గణితానికీ సాహితీ సువాసన

  • 325 Views
  • 0Likes
  • Like
  • Article Share

గణితం, సాహిత్యం... రెండూ ఏమాత్రం పొసగనట్టు కనిపించే అంశాలు. వీటికి సాన్నిహిత్యం, సమన్వయం ఏంటనేవి ఏమాత్రమూ చర్చకు రాని అంశాలు. కానీ లోతుగా పరిశీలిస్తే ఇవి అత్యంత సుస్పష్టమైన అంతర్గత సంబంధం కలిగి ఉన్నాయని నిరూపితమవుతుంది. ఈ అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని, నన్నయ నుంచి ఇప్పటి నానీల వరకు సాహిత్యంలో గణితం అంతర్లీనంగా ఉందనే విషయాన్ని నిరూపిస్తూ విజయవాడకు చెందిన ‘గణిత విద్యాభివృద్ధి సంఘం’ (ఎ.ఐ.ఎం.ఇ.డి), మారిస్‌ స్టెల్లా కళాశాలలు సంయుక్తంగా సెప్టెంబరు 22, 23 తేదీల్లో ‘గణితం-   సాహిత్యం’ అంశం మీద జాతీయ సదస్సు నిర్వహించాయి. 
      గణిత విజ్ఞాన త్రైమాసిక పత్రిక ‘గణిత చంద్రిక’ సంపాదకుడు డాక్టర్‌ కె.రామకృష్ణ ఈ సదస్సుకు సమన్వయకర్త. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి ఆచార్యులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయ శిక్షకులు ఈ సదస్సుకు హాజరయ్యారు. డాక్టర్‌ గెలివి సహదేవుడు (నంద్యాల), ఆచార్య బి.మహేశ్వరి (పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం), ఎం.మహదేవన్‌ (చెన్నై), ఆర్‌.ఆత్మారామన్‌ (చెన్నై), ఆచార్య పి.వి.కృష్ణయ్య (ఆంధ్ర విశ్వవిద్యాలయం), ఆచార్య డి.ఆర్‌.శర్మ (ఉపసంచాలకులు, ఇగ్నో), డాక్టర్‌ జి.శివశంకరరెడ్డి (అనంతపురం), ఆచార్య డి.ఎస్‌.ఎన్‌.శాస్త్రి (మచిలీపట్నం), డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు (విజయవాడ), డాక్టర్‌ ఎం.వి.రమణమూర్తి (విజయవాడ), సూర్యనారాయణమూర్తి (గణితావధాని, అమలాపురం) ఈ సదస్సులో పరిశోధన పత్రాలు సమర్పించారు. 
భాష తోడుంటేనే 
గణితం, సాహిత్యం పరస్పరాశ్రితాలని నిరూపించి, ఈ రెండు అంశాల్లోనూ కొత్త ఆవిష్కరణలకు తెరతీయాలన్న సంకల్పం ఈ సదుస్సు ఉద్దేశం. దాన్ని సమర్థిస్తూ గణిత విద్యావేత్త, ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య పి.వి.అరుణాచలం కీలకోపన్యాసం చేశారు. ఆయన తన ప్రసంగంలో... ‘‘గణితానికి భాష పునాది. భాష తోడులేకుంటే గణిత విజ్ఞాన వ్యాప్తి కష్టం. గణిత నియమాలు ఆసరాగా ఉండటం వల్ల తెలుగు భాష ఛందస్సు, వ్యాకరణ నియమాల రూపంలో వైజ్ఞానిక రూపాన్ని సంతరించుకుంది. ఏ శాస్త్రవేత్త అయినా తన ఆవిష్కరణలను ప్రపంచానికి అందించాలంటే జనానికి అర్థమయ్యే భాష సాయం ఉండాల్సిందే. ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్తలు ఆర్యభట్ట, వరాహమిహిర, భాస్కరాచార్య తదితరులు తమ గణిత సూత్రాలను శ్లోకాల రూపంలో అందించారు. భాష తోడులేకుండా గణితాత్మకంగా విషయాన్ని చెప్పి ఉంటే అవి జనానికి అందుబాటులోకి రాకపోయేవి. గణిత విజ్ఞానాభివృద్ధికి భాష తోడు తప్పనిసరి’’ అని పేర్కొన్నారు.  ‘‘తెలుగు సామెతల్లో ఎన్నో గణితాంశాలు ఉన్నాయి. పరిశోధన చేస్తే ఆ గణిత విజ్ఞానంతోపాటు, ఎన్నో వైజ్ఞానికాంశాలు, ఆ సామెతల కాలంనాటి సామాజిక స్థితిగతులు అవగతం అవుతాయి’’ అన్నారు   డాక్టరు గుమ్మా సాంబశివరావు. 
