వాయులీన గమకవాసి

  • 78 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బుడితి రామినాయుడు

  • విజయనగరం,
  • 9490139503
బుడితి రామినాయుడు

నాయుడుగారూ! మీ వేళ్లు ఘనరాగ పంచకం! మీ శరీరమాకాశం! మీ హస్తం హరివిల్లు! చిత్ర చిత్ర వర్ణాలు శ్రీవారి వేళ్లు! సృష్టి శృతిమయం సగుణం నాదం నిర్గుణ బ్రహ్మ నిశ్శబ్దపు నీలి నీలి యంచులనే మ్రోగించును మీ వేళ్లు! ఉక్కు తీగె నొక్కేరో తారలనే దాటించి ధ్రువ నక్షత్రానికి చలనం కలిగించి పల్లెటూరి శోభతోడ పలుకరించు సూర్య చంద్ర లోకాలే! సూచించు బ్రహ్మ హృదయమే వెన్నెల బయలయి కనిపిస్తుంది. పంచమమే కడితే గాయత్రి ప్రత్యక్షం ఉపనయన వేళ చెవిలో బ్రాహ్మణుడేదో ఊదినట్లు! ఆనందానికి పరమావధి మందరమే అందుకుంటే సంధ్యకు పూర్వం దిన సంధిలోన తెల్లని వెలుగేదో తోచి గళమై పాడును! పిష్‌కాట్ వాయిస్తారు బొందెకు ఆత్మకు ద్వంద యుద్ధమే పెడతారు మానవత్వపు కుట్లు చిటపట తెగిపోవగ! మీ చేతిని జంత్రం కాదది ఏదో మహాయంత్రం మీ వేళ్లు బీజాక్షరాలు! కమానా? కాదు! నరుని రథం భారతయుద్ధం శ్రీకృష్ణుని చేతిని కొరడా! మీ వేళ్లు పలికే వేళల విశ్వరూపమే వినిపిస్తుంది కనిపిస్తుంది. 

- ‘ఫిడేల్‌ నాయుడు గారి వేళ్లు’ కవితలో శ్రీరంగం నారాయణబాబు (ఉక్కు తీగ- ఫిడేల్‌ మీది మొదటి తీగ, పంచమం- మూడో తీగ, మందరం- నాలుగో తీగె, పిష్‌కాట్‌- కమాను వదిలి ఒక తీగను మీటుతూ రెండో చేత్తో స్వర స్థానాలను నొక్కడం)

తెలుగునాట ‘ద్వారం’ అనగానే ప్రఖ్యాత వయొలిన్‌ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గుర్తుకొస్తారు. ఆయన 1893 నవంబరు 8వ తేదీన ద్వారం వెంకట రాయలు, లక్ష్మీనరసమ్మ దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు. వీరి పూర్వులు కశింకోట వాస్తవ్యులు. బ్రిటీష్‌ ఇండియన్‌ ఆర్మీలో సుబేదార్‌ మేజర్లుగా పనిచేశారు. వెంకటస్వామి అన్నయ్య వెంకటకృష్ణయ్య నాయుడు వయొలిన్‌ వాద్య ప్రవీణుడే కాదు, మధుర వాగ్గేయకారులు కూడా. తన తమ్ముడికి సంగీత విద్య నేర్పి ప్రోత్సహించారు. వెంకటస్వామి విజయనగరంలోని విజయరామ గాన పాఠశాలలో విద్యార్థిగా చేరడానికి వెళ్తే, పాఠశాల యాజమాన్యం ఆయన విద్వత్తుకు ముగ్ధులై అదే పాఠశాలలో అధ్యాపకులుగా నియమించింది. పాఠశాల మొదటి అధ్యక్షులు ఆదిభట్ల పదవీ విరమణ చేశాక నాయుడు ఆ బాధ్యతలు స్వీకరించారు. ఘంటసాల లాంటి ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. 
      ద్వారం వెంకటస్వామి నాయుడు కొన్ని దశాబ్దాల పాటు తన కమానుతో సంగీత ప్రియుల హృదయ తంత్రులను మీటారు. అపూర్వ రాగ భావ తాళ సమ్మేళనా ప్రావీణ్యాన్ని సంతరించుకున్న పరిపూర్ణుడైన సంగీత విద్వాంసుడిగా ప్రశంసలందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్‌ విద్వాంసులు యెహుదీ మెనుహిన్, నాయుడు వాయులీన వాదనను విని మెచ్చుకున్నారు. ముప్పయ్యో దశకంలో వెంకటస్వామి మైసూరు దర్బారులో కచ్చేరి చేసి అర్ధ వెయ్యి నూటపదహార్లు, జోడు శాలువాలు అందుకున్నారు. మైసూరు రాజసభలో అంతటి సత్కారం అందుకున్న ఆంధ్రులు అప్పటికి వేరొకరు లేరని ‘భారతి’ పత్రిక కీర్తించింది. బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా రాయల నాటి వైభవంతో కళాకారులకు సన్మానం జరిపించారు. ఆ సన్మాన గ్రహీతల్లో నాయుడు ప్రథములు. కళాప్రపూర్ణ తదితర అనేక బిరుదులూ వరించాయి. 1957లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదును ఇచ్చి వెంకటస్వామిని గౌరవించింది. 1993లో ఆయన పేరిట తపాలా స్టాంపు విడుదల చేసింది. 
      మంద్ర, మధ్యమ, తారాస్థానాలు మూడింట్లోనూ నాద సమతను చూపించడం నాయుడు వాయులీన వాదనలో విశిష్టత. అలాగే, స్వరకల్పన చేసేటప్పుడు వెనక మృదంగం వినిపిస్తోందా అన్నట్టుగా కమానును ఉపయోగించడమూ మరో ప్రత్యేకత! ఇలాంటి ఎన్నో ప్రయోగాలతో ప్రజా బాహుళ్యంలో ‘ఫిడేలు నాయుడు’గా ప్రసిద్ధి చెందిన ఆయన.. నవంబరు 25, 1964న కీర్తిశేషులయ్యారు. ‘‘ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలో తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే శ్రోతలకు తెలుస్తాయి’’ అనే నాయుడు.. నిరంతర కఠోర సాధనతో వాయులీన వాదనలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, అనితర సాధ్యమైన ఆనంద పారవశ్య స్థితిని అందుకున్నారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం