వెండితెర చందమామలు

  • 788 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। వేదగిరి రాంబాబు

  • హైదరాబాదు
  • 9391343916
డా।। వేదగిరి రాంబాబు

‘జీవము నీవేకదా దేవా/ బ్రోచే భారము నీదేకదా...’ ఈ పాట జ్ఞప్తికి రాగానే రోజారమణి ప్రహ్లాద రూపం కళ్లముందు కదలాడదూ! ‘‘పిల్లలూ దేవుడూ చల్లనివారే/ కల్లకపటమెరుగని కరుణామయులే...’’ అంటూ ఆరిందాలా అలా చేతులు ఆడిస్తూ పాడే కుట్టిపద్మినిని చూస్తే భలే ముచ్చటేస్తుంది కదా! ‘‘రామకథను వినరయ్యా’’... లవకుశులు నాగరాజు, సుబ్రహ్మణ్యంలైతే మనింటి పిల్లలే. ఇక ‘‘అంజలి అంజలి అంజలీ చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి’’... ముద్దులొలికే చిన్నారి షామిలిని మర్చిపోగలమా! ‘సీతాకోకచిలుక’లో అలీ వేషాలూ... ‘ఆదిత్య 369’లో తరుణ్‌ సాహసాలూ... చెప్పుకుంటూ వెళ్తే, వెండితెర మీద నిండు చందమామల్లా మెరిసిన బాలనటులెందరో! వాళ్లు పోషించిన పాత్రలెన్నో తెలుగువాళ్ల గుండెల్లో నిలిచిపోయాయి.  
మన చలనచిత్రాల్లో
ప్రారంభం నుంచీ పిల్లల పాత్రలకి ఓ ప్రత్యేకస్థానం ఉంది. మొట్టమొదటి భారతీయ మూకీ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’(1913)తోనే ఆ పరంపర ప్రారంభమైంది. ఈ చిత్ర దర్శక నిర్మాత దాదాసాహెబ్‌ ఫాల్కే. చిత్ర కథ తెలిసిందే. ఈ చిత్రంలో హరిశ్చంద్రుడి కుమారుడు లోహితాశుడి పాత్రను ఫాల్కే కొడుకు బాలచంద్ర.డి.ఫాల్కే పోషించాడు. 
      తెలుగులో మొదటి టాకీ 1932లో వచ్చింది. అదే హెచ్‌.ఎమ్‌.రెడ్డి ‘భక్తప్రహ్లాద’. ఇందులో నాగబోయిన సుధీర్‌ బాబు ప్రహ్లాదుడి పాత్ర పోషించాడు. ఇదే చిత్రాన్ని రంగుల్లº, నూతన సాంకేతికతతో 1967లో ఏవీఎం సంస్థ మళ్లీ నిర్మించింది. ఎస్వీరంగారావు, అంజలీదేవి, రోజారమణి... హిరణ్యకశిపుడు, లీలావతి, ప్రహ్లాద పాత్రలు పోషించారు. ప్రహ్లాదుడితో బాటు ఈ చిత్రంలో ఎన్నో బాలపాత్రలుంటాయి. హరిని పూజిస్తున్నాడన్న కోపంతో తన కుమారుణ్ని హింసిస్తాడు హిరణ్యకశిపుడు. అయినా ప్రహ్లాదుడికేమీ కాదు. ఆఖరిలో హరి, నరసింహుడుగా వచ్చి హిరణ్యకశిపుణ్ని సంహరిస్తాడు. అప్పటికి అయిదారేళ్ల చిన్నారి అయిన రోజారమణి ప్రహ్లాద పాత్రలో మెప్పించింది.
      సుధాకర్‌ అనే కుర్రాడు మొట్టమొదటిసారి రాజు, పేదగా ద్విపాత్రాభినయం చేసిన ‘రాజు-పేద’ చిత్రం 1954లో విడుదలైంది. బి.ఎ.సుబ్బారావు దర్శకులు. ఇందులో ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, ఆర్‌.నాగేశ్వరరావులతో సమానంగా గుర్తుండిపోయేలా నిలిచిపోయింది ఆ కుర్రాడి పాత్ర. వైవిధ్యమున్న రెండు పాత్రల్లో సుధాకర్‌ గొప్పగా నటించాడు.
      రాకుమారుడు, బిచ్చగాడి కొడుకు ఒకేలా ఉంటారు. తర్వాత రాకుమారుడు పేదవాడుగాను, పేదవాడు రాకుమారుడిగాను మారతారు. రాకుమారుడు పేదవాడుగా ఉండలేకపోతాడు. పేదవాడు రాకుమారుడిలా జీవించలేకపోతాడు. ‘‘రాకుమారుడిగా నా తల నేను గోక్కోలేను. నా అన్నం నన్ను తిననివ్వరు. నా నీళ్లు నన్ను తాగనివ్వరు. నా ఊపిరి కూడా నన్ను పీల్చుకోనివ్వరు’’ అంటూ బాధపడతాడు యువరాజుగా మారిన పేదపిల్లాడు. సేనాపతి మాయతో ఆ కుర్రాడికి పట్టాభిషేకం చేయడానికి రంగం సిద్ధం చేస్తాడు. ఇది తెలిసి పేదవాడి రూపంలో ఉన్న రాకుమారుడు రాజదర్బారుకు పరుగెత్తుకొస్తాడు. 
      ‘‘ఎవర్రా మీరు! నన్ను లోపలికి వెళ్లనివ్వండి’’ అంటూ భటుల్ని తప్పించుకుంటూ దర్బారులోకి ప్రవేశిస్తాడు. ‘‘నేను యువరాజును’’ అంటాడు. మంత్రి, సేనాపతుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తాడు. దాంతో ‘‘రాజముద్రిక ఎక్కడుందో చెప్పమ’’ని అడుగుతారు వాళ్లు. ఫలానాచోట ఉంది తెమ్మని రాకుమారుడుగా ఉన్న పేదవాడితో చెప్తాడీ నిజమైన యువరాజు. దాంతో అతణ్ని రాకుమారుడుగా గుర్తిస్తారు. రాజు, పేద కలిసి సేనాపతి ఆటకట్టిస్తారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో ద్విపాత్రాభినయ చిత్రాలకు చక్కటి ఒరవడి పెట్టింది. దీన్ని మార్క్‌ట్వైన్‌ నవల ‘ప్రిన్స్‌ అండ్‌ పాపర్‌’ ఆధారంగా తీశారు. 
అమ్మానాన్నలను కలిపే అమ్మాయిలు
‘లేతమనసులు’(1960)లో కుట్టిపద్మిని కూడా ద్విపాత్రాభినయం చేసింది. కథలోకి వెళ్తే... సత్యభామకి కవల పిల్లలు పుడతారు. తర్వాత భార్యాభర్తలు విడిపోతారు. పిల్లలిద్దరినీ పంచుకుంటారు. తండ్రికి పేదలంటే జాలి. మానవత్వం ఎక్కువ. అతని దగ్గర పెరిగిన పాపకీ అదే సంస్కారం వస్తుంది. తన పేరు పప్పి. తల్లి దగ్గర పెరిగిన పిల్ల లల్లి. అన్నీ అమ్మమ్మగారి పోలికలే! ఉన్నతస్థాయిలో ఉన్నామన్న అహంకారంతో పప్పీతో పోట్లాట పెట్టుకుంటుంది.
      ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే. కల్లకపటమెరుగని కరుణామయులే’ అన్న పప్పి పాట లల్లీని ఆలోచింపచేస్తుంది. ఇద్దరూ మిత్రులవుతారు. తర్వాత వాళ్లకు అమ్మానాన్నల కథ తెలుస్తుంది. దాంతో లల్లీ నాన్నని చూడాలనుకుంటుంది. పప్పీ అమ్మను చూడాలనుకుంటుంది. ఇంకేముంది లల్లీ పప్పీగా, పప్పీ లల్లీగా మారి ఒకరిళ్లకు మరొకరు వెళ్తారు. ఇద్దరూ అమ్మానాన్నలని కలపాలనుకుంటారు. కానీ వాళ్లలో మార్పు తేలేకపోతారు. ‘కోడి ఒక కోనలో... పుంజు ఒక కోనలో...’ అంటూ బాధపడతారు. ఇంతలో ప్రతినాయకుడు వీళ్లిద్దరినీ చంపాలని తిరుపతి కొండమీదికి తీసుకెళ్తాడు. ఈలోపు అతణ్ని పాము కరుస్తుంది. చనిపోతాడు. పిల్లల్ని తమ దగ్గరికి రమ్మని వాళ్లని వెదుక్కుంటూ వస్తున్న అమ్మానాన్నలు కేకలేస్తుంటారు.
