కార్తీక భోజనంబు.. సంతోషమైన విందు!

  • 208 Views
  • 0Likes
  • Like
  • Article Share

    - భాను

తేటతెలుగులా వడబోసిన చంద్రికలు. గోరువెచ్చని పూతమెరుగుల సూర్యకాంతులు. బురద ఇంకిన నేలలో పరుచుకున్న మట్టి పరిమళాన్ని మోసుకొచ్చే చలిగాలి గిలిగింతలు. ఆకుపచ్చని గుబురులో అందంగా ఒదిగిన మంచుముత్యాలు. నిలువెల్లా తియ్యదనంతో నిటారుగా పిలిచే చెరకుతోటలు. గుడిగంటలు... ఉపవాస దీక్షలు... అభిషేక మంత్రాలు. ఊరంతా ఏకమవుతుంది... ఉసిరి చెట్ల కింద బారులు తీరి, కార్తీక వనభోజనాలు ఆరగిస్తుంది!
‘‘సంజ మసక
చీకటిలో సందోహాలేమిటి?/ అలల శాలువాలపైన జరీపూలేమిటి?/ కాంతియోగి నయనోజ్జ్వల కార్తీక దీపాలవి!/ చిదాకాశ వ్యోమకేశ శివానంద రూపాలవి!/ ప్రణవం పలుకాంతులుగా ప్రమిదలలో ఒదిగినది!/ ప్రమథగణం దీపోత్సవ శుభదినాన ఆడినది!/ ఇందుమౌళి, హైమవతుల సుందర సంధ్యా నృత్యం!/ దిగంతాల వితర్దిపై హిమయవనిక నేపథ్యం!/ మలయానిల వీచిక వింజామరలై వీచినది!/ సరసీరుహ సౌరభమిక గంధాలను పూసినది!/ ఇంద్రనీల మణుల వంటి నిటలాక్షుని జటగంగా/ శీకరాలు చింది గగన తారకలై విరియంగ’’ - కార్తీక మాసంలో ప్రతీక్షణం అందమైందే... ఆహ్లాదకరమైందే! వైశాఖంలోని వేడి బాధ ఉండదు. ఆషాఢం ముసురు జడి కనిపించదు. పుష్యమాసం చలిగాలి కోతల బెడదా ఉండదు. కార్తీక మాసంలో కమ్మటి విందు భోజనం లాంటి అనుభూతులెన్నో! భక్తీ, ముక్తీ, రక్తీ - ముప్పేటలా అల్లుకున్న కార్తీకంలో వనభోజనాలు ప్రత్యేక ఆకర్షణ!
గోవిందుడి విందు
‘‘బతకడానికి తినాలి. తినడం కోసం బతకొద్దు’’ అన్నారు పెద్దలు. కానీ వనభోజనం వంద విస్తళ్లు వేస్తుంది. అందరితో కలిసి, ఆనందంగా తింటూ బతకమంటుంది. పంచుకుని తినడంలోని పరమార్థం కార్తీక వనభోజనంలో ఉంది. కష్టమైనా, సుఖమైనా కలిసి ఆరగించడంలోని ఆనందమే వేరు. అది ఆరు రుచుల కలబోత కానవసరం లేదు... ఆరారా పోసిన గంజినీళ్లయినా అమృతమే! ఎక్కణ్నుంచో ఏరుకు తెచ్చిన పచ్చి జామకాయని కాకి ఎంగిలితో పంచుకుతిన్న బాల్యం ఎంత గొప్పదో! అలాంటి బాలానందాన్ని భాగవతంలో రక్తికట్టించాడు పోతన. యమునా తీరంలోని తోటల్లో, తోపుల్లో, గడ్డిభూముల్లో ఆలమందలు మేస్తుంటే- ‘‘కొసరి చల్దులు మ్రెక్కు గొల్లపిల్లల వ్రేళ్లసందుల మాగాయ పచ్చడి పసందుల్ని’’ అంటూ అద్భుతంగా ఆవిష్కరించాడు. అదో సామూహిక వనభోజనమే!
      గోపబాలురు వలయాకారంలో కూర్చుంటే, వారి నడిమధ్యలో కృష్ణుడు కొలువుతీరాడు. చెట్లకు వేలాడదీసిన సద్దికూడు మూటల్ని విప్పారు. కొందరు తామరాకులు తెచ్చారు. ఇంకొందరు అరటి ఆకులు తెరిచారు. మరికొందరు మట్టి కుండల్లోనూ, రాతి చిప్పల్లోనూ తీసుకొచ్చిన అన్నాన్ని వడ్డించుకున్నారు. కృష్ణుడు నడుముకు చుట్టిన పీతాంబరం మడతలో పిల్లనగ్రోవిని దోపి ఉంచాడు. దూడల్ని తోలేందుకు తెచ్చిన కర్రను చంకలో దాచాడు. హాస్యోక్తులతో అందరినీ నవ్విస్తూ, ఓ చేతివేళ్ల మధ్య ఊరగాయను పట్టుకున్నాడు. మరో చేత్తో పెరుగన్నం అందుకున్నాడు. చూపుడు వేలితో ఊరిస్తూ, మధ్యమధ్యలో రుచి చూస్తూ, ఒకరి విస్తరిలోది మరొకరు నంజుకుంటూ, పంచుకుంటూ మహదానందంతో వనభోజనాలు చేశారంతా!
కలిసి తింటే కలదు సుఖం
ఎగిరి అందుకున్న కొమ్మలోని కసుగాయ అయినా సరే రుచిగా అనిపిస్తుంది. అలాగే తోటలో చెట్లకింద కూర్చొని, సంతోషాల విస్తరి సరాగాల్ని నంజుకుంటూ తిన్న భోజనం ముందు, ఒక్కడే తాగిన అమృతం కూడా బలాదూరే! అందుకే- ‘‘విందు భోజనం/ పసందు భోజనం/ ఏటి ఒడ్డు తోటలోన మేటి భోజనం’’ అంటూ ‘బాలభారతము’ చిత్రంలో చిన్ననాటి కురు, పాండవుల్ని వనభోజనానికి పంపిస్తూ, కమ్మటి పాటను వండివార్చారు ఆరుద్ర. మారాజుల బిడ్డలే కదా! అందుకే-
నేతి గారెలు, నేతి బూరెలు
జాతివడ్ల పులిహోర, పరమాన్నాలు
అప్పడాలు, దప్పళాలు, ఆవకూరలు
పేరు చెప్పగానె నోరూరే - పిండివంటలు!
బొబ్బట్లు, మినపట్లు,
పొంగళ్లు, నంజుళ్లు,
దబ్బకాయలంత పెద్ద లడ్డుండలు,
పులుపు, తీపి, కారాలూ ముక్కుదాకా
బాగ కలిపికొట్టి తిన్నదే కమ్మని విందు 

      అంటూ నోరూరేలా వర్ణించిన కవి, సహపంక్తి భోజనంలోని సందేశాన్ని- 
ఆరురుచుల మేళవింపె నిండు భోజనం
అన్నదమ్ము లారగించు దండి భోజనం
ఒంటిపిల్లి రాకాసిది ఉత్త భోజనం
అన్నబంతిలోన పండగౌను పంక్తిభోజనం- 
సహపంక్తి భోజనం అని తేటతెల్లం చేశారు.

      అలాగే ‘అందాలరాముడు’ చిత్రంలో కూడా ‘‘సమూహ భోజనంబు, సంతోషమైన విందు, అంతస్తులన్ని బందు, అహాహ ఏమనందు’’ అని వర్ణిస్తూ ‘సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు’ అనే సమభావనను అంతస్సూత్రంగా ఆవిష్కరించారు ఆరుద్ర.
సంతర్పణ జ్ఞాపకాలు
వనభోజనాల ఏర్పాట్ల గురించి ఊళ్లలో జరిగే హడావుడి అంతా ఇంతా కాదు. కార్తీక మాసంతోపాటు శివరాత్రి, శ్రీరామనవమిలాంటి ఉత్సవాల సమయంలో కూడా పుణ్యక్షేత్రాల నదీతీరాల్లోని తోటల్లో అన్న సంతర్పణల పేరుతో సామూహిక భోజనాలు చేయడం ఇప్పటికీ కొన్నిచోట్ల సాంప్రదాయకంగా కొనసాగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ధార్మిక విధులకు పెద్దపీట వేయడం కార్తీక వనభోజనాల్లో కనిపిస్తుంది. ఊరి చివర వనాల్లో ఉసిరిచెట్ల కింద కార్తీక విశేష పర్వదినాల్లో సామూహిక రుద్రాభిషేకాలూ, సత్యనారాయణ వ్రతాలూ, విష్ణులలితా సహస్రనామాల పారాయణలూ, కుంకుమార్చనలూ, దాన ధర్మాల్లాంటివి చేస్తారు. కార్తీక పురాణంలో నైమిశారణ్యంలో మునులు ఆచరించిన వనభోజన విధులకు సంబంధించిన అధ్యాయాల్ని చదువుతారు. దీపాలు వెలిగిస్తారు. అందరూ కలిసి దేవుడి ప్రసాదాన్ని అన్న సంతర్పణలో ఆరగిస్తారు. ఇప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలకు చందాలు సేకరిస్తున్నారుగానీ, వెనకటి రోజుల్లో ఊరిపెద్దలో, మోతుబరులో ప్రాయోజకులుగా ముందుకువచ్చి, ఖర్చులన్నీ తామే భరించి, కార్తీకవన సమారాధనలు జరిపించేవారు. ఇందుకు కావాల్సిన బియ్యం, పప్పు, కూరగాయలు, ఇతర వంట దినుసులతో పాటు భారీ ఎత్తున వంటలకు అవసరమైన పాత్రలు సైతం పెద్దింటి అటకల మీది నుంచి దిగేవి. పెద్దపెద్ద గంగాళాలు, బిందెలు, మండిగలు, గరిటెలు, అట్లకాడలు, చట్రాలు, పప్పుగుత్తెలు, వడ్డెన గుత్తెలు, జాడీలు, రాతిచిప్పలు, విస్తళ్లు, కట్టెలు, రుబ్బురోళ్లు - ఇలా ఒకటేంటి సంతర్పణ సామగ్రిని ఎడ్లబళ్ల మీద వేసుకుని, ముందురోజు రాత్రికే తోటలకు చేరుకునేవారు. అన్నాన్ని చల్లారబెట్టడానికీ, కూరల్ని బాగా కలపడానికీ తాటాకు చాపల్ని కూడా తీసుకువెళ్లేవారు. తోటలో అనువైన చోట గాడిపొయ్యిలు తవ్వేవారు. పెట్టుబడి పెట్టేవాళ్లకు కుడిభుజాల్లాగా మసులుతూ, పనుల్ని తలకెత్తుకుని జరిపించే నాయకత్వ లక్షణం ఉన్న వ్యక్తులు కూడా ఊళ్లల్లో ఉండేవారు. సామాన్లు తరలించడం మొదలుకుని, వంటలు వండించడం, పూజాదికాలు పూర్తయిన తర్వాత అన్నప్రసాదాన్ని ఊరందరికీ వడ్డించి, చివరి పంక్తిలో మిగిలిన దాంతోనే తృప్తిపడి... తిన్నవారి ముఖాల్లో ఆనందాన్ని చూస్తూ, తమ కడుపు నిండినంత సంబరపడేవారు. ‘‘ఏం తిన్నాం? ఎంత తిన్నాం?’’ లాంటి ప్రశ్నలు వినిపించేవే కావు. ‘‘ఎంతలా కలిసి ఉన్నాం! ఎంత సరదాగా, సంతోషంగా తిన్నాం!’’ అనుకుంటూ రాబోయే సంవత్సరం కార్తీక వనభోజనాల కోసం ఎదురు చూసేవారు.
సందడే సందడి
ఇలాంటి కార్యక్రమాలు ఊరందరినీ ఒక్కతాటిపై నడిపించడానికి దోహదం చేసేవి. తగవులూ, పొరపొచ్చాలూ, స్పర్థలూ ఉన్నా చల్లని తోటనీడల్లోని సానుకూల వాతావరణంలో అవి పరిష్కారమైపోయేవి. అన్నం ఉడుకుపట్టి, మల్లెపువ్వులాగా విచ్చుకుని, వింత పరిమళాన్ని వెదజల్లుతున్న వేళ, లేత ఎండలో చూపులు కలిసిన జంటలకు సంబంధాలు ఖాయం చేసుకున్న సందర్భాలు ఎన్నెన్నో. వంటలోనూ, వడ్డనల్లోనూ అన్ని వీధులవారూ అన్నదమ్ముల్లాగా పోటీపడేవారు. అలాగే పందెం వేసుకుని బూరెల్నీ, గారెల్నీ ఓ పట్టుపట్టేవారు. భోజనం ఆరగించే ముందు ‘‘భోజనకాలే హరినామ స్మరణే’’ అంటూ అందరితో ‘గోవిందలు’ కొట్టించడం, ‘రాయబారం’ పద్యాల్ని ఏరుదాటి, పొరుగూరి తోటల్లో వనసంతర్పణ చేసుకున్న వారికి వినిపించేలాగా ఆరున్నొక్కటిలో ఆలపించడం వనభోజనాల్లోని ఘనమైన జ్ఞాపకాలు! ఇలాంటివన్నీ ఒకవైపు సాగుతుండగానే, ‘చతుర్ముఖ పారాయణం’లో తలమునకలయ్యే బృందాలు చెట్లనీడల్లో చెదురుమదురుగా కానవస్తాయి. తోటలోని పిట్టల అరుపులతోపాటు పేకదస్తాల కత్తిరింపుల సవ్వడులు విధిగా వినిపిస్తాయి. పొద్దు వాటారి, అందరూ ఇళ్లకు తిరుగుముఖం పడుతున్నా, పేకాటరాయుళ్లు మాత్రం ‘ఇదే ఆఖరి ఆట’ అంటూ ముక్కల పంపకంలో మునిగిపోయే ఉంటారు!
      కాలంతో పాటు వనభోజనాల స్వరూప స్వభావాలు సహజంగానే మారిపోయాయి. ‘కిట్టీపార్టీలు’, ‘పిక్నిక్‌ పార్టీలు’ లాంటివి ఆటవిడుపు వినోదాలైపోయాయి. సంస్థల వారీగా, కులాలూ, ప్రాంతాల వారీగా జరుపుకునేవీ సాధారణమైపోయాయి. గతవైభవాన్ని పునరావిష్కరించడం ఏ మేరకు సాధ్యమోగానీ, సామూహిక భోజనాల్లోని సానుకూలమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తే  - ‘‘ఒంటిపిల్లి రాకాసిది ఉత్త భోజనం, అన్నబంతిలోన పండగౌను పంక్తి భోజనం’’ అన్న కవి మాట నిజమవుతుంది!


వెనక్కి ...

మీ అభిప్రాయం