శతాధిక గళాల సాధికారతా నాదం

  • 318 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బి.నర్సన్‌

  • విశ్రాంత అధికారి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు
  • హైదరాబాదు
  • 9440128169
బి.నర్సన్‌

భాష మనుషులను కలిపితే, సాహిత్యం మనసులకు కలుపుతుంది. ఇష్టమైన చెట్ల మీద గుంపులుగా చేరే పక్షుల్లా అంతర్జాలంతో సమభావజీవులు అభౌతికంగా దగ్గరవుతున్నారు. క్రీడాకారులు, కళాకారులు, సాహిత్యప్రియులు ఎవరైతేనేం వాట్సప్‌ సమూహాలుగా అంకురించి శాఖలుగా ఎదిగి సంతోష సమయాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలా ఓ వాట్సప్‌ బృంద నిర్వాహకుల చొరవతో జగిత్యాల శతాధిక మహిళా కవుల సమ్మేళనం ఏర్పాటైంది. మూడురాష్ట్రాల నుంచి వచ్చిన 110 మంది కవయిత్రులు ఇందులో పాల్గొన్నారు. ఈ సంరంభం ఓ పండగలా.. తెలుగు కవయిత్రుల మహాసభగా సాగింది.
రచయితలు
పెరిగే కొద్దీ భాషా, సాహిత్యాలు పరమార్థాలై సాహితీ వాతావరణం విస్తరిస్తోంది. వాట్సప్‌ మాధ్యమంగా సాహితీ సమూహాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇలా ఏర్పడ్డ సమూహాలు వాటివాటి స్థాయి, సామర్థ్యాలను బట్టి వినూత్న కార్యక్రమాలతో ముందడుగు వేస్తున్నాయి. సారూప్య సమూహాలు కేవలం చరవాణి తెరకే పరిమితం కాకుండా ఆత్మబంధువుల్లా వివిధ వేదికల ద్వారా వ్యక్తిగతంగా కలుస్తూ వ్యక్తిగత పరిచయాలతోపాటు అభిరుచుల పరిణతిని సైతం వృద్ధి చేసుకుంటున్నాయి.
      తెలుగునాట చురుగ్గా ఉన్న వందలాది సాహితీప్రియుల వాట్సప్‌ సమూహాల్లో కళాశ్రీసాహిత్య వేదిక ఒకటి. జగిత్యాల జిల్లా కేంద్రంలో 2019 జులై 4న ఏర్పడింది. గుండేటి రాజు దీని ప్రధాన నిర్వాహకులు. అయిత అనిత, కటకం కవిత, మద్దెల సరోజన సహనిర్వాహకులు. పరిచిత సాహితీమిత్రుల కలయికతో ఈ సమూహం కవిత్వానికి చిరునామాగా మారింది. కవిత్వం, పుస్తకాల మీద ఇందులో సాగుతున్న చర్చలు నవకవులకు మార్గదర్శకాలవుతున్నాయి.
      సుమారు నలభై మంది కవులున్న ఈ సమూహానికి ఒక భారీ కవి సమ్మేళనం జగిత్యాలలోనే ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. తామే కాకుండా తాము సభ్యులుగా కొనసాగుతున్న ఇతర సమూహాల్లోని కవులను కూడా ఆహ్వానిస్తే సమ్మేళనం మరింత బాగుంటుందని మరో ఆలోచన మొగ్గ తొడిగింది. ఇలా అన్ని సమూహాల్లోని కవులను లెక్కిస్తే సంఖ్య వందల్లో ఉంది. దీన్ని వడబోయడం ఎలా అని ఆలోచిస్తున్న క్రమంలో కవయిత్రుల సంఖ్య ఏమీ తక్కువగా కనబడలేదు. కేవలం మహిళా కవులతోనే సమ్మేళనం ఎలా ఉంటుందీ అని కొత్త ఆలోచన వచ్చింది. అలా మహిళలను వేరు చేసి చూస్తే వందకు దరిదాపున కనబడుతున్నారు. ఎక్కడా చేయని విధంగా శతాధిక మహిళాకవి సమ్మేళనం నిర్వహిస్తే ఓ వినూత్న కార్యక్రమం చేసినట్లువుతుందనే కొత్త సంకల్పం పురుడుపోసుకుంది. 
ఉరిమే ఉత్సాహంతో...
కవయిత్రుల వివరాల సేకరణ, సంప్రదింపుల బాధ్యతను సమూహ సహనిర్వాహకులు తలకెత్తుకున్నారు. తాము సభ్యులుగా ఉన్న వాట్సప్‌ సమూహాల్లో కవి సమ్మేళనం సమాచారాన్ని ఉంచారు. తాము సభ్యులుగా లేని ఇతర సాహితీ సమూహాలకు సైతం ఈ సమాచారం చేరేలా చూశారు. ఇలా సమూహం నుంచి సమూహానికి చేరుతూ ఆ వార్త రెండు తెలుగు రాష్ట్రాలను సైతం దాటింది. తెలంగాణ జిల్లాలే కాకుండా సుదూర శ్రీకాకుళంతోపాటు మైసూరు, ముంబై, చెన్నై నుంచి కూడా కవయిత్రులు ఆసక్తి కనబరచారు. అందరికీ వీలయ్యేలా ఆదివారం.. 2019, నవంబరు 24 తేదీని ఖాయం చేసుకుని నిర్వాహకులు కార్యోన్ముఖులయ్యారు.  
      హైదరాబాదు, వరంగల్లు, నిజామాబాదు, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నెల్లూరు, శ్రీకాకుళం, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల నుంచి కవయిత్రులు ఎక్కువగా ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. యువతుల నుంచి అమ్మమ్మలదాకా అన్ని వయసుల వారూ వచ్చారు. హైదరాబాదు వాసి నీలారంగనాథం, మైసూరుకు చెందిన ప్రభాశాస్త్రి జోశ్యుల వయోవృద్ధులైనా హుషారుగా పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తపరచారు. శ్రీకాకుళంలో డిప్యూటీ కలెక్టర్‌ అయిన తులాల సవరమ్మ హోదాను పక్కనపెట్టి కేవలం కవిగా ఇందులో పాల్గొన్నారు. హాలు బయటే ఉండిపోయిన ఆమె భద్రతాసిబ్బంది చెప్పేదాకా ఆవిడ అసలు విషయం ఎవరికీ తెలియలేదు. 
భాష ఒక్కటే.. సంస్కృతి ఒక్కటే
ఉదయం పదింటికి మొదలైన కవితాపఠనం మూడు గంటలపాటు కొనసాగింది. భోజనానంతరం కవయిత్రులను సన్మానించి, ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి హాజరయ్యారు. ‘‘తెలుగు భాష ఒక్కటే.. తెలుగు సంస్కృతి ఒక్కటే. తెలుగు మాధ్యమంలో బోధన ప్రశ్నార్థకంగా మారిన ఈ సందర్భంలో కవయిత్రుల సమ్మేళనం జరగడం గొప్ప విషయం. ఎల్లలు దాటిన భాషా ప్రేమకు ఇది నిదర్శనం. తెలుగు భాష మాధుర్యం మాండలికాల్లో ఉంది. అన్ని తెలుగు ప్రాంతాల భాషాపదాలను అందరూ తెలుసుకోవాలి. అప్పుడే మన భాష గొప్పగా, పరిపూర్ణంగా వికసిస్తుంది. సమానత్వం పరిఢవిల్లుతుంది. కవిత్వం రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు. నలభై ఏళ్లుగా కవిత్వంతో సాగుతున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను. శాలువా ముఖ్యమనుకునే వారు కవిత్వాన్ని ప్రేమించరు. శాలువాల్ని మాత్రమే ప్రేమిస్తారు. దండలు, శాలువాలు బయట కూడా దొరుకుతాయి. కవిత్వం దొరకదు. హృదయాలను చేరుకోగల భాష కవిత్వానికే తెలుసు. కవిత్వం హృదయాంతరాలకు చేరి సంస్కరిస్తుంద’’ని చెప్పారు. కవి సమ్మేళనం నిర్వాహకులను ఆయన అభినందించారు. మరో ముఖ్య అతిథి, స్థానిక శాసనసభ్యులు డా।। సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ జగిత్యాలలో ఇంతటి ఘనమైన సాహితీ కార్యక్రమం జరగడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. ఈ సమ్మేళనానికి డా।। శైలేందర్‌రెడ్డి, జాగృతి సమన్వయకర్త జమునారాణి, వ్యాఖ్యాత మాడిశెట్టి గోపాల్‌ తదితరులు ప్రత్యేక అతిథులుగా వచ్చారు.