      ‘‘మేము రాము. మీరిద్దరూ కొట్టుకోకుండా కలిసి ఉంటామంటేనే వస్తాం’’ అంటారు పిల్లలు. ‘‘అలాగే’’ అంటారు పెద్దలు. దాంతో పిల్లలు ఆనందంగా వాళ్ల దగ్గరికి వస్తారు. దీనికి మాతృక ఓ తమిళచిత్రం.
      ఆ తర్వాత వచ్చిన చాలా చిత్రాల్లో కవలపిల్లలు చిన్నప్పుడే ఏవో కారణాల వల్ల విడిపోతారు. చిత్రం నడుస్తుంటుంది. చివర్లో అన్నదమ్ములో, అక్కచెల్లెళ్లో అని తెలుస్తుంది. కథ సుఖాంతం. పూర్వరంగం (ఫ్లాష్‌బాక్‌)లో పిల్లల పాత్రలు తప్పవు!
కరకు గుండెలను సైతం...
చిన్నారులు నటించిన చిత్రాలలో డి.రామానాయుడు తీసిన ‘పాపకోసం’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1968లో వచ్చిన ఈ చిత్రానికి జి.వి.ఆర్‌.శేషగిరిరావు దర్శకులు. ఓ చిన్నపాప (రాణి)... కఠిన హృదయులైన నేరస్థుల గుండెల్ని తన వచ్చీరాని మాటలతో, బుడిబుడి ఆడుగులతో కరిగిస్తుంది. వాళ్లు ఆ పాపకోసం ఏ త్యాగానికైనా సిద్ధమవుతారు. ఆ పాప ఏడుపు మాన్పించడానికి వాళ్లలో ఒకడు చీరకట్టుకుని ‘రావే కూతురా..’ అంటూ పాడతాడు. నిర్మల హృదయులైన పిల్లలు ఎంత కఠినాత్ములనైనా మార్చగలరన్నది ఈ చిత్ర సందేశం. మరో ‘పాపకోసం’ చిత్రం బేబి శాలినితో వచ్చింది.
      1950లో విడుదలైన ‘బంగారుపాప’కి జార్జ్‌ ఇలియట్‌ నవల ఆధారం. జైలు నుంచి వచ్చిన కోటయ్య రౌడీగా మారతాడు. ఎవరినో చంపడానికి బయల్దేరిన కోటయ్యకి పాప ఏడుపు వినిపిస్తుంది. ఆమెను పెంచుకోవడంతో అతనిలో మానవత్వం మొగ్గతొడుగుతుంది. ఇది ఒక నేరస్థుడిలో పాప తెచ్చిన మార్పు అయితే, తర్వాత వచ్చిన ‘పాపకోసం’లో కరకు మనుషుల ముఠానే పాప మారుస్తుంది. ఇలా నేరస్థుల్ని సంస్కరించే బాల పాత్రలతో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి.
      ‘‘అమ్మా చూడాలి... నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి... నిన్ను చేరే దారే లేదు. నిన్ను చూసే ఆశే లేదు. నడవాలంటే ఓపికలేదు... ఆకలి వేస్తోందమ్మా... పలికేందుకు మనిషే లేడు... బాధగా ఉంది,  భయమేస్తోంది, ప్రాణం లాగేస్తోంది’’ అంటూ ఎడారిలో పసివాడు ఏడుస్తూ పాడే పాట అప్పట్లో ప్రేక్షకుల గుండెలను పిండేసింది. 1970లో వచ్చిన ‘పాపం పసివాడు’లోనిదే ఈ పాట. ‘లాస్ట్‌ ఇన్‌ ద డెజర్ట్‌’ అనే దక్షిణాఫ్రికా చిత్రం ఆధారంగా తెలుగులో దీన్ని తీశారు. ఇందులో పసివాడుగా రాము రఘువరన్‌ నటించాడు. కథలోకి వెళ్తే.. యూరప్‌ వెళ్తున్న విమానం కూలిపోవడంతో అందులోని చిన్న పిల్లాడు ఎడారిలో చిక్కుకుపోతాడు. ఎంత దూరం వెళ్లినా ఎవరూ కనిపించరు. ఆకలి వేస్తుంటుంది. ఏవేవో గుడ్లు కనిపిస్తాయి. వాటిని తింటాడు. ఎడారిలో నానా ఇబ్బందులు పడుతూ, అమ్మానాన్నల కోసం ఏడుస్తాడు. చివరికి ఆ పిల్లాడు తల్లిదండ్రుల్ని చేరుకోవడంతో చిత్రం సుఖాంతమవుతుంది. ఇందులో దాయాదుల కుట్రలూ కనిపిస్తాయి.
      ఆస్తి కోసం దాయాదులు పిల్లల్ని వేధించే సినిమాలు ఇంకా వచ్చాయి. ఎస్వీ.కృష్ణారెడ్డి మాయలోడు, ఘటోత్కచుడు కూడా ఈ కోవకి చెందినవే! కాకపోతే ‘పాపం పసివాడు’ కరుణ రసభరితమైతే, మాయలోడు, ఘటోత్కచుడు, సిసింద్రీ వినోద ప్రధానం. వీటిలో పిల్లలే ప్రధాన పాత్రలు. 
పౌరాణికాల్లోనూ...
పౌరాణిక చిత్రాలను తీయడంలో తెలుగువారి ఘనత దేశమంతటికీ తెలిసిందే. పిల్లలు ప్రధాన పాత్రలుగా కూడా అలాంటి చిత్రాలు తీశారు. 1935లో ‘శ్రీకృష్ణలీలలు’ వచ్చింది. బాలకృష్ణుడి లీలలు దీని కథావస్తువు. ఇందులో ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు చిన్న కృష్ణుడి వేషం ధరించడం విశేషం.
      1963లో వచ్చిన ‘లవకుశ’ సంచలన విజయాన్ని సాధించింది. లవకుశులుగా చిన్నారులు నాగరాజు, సుబ్రహ్మణ్యం అద్భుతంగా నటించారు. ఆ పిల్లలిద్దరూ రామకథని హృద్యంగా గానం చేయడం చిత్రంలోని పెద్ద పాత్రలనే కాదు, ప్రేక్షకుల్నీ ముగ్ధుల్ని చేసింది. అర్ధశతాబ్దం దాటినా ఈనాటికీ ఈ చిత్రం తెలుగువాళ్లను రంజింప చేస్తూనే ఉంది. ఈమధ్య వచ్చిన ‘శ్రీరామరాజ్యం’లో లవకుశుల పాత్రలను గౌరవ్, ధనుష్‌లు పోషించారు. ఈ చిత్రాన్ని చక్కగా తీసినా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేపోయింది. కారణం... నాటి ‘లవకుశ’ ప్రేక్షకుల మనసులో స్థిరంగా నిలిచిపోవడమే! ఇక కృష్ణుడి జననం, బాల్య లీలలతో సి.ఎస్‌.రావు దర్శకత్వంలో ‘యశోదకృష్ణ’ వచ్చింది. శ్రీదేవి బాలకృష్ణుడుగా మెప్పించింది.
      భాగవత, రామాయణాల్నే కాదు- వీనస్‌ మహీజా వాళ్లు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ‘బాలభారతం’(1972) తీశారు. కౌరవులు, పాండవులు చిన్ననాటి రోజుల్ని చిత్రంగా మలిచారు. ఇందులో నటించిన చిన్నారుల్లో శ్రీదేవి, ప్రభాకర్‌ ముఖ్యులు.
అందరూ పిడుగులే! 
1996లో ఎమ్మెస్‌రెడ్డి, గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘బాల రామాయణం’ తీశారు. ఇదో వినూత్న ప్రయోగం. రామాయణం అంతటినీ పిల్లలతోనే తెరకెక్కించారు. జూనియర్‌ ఎన్టీయార్‌ రాముడి పాత్రని పోషించారు. జంటనగరాల్లోని 25- 30 పాఠశాలల నుంచి దాదాపు మూడువేల మంది పిల్లలని ఎంపికచేసి, ఈ చిత్రంలో నటింపచేశారు.
      ఇక భక్తుల కథలతో భక్తమార్కండేయ, భక్తధృవ చిత్రాలూ వచ్చాయి. వాటిల్లో పిల్లలే ముఖ్యపాత్రలు. ప్రభాకర్‌ మార్కండేయుడిగా బి.యస్‌.రంగా ‘భక్త మార్కండేయ’ చిత్రాన్ని 1956లో తీశారు. మార్కండేయుడు అల్పాయుష్కుడు. చిన్న వయసులోనే అతని ప్రాణాల్ని తీసుకువెళ్లడానికి యముడు వస్తాడు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా వాటేసుకుని ఉండిపోవడంతో శివుడు మార్కండేయుణ్ని కాపాడతాడు. 1982లో ధృవ, మార్కండేయ చరిత్రల్ని కలిపి పదహారేళ్ల లోపు బాలబాలికలతో భానుమతి చక్కటి పిల్లల చిత్రాన్ని తీశారు. అదీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
బాలమిత్రులు... బాలరాజులు
‘బాలమిత్రుల కథ’ అనే చిత్రం 1972లో వచ్చింది. దర్శక నిర్మాతలు వరప్రసాదరావు, ఎస్‌.భావనారాయణ. ఓ ధనవంతుల బిడ్డ, పేద కుర్రాడు మంచిమిత్రులు. నిజాయతీ వాళ్ల ప్రాణం. ఉపాధ్యాయుడు భవానీప్రసాద్‌ వీళ్ల స్నేహం చిగురించేట్టు చేస్తాడు. అతని తరగతిలోనే పేద పిల్లవాడు ‘‘గున్నమామిడి కొమ్మమీద..’ అని పాడతాడు. ఇది ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. దేవానంద్, సురేంద్ర ఆ పాత్రల్ని రక్తి కట్టించారు.
      1970లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘బాలరాజుకథ’ కూడా చిన్నారి పాత్ర ప్రధానంగా తీసిన చక్కటి చిత్రం. ‘వా రాజా వా’ అనే తమిళచిత్రం దీనికి ఆధారం. ప్రభాకర్‌ ప్రధాన పాత్ర- బాలరాజుగా వేశాడు. మహాబలిపురంలో గైడ్‌గా ఆడుతూ, పాడుతూన్న బాలరాజుని పిల్లలు లేని దంపతులు దత్తత చేసుకుంటామంటూ ఇబ్బంది పెడతారు.
ఏవీఎం వాళ్లు పిల్లలే ప్రధానపాత్రలుగా తీసిన ‘లేతమనసులు, భక్తప్రహ్లాద’ చిత్రాలు విజయవంతమయ్యాయి. ఆ స్ఫూర్తితో వాళ్లు మళ్లీ పిల్లల చుట్టూ తిరిగే కథలతో ‘రాము’, ‘మూగనోము’ నిర్మించారు. ‘రాము’లో రాజ్‌కుమార్‌ ప్రధానపాత్ర పోషించాడు. తల్లి మంటల్లో కాలి చనిపోవడంతో రామూకి మాట పడిపోతుంది. పిల్లాడికి మాట తెప్పించడానికి తండ్రి చాలా ప్రయత్నిస్తాడు. ఆఖరికి ఆ అబ్బాయికి మాటతోపాటు రెండో అమ్మ కూడా వస్తుంది. ‘మూగనోము’లో జమున పాత్ర పేరు గౌరి. నాగేశ్వరరావు చిన్న జమీందారు- చినబాబు. చినబాబు వల్ల గౌరి గర్భవతవుతుంది. జమీందారు ఆమెని దూరంగా వెళ్లిపొమ్మనడంతో పాటు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటాడు. దాంతో ఆమె మూగనోము పడుతుంది. చివరికి కొడుకు గోపి (బ్రహ్మాజీ) వల్ల కథ సుఖాంతమవుతుంది. ఇలా పిల్లలు తల్లిదండ్రుల్ని కలిపే చిత్రాలు తెలుగులో ఎన్నో వచ్చాయి.
ఉదాత్తమైన పాత్రలే ఎక్కువ
కె.విశ్వనాథ్‌ సినిమాల్లో కూడా పిల్లలవి మంచి పాత్రలు. ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి శిష్యుడైన మంజుభార్గవి కొడుకు శంకర్‌ పాత్రలో తులసి నటించింది. శంకరశాస్త్రి, మంజుభార్గవి పాత్రల నిర్మల ప్రేమకు ఈ అబ్బాయి ఎంతగానో ఉపయోగపడతాడు. మంజు భార్గవి పేరు చిత్రంలో తులసి. శంకరశాస్త్రి మీద గౌరవంతో, తన పిల్లాడికి ఆయన పేరే పెట్టుకుంటుంది. అతణ్ని తన కుమారుడుగా కాకుండా అనాథగా శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకునేట్టు చేస్తుంది. చివర్లో కచేరీలో ‘దొరకునా ఇటువంటి సేవ’ అంటూ పాడుతున్న శంకరశాస్త్రికి హఠాత్తుగా గుండెపోటు వస్తే ఆ పాటని బాలశంకరుడు పూర్తిచేస్తాడు. అతని కాలికి గండపెండేరం తొడుగుతాడు శంకరశాస్త్రి. సంగీతంలో శంకరశాస్త్రికి ఆ పిల్లాడు వారసుడన్నట్లు చూపిస్తుండగా శంకరశాస్త్రి, తులసి మరణిస్తారు. ఇక ‘స్వాతిముత్యం’లో తల్లి వివాహం చేసుకోవడానికి తోడ్పడే బాలపాత్రని చక్కగా రూపుదిద్దారు. ‘స్వాతికిరణం’లో కుర్రాడి పాత్రా భిన్నమైందే.  
      ‘బడిపంతులు’లో తాత, నాయనమ్మల్ని తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకుండా- కొడుకులిద్దరూ చెరొకరిని పంచుకుంటే- వాళ్లకి మనవరాలు గుణపాఠం చెబుతుంది. మనవరాలుగా శ్రీదేవి మెప్పించింది. రామాయణ పాత్రలకు సాంఘిక రూపాన్ని ఇచ్చి రూపొందించింది ‘ముత్యాలముగ్గు’. లవకుశులకు బదులు ఒక పాప, బాబు పాత్రల్ని సృష్టించారు. వీళ్లిద్దరూ అపార్థాల్ని తొలగించి, విడిపోయిన తల్లిదండ్రులు ఒక్కటయ్యేలా చేస్తారు.
      లిటిల్‌సోల్జర్స్, మిస్టర్‌ పెళ్లాం, దేవుళ్లు, అంజలి, జగదేకవీరుడు- అతిలోకసుందరి, అంజి, దేవీపుత్రుడు, అమ్మోరు, పాపే నా ప్రాణం, తేజ, జీవనజ్యోతి, నాని, కొడుకు దిద్దిన కాపురం, దాగుడు మూతలు, రామదండు, బాలపౌరులు లాంటి చిత్రాలెన్నింటిలోనో పిల్లలు విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు.
      ఇటీవల వస్తున్న ఏవో కొద్ది చిత్రాలలో తప్ప తెలుగు చిత్రాలలో పిల్లల పాత్రలను చాలా ఉదాత్తంగా చిత్రించారు. ఒకటి రెండు ఫ్యాక్షన్‌ చిత్రాల్లో చిన్న పిల్లలమీద కసి తీర్చుకోవడం చూపించారు. ఈ మధ్య వెకిలితనాన్నే హాస్యంగా భావించే కొంతమంది... పిల్లలు పెద్దలకు ప్రేమలో సలహాలిస్తున్నట్లూ కథలల్లారు. వయసుకు మించిన సంభాషణలను పలికింపజేయడంతో పాటు తల్లిదండ్రులు- గురువులను ఎదిరించడం తదితర అవలక్షణాలనూ పిల్లల పాత్రలకు అంటగట్టారు. కత్తులు, తుపాకులు చేతికిచ్చి చిన్నారులతో వెండితెర మీద హత్యలు చేయించిన వారూ ఉన్నారు. అయితే, కొద్ది చిత్రాలలోని ఇలాంటి పాత్రల్ని మినహాయిస్తే మన తెలుగు చిత్రాలలో పిల్లల పాత్రలు చెప్పుకోదగ్గవి. అందుకే చెప్పుకుంటున్నాం.


వెనక్కి ...

మీ అభిప్రాయం