నారసింహ క్షేత్ర కీర్తి

  • 487 Views
  • 3Likes
  • Like
  • Article Share

శ్రీమదహోబలేశ నరసింహుడు నా ప్రియదైవతంబు మ
త్స్వామి తదీయ తీర్థవిభవంబును దన్మహితావతారమున్‌
నీ మధురోక్తిభంగున మనీషులు మెచ్చగ బ్రస్తుతింపు నీ
కేమెయి సంభవించు నఖిలేప్సిత పుణ్యఫలోదయోన్నతుల్‌ 

      తను ధ్యానంలో ఉన్నప్పుడు తాత ఎరపోత సూరి కనిపించి, అహోబల తీర్థ విభవం గురించి రాయమని చెప్పడంతో ‘నృసింహపురాణం’ రాస్తున్నానని అవతారికలో పేర్కొన్నాడు ఎర్రన. ఇక్కడే అర్థమైపోతుంది ఇదో స్థలపురాణమని. పేరుకు ‘‘బ్రహ్మాండాది పురాణోక్తంబయిన శ్రీ నరసింహావతారంబను పురాణంబు తెనుంగుబాస బ్రకటింపవలయు’’ అని ఎర్రన చెప్పినా ఇది స్వతంత్ర రచనే. బ్రహ్మాండ పురాణంలో ఈ కథ చాలా చిన్నది. పైగా, ప్రారంభంలో దేవశ్రవుడితో ‘‘ఏనును బెద్దలచే మును/ వీనులలర దర తరంబవిన్న విధంబున్‌/ మానసమున నున్న తెరగు/ గానుపునంగన్న క్రమము గథనమొనర్తున్‌’’ అని ప్రకటింపజేశాడు. దీన్నిబట్టి ఇందులో కల్పన చొప్పించినట్లు అర్థమవుతుంది. 
      ఎర్రన... ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ‘ఆంధ్రమహాభారత అరణ్య పర్వ శేషం, హరివంశం, నృసింహపురాణం’ ఎర్రన ఇతర రచనలు. రామాయణం కూడా రాసినట్లు చెబుతారు. అది అలభ్యం. ‘నృసింహపురాణం’ తొలి తెలుగు స్థల పురాణం. పదకొండు పద్యాలతో అహోబిల నారసింహుడి మీద షష్ఠ్యంతాలు రాసి కావ్య రచనలోకి ప్రవేశించిన ఎర్రన, ఈ గ్రంథాన్ని ఆ స్వామికే అంకితం చేశాడు. గాలవుడనే ముని అహోబల క్షేత్రాన్ని దర్శించి, దేవశ్రవుణ్ని ‘శ్రీమహావిష్ణువుతో హిరణ్యకశిపుడికి వైరం ఎలా ఏర్పడింది? ప్రహ్లాదుడు విష్ణువుని ఎలా మెప్పించాడు? నరసింహావతారానికి కారణమేంటి? అతనికి అహోబలనాథుడని ఖ్యాతి ఎలా కలిగింది?’ అని ప్రశ్నిస్తాడు. వాటికి సమాధానమే ఈ కథ. ద్వారపాలకులైన జయవిజయులను రాక్షసులుగా జన్మించమని సనక సనందాదులు శపిస్తారు. వారిద్దరూ హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా పుట్టి తిరిగి తన సాయుజ్యం పొందుతారని విష్ణుమూర్తి చెబుతాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మ వరం పొంది దేవతలను హింసిస్తుంటాడు. ఆపై ప్రహ్లాద జననం, అతని విష్ణుభక్తికి కోపించి హిరణ్య కశిపుడు హింసించడం, చివరికి నృసింహావతారంలో స్వామి అతణ్ని సంహరించడం తర్వాతి కథ. చివర్లో ‘ఈ ప్రదేశం పరమ మంగళంబై నన్నిక్కడ ఉండాలని కోరుకుంటోంది. ఇకపై ఇక్కడే ఉండి భక్తులను రక్షిస్తుంటాను’ అని ఆ స్వామితో ఈ క్షేత్రాన్ని కొనియాడించి తెలుగులో తొలి స్థల పురాణానికి కావ్య గౌరవం కల్పించాడు ఎర్రన. పైగా ‘శ్రీకాంచిపురిహరి క్షేత్రంబు, మధుర, శ్రీ ద్వారక, శ్రీరంగభూరిపదము, శ్రీకూర్మ సదనంబు సింహాచలంబును, నా కహోబల తీర్థంబు పగిది నధిక వల్లభములు గావు’ అనీ చెప్పించాడు! 
      ‘నృసింహపురాణం’ ప్రబంధమా? పురాణమా? అని పండితుల్లో వాదన ఉంది. అయితే, ఈ గ్రంథాన్ని ఎర్రన ప్రబంధమని, కావ్యమని, విజ్ఞాన వాఙ్మయమని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఎర్రన దీన్ని ‘లక్ష్మీనరసింహావతారం బను పురాణకథ’ అని చెప్పుకున్నాడు. వర్ణనలు, కథనం పరంగా దీన్ని ప్రబంధంగానే చెప్పుకోవచ్చు. పోతన రాసిన ఆంధ్ర మహాభాగవతం ద్వారా కూడా ప్రహ్లాదుడు తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. అయితే, భాగవతం, నృసింహపురాణం రెండింటిలోని కథల్లో చాలా వ్యత్యాసాలున్నాయి. ఈ రెండు రచనలను తులనాత్మక పరిశీలన చేస్తే ఎర్రన పద్యాలను పోతన అనుకరించినట్లు అర్థమవుతుంది. నృసింహపురాణంలోని తెలుగు నుడికారపు సొగసులు, పద్యాల కూర్పు ఎంతో హృద్యంగా ఉంటాయి. నిప్పున జెదలంటునే; కుంపటిలో దామర మొలచిన క్రియ లాంటి నానుళ్లు, ఎన్నో జాతీయాలను ఇందులో ఎర్రన ఉపయోగించాడు. నృసింహపురాణంలో వీర రౌద్ర భయానక శృంగార కరుణ భక్తి రసాలు కనిపించినా అంగిరసం మాత్రం శాంతమని విమర్శకులు పేర్కొన్నారు. అహోబలేశుడి ఖ్యాతిని వివరిస్తూ వచ్చిన ఈ రమణీయ గ్రంథం తర్వాతి కాలంలో అనేక స్థలపురాణాలకు స్ఫూర్తిగా నిలిచింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం