శివుడా ‘‘ఏమి నీ కోరిక ’’

  • 497 Views
  • 3Likes
  • Like
  • Article Share

    సురా

శివరాత్రి వచ్చేసింది.. భోళాశంకరుడు వరాలిచ్చేస్తాడని ఖాళీగా కూర్చునైనా జాగారం చేసేద్దాం అనుకుంటూనే ఉంటారు భక్తజనంలో తర్కజనం. 
      ఆయన ఇచ్చేవాడైతే.. వచ్చే తోవలో అడ్డగించమని మందిని పంపడానికి ఎంతమంది లేరూ? ఒకప్పుడు భక్తి భూమండలం అంత పరిమాణంలో ఉండేది. ఇప్పుడు బంతిపువ్వంతైనా లేదు.  అప్పట్లో తపస్సు చెయ్యడానికి అలా ఏ కైలాస శిఖరానికో వెళ్తే.. వరాలు పొందేసి తిరిగొచ్చే రుషులూ మహర్షులూ చాలామంది కనిపించేవారు. ఆ రోజులు విభూదిలో రేణువులైపోయాయి.  
      ఏడాది పొడుగునా ఎవడు తపస్సు చేస్తాడిప్పుడు? సుబ్బరంగా ఇలాంటి వరాల ధమాకా ప్రకటించే రోజును కష్టపడి ఇష్టపడి నిష్టగా ఉన్నామంటే, పుణ్యం ఖాతా పొంగిపోయి నరకవాసులకు కూడా స్వర్గానికి తెచ్చేంత శక్తిమంతులం అయిపోమూ? 
      అందుకే జాగారం చెయ్యాలి.
      కానీ ఈ రహస్యాన్ని ఔపోసన పట్టి తర్వాతి తరాలకు అందించడంలో సమాచార లోపం ఒకటి వచ్చింది. అయిదు దశాబ్దాల కిందట జరిగిందా సమాచార వైపరీత్యం!
      అది 1970..
      రేడియోల్లో పల్లె జన హృదయాలు గూడు కట్టుకోవడం జోరందుకున్న రోజులు. ఎప్పటిలానే అల కైలాసపురమునందు మహాశివరాత్రి సంబరాలు మొదలయ్యాయి. ఇల ఏదోపురమునందు ఒక భక్తాగ్రేసరుడు జాగారం రెండో జాముకు చేరుకున్న క్షణంలో.. అనుకోకుండా వినిపించింది ఆ పక్కఇంటిపురం నుంచి ఓ గీతం.. ‘దేవదేవ ధవళాచల మందిర గంగాధరా..’ అంటూ. దాంతో అతను తన్మయత్వంతో తన రేడియోను జ్ఞప్తికి తెచ్చుకుని, దాన్ని శ్రద్ధగా ఒడిలో పెట్టుకుని, సిలోను బ్యాండును మార్చి ఆ గీతం వెలువడుతున్న భక్తికేంద్రాన్ని వెదుకులాడాడు. భక్తి తరంగాలు తగలనే తగిలాయి. జపమాలను వెదుకుతూ వచ్చిన అతని జేజమ్మ కూడా రేడియోభక్తి తరంగాలకు దాసురాలైంది. ఆపై శివస్మరణతో ఎన్నో గీతాలు ఆ రేడియోలోంచి వెలువడి ఆ గృహవాసులనూ, వారి సేవకజనావళినీ, వారి ఇంట్లోనే అద్దెకు దిగిన యువ జంటనూ భక్తిపారవశ్యంలో ముంచి తేల్చాయి. ఈ జాగరణ విజయాన్ని ఊరెల్లా ఆలకించింది. శివనామస్మరణ ఏలాగున చేసిననూ అది ఒప్పిదమే అని తీర్మానించుకుని ఫలసిద్ధిని పొందినట్లుగా ప్రకటించారు పెద్దలు. ఇక ఆ తర్వాతనుంచి శివరాత్రి జాగరణలో నిద్రఛేదన కోసం రేడియోను పాశుపతాస్త్రంలా ఉపయోగించవచ్చన్న మాట ఆనోటా ఈనోటా పాకి కైలాసందాకా చేరింది. 
      శివుడు ఈ జాగరణశోభకు అంగీకారముద్ర వేస్తానని అన్నాడో లేదో తెలీలేదు.
      ఆపై 1980..
      టేపురికార్డర్లు వీధికొక్కటిగా కాపుగాసి మరీ భక్తశిఖామణుల్ని పిలిచే రోజులవి. వాటి శ్రావ్యత స్పష్టత చూశాక అదో గొప్ప భక్తికేంద్రం అని ముచ్చటించుకున్నారు యువ భక్తులు. ఇటు రేడియో భక్తితరంగాల పౌనఃపున్యం పలుచబడిపోయి పరమేశ్వరుణ్ని ప్రసన్నం చేయలేక పోతున్నాయని వాపోయారు అప్పారావులూ సుబ్బారావులూ. ధ్వని కైలాసానికి వినపడేంత పెంచుకుని నచ్చిన శివభజనలు, గేయాలూ పదిమందికీ వినిపించేలా కృషిచేయాల్సిన రోజు రానేవచ్చిందని శివరాత్రిని స్వాగతించారు. ఆ తర్వాత జాగరభీతి ఏ వీధిలోనూ లేదు. నాలుగు జాములూ కళ్లు క్యాసెట్టు చక్రాల్లో పెట్టుకుని కూర్చున్నారు. కానీ ఓ అధమనిద్రజాతీయుడు ఒక కునుకు దాటేందుకు, శరీరాన్ని ఉత్తేజపరచేందుకు ఓ సినీగీతాల క్యాసెట్టును ఆశ్రయించాడు. ఆ నృత్యం తర్వాత అతను మళ్లీ భక్తిపర్వానికి చేరుకుంటానన్న ధీమా తన ఇంట్లోవారికి ఇచ్చాడు. అన్నట్లే అతని నిద్ర పోయింది. మళ్లీ భక్తిసాగరంలో ఈదులాడసాగాడు. కానీ అతని పిల్లలు మాత్రం నిద్రపోబోయారు. వాళ్లను నిద్రపోనీయరాదని మళ్లీ ఆ సినీనృత్య క్యాసెట్టును ఎరగా వేశాడు. చివరిజాము వచ్చేసరికి ఇల్లంతా సినీనృత్యకేళి. ఉదయాన్నే పశ్చాత్తాపం రగిలింది. బంధుగణం మధ్య చర్చించాడు. అసలు నృత్యం శివుడికి ఇష్టమైన చర్య. అంటే మనం పరమేశుడిని ఆనందపరిచాం కదా.. అని ముగింపుతో ఆ దశాబ్దం గడిచింది.
      శివుడి అంగీకారముద్ర గురించి తెలీదు.
      తర్వాత 1990..
      ఇది రహస్యజాగరణను ప్రవేశపెట్టిన యుగం. జపమాల స్థానంలో వీడియో క్యాసెట్టు, ధూపదీపాల బదులు వీసీపీలూ వీసీఆర్‌లూ వచ్చాయి. వినడం కన్నా, చదవడం కన్నా, ఆ శివలీలలు వీక్షించడం అదృష్టం అనే ప్రవచనానికి భక్తకిరీటులు పరవశించిపోయారు. భూకైలాస్, ఉమాచండీగౌరీశంకరుల కథ మొదలు చలన చిత్రాలు జాగరణ దీపాలైపోయాయి. ఇవి చూసినా నిద్రలోకి జారుకుంటున్నామే అని కౌమారపురంబులో ఉన్న ఓ వెంకట్రావూ ఓ శ్రీనివాసరావూ కలిసి ఒక బ్రేకుడ్యాన్సు చిత్రమూ ఒక కరాటేఫైటు చిత్రమూ వీక్షించారు. జాగరణ పరిపూర్ణం చేశారు. మర్నాడు వాదోపవాదాల్లో శివుడిలో కొత్త నృత్యభంగిమలూ, వీరత్వపు వీచికలూ ఆయా చిత్రాల్లో ప్రతిఫలించాయని అంటే.. ఎలాగైతే ఏం.. కల్మష రహిత జాగరణ ముఖ్యం అంటూ తలోదిక్కూ వెళ్లిపోయారు. 
      శివుడి అంగీకారముద్ర గురించా..?
      ఇక 21వ శతాబ్దం నాయనా..
      అపర భక్త దురంధరుల చరవాణుల్లో శివుడు గంగాగౌరీ సమేతంగా వాల్‌పేపర్లెక్కిన శివరాత్రులు మొదలు. రింగుటోన్లో శివుడు, మెసేజ్‌టోన్లో శివుడు, వాట్సప్‌ డీపీలో, ఫేస్బుక్కు ప్రొఫైల్‌పిక్‌లో, ఇన్‌స్టాలో, ట్విట్టర్లో.. శివుడు శివుడు శివుడు! ఇది భక్తి కాక మరేమిటీ? కళ్లు తెరచినా కళ్లు మూసినా కైలాస ఘంటికలే! రాత్రంతా అందరికీ పోస్టింగులు పెట్టి జాగరణ చేస్తే లభించేది శివసాన్నిధ్యం కాదూ? ఫోను లింగాకారంలోకి మారిపోయిందన్నంత ఫీలింగు!! రాత్రంతా దాన్ని మార్కండేయుడిలా పట్టుకుని కూర్చున్నామని చెప్పుకొనేంత వీరభక్తి!! 
      శివుడి అంగీకారముద్ర గురించేనా..?
      నరుడా ఏమి నీ కోరికా అనే మాట ఆయన అంటాడో లేదో కానీ.. శివుడా ఏమి నీ కోరికా..? చెప్పు.. ఏ పాట కావాలి? ఏ సినిమా కావాలి? ఏ ఫొటో కావాలి? అంటూ వెంటబడరూ?
      నాకేమో ఆయన తపస్సులోనే ఉండిపోయి వరాలివ్వడం మానేశాడని అనిపిస్తోంది. కనిపిస్తే మాత్రం నేనూ అడుగుతా.. శివుడా.. ఏమి నీ కోరికా.. అని! 


వెనక్కి ...

మీ అభిప్రాయం