చైతన్యమానవి పడతి
ఈ సమ్మేళనంలో కవయిత్రులు చదివిన కవితల్లో మహిళాసాధికారతను లక్షించినవే ఎక్కువగా ఉన్నాయి. స్త్రీ తల్లిగా, సతిగా, సోదరిగా మానవీయ అనుబంధాలకు మూలాధారంగా నిర్వహిస్తున్న పాత్రను అక్షరహాలికులు పట్టిచూపారు. వివిధ సామాజిక రుగ్మతల్లో మహిళ బలిపశువు అవుతున్న తీరును నిలదీశారు. అన్నింటిలో సగమైనపుడే ఆకాశంలో సగమనే మాటకు అర్థముంటుందని నినదించారు.
      వీటిలో కొన్ని కవితలు స్త్రీజాతి ఔన్నత్యాన్ని చాటాయి. మరికొన్ని సమాజంలో దిగజారిపోతున్న మానవీయ విలువలు, తద్వారా స్త్రీలు ఎదుర్కొంటున్న దారుణాల మీద ఆందోళన వ్యక్తంచేశాయి. ‘‘ఫలితమెట్టిదైన పడతితాప్రతిభతో/ వెనుకముందు చూడ వెరసిపోక/ భయం చెందబోక భారము మోయుచూ/ పతికి సాయమౌను సతిగ తాను’’ అంటూ ఇల్లాలి పాత్రను ఆటవెలది పద్యంలో విశదీకరించారు నీలారంగనాథం. ‘‘బంధాలు అనుబంధాల కొలిమిలో/ కుటుంబ బాధ్యతల రణరంగంలో/ నానాయాతన పడ్డా చెదరని నగవుతో/ అనుభవ సారాల ఆణిముత్యం అతివ’’ అంటూ స్త్రీమూర్తికి జోతలకు పలికారు కోరుట్ల కవయిత్రి కటకం కవిత. ‘‘అబలను మోసం చేస్తే/ అంబ అవతారమెత్తి/ అంకుశంతో మొత్తి/ విశ్వరూపం దాల్చుతుంది/ చైతన్యమానవి పడతి’’.. ఇవి ప్రభాశాస్త్రి జోశ్యుల కవితలోని పంక్తులు. మహిళా చైతన్యానికి విశ్వరూపమిచ్చిన తీరును ఇందులో దర్శించవచ్చు. ‘‘కులం మతం బుసలుకొట్టని/ పాము పడగలకావల పుట్టుకొచ్చిన/ పచ్చని బతుకుల బంగరుసోయగమ్‌/ అసలుసిసలైన స్వాతంత్య్రం’’- నిజమైన స్వాతంత్య్రానికి కులం, మతం అడ్డుగోడలని అయిత అనిత తన కవిత ద్వారా పచ్చటి బతుకులకు అర్థం చెప్పారు. ‘‘నిశ్శబ్దనిశీధిలో నడుస్తున్నాను/ నా అడుగుల సవ్వడి, గుండె చప్పుడు కాకుండా/ ఏదోరోదన నా కర్ణాలను/ చిరాకుపరుస్తుంటే/ నాలో నేను జవాబులేని/ ప్రశ్నగా మిగలాల్సిందేనా!’’ అంటూ ఈ ప్రశ్నను నిజామాబాదుకు చెందిన కామినేని రేణుక తనకుతాను వేసుకోవడమేకాకుండా సమాజం ముందుంచారు. ఈ కవితల్లో అంశ ప్రాధాన్యంతోపాటు కవితాత్మకతకు కూడా కొదువ లేదు. ఈ కవయిత్రుల్లో అయిత అనిత, మద్దెల సరోజన, నన్నపురాజు విజయశ్రీ, గాండ్ల వీరమణి, విజయలక్ష్మీ నాగరాజ్, ప్రభాశాస్త్రి, శైలజాశ్రీనివాస్, డా।। గడ్డం శ్యామల ఇప్పటికే తమ రచనలను సంపుటాలుగా వెలువరించారు. ఐల మమత రాసిన ‘మమతల విరిజల్లు’ను ఈ సమ్మేళనంలో ఆవిష్కరించారు.
      కేవలం వాట్సప్‌ మాధ్యమంగానే కాకుండా సభలు, సమావేశాల నిర్వహణ కూడా చేపట్టిన ‘కళాశ్రీ సాహితీ వేదిక’ కృషి ప్రశంసనీయం. ఇలాంటి సమ్మేళనాలతో తెలుగు కవితావైభవ దీప్తులు మరింతగా విస్తరిస్తాయి. అక్షర హాలికులకు ప్రోత్సాహకరంగా నిలుస్తూ సాహితీవృక్షానికి వసంతకాలపు పచ్చదనాన్ని అద్దుతాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం