ప్రతిఘటన చైతన్యానికి ప్రతీక

  • 120 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు

  • తెలుగు శాఖాధిపతి, హిందూ కళాశాల
  • గుంటూరు,
  • 9848543520
డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు

గుర్రం జాషువ పేరు వినగానే... మనసులో కదన కుతూహల రాగం కడలి తరంగ సహకార వాద్యంతో గింగురుమంటుంది. స్తబ్ధతను ఛేదించి కొత్త ఆలోచనలకు దారులు చూపుతుంది. ఆయన పుట్టి ఇప్పటికి నూట ఇరవై సంవత్సరాలైంది. కాలప్రవాహంలో ఆయన భౌతికంగా దూరమైనా, ఇప్పటికీ ఆయన తెలుగుజాతి తలపుల్లో సజీవంగానే ఉన్నారు. జాషువ పుట్టి పెరిగిన గుంటూరు ప్రాంతంలో ఇటీవల విశేషంగా జరిగిన ఆయన జయంత్యుత్సవ వేడుకలే దీనికి నిదర్శనాలు.
      జాషువ కళాపీఠం తరఫున మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌.. ‘వంద గొంతులు ఒక్కటై జాషువ కోసం’ అనే కార్యక్రమాన్ని సెప్టెంబరు 20న గుంటూరు పోలీసు కల్యాణ మండపంలో నిర్వహించారు. గుంటూరు సంస్కృతి సంస్థ వ్యవస్థాపకుడు సర్రాజు బాలచందర్‌ సెప్టెంబరు 26న శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉత్సవసభ ఏర్పాటుచేశారు. జాషువ పద్యాల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య ఎస్వీ.సత్యనారాయణను జాషువ పురస్కారంతో సత్కరించారు. 
      జాషువ జయంతి సభలలో పెద్దసభ గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జరిగింది. ఇక్కడ ‘జాషువ సమగ్ర రచనలు- సమాలోచన’ అంశం మీద సదస్సు నిర్వహించారు. దీనికి జాషువ కళాపీఠం కార్యనిర్వాహక ధర్మకర్త, మాణిక్య వరప్రసాద్‌ ఛైర్మన్‌గా, క్రైస్తవ కళాశాల ప్రధానాచార్యులు డా।। పి.ముత్యం గౌరవాధ్యక్షుడిగా, శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్‌.లక్ష్మణరావు అధ్యక్షుడిగా, ప్రజానాట్య మండలి గుంటూరు జిల్లా కార్యదర్శి పి.వి.రమణ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఇవికాక మరో మూడు నాలుగు చిన్న సభలు జరిగాయి. అలాగే, విజయవాడలో జాషువ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఆత్మవిశ్వాస సంపన్నులు
జాషువ 120వ జయంతి వారోత్సవాల ప్రధాన సభలలో ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, డా।। ఎండ్లూరి సుధాకర్, డా।। అద్దేపల్లి రామమోహనరావు, కత్తి పద్మారావు లాంటి సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు. వారినోటి నుంచి వెలువడిన ‘తెలుగు వాఙ్మయలక్ష్మి కలికి దేహమునందు/ కలదు నా నిర్మాణ కలప కొంత...’, ‘సకలాంధ్ర కవికోటి జాబితా లోపల/ నా నామమునకు స్థానంబు కలదు..’ లాంటి జాషువా పద్యాలు ఒక ఎత్తయితే... వారి ఉపన్యాసాలు జాషువా రచనల్లోని కొత్తకోణాలను విశ్లేషించాయి. 
      ఆంధ్ర క్రైస్తవ కళాశాల సదస్సులో కత్తి పద్మారావు మాట్లాడుతూ ‘‘వేమన, పోతులూరి వీరబ్రహ్మం, జాషువ... ఈ ముగ్గురూ ఒక కోవకు చెందినవారు. జాషువ దళితవాదానికి సంబంధించిన మానవీయ విలువలున్న మహామనీషి’’ అన్నారు. జాషువ దళితవాదానికి ఉదాహరణగా ‘శ్మశానవాటి’లోని పద్యాల్ని తాత్విక దృష్టితో వివరించారు పద్మారావు. ఇందులో సమాధి మీద వెలుగుతున్న దివ్వెను ప్రేమామృతమూర్తి అయిన తల్లి హృదయంతో పోల్చాడు కవి. అది కేవలం ఆముదం పోసిన దివ్వె మాత్రమే అయితే ఎంతోసేపు... అంటే ఆముదం అయిపోయాక వెలగదు. అది సమాధిలోని ఓ తల్లి హృదయం. బిడ్డల్ని వదిలి ఆ అభాగ్యురాలు వెళ్లిపోయింది. తన బిడ్డల కోసం ఆమె హృదయం అలా మిణుకు మిణుకు మంటూ కొట్టుకొంటోందని చెప్పటంలో జాషువ మానవీయత కనిపిస్తుందన్నారాయన.
పాటల్లాంటి పద్యాలు
జాషువ పద్యాలను పాటలుగా, గజళ్లుగా కూడా పాడుకోవచ్చన్నారు అద్దేపల్లి రామమోహనరావు. ‘ఎంత కోయిలపాట వృథయయ్యెనో కదా/ చిక్కు చీకటి వనసీమలందు/ ఎన్ని వెన్నెల వాగు లింకిపోయెనొ కదా/ కటిక కొండల మీద మిటకరించి...’ అంటూ పుట్టరాని చోట పుట్టడం మూలంగా ఎంత ప్రతిభ వృథా అయిపోయిందో అన్న ‘గబ్బిలం’ పద్యాన్ని పాడి వినిపించారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ జాషువ ఆధునిక తెలుగు కవులలో ప్రతిఘటన చైతన్యానికి ప్రతీక అని చెప్పారు. జాషువ అనుభవవాదానికి ఆద్యుడే కాదు, సంప్రదాయ ఛందస్సును ఆధునిక భావ వ్యక్తీకరణకు ఉపయోగించిన దిట్ట అన్నది రాచపాళెం అభిప్రాయం. అభ్యుదయ సాహిత్యం పురిటి నొప్పులు పడుతున్న నేపథ్యంలో సంస్కరణవాద కవిగా జాషువ పేరు పడ్డారన్నారాయన. 1932లోనే ఆర్థిక అసమానతలను ఎత్తి చూపి, వాటికి కారకులైన వారిని నిలదీసిన ధైర్యశాలి జాషువ అని కొనియాడారు.  జాషువ జీవితం, సాహిత్యం ఎప్పటికీ చర్చనీయాంశాలే అన్నది ఎండ్లూరి సుధాకర్‌ అభిప్రాయం. జాషువ సాహిత్య మూలాలు ప్రాచీనమైనా ఫలాలు మాత్రం ఆధునికం, జాషువను ఆధునిక కోణంలో విశ్లేషిస్తే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయన్నారు సుధాకర్‌. 
ఆత్మగతమైనా...
ప్రజాగాయకుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ ‘‘తనకాలం నాటి సామాజిక రుగ్మతలను ఎదిరించిన ధైర్యశాలి జాషువ. గబ్బిలం కావ్యాన్ని తన ఆత్మగతంగా రాసుకుని దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్మొహమాటంగా చాటారు. జాషువ కవిత్వం కరుణరసంతో నిండి ఉంటుంది. ఆయన పద్యాలు తెలుగు కవిత్వ రచనకు మచ్చుతునకలు. అందుకే తెలుగువాళ్లు జాషువ కవిత్వాన్ని ముమ్మరంగా ప్రచారం చేయాలి’ అన్నారు
      జాషువ మనుషుల్ని చదివి మానవత్వాన్ని రాసిన కవి. ఆంగ్ల సంస్కృత భాషల ప్రభావంలో కవులు ఉన్న రోజుల్లో చక్కని తెలుగు కవిత్వాన్ని రచించి అందరికన్నా గొప్పకవి అని ఆయన పేరు తెచ్చుకున్నారాయన అన్నారు ఆచార్య కొలకలూరి ఇనాక్‌. ప్రాచీన భాషకు చిన్నపీటను, పల్లె పలుకులకు పెద్దపీటను వేసి తెలుగు నుడికారాన్ని కాపాడిన ఘనుడు జాషువ. ఆయనను కేవలం నవయుగ కవి చక్రవర్తి అనడం సరిపోదు.. నన్నయ నుంచి చిన్నయ వరకు తొమ్మిది యుగాలకు ఆయన యుగకవి అని ఆచార్య ఇనాక్‌ పేర్కొన్నారు. సదస్సులో తెలకపల్లి రవి, జేడీ శీలం, శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి, డా।। కొలకలూరి మధుజ్యోతి, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ తదితరులు  ప్రసంగించారు. ‘దళిత సాహిత్యవాదం- జాషువ’ (పద్మారావు), ‘జాషువ సాహిత్య దృక్పథం- పరిణామం’ (ఎండ్లూరి), ‘జాషువ స్వప్నం- సందేశం’ (రాచపాళెం), ‘మహాకవి జాషువ ప్రగతిశీలత- కళాత్మకత’ (అద్దేపల్లి రామమోహనరావు) పుస్తకాలను ఆవిష్కరించారు.
      తెలుగు సాహిత్యంలో అతిసామాన్య ప్రాణుల్ని తీసుకుని, అసామాన్యంగా రచనలు చేసిన జాషువ చిరస్మరణీయుడు. సమాజం నుంచి వివక్ష ఎదుర్కున్న ఆయన వ్యథనుంచి పుట్టిన ఆ రచనలు ప్రాతఃస్మరణీయాలు. అందుకే, ఈ సదస్సు ఆ మహాకవికి ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించింది. 
      తెలుగుజాతికి చైతన్య స్ఫూర్తిని రగిలించి, అభ్యుదయవాదాన్ని మప్పించి, సంస్కరణల బాట పట్టించిన మహాకవులందరినీ స్మరించుకోవాలి. వారి దీప్తిని భావితరాలకు అందజేయాలి. 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం