ఆయన రాసిన కవితా సంపుటాలు వీరవాదం (సవాలు), వలకిలుక్కం (గాజుల గలగలలు) లాంటివి సంఘ సంస్కరణకు సంబంధించినవి. దురాచారాల నుంచి విముక్తి పొందితేనే మానవత్వం వైపు ప్రయాణించగలమని దృఢంగా నమ్మిన కవి అచ్యుతన్‌. అయితే, దురాచారాలు నిర్మూలన కావడం మాట అటుంచితే అవింకా బలపడుతున్నాయని తెలుసుకున్నారాయన. సంస్కరణ ఇంటినుంచే మొదలు కావాలనే నానుడిని రుజువు చేస్తూ ‘‘చచ్చిన ఈ సంప్రదాయపు సింహం/ భయపడకసలు, గర్జిస్తుందని/ బయటికి దిగు జన్మసౌఖ్యం/ వెతుకు నువ్వు నంబూదిరి యువతీ’’ అంటూ యువతుల్ని నవ మార్గం వైపు నడిపించే ప్రయత్నం చేశారు ‘ఋతుమతి’ కవితలో.
      అచ్యుతన్‌ కవితా దృక్పథం గురించి చెప్పుకోవాలంటే ‘ఇరవయ్యో శతాబ్దపు ఇతిహాసం’ దీర్ఘకావ్యానికి ముందు, ఆ తర్వాత అని విభజించుకోవాలి. మలయాళ సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిన ‘ఇరవయ్యో శతాబ్దపు ఇతిహాసం’ను అచ్యుతన్‌ 1952లో రచించారు. ఇక్కడి నుంచి విశ్వమానవుణ్ని ఆవిష్కరించే దిశగా ఆయన రచనలు సాగాయి. ఇందుకు కారణాలను ఆయనే స్వయంగా ఓసారి చెప్పారు. ‘‘1948-49లో కొంతమంది కమ్యూనిస్టులతో నాకున్న సన్నిహిత సంబంధాలవల్ల ఈ రచనకు ప్రాగ్రూపం ఏర్పడింది. దీన్ని రాయడం వల్ల ఎదురయ్యే రాజకీయ పర్యవసానాలను తలచుకుని మొదట్లో కొంత జంకాను. కానీ 1951 నాటికి నా అంతరాత్మ నన్ను రాయకుండా ఉండనీయలేదు. సమానత్వం, ప్రేమ మీద అధిష్ఠితమైన కమ్యూనిజం హింసాత్మకంగా, మానవ విరుద్ధంగా పరిణమించింది’’ అని అన్నారు. జాలితో రాల్చిన కన్నీటి బిందువులు, ఓదార్పు, ఓ చిరునవ్వు మనిషి మనసుని ఎలా పరిశుద్ధం చేస్తుందో తెలియజేస్తుందీ దీర్ఘ కవిత. ఒక రకంగా చెప్పాలంటే ఇదో నేర సమ్మత పత్రం (కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌). ఇరవయ్యో శతాబ్దపు కేరళ సమాజం పట్ల తనకు కలిగిన స్పందనను స్వర్గం, నరకం, పాతాళం, భూమి అనే నాలుగు శీర్షికలుగా విభజించి వాస్తవంగా, ధైర్యంగా ఈ దీర్ఘ కవితలో ఆవిష్కరించారు. ‘‘వెనక్కి తిరిగి చూస్తున్నా/ నడచి వచ్చిన దారిని/ గడిపాను నేను కూడా/ సుఖలోలిత దినాలు’’ అంటూ మొదలవుతుందిది. నేటి రోజుల్లో యువతీ యువకుల ఫ్యాషన్‌ పిచ్చిని చిత్రించడమే కాక, పెరిగిన సంపద వల్ల కొందరిలో కలిగిన దుష్ఫలితాలను అచ్యుతన్‌ ఇలా చెబుతారు.. ‘నడి రోడ్డు పైన పొడుస్తోంది/ కాకి చచ్చిన దాని కనులు/ దాని రొమ్ము కొరుకుతున్నాడు/ నర వర్గ నవాతిథి/ వంట వాడి పొయ్యి లో/ పడినందున ఉవ్విళ్లూరే మిడుతలు!/ మరునాడు రహదారి కాలువల్లో/ పసి పిల్లల కళేబరాలు’’ అంటూ ఆవేదన చెందు తూనే ‘‘వెలుగు దుఃఖమే బాబూ/ చీకటేగా సుఖప్రదం’’ అంటారు. సాయుధ పోరాటం ద్వారా సామ్యవాదాన్ని అందుకోవచ్చని అనుకున్న వారి చర్యలని ఆవిష్కరించిన శీర్షిక ‘పాతాళం’. అపనమ్మకాల పాతాళం నుంచి క్షమాగుణశాలి అయిన భూమి తాలూకు మట్టిలోకి తిరిగి వచ్చిన మనిషి పశ్చాత్తాపం ‘భూమి’ శీర్షికలో కనిపిస్తుంది. ‘‘జీవన ప్రేమా!/ నీ శిలువ గాయమై/ పశ్చాత్తాప భావనల నెత్తురు పారుతోంది’’ అంటారు ఇందులో. 
అదే నా స్వప్నం
అచ్యుతన్‌ ‘బలిదర్శనం’ కావ్యం సమకాలీన జీవితంలో పతనమైన విలువల గురించి చర్చిస్తుంది. ‘‘నాది కాదు కాదీ గొప్ప దేవాలయం పిల్లలూ/ నావి కావు ఈ గజవీరులు కూడాను’’ అనడంలో తరతరా లుగా కేరళలో నంబూదిరి కుటుంబాలకు సంబంధించి వస్తున్న ఆచారాల మీద ఆయన నిరసన, సమాజంలో వచ్చిన మార్పు కనిపిస్తుంది. 
      మీ దృష్టిలో కవిత్వం అంటే ఏంటి? అని ఒక మిత్రుడు అడిగినప్పుడు ‘‘అన్ని అసంపూర్ణతలూ కలిస్తే పరిపూర్ణత, సంపూ ర్ణత. ఆ పరిపూర్ణతే దేవుడు. దేవుడంటే ఆనందం. ఆనందమే కవిత్వం’’ అన్నారు అచ్యుతన్‌. ‘‘భౌతికమూ ఆత్మీయమూ అయిన జీవితపు బాహ్య రూపాలను నేను అంగీకరిస్తున్నాను. ఇక్కడ చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్నకి తావులేదు. వేల వేల ముఖాలతో కూడి ఉంది సత్యం. ఈ ప్రపంచంలో ప్రతి కదలికా, ప్రతి వస్తువూ పరస్పర పూరకాలే. అదే వాటి శక్తి, సౌందర్యం కూడా. చూడాల్సిన వాటిల్లో అణుమాత్రం కూడా మనమింకా చూడలేదు. దోపిడీ అంటే నాకు అసహ్యం. అది భౌతికమైందైనా, మానసికమైందైనా. అందరూ పనిచేసే, కాళ్లకూ చేతులకూ సంకెళ్లు లేని, ప్రతి ఒక్కరి పొట్టా, మేధా నిండే ఒక లోకం గురించి కలకంటున్నాను నేను. అయినా మనిషికి సంతృప్తి కలగదే మోననే అనుమానం నాకుంది. క్షమాగుణం కలిగినవాడికే సుఖం. సుఖమంటే దుఃఖాన్ని మరచిపోవడమే. దుఃఖాన్ని తొలగించే ఔషధం ఒకటే, అదే స్నేహం’’ లాంటి మాటలు అక్కిత్తం జీవన తాత్త్వికతకి అద్దం పడతాయి. అందుకే ‘అక్కిత్తం కవిత్వం కుమిలిపోయే మనస్సాక్షి ఆవిష్కరణ’ అనే మలయాళ విమర్శకుల మాటలు అక్షర సత్యం.


వెనక్కి ...

మీ అభిప్రాయం