విజ్ఞాన దీపాలు వెలిగిద్దాం!

  • 905 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। గరికిపాటి నరసింహారావు

  • మహాసహస్రావధాని,
  • హైదరాబాదు.
  • 9848253135
డా।। గరికిపాటి నరసింహారావు

‘దైవతార్చలపుడు తామసభూత ర/ క్షోముఖంబులైన కుత్సితంపు/ జాతులెల్ల దీప సన్నిధి నడఁగు న/ ట్లగుట...’’ అంటాడు తిక్కన మహాభారతంలో. తామస గుణసంపన్నమైన భూతాలు, రాక్షసుల వంటి దుష్టజాతులన్నీ దీపం దగ్గర నశిస్తాయన్నది దీని అర్థం. దీపం చీకటి భూతాన్ని తరిమేస్తుంది. లోకానికి చిక్కటి వెలుగులు అద్దుతుంది. అజ్ఞానం పెచ్చుమీరి మనిషి రాక్షసుడు కాకుండా, చీకట్లోకి జారిపోకుండా... జగతి నిండా జ్ఞానజ్యోతుల వెలుగు పరుచుకోవాలన్నదే దివ్వెల పండగ దీపావళిలోని అంతరార్థం.
భారతీయ
జీవన విధానంలో ఏ ఆచారం పాటించినా, ఏ సంప్రదాయం అనుసరించినా, ఏ పండగ జరుపుకున్నా అందులో భౌతిక ప్రయోజనం, మానసిక అనుభూతి, ఆధ్యాత్మిక తత్త్వం అనే మూడు కోణాలుంటాయి. ‘దీపావళి’లో ఈ మూడు కోణాలు మరింత స్పష్టంగా వెలుగులీనుతూ ఉంటాయి.
      వర్ష రుతువుకి, శరదృతువుకి ఇది సంధికాలం. నేల తడిసిపోవడం, ఎండ తీక్షణంగా ఉండకపోవడం వల్ల ఈ కాలంలో సూక్ష్మక్రిములు విపరీతంగా పెరుగుతాయి. అయితే, పండగనాడు వెలిగించే దీపాల కాంతికి, వేడికి, చిటపటలకి వాటి వృద్ధి బాగా తగ్గిపోతుంది. అది ప్రజారోగ్యానికి మంచిది. ఇది భౌతిక కోణం. ఇక ఇంటింటా దీపతోరణాలు కళ్లకు కాంతిని, మనసుకు ఉత్సాహాన్నీ కలిగిస్తాయి. ఆ దీప కాంతుల్లో మనకు మనమే కొత్తగా, తేజోమూర్తులుగా కనబడతాం. ఇది మానసిక కోణం. బయటి చీకటిని బయటి దీపం పోగొడుతుంది- అంటే మనసులోని చీకటిని మనసులో వెలిగించే దీపం పోగొడుతుందనేే కదా! అదే జ్ఞానదీపం. జ్ఞానం అంటే అద్వైతం. అభేదభావం. అంతా ఒక్కటే అని భావించగలగడం. ఆ భావం వల్ల రాగద్వేషాలు మన మనసుని కలుషితం చేయవు. అప్పుడు మనం చేసే అన్ని ఆలోచనలు, మనం తీసుకునే అన్ని నిర్ణయాలు ధర్మానికి, న్యాయానికి అనుకూలంగా ఉంటాయి. వ్యక్తులకు అనుకూలంగా ఉండవు. ఇదే జ్ఞానజ్యోతి ప్రజ్వలన. ఇదీ ఇందులోని ఆధ్యాత్మిక కోణం.
ఇలా దీపాలు వెలిగించడం దీపావళి నాడే కాదు - అనేక సందర్భాల్లో జరిపిస్తాం. అసలు జ్యోతిని ప్రజ్వలింప చేయకుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టకూడదన్నది భారతీయ సంప్రదాయం. అంటే ప్రతి కర్మనూ జ్ఞానం అనే వెలుగులో చూడమని అర్థం. అప్పుడే అందులో ఉండే తత్త్వం అవగతమై జీవితం నిశ్చింతగా సాగుతుంది. లేకపోతే కర్మకాండ అనే ఊబిలో కూరుకుపోయి సందేహాలతో సతమతమైపోతూ, ప్రలోభాలకు లొంగిపోతూ, అన్నిటికీ భయపడుతూ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటాం.
ఆ రోజే ఎందుకంటే...
అమావాస్య నాడే ఈ దివ్వెల పండగ జరుపుకోవడంలో మరో ఉద్దేశం ఉంది. జీవితంలో కారుచీకట్లు కమ్ముకుపోయినా భయపడొద్దనీ, ఆ చీకట్లోనే దీపాలు బాగా వెలుగుతాయనీ... ఆ చైతన్యదీపాలు, ఆ జ్ఞానజ్యోతులు మన జీవితాల్లోని నిరాశలను తొలగిస్తాయన్న ధైర్యాన్నిచ్చే ఉత్సవం ఇది. కారుచీకట్లో కాంతిరేఖలా భగవచ్ఛక్తి మనల్ని కాపాడుతుందని దీని సందేశం.
      ఎన్ని వత్తులతో దీపం పెట్టాలనేది చాలామందికి కలిగే సందేహం. దీపం పెట్టేటప్పుడు పురోహితులు చదివే శ్లోకంలోనే ఆ విషయం స్పష్టంగా ఉంటుంది. ‘సాజ్యం త్రివర్తి సంయుక్తం’ అంటారు. అంటే మూడు పోగులు కలిపి వత్తిగా పేని వెలిగించమని అర్థం. ఇక్కడ ఆ మూడు పోగులు త్రిగుణాలకి సంకేతాలు. అవే సత్త్వ రజస్తమో గుణాలు. ప్రకృతిలో ఉన్నవి ఈ మూడే. మనందరిలో ఉన్నవీ ఈ మూడే. మొత్తం సృష్టికి కారణమూ ఈ మూడే. మూడు దారపు పోగులు కలిపి వంపులు వంపులుగా పేనడం వల్ల ఆ వత్తి నూనెను బాగా లాక్కుంటుంది. దీపం బాగా వెలుగుతుంది. అలాగే మూడు గుణాలని కలిపి జ్ఞానమార్గంలో ఆహుతి చేస్తే గుణాతీత జ్ఞానజ్యోతి దర్శనమిస్తుంది. శరీరం ద్వారా సంప్రాప్తించే ఈ మూడు గుణాలను అధిగమించిన వ్యక్తి... చావుపుట్టుకలు, ముసలితనం, దుఃఖాల నుంచి విముక్తుడై అమరత్వాన్ని అందుకుంటాడన్నది గీతాసారం.
      ఇంతటి పరమార్థాన్ని బోధించే ఈ పండగలో ఇవాళ దీపాల కంటే మందుగుండు సామగ్రి ప్రధానం అయిపోయింది!  పూర్వికులు అమృతపాత్రల్లాంటి ఆచారాలని అందిస్తే, అజ్ఞానంతో వాటిని ఆముదం డబ్బాలుగా చేసేస్తున్నాం. జాగ్రత్తపడాల్సిన విషయమిది. నరకాసుర సంహారం జరిగింది కాబట్టి ప్రజలు ఆనందంగా దీపాలు వెలిగించి ఉత్సవం చేసుకున్నారని మాత్రమే భాగవతంలో ఉంది. కాలక్రమంలో బాణసంచా పుట్టి, మన బుద్ధి వైపరీత్యంతో ఇప్పుడు బాంబుల సంతగా మారి భయపెడుతోంది.
తప్పు చేసింది కొడుకైనా...
నరకాసురుడు భూదేవి కుమారుడు. వరాహావతారంలో మహావిష్ణువుకి జన్మించినవాడే. కానీ, లోక కంటకుడిగా మారిన నరకుణ్ని సంహరించి భూభారం తగ్గించమని భూమే స్వయంగా భగవంతుణ్ని కోరింది. అంటే దుర్మార్గుణ్ని కన్నతల్లి కూడా భరించలేదని గ్రహించాలి. స్వామి శ్రీకృష్ణుడుగా అవతరిస్తే, ఆమె సత్యభామగా వచ్చింది. 16 వేల మంది స్త్రీలను చెరబట్టిన నరకాసురుణ్ని తల్లి విజ్ఞప్తి మేరకు తండ్రే స్వయంగా సంహరించాడు. ఆ అమాయక స్త్రీలకు, అనంతకోటి బ్రహ్మాండాలకి రక్షణ కల్పించాడు. అదీ నిష్పక్షపాత వ్యక్తిత్వం అంటే. దుష్ట సంతానాన్ని కాపాడుకోవడానికి అధికార దుర్వినియోగం చేస్తున్న పెద్దమనుషులందరూ ఈ కథను అర్థం చేసుకుంటే మేలు.
      సత్యాకృష్ణులకి- నరకాసురుడికి జరిగిన సంగ్రామంలో సత్యభామ ప్రతాపాన్నీ, విలక్షణ ప్రవృత్తినీ పోతన కళ్లకు కట్టించాడు. జీవితంలో ఉండే వైవిధ్యం అంతా చూపించాడు.
పరుఁజూచున్‌ వరుఁజూచు నొంపనలరింపన్‌ రోషరాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో, వీరంబు శృంగారమున్‌
బరగన్‌ గన్నులఁ గెంపు సొంపుఁ బరపన్‌ జండాస్త్ర సందోహమున్‌
సరసాలోక సమూహమున్‌ నెఱపుచున్‌ జంద్రాస్య హేలాగతిన్‌

      నరకుడి వైపు తూపులు, నారాయణుడి వైపు చూపులు ప్రయోగిస్తున్న సత్యభామ నైపుణ్యం, గుండె నిబ్బరం ఈ పద్యంలో చిత్రితమయ్యాయి. ఒకేసారి ఒకే వ్యక్తి శత్రువుని నొప్పిస్తూ, భర్తను ఆనందింపజేస్తూ; రాగద్వేషాలు ఒకేసారి ప్రదర్శిస్తూ; చురకత్తి పదునునీ, చిరునవ్వు పంటనీ ఒకేసారి రుచిచూపిస్తూ; భయంకర బాణాగ్నిని ఒకవైపు, సరసాలోకనంలో మృదుత్వాన్ని ఒకవైపు అనుభవింపజేస్తూ వీర శృంగార రసాలను కలబోసి ఆస్వాదింపచేయడం సాధ్యమేనా? అంటే అవసరాన్ని బట్టి సాధ్యం చేసి చూపించాలని సత్యభామ సంగ్రామఘట్టం ప్రబోధిస్తుంది. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది పంటి బిగువున దుఃఖాన్ని అదిమి పట్టుకుంటూనే, బాధ్యతలను సక్రమంగా నిర్వరిస్తుంటారు కదా.
ఆకాశదీపం
దీపావళితో ప్రారంభించి కార్తీకం అంతా ఆకాశదీపం పెడతారు. చుట్టూ రంధ్రాలున్న ఇత్తడి గిన్నెలోని ప్రమిదలో దీపంపెట్టి, దానికి తాడుకట్టి జెండా ఎగరేసినట్టు పైకిలాగి రాత్రంతా వెలిగేలా చేస్తారు. దీన్లోని ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఆదిశంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. 
      ఆకాశదీపం ఒక్కటే అయినా దాని కాంతి గిన్నెకుండే చిల్లుల ద్వారా బయటికి     ప్రసరించి దూరం నుంచి చూసేవారికి అనేక దీపాలుగా కనిపిస్తుంది. అలాగే మనిషి శరీరంలోని ఆత్మ తేజస్సు... కళ్లు, ముక్కు, చెవుల ద్వారా వ్యక్తమై రకరకాల స్పందనలకు కారణమవుతుంది. ఒక వ్యక్తిలో ఉండేది వ్యష్టి ఆత్మ అయితే మొత్తం విశ్వంలో ఉండేది సమష్టి ఆత్మ. విశ్వం ప్రకాశించడానికి కూడా దాని వెనుక ఉండే భగవత్తేజస్సే కారణం. ఇలా మనలో ఉండే భగవంతుణ్ని గుర్తించడానికి ‘ఆకాశదీపం’ ఒక సంకేతంగా ఉపయోగపడుతుంది. దాన్ని ఆకాశమంత ఎత్తులో కట్టడంలో ఓ ఉద్దేశముంది. ఆకాశంలో ఉండే చందమామ ఎప్పుడూ వెన్నెల రూపంలో అమృతాన్ని స్రవింపజేసి సకల జీవరాశి వృద్ధికి కారణమవుతున్నాడు. అతణ్ని అందుకోవడానికి ఆకాశదీపం ప్రయత్నించినట్లే... మన బుద్ధిలో వెలిగించే జ్ఞానదీపంతో శిరసు పైభాగంలో సహస్రార కమలంలో వెలిగే చంద్రుణ్ని అందుకుని అమృతానందం పొందగలగాలి. అదే మోక్షం. బతికుండగా పొందితే అదే జీవన్ముక్తి. ‘దీపావళి’ పండగ జరుపుకోవడం ద్వారా ఇంత ఉన్నతంగా వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోగలగడమే ఉత్సవ సౌరభం.


వెనక్కి ...

మీ అభిప్రాయం