చరిత్రసౌధానికి పునాదిరాళ్లు

  • 1619 Views
  • 6Likes
  • Like
  • Article Share

    డా.మాదిరాజు కనకదుర్గ

  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,
  • హైదరాబాదు
  • 9885688342
డా.మాదిరాజు కనకదుర్గ

‘కైఫియత్‌’/ ‘కైఫీయత్తు’ అరబ్బీపదం. దీనికి స్థానిక చరిత్ర అని అర్థం. ‘దండ కవిలె’, ‘హకీకతు’, ‘పారీకతు’, ‘యాదుదాస్తు’, ‘కథ’, ‘వృత్తాంతం’... ఇవి కైఫీయత్తు పర్యాయాలు. ఈ స్థలచరిత్రల సేకరణకు ఆద్యుడు కల్నల్‌ కాలిన్‌ మెకంజి. ఆయన ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అందించిన కైఫీయత్తులు... తెలుగు పల్లెల ఆవిర్భావ వికాసాలు, జానపదుల జీవితం, నాటి భాష తదితరాలకు దర్పణాలు. తెలుగువారి చరిత్ర నిర్మాణంలో వీటి పాత్ర కీలకం. 
ఆ కాలంలో గ్రామలెక్కలు రాసే బాధ్యత కరణాలది. అలా భూములు, శిస్తు వివరాలతోపాటు గ్రామాల పుట్టుపూర్వోత్తరాలూ నమోదుచేశారు వాళ్లు. అందుకే ‘కవిలె రాయడం చేతగాని వ్యక్తి కరణమే కాద’ంటాడు ‘సకలనీతి సమ్మతం’లో మడికి సింగన. ఆ గ్రామచరిత్రలే కైఫీయత్తులు. వీటిలో గ్రామీణ జీవనానికి సంబంధించిన అనేక అంశాల ప్రస్తావన ఉంది. అయితే, చాలావాటిలో ఆయా గ్రామస్థులకు ఇష్టదైవాలు స్వప్నంలో దర్శనమిచ్చి, ఆలయాలను నిర్మించాలని కోరడం, అవి నిర్మించాక- ఆలయం కేంద్రంగా ప్రజల నివాసాలు, కార్యకలాపాలు ముమ్మరం కావడం... చివరికి ఆ గ్రామం అక్కడి దేవుడి పేరుతోనో, ఆయన మహిమలతోనో ప్రసిద్ధికెక్కిన విషయం ప్రధానాంశం. కవిలెలను కొంతమంది క్లుప్తంగా రాయగా, ఇంకొంతమంది విపులంగా రాశారు. వీటినుంచి నాటి గ్రామీణ వ్యవస్థ, ప్రజల జీవనవిధానం కొంతవరకు తెలుస్తాయి.
      ఆనాడు గ్రామాలు రాచవూళ్లు, అగ్రహారాలు, నాయంకరాలు అని మూడు రకాలు. రాచవూళ్లు ఆ ప్రాంతపు రాజు ప్రత్యక్ష పాలనలో ఉండేవి. వీటి వ్యవహారాలను రాజోద్యోగులే నిర్వహించి, ఆదాయాన్ని రాజుకు సమర్పించేవాళ్లు. అగ్రహారాలు బ్రాహ్మణులకు, పండితులకు రాజులు, సామంతులు దానం చేసిన గ్రామాలు. వీటినుంచి వచ్చే శిస్తు వగైరాలు దానం తీసుకున్న వాళ్లకే చెందేవి. ఈ రెండూ కానివి నాయంకరాలు. ఇవి రాజులకు సైన్యాన్ని సమకూర్చి పెట్టేందుకు దండనాయకులకు ఇచ్చినవి. ఇవికాక, జమీందార్లు జాగీరుగా ఇచ్చిన భూముల్లో వ్యక్తులు గ్రామాలను నిర్మించి, వాటికి తమ పేరుపెట్టడమూ కనిపిస్తుంది. గండికోటను పాలించిన పెమ్మసాని తిమ్మనాయుడు తన తోబుట్టువు గోవిందమ్మకు జాగీరు ఇచ్చాడు. ఆమె తనపేరిట ‘గోవిందమ్మపేట’ను కట్టించినట్లు ఫకీరుపేట కైఫీయత్తులో ఉంది.
      ఇక గ్రామ నిర్మాణానికి శంకుస్థాపన వాస్తు ప్రకారం చేసేవాళ్లు. శంకుస్థాపన సమయంలో అన్ని కులాలవారికీ ప్రాతినిధ్యం ఉండేది. మాన్యం ఇచ్చిన భూమికి పొలిమేరలు నిర్ణయిస్తూ శిలాఫలకాలు పాతేవాళ్లు. రాజులు తమ ఏలుబడిలో ఉన్న గ్రామ ప్రవేశాలకు ముహూర్తం నిర్ణయించి, పూజాదికాలు చేసి, అన్నదాన శాంతి జరిపాకే ఊళ్లో అడుగుపెట్టేవాళ్లు. ‘‘స్వామి సంప్రోక్షణం చేసి, బ్రాహ్మణులకు భోజనం చేసి, ఆపై ‘గ్రామాన వురిమి పెట్టి’ ఆ గ్రామం ఎక్కిరి’’ అని కొమ్మెర గ్రామ కైఫీయత్తులో పేర్కొన్నారు.
సహస్ర వృత్తుల సమస్త చిత్రణ
మెకంజి కైఫీయత్తుల్లో అష్టాదశ వర్ణాల ప్రస్తావనలో వివిధ వృత్తుల వివరాలు ఉన్నాయి. ‘బ్రహ్మదేవుడు అక్షరములలో నాలుగవ అక్షరములను అనగా ఘ, ఝ, ఢ, ధ, భ అనువానిని, స్వరవర్ణములలో మహాప్రాణములని, శ్వాసములని నిర్మించెను. అంటే చతుర్ధ వర్ణమైన శూద్రవర్ణము సర్వవర్ణముల వారికి ప్రాణభూతమైనది’ అని శూద్రుల పుట్టుకను, ప్రాధాన్యాన్ని వివరిస్తుంది ముట్నూరు కైఫీయత్తు. కులాలు, వృత్తుల మీద ఊళ్ల పేర్లు ఏర్పడటం చూస్తే సమాజంలో వృత్తిపనివారి ప్రాధాన్యం తెలుస్తుంది. బ్రాహ్మణపల్లె, గొల్లులుప్పలపాడు లాంటివి ఇలాంటి గ్రామాలకు ఉదాహరణలు.
      బ్రాహ్మణులు నియోగి, వైదికి అని రెండు తెగలు. కరణీకం చేసేవాళ్లు నియోగులు. వేదోక్త కర్మలు నిర్వహించేవాళ్లు వైదికులు. ఆకాలంలో రాజులు బ్రాహ్మణులకు కరణీకం మిరాశీలు ఇచ్చేవాళ్లు. పేరుసోముల కైఫీయత్తులో బ్రాహ్మణులు మాంసం తింటారనీ, చేపలను చంపి దర్భాసనం కింద వేసుకుంటారని పేర్కొంటే... పత్తికొండ కైఫీయత్తేమో ఎర్రగా ఉండే గెంజరగెడ్డలను బ్రాహ్మణులు తినరంటుంది. వీటినుంచి ఒక్కో ప్రాంతంలో బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలు, జీవనవిధానం ఒక్కో రకంగా ఉండేవన్న విషయం తెలుస్తుంది.
      పద్మశాలీల గురించి, వారి వృత్తి చేనేత గురించి ‘సాలెకులంవారి కైఫియత్‌’ వివరిస్తుంది. పాంచాల కులంలో కమ్మరులను శ్రేష్ఠులుగా చెప్పారు. కాశవాళ్లు రాళ్లపని, ఉప్పరలు కారు ఉప్పు తయారీ చేస్తున్నట్టు, చిటికెన వాళ్లు కెంపులు, రత్నాలు, పూసలు, చాకులు, కత్తులు, దబ్బణాలు అమ్ముతున్నట్టు కైఫీయత్తులు సమాచారం ఇస్తున్నాయి. బలిజలు, తంబళ్లు శైవ కులాలవారు కాగా; గొల్లలలో యాకరి గొల్లలు, పట్టెగొల్లలు, పట్రగొల్లలు, కాపులలో పెడకంటి కాపులు, పాకనాటి కాపులు, ఈడిగె, దాసరి, పూనుముత్త దాసర్లు వైష్ణవ సంబంధ కులాలవారన్న విభజన వీటినుంచి తెలుస్తుంది. విప్రవినోదులు, భాగవతులు, తప్పలవారు కూడా ఈ విభజనలో చేరతారు. సురభివాళ్లు, బొగ్గులవాళ్లు, విజయభారతులు, పోగులవాళ్లు, తలారి, వడ్ల, మాల, మాదిగ, మంగల నాడు ప్రముఖంగా ఉన్న మరికొన్ని కులాలు. రాజులు దండయాత్రకు వెళ్తూ రజకుల ఇళ్ల మీద జొన్నలు చల్లేవారట. కృష్ణదేవరాయల కాలంలో ఒక రజకుడు ఇంటిముందు విశ్రమించి, ‘కొండవీడు మనదేరా! కొండపల్లి మనదేరా! కాదని యెవ్వడు వాదుకు దిగినా కటకం వరకూ మనదేరా!’ అన్నాడంటోంది కొండవీడు కైఫీయత్తు. మజుకూరి కరణం రమణరాయనిం గారు గ్రామ చాకళ్లకు, వడ్లకమ్మర్లకు, సరాబులకు భూములను ఈనాముగా ఇచ్చినట్లు కొప్పర్రు కైఫీయత్తులో ఉంది.
స్వర్ణవిద్య పట్ల ఆసక్తి
కైఫీయత్తుల్లో ఎక్కువగా ప్రస్తావించింది ‘పరుసవేది’ గురించి. కొండవీడు కైఫీయత్తులో దొంతిరెడ్ల ప్రస్తావన ఉంది. ఎవరో ఒక కోమటి వేమనకు ఇనుమును బంగారం చేసే విద్య తెలుసు. ఓ సందర్భంలో ఆయన రెడ్ల ఇంటిలో విడిది చేశాడు. అప్పుడు నాగటికర్రు మీద పరుసవేది పడి అది బంగారమైంది. అది చూసిన రెడ్డి పరుసవేదిని దొంగిలించాడు. దానివల్ల సంపన్నుడయ్యాడు. దాంతో కోమటి వేమన కులం పేరును తమ ఇంటిపేరుగా చేసుకున్నాడు. కొన్నాళ్లకు రాజ్యాధికారం చేజిక్కించుకొన్నాడన్నది కొండవీడు కైఫీయత్తు కథనం. అలానే, సవరలకు పరుసవేది విద్య తెలుసని, సవర చిన్నది పరుసవేదితో బంగారం చేసిన ఉదంతాన్ని చెబుతుంది కిమిడి కైఫీయత్తు. అడవుల్లో నివసించే గొల్లచెంచుల వస్త్రధారణతోపాటు, వాళ్లు పెళ్లిళ్ల సమయంలో వక్కాకులు, బట్టలు కానుకలుగా ఇచ్చి పుచ్చుకుంటారనీ, బంధువులకు జొన్నలు, అరికెలతో అన్నం పెడతారని శ్రీశైలం కైఫీయత్తు వివరిస్తుంది.
      ఆ కాలంలో స్త్రీలు ఏడువారాల నగలు ధరించేవారు. ముత్యాల కుచ్చులదండలు, చౌకట్లు, చిలుకలు, తారిబిల్లల మొలతాడు, గంటల మొలతాడు, కడియాలు, మురుగులు, మురడీలు, సరఫణి గొలుసులు, చంద్రహారాలు, పలకసరులు, బేసరులు, చవకట్ల పోగులు ధరించేవారని దువ్వూరి కైఫీయత్తు నుంచి తెలుస్తోంది. రాణివాసపు స్త్రీలు ఒంటికి గంధం పూసుకొని ఆకువొప్పులు శృంగారించుకొనేవారని ఒంటిమిట్ట కైఫీయత్తులో ఉంది. రాజస్త్రీలకు అలంకారం చేసేందుకు పనివాళ్లు ఉండేవారట. అలా కొప్పులు ముడిచిన వారికి ఇచ్చిన ఊరు కొప్పోలు; గాజులు తొడిగిన వారికి ఇచ్చింది కంకణాలపల్లెగా స్థిరపడినట్లు ఆయా ఊళ్ల కైఫీయత్తుల్లో నమోదుచేశారు.
పండగలు- ఆచారాలు
కైఫీయత్తులలో ‘హోళీ’ని గురించి వివరంగా రాశారు. గులాలు, మోదుగుపూలతో చేసిన వసంతాన్ని ఒకరిపై ఒకరు గుమ్మరించుకుంటూ... రాత్రివేళల్లో కాముని బొమ్మలు చేయించి, దాన్ని అగ్నిగుండంలో కాల్చేవాళ్లట. తర్వాత ఆ బూడిదను ఒకరిపై ఒకరు చల్లుకునే వారని ఆదోవాని కైఫీయత్తు తెలుపుతోంది. ఇందులోనే దేవుడి మాన్యాల మీద వచ్చే ఆదాయంతో ఆలయ ఉత్సవాలు జరిపేవారనీ ఉంది. అప్పట్లో కోట్లకు పడగెత్తిన వేశ్యలు ఉండేవాళ్లు. వాళ్లు ధర్మకార్యాలు చేసేవాళ్లు.  గుళ్లు, ఊళ్లు నిర్మించేవాళ్లు. రాజులు, గ్రామస్థులు వాళ్లను చిన్నచూపు చూడకుండా వేడుకలకు ఆహ్వానించి మాన్యాలు ఇచ్చేవాళ్లు. ‘‘నందన చక్రవర్తి సీతేశ్వర స్వామి ఆలయం కట్టించి, ఆ దేవాలయంలో ఉత్సవాలకు అంకసాని, అల్లసాని, సాని అనే ముగ్గురు దేవదాసీలను నియమించి భూమిని ఇచ్చిరి’’ అని మేడికొండూరు కైఫీయత్తు పేర్కొంటుంది. వీళ్లలో అంకసాని తనకు హక్కుభుక్తమైన భూమిలో గ్రామం నిర్మించగా, అది ఆమె పేరిట అంకసానిపల్లెగా ప్రసిద్ధిచెందినట్లు ఆ గ్రామ కైఫీయత్తులో ఉంది.
      కైఫీయత్తులు ప్రస్తావనకు తెచ్చిన నాటి సామాజిక దురాచారం సతీసహగమనం. దీన్ని ‘గుండాన పడటం’ అనేవారు. అయితే, గర్భవతులు సహగమనం చేయరాదన్న నిబంధన ఉండేదని, ప్రసవం తర్వాత ‘అనుగమనం’ పేరిట ప్రాణాలు విడిచేవారంటుంది మధుర తిరుమలనాయని చరిత్ర. చిన్నచిన్న కారణాలతో, ఊరికోసం, కుటుంబం కోసం, దేవుని ఆదేశం మేరకు ఆత్మత్యాగం చేసి పేరంటాళ్లుగా మారిన స్త్రీల ప్రస్తావన చాలా కైఫీయత్తుల్లో ఉంది. మగవాళ్ల ఆత్మత్యాగం గురించి మాత్రం ఎక్కడా లేదు. కోటపాడు కైఫీయత్తులో ‘ఆవులపరువు’ పండగ జరుపుకొనే విధానాన్ని ప్రస్తావించారు. వాటిని దేవర ఆవులని పిలిచేవారు. ప్రతి ఏటా జాతర చేసి, శనగలు నానబోసి, ఆ పణ్యారాలను ఆవులకు తినిపించేవారు. ఆవులమందలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఆలపాడుగా పేరుకెక్కింది.
వ్యవసాయ ఆర్థిక వివరాలు
ఒక ప్రాంతంలో పండించిన పంటను, తయారైన వస్తువులను వేరే ప్రాంతాలకు తీసుకుపోయి అమ్మటం, వేరే ప్రాంతాల సరకులను కొనడం వంటివీ కైఫీయత్తుల్లో తారసపడతాయి. వేమవరంలో తయారైన కాగితాన్ని బందరు, చల్లపల్లి, గుంటూరు, అమరావతి, వినుకొండ, కడకుదురు తదితర చోట్లకు తీసుకుపోయిన విషయాన్ని పేర్కొంటుంది ఆ గ్రామ కైఫీయత్తు. మోటుపల్లి రేవులో ప్రజలు వలలు వేసి ముత్యాలను సేకరించారని మహిమలూరు కైఫీయత్తులో రాశారు. శ్రీగంధం, కర్పూరం, ముత్యాలు, పన్నీరు, దంతం, జవ్వాది, రాగి, తగరం, సీసం, పట్టు, పగడం, మిరియాలు, పోకలు, లక్క మొదలైనవి ఎగుమతి చేసేవారని హరివరం కైఫీయత్తు ద్వారా తెలుస్తోంది. లింగంగిరి పరగణా కైఫీయత్తులో వజ్రాలు దొరికే స్థలాల వివరాలున్నాయి. భూమిమీద కనిపించే రాళ్లనుబట్టి, లోపలున్న వజ్రాలను గుర్తించే నిపుణుల వివరాలూ ఉన్నాయి. బొగ్గుపాతర్ల గురించి ‘గూళ్యం’ కైఫీయత్తులో రాశారు. ముని మడుగుపేట కైఫీయత్తులో రవ్వలు దొరికిన సమాచారం ఉంది. రాగి, కంచు, ఇత్తడి పాత్రలను జనం విరివిగా వాడేవారు.
      పంటలు బాగా పండటానికి నదులకు కాలువలు తవ్వి నీటిని భూములకు మళ్లించేవాళ్లు. కొబ్బరి, అరటి వంటి ఫలవృక్ష జాతులను పెంచేవారని ఆరంట్లకోట కైఫీయత్తులో తెలిపారు. ఇందులోనే ఆ ఊరి కంచర పనివాళ్లు వ్యవసాయ పనిముట్లు తయారుచేసే విధానం గురించి వివరాలు ఉన్నాయి. ప్రతీ కైఫీయత్తులోనూ ఆ గ్రామంలో పండే ఖుష్కి, తరి పంటల వివరాలు, నేసే బట్టల రకాలు, వాటి ధరలను తప్పనిసరిగా నమోదు చేసేవారు. వరి, రామసాగరాలు, పచ్చజొన్న, తెల్లజొన్న మోటబావుల కింద పండించేవారు. కందులు, అనుములు, పెసలు, ఉలవలు, శనగలు, ధనియాలు, బొబ్బర్లు, మినుములు, తమిదెలు, కొర్రలు, నువ్వులు, చెన్నంగులు, ఆముదాలు, పత్తి, నీలిమందు మొదలైనవి ప్రధాన పంటలు. జామ, మామిడి, వెలగతోటలు ఎక్కువ. కరివెన కైఫీయత్తులో ఆనాటి వర్షాధార సేద్యం, రుతువులను బట్టి చేపట్టే వ్యవసాయ విధానాలు, తుంగభద్రకు వరదవచ్చే అవకాశం ఉన్న సమయాల వివరాలు విశదపరిచారు.
      ముతకవి, తెల్లతొగురు నిడివి చీరలు, కోరువలు రెండు రూపాయలకు వేంపల్లెలో విక్రయించే వారని కొండూరు కైఫీయత్తులో పేర్కొన్నారు. చెప్పల్లె, ఉప్పులూరి కైఫీయత్తుల్లో వివిధ రకాల వస్త్రాల ధరలను ప్రస్తావించారు. భాకరాపేట కైఫీయత్తులో నేతపని వివరాలు ఉన్నాయి. చింతలపూడి కైఫీయత్తులో ఈడిగె వీరమ్మ, జమీందారు జూపల్లి వెంకటరాయణిం గార్ల కథను ప్రస్తావించారు. దీనినుంచి ఆ రోజుల్లో జమీందార్లు అప్పులు ఇచ్చి, వాటిని తీర్చలేకపోతే, తామే తీర్పుచెప్పి, వాళ్లను తమ అధీనంలోనే ఉంచుకునేవారు. వారిని ఏ కారణంగానైనా విడుదల చేయాల్సి వస్తే, బదులుగా వారి కుటుంబికులను ఖైదు చేసేవారని ఈ కైఫీయత్తు తెలుపుతోంది. ఇలాంటి స్థితిలోనే వీరమ్మ తన భర్తకు బదులుగా బందీ అయి మరణించింది. దొడ్డుగొల్లు కైఫీయత్తులో తల్లిదండ్రులతో ఘర్షణపడి వేరుకాపురం పెట్టిన కొడుకుల సమాచారం ఉంది. 
      ఇలా కైఫీయత్తులు తెలుగు నేల మీదున్న అనేక పల్లెటూళ్ల చరిత్రను మనముందు నిలుపుతాయి. వీటిలో ప్రస్తావించిన ప్రజల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, పరిణామ వికాసాలు చరిత్ర నిర్మాణానికి ఆలంబనగా నిలిచాయి. ‘మతలబులూ కైఫీయతులూ ఇవి కావోయ్‌ చరిత్రసారం’ అని శ్రీశ్రీ అన్నా... మన పూర్వికుల చరిత్ర మతలబును తెలిపిన కైఫీయత్తులు మన ఘనమైన వారసత్వ సంపద!


వెనక్కి ...

మీ అభిప్రాయం