      గణిత బోధనలోనూ భాష పాత్ర కీలకమే. అయితే ఉపాధ్యాయులు మాత్రం గణితంలో భాష ఏంటంటూ తేలిగ్గా కొట్టిపారేస్తారు. గణితాన్ని తేలికైన భాషలో విద్యార్థుల మనసుకు హత్తుకునేలా చెప్పాలి. ఉదాహరణకు ఆవర్తనం, పరావర్తనం, త్రిభుజం, లంబకోణం, దత్తాంశం మొదలైన పదాలను ఏ పర్యాయ పదంతోనూ భర్తీ చేయలేం. కాబట్టి, సాంకేతిక పదాల విషయంలో భాష సహకారం లేకపోతే విజ్ఞానం విద్యార్థులకు చేరువ  కాదని మరికొందరు వక్తలు వివరించారు. 
పద్యాల్లో లెక్కలు
తెలుగులో వచ్చిన మొదటి గణితగ్రంథం పావులూరి మల్లన ‘గణిత సారసంగ్రహం’. ఇది మహావీరాచార్యుడు సంస్కృతంలో రాసిన సారసంగ్రహ గణితానికి అనువాదం. మల్లన తన రచనకు పద్యాన్ని ఎంచుకున్నాడు. ఆ తర్వాత తెలుగు గణిత గ్రంథకర్తల్లో ప్రసిద్ధిచెందిన వ్యక్తి తడకమళ్ల వేంకటకృష్ణారావు. ఆయన కూడా పద్యాల్లో ‘ఆంధ్ర లీలావతి’ రాశారు. 
      ఆధునిక కవిత్వానికొస్తే ఆరుద్ర ‘త్వమేవాహం’లో ‘పెద్దముల్లు’ కవితలో పైథాగరస్‌ సిద్ధాంతాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు. శ్రామికవర్గాన్ని పెట్టుబడిదారులు దోచుకుంటున్నారనే భావాన్ని వ్యక్తం చేయటానికి లంబకోణ త్రిభుజంలోని కర్ణం, ఆసన్నభుజం, అడుగుభుజం భావాలను ఆయన ఆ కవితలో వాడుకున్నారు. పఠాభి, కొత్తపల్లి శ్రీమన్నారాయణ, యండమూరి వీరేంద్రనాథ్‌ వంటి మరికొందరు ఆధునిక రచయితలు కూడా తమ రచనల్లో అనేక గణితాంశాలు ప్రస్తావించారు. వీటన్నిటినీ కలిపి ఓ సంకలనంగా తీసుకురావాలని మరికొంతమంది వక్తలు అభిప్రాయ పడ్డారు. సదస్సులో  కొన్ని తీర్మానాలు చేశారు. అవి...
      గణితశాస్త్ర చరిత్రను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. దీనికి విశ్వవిద్యాలయాల గణితశాఖల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
      సాహితీరూపంలో వెలువడిన గణిత గ్రంథాలను వెలుగులోకి తీసుకురావాలి. 
      ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు జరుగుతున్న గణిత బోధనను విశ్లేషించి, భాషాపరంగా అందులో జరుగుతున్న లోపాలను సవరించేందుకు నిపుణులను నియమించాలి. 
      ప్రత్యేకించి ప్రాథమిక స్థాయిలో పిల్లలకు గణితం పట్ల ఆసక్తి పెరిగేలా చేసేందుకు కవితలు, పద్యాలు, పాటలు రాయాలి. ఈ తరహా రచనలు చేసేవారికి ప్రోత్సాహకాలు అందించాలి. ఆ రచనల్ని పాఠాల్లో భాగం చేయాలి. 
      గణితావధానం వంటి గణిత, సాహిత్య సమ్మిళిత ప్రక్రియలను ప్రోత్సహించాలి.
      ఆధునిక కవితా ప్రక్రియల్లో ప్రత్యేకంగా గణితాత్మకంగా రాసిన రచనల్ని క్రోడీకరించి ప్రచురించాలి. ఇందుకోసం నిపుణులతో విశ్వవిద్యాలయాల స్థాయిలో సంఘాన్ని నియమించాలి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం