సహనమేవ జయతే

  • 353 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంభు

సహనం మన సంస్కృతి’ అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు కానీ ఆంజనేయస్వామి ఒప్పుకోకపోవచ్చు. అసలే లంకాదహనం చేసి ‘దహనం మన సంస్కృతి’ అని నిరూపించిన నరోత్తముడు, వానరోత్తముడు కదా ఆయన. అయినా తన శక్తి తనకు తెలీని అమాయకుడు. ఇక ప్రత్యక్ష లంకాదహనం లాంటివి చేసి ఎన్నో కొంపలకు చిచ్చుపెట్టిన అభినవ ఆంజనేయులూ ఎందరో ఉన్నారు. అయితే ‘సహనం బలహీనుడి ఆయుధం’ అనేవాళ్లూ ఉన్నారు. ఇది తప్పు. సహనం వల్లే మనకు స్వతంత్రం వచ్చింది. జాతిపిత మహాత్మాగాంధీ ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. ఇది సహనమూర్తి చెప్పిన మాట. చూపిన బాట. మరి రెండో చెంప మీద కొడితే ఏం చేయాలి? అని ఓ అసహనమూర్తి ప్రశ్నించాడు. అంతేకాదు శత్రువు మన జోలికి రాకముందే వాడి చెంపలు రెండూ మార్చిమార్చి ఎడాపెడా వాయించేయడమే మార్గమని అతగాడు ప్రేరేపిస్తాడు. సహనం మన బలహీనతకు గుర్తు అని అభిప్రాయపడతాడు. నిజానికి సహనం.. బలహీనత కాదు, తిరుగులేని బలం. ఎవడైనా మంచివాడి మీద దాడి చేస్తే అతడు ప్రతిఘటించకపోవచ్చు. అయితే ప్రతిఘటించనివాణ్ని చూసి దాడి చేసినవాడు మనసులో గడగడ వణికిపోవచ్చు. వాడు ఎప్పుడు దాడి చేస్తాడోనన్న భయమే అతణ్ని నిలువునా దహించేస్తుంది. అతడి అనుమానమే పెనుభూతమై అతణ్ని కాల్చుకుతింటుంది. అంతకుమించి వేరే శిక్ష అవసరం లేదు.
      అంతర్జాతీయ సహన దినోత్సవం అంటూ జరుపుతారు. ఏడాదిలో ఒకే ఒక్క రోజు సహనం చూపితే చాలా? అని కొంటెగా ప్రశ్నించేవాళ్లూ ఉంటారు. పోనీలే నాయనా ఏడాది అంతా అసహనం ప్రదర్శించే నీలాంటివాళ్లు ఒక్కరోజు సహనం వహించినా గొప్పేగా అని చురక వేయవచ్చు.
తథాగతుడే ఆదర్శం
భారతీయ చరిత్ర సర్వస్వం సహన, అసహనాల మధ్య పోటీయే. బుద్ధుడు తిరుగులేని సహనమూర్తి. అందరూ బుద్ధం శరణం గచ్ఛామి అంటారు. ‘యుద్ధం శరణం గచ్ఛామి’ అని ఆవేశకావేషాలు పెంచుకుంటున్న ఈ రోజుల్లో ఈ మాటకు మించిన మందు లేదు. బుద్ధుడు సహనాన్ని ఆచరించి ప్రపంచానికి చూపించాడు. సహనం మనకు పాఠం నేర్పుతుంది. గుణపాఠమూ నేర్పుతుంది. బుద్ధుడు ఓ ఇంటికి భిక్షకు వెళ్లాడు. ఆ ఇల్లాలు భిక్షవేయలేదు. అయినా బుద్ధుడు అక్కడే నిల్చున్నాడు. ఇల్లాలికి కోపం వచ్చింది. నానామాటలన్నది. అయినా బుద్ధుడు ఉలుకూ పలుకూ లేకుండా అలాగే నిల్చున్నాడు. చివరికి విసిగిపోయిన ఇల్లాలు భిక్ష తెచ్చి ‘తీసుకో’ అంది. బుద్ధుడు తీసుకోలేదు. ‘తీసుకోకపోతే ఏమవుతుంది’ అన్నాడు. ‘శుభ్రంగా నాకే ఉంటుంది’ అందామె. అప్పుడు బుద్ధుడు ‘ఇందాకటి నుంచి నువ్వు తిట్టిన తిట్లన్నీ నేను తీసుకోలేదు!’ అనేశాడు. ఈ ఉదంతం సహనానికి పరీక్ష. జయానికి నిరీక్ష. ఎదుటివాడు తిడితే ప్రతిగా మనం తిట్టామంటే ప్రత్యర్థి తిట్టును స్వీకరించి దానికి జవాబు చెప్పినట్టే. అయినా అట్టు తిన్నట్టు తిట్టు తినడమెందుకు? మళ్లీ అట్టు తిరగేసినట్టు తిట్టు తిరగెయ్యడమెందుకు?
      దానంతటికి కారణం సహనం లోపించడమే. కోపమే. తాత ముత్తాతలైన శతక కవులు ఎప్పుడో ఈ సంగతి చెప్పారు. ‘‘తన కోపమె తన శత్రువు/ తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ’’ అనే పద్యం తెలీని తెలుగువాడుండడు! తన కోపమే తన బీపీ అన్నది దాని ‘తాత’పర్యం! ప్రహ్లాదుడి విజయరహస్యం ఏమిటంటారు? సహనమే. ఏనుగులతో తొక్కించినా, పాములతో కరిపించినా ప్రహ్లాదుడు సహనం విడిచిపెట్టలేదు. రాజకుమారుడి దర్జా చూపించలేదు. ఏడిరా నీ శ్రీహరి అని తన తండ్రి హిరణ్యకశిపుడు గర్జించినా కోపం తెచ్చుకోలేదు. సహనం చూపించాడు. ‘ఇందుగలడందు లేడని, సందేహము వలదు, చక్రి సర్వోపగతుం, డెందెందు వెదకి జూచిన నందందే గలడు’ అన్న పద్యం సహకారవాద్యం లేకపోయినా పాడాడు తప్ప కోపం తెచ్చుకోలేదు. ఇదంతా లోకకల్యాణం కోసం. ఆ మాటకొస్తే లోకకల్యాణానికైనా, కల్యాణానికైనా సహనం నిత్యావసర వస్తువు. అయితే మన దేవతలందరికీ సహనం ఉందా? అంటే లేకపోవచ్చు. మన పురాణ కథలు అన్నీ రాక్షసవధలు. సహనం చూపి చూపి చివరికి జెండాపై కపిరాజు పద్యం పాడి కదన కుతూహలం చూపించినవాళ్లూ ఉన్నారు. పంచపాండవులు చూపించాల్సినంత సహనం చూపించారు. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు పూనుకున్నా శక్తిమంతులై ఉండి కూడా భరించారు. పాండవులు చివరికి రాయబారంలో అయిదూళ్లు ఇచ్చినా చాలన్నారు. దేనివల్లా ప్రయోజనం లేకపోయాకనే చేతికి పనిచెప్పారు. కత్తికి పదును పెట్టారు.
సరసమో... సహనమో!
చివరికి కల్యాణంలో కూడా సహనం అవసరమే. అయితే ఆ సహనానికి హద్దులుంటాయి. పద్దులుంటాయి. భార్యాభర్తలు ఇద్దరికీ సహనం ఉండాలంటారుగానీ అది అత్యాశ. ఇద్దరిలో ఒకరికి సహనం ఉన్నా చాలు. విడాకుల కోర్టుకు పని ఉండదు. భార్యాభర్తలు ఇద్దరికీ సహనం ఉంటే ఒక్క ఇబ్బంది ఉంది. చుట్టుపక్కలవారికి ఏమీ తోచదు. ఉచిత వినోదం దక్కదు. వారు జుట్టు పీక్కోవాల్సివస్తుంది. తీర్పులు చెప్పే అవకాశం కూడా ఉండదు. సహజంగానో, అసహజంగానో ఆడమగల మధ్య జాతిపరమైన కలహం రగులుతుంటుంది. ఒకచోట అటు ఆడవాళ్లు, ఇటు మగవాళ్లు ప్రతీకారంతో రగిలిపోయారు. యుద్ధానికి మోహరించారు. అంతుతేల్చుకోవడానికి దగ్గరయ్యారు. మరీ మరీ దగ్గరయ్యారట. అదేం చిత్రమోగానీ ముద్దుల శబ్దం వినిపించింది తప్ప గుద్దుల శబ్దం వినిపించలేదట. అది సరసమో, సహనమో తెలీదు. ఒక పెద్ద రచయిత చెప్పిన కథ ఇది. దెబ్బలు తిన్న ఓ పెద్దమనిషి ప్రతి దాడిచేయకుండానే సహనంతోనే తన ప్రతాపం చూపించాడు. నన్ను కొడితే కొట్టారు. నీకు చేతనైతే మా అన్నను కొట్టు.. మా నాన్నను కొట్టు అని రెచ్చగొట్టాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదో పద్ధతి. ఆడవాళ్లకు ఉన్న సహనం మగాళ్లకు ఉండదు. ఇది మాటల్లో తేలుతుంది. ఎటొచ్చీ మగాళ్లు పైకి తిడతారు. ఆడాళ్లు లోపల తిట్టుకుంటారు. అంతా సరిసమానం. అయితే మగాళ్లు ఏం తిట్టారో అందరికీ తెలుస్తుంది. ఆడాళ్లు ఏం తిట్టుకున్నదీ నరమానవులకూ తెలీదు. వెనకటికి మహారాణుల అంతఃపురాల్లో అలక గృహాలు ఉండేవి. సత్యభామను అలకగృహంలో చూసేసరికి శ్రీకృష్ణుడి పలక మారిపోయింది. పడకగదిలో ఆమె శ్రీకృష్ణుడిని ఎడమకాలితో తోసేసింది. ముక్కుతిమ్మన్న ఈ దృశ్యాన్ని చూసినట్టు రాశాడు. శ్రీకృష్ణుడి పరువు తీశాడు. అయినా శ్రీకృష్ణుణ్ని చివరికి సహనమే రక్షించింది. 
జలజాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునం 
తొలగం ద్రోచె లతాంగి! యట్ల యగు నాథుల్‌ నేరముల్‌ సేయ పే 
రలుకన్‌ జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్‌ నేర్తురే? 

ఇది తిమ్మన రాత. శ్రీకృష్ణుడు దాన్ని ఏ పత్రికలోనూ ఖండించలేదు. పెళ్లిపత్రికకు కట్టుబడి ఉన్నాడు. పైగా జగన్నాటక సూత్రధారి అయిన కన్నయ్య ‘నన్ను తన్నినందువల్ల నీ కాలు కందిందేమో’ అనేసి సత్యభామ దగ్గర మార్కులు కొట్టేశాడు. సహనం ఎంత ఘనవిజయం సాధించిపెట్టిందో తెలుసుకుంటే సరి! ఇది సంసారంలో వ్యక్తిత్వ వికాసం!
      అంతఃపురాల సంగతి అలా ఉందిగానీ ఇప్పుడు పురాల్లో ఇళ్లలో అలాంటి అలక గృహాలు ప్రత్యేకించి లేవు. ఇంట్లో ఇల్లాలి మదిని బట్టి ప్రతిగదీ అలకగదిగా మారిపోతుంది. వడదెబ్బకన్నా జడదెబ్బ ప్రమాదకరమైందని చెప్పారు. అది పడకగది, ఇది వంటశాల అనే విచక్షణలు ఏమీ ఉండవు. భార్య చుట్టూ ప్రదక్షిణలు తిరిగేవరకూ పరిస్థితిలో మార్పు ఉండదు.
      ఈ విషయంలో అడుగుజాడ నిస్సందేహంగా శ్రీకృష్ణుడిదే. అందుకే  ‘కృష్ణం వందే జగద్గురుం’ అనడానికి ఇది కూడా ఒక కారణమేనేమో! జగద్గురువు బాటను ఇతర గురువులు అనుసరించడమూ సహజమే. ఇందుకు ఉదాహరణలూ ఉన్నాయి. ‘సహనౌ’ భునక్తు అన్న మాటకు సహనం వల్లనే మగడికి భుక్తి అని వికటంగా ఆచరణలో చాటిచెప్పిన గురువరేణ్యులూ ఉన్నారు. ఇలాంటి తెరువులు చూపించినవారూ సద్గురువులే.
      ఒక గురువుగారు తాను ఎన్ని అన్నా భార్య నోరు విప్పదని రుజువు చేయదలుచుకున్నారు. శిష్యుడి ముందు తన పరాక్రమం చూపించదలుచుకున్నాడు. ఒకరోజు భోజనానికి పిలిచాడు. శిష్యుడి ముందు తన పరువు నిలబెట్టమని భార్యను, ఆ తర్వాత ముక్కోటి దేవతలను ప్రార్థించాడు. గృహదేవత కరుణించింది. శిష్యసమేతంగా భోజనం చేసేటప్పుడు తాను చెడామడా తిడతానని అప్పుడు మారు మాట్లాడవద్దని గురువుగారు సతిని కోరుకున్నాడు. ఆమె దయతో అంగీకరించింది. వంద తిట్లు తిట్టడానికి అనుమతించింది. ఇక గురువుగారి ఆనందానికి అవధులు లేవు. తిట్ల ప్రవాహానికి హద్దులు లేవు. అమ్మగారి దృష్టిలో వంద అంటే వందే! ఆమె లెక్కపెట్టి వంద చింతపిక్కలు పక్కన పెట్టుకుంది. ఒక్కో తిట్టుకు ఒక్కో చింతపిక్క పక్కన పారేసింది. గురువుగారు విజృంభిస్తున్నారు. వంద తిట్లు అయిపోయాయి. వంద పిక్కలూ అయిపోయాయి. వేడి వేడి సాంబారు వడ్డించే అపురూప దృశ్యం వచ్చింది. ‘లెక్క’లేని గురువుగారు నూటొకటో తిట్టు తిట్టారు. ఒప్పందం దాటిపోయింది కదా గురువుగారి ధర్మపత్ని సలసల కాగే సాంబారును గురువుగారి నెత్తి మీద పోసింది. దెబ్బకు బొబ్బలెక్కి తబ్బిబ్బు అయ్యారు. కథ కంచికి.. గురువుగారు ఆసుపత్రికి! ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన శిష్యుడికి గురువుగారంటే చిన్న చూపు కలిగింది. నేను ఆ పరిస్థితిలో ఉంటేనా పెళ్లాన్ని చీల్చి చెండాడేవాణ్ని అనుకున్నాడు. పెళ్లికాకముందు మగాళ్లు అమాయకంగా అలాగే అనుకుంటారని అప్పుడు అతడికి తత్వం తలకెక్కలేదు. కొన్నాళ్లకు శిష్యవరేణ్యుడు ఒకింటివాడై, గురువుగారిని భోజనానికి పిలిచాడు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. శిష్యుడి భార్య వడ్డించడం ప్రారంభించింది. శిష్యుడు తిట్టడం లంకించుకున్నాడు. భార్యాభర్తల మధ్య ఒప్పందం ఏంటో బాహ్యప్రపంచానికి తెలీదు. ఒక దశ వచ్చేటప్పటికి శిష్యుడి దశ మారిపోయింది. భార్య కుండ తెచ్చి పతిదేవుడి నెత్తిమీద కొట్టింది. అభం శుభం తెలియని కుండ పగిలిపోయింది. ‘‘అన్యాయంగా నీవల్ల కుండ పగిలిపోయింది. డబ్బు కట్టు.. వెంటనే కట్టు’’ అని భర్తను గద్దించిందా భార్య. శిష్యుడు గత్యంతరం లేక డబ్బు కట్టాడు. కట్టకపోతే తిన్నదంతా కక్కాల్సివస్తుందన్న భయమూ ఉంటుంది. శిష్యుడి తల దెబ్బతిన్నా నష్టం ఏమీ కలగలేదు. అందులో ఏమన్నా ఉంటే కదా నష్టం కలగడానికి అని అతడి సతీమణి తనను తాను సమర్థించుకుంది.
      శిష్యుడి నెత్తిన పాత్ర విధ్వంసం దృశ్యాన్ని చూసిన గురువుగారు తన పరిస్థితిని, శిష్యుడి పరిస్థితిని పోల్చి చెప్పాడు. గురువుగారికి ‘శిష్యవాత్సల్యం’ ఉంటుంది. అందువల్ల శిష్యుడి మీద జాలిచూపించాడు. నీ భార్యకన్నా నా భార్యే మంచిది. నా నెత్తిన ఇప్పటికి వంద కుండలు పగిలినా పాపం పిచ్చిమొహం ఒక్కదానికీ డబ్బు కట్టమన్లేదు. ఎంత మంచిదో అనేశాడు. ఇలాంటి సహనమే వివాహబంధాన్ని నూరేళ్లపాటు నిలుపుతోంది. గుద్దుకు చావడం కన్నా సర్దుకుపోవడంలోనే జీవితం ఉంది. 
      ఎంత నిజమో తెలీదుగానీ సోక్రటీస్‌ భార్యకు పరమగయ్యాళిగా పేరు. సోక్రటీస్‌కు ఎంత ప్రచారం ఉందో, ఆమెకు అంతకన్నా ఎక్కువ ప్రచారమే ఉంది. తన శిష్యుడొకడు సోక్రటీస్‌ దగ్గరికి వచ్చి ‘గురువుగారూ! నాకు సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి చేసుకోమంటారా?’ అని అడిగాడు. ‘పెళ్లి చేసుకోనాయనా!’ అన్నాడు సోక్రటీస్‌. గురువుగారూ! ఒక పక్కన అమ్మగారితో మీరు నానా అవస్థలు పడుతున్నారు కదా! నాకు ఎందుకు అలా సలహా ఇస్తున్నారు అని ప్రశ్నించాడు శిష్యుడు. అప్పుడు సోక్రటీస్‌ తాపీగా ‘‘నాయనా! నీ భార్య అనుకూలవతి అయితే నీవు గొప్ప భోగివవుతావు. గయ్యాళి అయితే గొప్ప విరాగి అవుతావు’’ ఏదైనా మంచిదే కదా అన్నాడు. నిజానికి గయ్యాళి తిట్టుమాటేమీ కాదు. ‘గయ్‌ గయ్‌మనే ఆలి గయ్యాళి’ అని ఒక కవి అన్నాడుగానీ మూలార్థం అదికాదు. గయ్యాళి అంటే గయ ఆలి. పూర్వం రోజుల్లో గయలోని స్త్రీలు విషయం వస్తే గట్టిగా మాట్లాడేవారట! అంతకుమించి నేరం ఏమీ లేదు. అదే గయ్యాళిగా ముద్రపడి నానా రచ్చా చేస్తోంది.
      సహనానికి పరీక్షలు పెట్టేవాళ్లూ ప్రపంచంలో బోలెడంతమంది. అయితే ఊరుకున్నవాణ్ని ఊరందరూ కలిసినా కొట్టలేరనే సామెత ఉంది. సత్యమేవ జయతే అంటారు. అయితే ఇది సత్యం అని ఎవరూ నిర్ధరించి చెప్పలేరు. ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చెయ్యవచ్చు. న్యాయదేవత సైతం కళ్లకు గంతలు కట్టుకునే ఉంటుంది. కానీ సహనమేవ జయతే అంటే మాత్రం తిరుగు ఉండదుగాక ఉండదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం