దసరాకు వచ్చి తమ దర్శనము చేయ

  • 494 Views
  • 1Likes
  • Like
  • Article Share

    పటాపంచుల శ్రీను

  • పరిశోధక విద్యార్థి, ఆంధ్ర విశ్వవిద్యాలయం,
  • విశాఖపట్నం
  • 8897432977
పటాపంచుల శ్రీను

ఆధునికత గ్రామాలు, ఓ మోస్తరు పట్టణాల్లోకి చొరబడని రోజులు... 1990ల వరకు పల్లెసీమలకు ప్లాస్టిక్‌ అంతగా చొచ్చుకుపోలేదు. టీవీలు కూడా ఏవో ఒకటి రెండిళ్లకే పరిమితం. సెలవులు వస్తే ఇప్పట్లా అయితే ఇంట్లోనో, లేకపోతే స్థానిక సమాజానికి దూరంగా వెళ్లే రోజులు కావు. ఇదంతా ఎందుకు అంటారా? ఎందుకంటే పల్లె సహజత్వాన్ని అర్థం చేసుకోవడానికి! అలాంటి నిసర్గమైన సమాజంలోనే సమష్టితత్వం చెప్పకుండానే అలవడుతుంది. దానికి అనుగుణంగానే పండగల సంబరాలూ జరిగేవి. ఆ కోవలోవే దసరా పాటలు. ఆ సరదాల సందళ్ల పసందైన కబుర్లు...
ఓ యాభై అరవై
ఏళ్లకు పూర్వం... అంటే ఇప్పట్లా వ్యవస్థీకృత పాఠశాలలు లేని కాలం అన్నమాట. జీవితానికి అవసరమైన జ్ఞానం పొందేందుకు వీధిబడి ఆలంబనగా ఉండేది. అయితే ఇప్పుడు ఉన్నంతగా డబ్బు అప్పట్లో చెలామణిలో లేదు. వస్తుమార్పిడి ఉండేది. అదీ ధాన్య రూపంలోనే. అలాంటి పరిస్థితుల్లో వీధిబడి అయ్యవారికి కాస్త ఇబ్బందిగానే గడిచిపోయేవి రోజులు. అందుకే ఆయన బతకలేక బడిపంతులు అయ్యాడు. ఏదైనా పండగ వస్తే ఆయనకు జరుగుబాటు అంతంత మాత్రం. అప్పుడు ఆ ఊరివాళ్లే గౌరవంగా తలా కాస్తా భత్యం సమకూర్చేవారు. మరి పదిరోజుల పండగ దసరా వేళ ఊరితోపాటు తన ఇల్లూ కళకళలాడాలి కదా! అలాగని అవసరం ఉంది కదాని... నేరుగా ఎవ్వరినీ అడగకూడదు. అందుకే తన పిల్లలతో సమానమైన... బడిపిల్లలను తీసుకుని... ‘బాలకుల దీవెనలు బ్రహ్మదీవెనలు...’, ‘పంతులుగారికి చాలు పది వరహాలు’ అంటూ ఆ ఊరంతా చుట్టేసేవారు. అలా వ్యాప్తిలోకి వచ్చినవే దసరా పాటలు. 
జయా విజయీ భవ...
గురువుగారి ఆదేశం మేరకు బడి పిల్లలంతా... ‘చెలువైన చౌకట్లు చంద్రహారములు/ మురిడీలు గొలుసులు/ ముద్దుటుంగ్రములు/ పచ్చల పోగులు/ ముద్దుతాళీలు, కొమ్మంచు/ పంచెలును, పొందైన పాగా/ జలతారు వోళీలు, జేబురుమాళ్లు/ అంగీలు, నడకట్లు, నదరుగా నగలు/ తొడిగితిమి ముస్తాబుతోటి గిలకలను’... ఇలా వివిధరకాల వేషాలు ధరించి ‘జయజయ! జయ మహావిజయ!’ అంటూ ఇంటింటికీ తిరిగేవాళ్లు.
      ఎవరి ఇంటికి వెళ్లినా ముందుగా పోతన నారాయణ శతకంలోని పద్యం ‘ధరసింహాసనమై నభంబు గొడుగై...’ చదివేవాళ్లు. అదవగానే మరో విద్యార్థి ‘శ్రీగణాధీశాయ శివకుమారాయ’ అని గణపతి ప్రార్థన గేయాన్ని అందుకునేవాడు. ఇలా ఒకటొకటిగా సాగిపోయేవి పిల్లల దసరా పాటలు. వాటిలో... పిల్లల్ని ఎంతో ఆకర్షించే పురాణపాత్ర శ్రీకృష్ణుడి పాటలు చోటుచేసుకునేవి. గోపబాలురతో ఆడుకునేందుకు వెళ్లిన, అల్లరి కన్నయ్యని.. ‘వెన్నముద్దల కృష్ణ చిన్ని నాయన్న/ చిన్న బాలుర కూడి పిలిచిన రావు/ ఉగ్గు పోద్దామంటే దగ్గరికి రావు/ పాటలు పాడెద పాపడవీవు...’ అంటూ నువ్వు చిన్నపాపడివి, నీకోసం పాటలు పాడతాను. ఉగ్గు పెడతా కన్నయ్యా అని యశోదమ్మ గోముగా పిలిచే సందర్భాన్ని చెప్పే పాట పాడేవారు. ఇలాంటిదే...
ఏమిరా! శ్రీకృష్ణ యింత యాగడము
తగునటర నీకిది జగతి
లోపలను, రేపల్లెవాడలో
గోపి సుందరులు, వింతగా జెప్పె
దరు సంతసమున నాతో
గొల్లభామల తోటి సయ్యాట లాడ
మనవంటి వారికిది మర్యాద కాదు
నా ముద్దు కృష్ణయ్య
నా చిన్న తనయా, నా వేణుగోపాల
నందకుమార, యని
యిట్ల యా తల్లి ఆలింటి పలికె
అమ్మరో వినవమ్మ అమ్మ
గోపమ్మ బాలురతో నేను
బంతులాడంగ నా బంతిపోయెనె
దానింటిలోకి నేవెళ్లి ఇమ్మన్న
ఇవ్వకున్నదియె. నాబంతి
తీసుకుని నేనొచ్చినాను
ఇంతకన్న నేను యెరుగనో
యమ్మా భళిర శ్రీగోపాల భవ్యప్రకాశ
జయ జయ! జయ మహావిజయ...
పాట. కొంటె కృష్ణుడు ఎవరో గోపికను గిల్లినట్లున్నాడు. ఆమె వచ్చి యశోదతో ఆ విషయాన్ని చెప్పి... కిట్టయ్య అల్లరిని భరించలేకపోతున్నాం. ఎలాగైనా కట్టడిచేయండి అని వేడుకున్నట్లుంది. దాన్ని గోపాలుడితో ప్రస్తావిస్తే... స్నేహితులతో ఆడుకుంటుంటే నా బంతి వాళ్లింట్లోకెళ్లింది. నేనెళ్లి దాన్ని తీసుకువచ్చాను. అంతకుమించి ఇంకే నేరమూ చేయలేదమ్మా! ఆ గోపికనే నా మీద చాడీలు చెబుతోందని బుంగమూతితో సమాధానమిచ్చాడు చిన్ని కృష్ణుడు. 
పిల్లవాళ్లకి చాలు పప్పు బెల్లాలు
బహుళ ప్రచారంలో ఉన్న మరోపాట. సీతమ్మ తోటలో సిరిమల్లె చెట్టు. ఆ సిరిమల్లె వింతగా పూసిందట. కొమ్మ కదలకుండా కోసినవి, వాటంతటవే రాలిన పూలను రెండు మాలలుగా అల్లారట సీతమ్మ కోసం. వాటిని హనుమంతుడు తీసుకెళ్లి సీతమ్మ చేతిలో పెట్టిన పాట ఇలా సాగుతుంది...
సీతమ్మ తోటలో సిరిమల్లె చెట్టు
ఆ చెట్టు పూసింది అతివింతగాను
కొమ్మ కదలకుండా కోయండి పూలు
కోసిన పూలన్ని కొట్లో పోయండి
రాలిన పూలన్ని రాశిపోయండి
ఆ పూలు ఈ పూలు దండ కూర్చండి
ఆ దండ ఈ దండ సీతకివ్వండి
సీతమ్మ సీతమ్మ తలుపు తీయమ్మ
నీ పేరు చెబితేనే తలుపు తీస్తాను
నా పేరు హనుమంత రాజకుమార
జయ జయ! జయ మహావిజయ

      ఏ పాట పాడినా దాని ఉద్దేశం పంతులుగారికి దసరా భత్యమే. కనుక కొన్ని పాటలు పాడాక... అలా సరదాగా విని ఆనందించినా, తమ రాకను గ్రహించలేదనుకునో, లేక ఇచ్చేవాళ్లను ఉడికించాలనుకునో అప్పటివరకు మామూలుగా పాడిన పిల్లలు ఒక్కసారిగా ‘మేం చిన్నవాళ్లం. ఇంకెంత సేపు ఉండాలి. ఊళ్లో వెళ్లాల్సిన ఇళ్లు ఇంకా ఉన్నాయి. మమ్మల్ని త్వరగా పంపించండి. ఇంతసేపు ఉంచుకోవటం తగని పని’ అంటూ ఇలా అందుకునేవారు.
ఏదయా మీదయా మా మీద లేదు
ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా, దస
రాకు వస్తిమని విసవిసలు పడక, చేతిలో
లేదనక, ఇవ్వలేమనక, ఇరుగుపొరుగు
వారు యిస్తారు సుమ్మి గొప్పగా చూడండి
తప్పకను మీరు, పావలా బేడయితే పట్టేది
లేదు అర్ధరూపాయయితే అంటేది లేదు
ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు, హెచ్చు
రూపాయిస్తే పుచ్చుకుంటాము, పై పావలా
మాకు పప్పు బెల్లాలు, శీఘ్రమే పంపుడి
శ్రీమంతులారా! జయజయ! మహావిజయ!

      దసరాకు వచ్చాం. మీలో మీరు అనుకోకండి. ఇరుగుపొరుగువాళ్లు ఇస్తారు. మీరూ ఇవ్వండి. అలాగని ఏ పావలానో, బేడనో ఇస్తే వాటిని పట్టుకోం. అర్ధరూపాయయితే అసలు తాకనే తాకం. మూడు పావలాలిస్తే ముట్టుకోం. కనీసం రూపాయి ఇవ్వాలి. అందులో ఒక పావలా మాకు పప్పు బెల్లాలకు సరిపోతుంది. మిగతాది పంతులుగారికి. బాలవాక్కు బ్రహ్మవాక్కు కదా! మీకు అన్నింటా జయం కలగాలి అంటూ... జయా విజయీభవ, దిగ్విజయీభవ అనో, జయజయ జయ మహావిజయా అనో దీవించి మరీ వెళ్లేవాళ్లు. 
కట్నమందితేనే కదిలేది
దసరా పాటల్లో నిష్ఠల వేంకట సోమాయాజి రాసిన పాట ‘ఏమండి దొరగారు’ ఆసక్తికరం.  
      పిల్లలంతా గురువుగారితో కలిసి దసరా పాటలు పాడుతూ ఓ దొరగారి ఇంటికి వెళ్లారు. ఆయన మరో పద్యం, మరోపాట అని అడిగి మరీ పాడించుకున్నాడు. పిల్లలూ ఆశతో ఉత్సాహంగా ఓపిగ్గా పాటలు, పద్యాలు పాడారు. కట్నం అనేసరికి ఆయన లేచి వెళ్లిపోబోయాడు. అప్పుడు పిల్లలు ముక్తకంఠంతో ‘అయ్యా! ప్రతి ఏటా దసరాకి మీ ఇంటికొస్తున్నాం. పద్యాలన్నీ చెప్పించుకుంటారు. పాటలు పాడించుకుంటారు. కట్నమడగ్గానే వెళ్లిపోవడం సబబేనా? మమ్మల్ని బాధపెట్టడం ధర్మమేనా? మా గురువుగారు, మేము గ్రామంలో దసరాపాటలు పాడుతూ తిరుగుతున్నాం. మీ ఇంటి దగ్గరా చాలాసేపు ఉన్నాం. కాళ్లు లాగుతున్నాయి. చిన్నపిల్లలం మమ్మల్ని నిలబెట్టడం భావ్యం కాదు. దయుంచి ఎంతోకొంత ఇవ్వండి. ఇవ్వకుంటే లేదని చెప్పండి. కట్నం ఇచ్చేదాకా మా గురువుగారు కదలరు. మరి మేమలాగే ఉంటే మాకు ఆయాసం వస్తుంది. మీకు అన్నింట్లో శుభం కలుగుతుంది... అని ఒకింత తెగింపు ప్రదర్శిస్తూనే ప్రాధేయపడ్డారు ఇలా... 
ఏమండి దొరగారు యేటేటమేము
దసరాకు వచ్చి తమ దర్శనము చేయ
పద్యముల్చదువుమని పట్టు పట్టెదరు
కట్నమన్నంతనే యట్టె లేచెదరు
బాలురమమ్మిట్లు బాధించమీకు
యేమిలాభించునో యెరిగింపుడయ్య
అయ్యవారును మేము అనుదినంబిట్లూ
తిరిగి తిరిగీ కాళ్లు దిగలాగుచుండె
నిలబెట్టమాకేమీ నిలువు జీతములు
ముట్టజెప్పెదరయ్య మోమాటమేల
ఈదలచుకున్న మాకీయుడీవేగ
లేకున్న చెప్పుడీ మీకు పుణ్యమ్ము
కట్నమందక కాని కదలరీగురువు
అట్టెయుంచిన మాకు నాయాసమయ్య
జయా విజయీభవ దిగ్విజయీభవ

      ఆ చిట్టిచిట్టి మాటలకు ఆ ఇంటి యజమాని మనసు కరిగిపోయి ఎంతో కొంత దసరా కట్నం ముట్టజెప్పాల్సిందే.
      అలా సమకూరిన పైకంతో పంతులుగారికి దసరా సంతృప్తికరంగా జరిగిపోయేది. పిల్లలకూ సమష్టితత్వమూ, సంఘీభావం, ఒకరికోసం అందరం అన్న భావాలు అలవడేవి. ఇంకా ఊరి వాతావరణంతో పరిచయం ఏర్పడేది. అంతా ఒక్క కుటుంబమే అన్న భావనకూ పునాది పడేది. ఇప్పుడిలాంటి దృశ్యాలు అరుదే కాదు... కరవై పోతున్నాయి. అందుకే వసుధైక కుటుంబం భావనను ప్రోది చేసే ఇలాంటి పాటలను అప్పుడప్పుడైనా పిల్లలకు గుర్తుచేయడమంటే, వాళ్ల వ్యక్తిత్వ వికాసానికి ఓ మార్గం చూపించినట్లే. 


వెనక్కి ...

మీ అభిప్రాయం