అమ్మంటే... ఆదిదేవత

  • 164 Views
  • 15Likes
  • Like
  • Article Share

    తమ్మినేని రమేష్‌

  • హైదరాబాదు
  • 9959859873

సృష్టిలో ఏదీ తల్లిప్రేమకు సాటి రాదు. ప్రేమకు ప్రతిరూపం అమ్మ. పిల్లలను లాలించి, పాలించి గొప్పవారిని చేసేందుకు ఎంతో త్యాగం చేస్తుంది తల్లి. బిడ్డల ఆనందమే తన ఆనందం అనుకుంటుంది అమ్మ. ఇక నాన్న విషయానికి వస్తే...  తల్లి ఒడిని విడిచిపెట్టిన పిల్లల జీవితానికి భరోసా నాన్న అండే. బుడిబుడి అడుగులతో బడిలోకి అడుగుపెట్టింది మొదలు పిల్లలు జీవితంలో స్థిరపడేవరకు, అవసరమైతే ఆ తర్వాత కూడా నేనున్నానంటూ నడిపిస్తాడు నాన్న. మరి తమ సర్వస్వమూ బిడ్డలే అనుకునే గొప్ప హృదయం ఉన్న మాతా పితలను గౌరవించే పిల్లలే ఆయుష్మంతులవుతారు. కన్నవాళ్ల రుణం తీర్చుకోవడం బిడ్డల ధర్మం. 
      నదీ జలాలు పవిత్రమైనవంటారు పెద్దలు. నదిలో స్నానం చేస్తే పుణ్యదాయకం అని నమ్ముతారు. నదికంటే పవిత్రమైంది ఇంకా ఏవైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి. అవీ మనకు అతి చేరువలోనే. అదీ ఏ శ్రమా, ఖర్చూ లేకుండానే ఆ పుణ్యాన్నంతటినీ పొందవచ్చు. అది ఎలాగో వివరించాడు కవిసార్వభౌముడు శ్రీనాథుడు.
సర్వతీర్థాంబువులకంటె సమధికంబు
పావనంబైన జనయిత్రి పాదజలము
వరతనూజుల కఖిలదేవతలకంటె
జనని యెక్కుడు సన్నుతాచార నిరతి

      తల్లి గొప్పతనాన్ని చెప్పే ఈ పద్యం ‘కాశీఖండం’లోది. తల్లి పాదాలను కడిగిన నీళ్లు ఈ భూమ్మీద ఉన్న అన్ని పుణ్యనదీ జలాలకన్నా గొప్పవి. పిల్లలకు ముక్కోటి దేవతలకన్నా ఎక్కువ పూజనీయమైంది కన్నతల్లే. శివుడు తన కుమారులు వినాయకుడు, కుమారస్వాములను పిలిచి ప్రమథ గణాలకు ఆధిపత్యం... ముల్లోకాలను ముందుగా చుట్టి వచ్చిన వాళ్లకే అంటాడు. తండ్రి ఆజ్ఞ అవగానే, కుమారస్వామి నెమలిని అధిష్ఠించి బయలుదేరతాడు. తమ్ముడితో పోటీ పడలేననుకున్న వినాయకుడు మాత్రం, జననీ జనకులు పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తాడు. తర్వాత ఆయన గణపతి అయ్యాడన్నది తెలిసిందే.
      గురువు అజ్ఞానమనే అంధకారాన్ని పారదోలి, జ్ఞానమనే వెలుగులోకి నడిపిస్తాడు. మంచీచెడు, పనిలో నేర్పు, పెద్దలను గౌరవించడం, సభ్యతగా మాట్లాడటం, క్రమశిక్షణ మొదలైనవి గురువు నుంచే విద్యార్థులకు అలవడతాయి. అలాంటి గురువులు నూరుగురి కన్నా గొప్పవాడు తండ్రి. సంసార నౌకను నడుపుతూ, పిల్లలకు సర్వకాల సర్వావస్థల్లో తోడుగా నిలుస్తాడు. అలాంటి తండ్రులు వెయ్యిమంది కంటే కూడా గొప్పది తల్లి. తండ్రి నావికుడైనా.. ఆ నావకు దిక్సూచి తల్లే మరి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని ఉపనిషత్తులు ఉగ్గడించాయి. ఈ సూక్ష్మాన్ని స్పష్టం చేసేదే కింది పద్యం...
జనకుం డధికుఁ డుపాధ్యా
యునకుఁ బదిమడుంగు లెక్కు డుర్వీనాథా!
జనకునకు దశగుణంబులు
జనని గురుత్వమున నిది ప్రశస్తము శ్రుతులన్‌

      దీనికి మూలంగా మనుస్మృతిలో... ‘ఉపాధ్యాయాన్‌ దశాచార్యః, ఆచార్యాణాం శతం పితా, సహస్రం పితౄణ్‌ మాతా, గౌరవేణాతిరిచ్యతే’ అని కనిపిస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం