సంకురాతిరి పండుగొచ్చె గొబ్బియల్లో

  • 527 Views
  • 0Likes
  • Like
  • Article Share

    తులసీ బృంద జంపన

  • హైదరాబాదు,
  • 9959966768
తులసీ బృంద జంపన

రాజ మహరాజ రైతు బిడ్డల గాజుల చేతుల గొబ్బిళ్లు... సీతాదేవి మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బిళ్లు... అంచు లంచుల అరుగుల మీద పంచెవన్నె ముగ్గులే గొబ్బిళ్లు... పల్లె తెలుగు పద‘బంధాలకు’ ఆనవాళ్లు! గలగలపారే గొబ్బిపాటల సెలయేళ్లు... వాటిలో మిలమిల మెరిసే మాటల ముత్యాలు... ఏరి దండకడితే తెలుగుతల్లికి లెక్కలేనన్ని మణిహారాలు! 
మంచు తెరలు కాస్తయినా తొలగనే లేదు. తూరుపున సూరీడు ఒళ్లు విరవనే లేదు. పూబాల పూర్తిగా విచ్చుకోనే లేదు. కానీ తెలుగు లోగిళ్లు మాత్రం ముగ్గులతో మెరు స్తున్నాయి. వాటి మధ్యనున్న గొబ్బెమ్మలు ముచ్చట్లాడుకుంటున్నాయి ఇది ధనుర్మాస దృశ్యం! ఊరికంటే ముందు వాకిలి నిద్ర  లేస్తుంది. గోమయంతో నిండారా స్నానం చేసి పచ్చటి కాంతులను విరజిమ్ముతుంది. ముచ్చటైన ముగ్గులతో ముస్తాబై పసుపు కుంకుమలతో అందాలద్దుకుంటుంది. గొబ్బె మ్మలనే ఆభరణాలుగా ధరించి వచ్చేపోయే వాళ్లని ఆప్యాయంగా పలకరిస్తుంది. 
కడివెడు నీళ్లూ కలాపి చల్లీ గొబ్బిళ్లో గొబ్బిళ్లో
కావడి పసుపూ గడపకి పూసీ గొబ్బిళ్లో గొబ్బిళ్లో
ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్లు
రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్లు

ఏ ఇంటి ముంగిట గొబ్బెమ్మలతో ముగ్గు మురుస్తుందో... అది కచ్చితంగా తెలుగు లోగిలే. 
ధనుర్మాస శోభ 
ధనుర్మాసం మొదలు సంక్రాంతి వరకూ పండుగ వాతావరణమే. ఆడవాళ్లంతా ఈ నెలరోజులూ తెల్లవారకముందే నిద్రలేస్తారు. వాకిట్లో కళ్లాపి చల్లుతారు. కాస్త ఆరనిచ్చి బియ్యప్పిండి లేదంటే సున్నం పిండితో ముగ్గులేస్తారు. అప్పుడు మొదలవుతుంది కన్నెపిల్లల హడావుడి... తలారా చన్నీటి స్నానాలు చేసి పట్టుపరికిణీ ఓణీలతో బుట్టబొమ్మలవుతారు. ముందురోజు ఊరంతా తిరిగి పోటీపడి సేకరించిన ఆవుపేడతో గొబ్బెమ్మలు చేస్తారు. 3, 5, 9 ... ఈ వరుసలో ఎవరికివాళ్లు గొబ్బులను సిద్ధం చేస్తారు. వాటికి పసుపు కుంకుమలతో అందాలద్దుతారు. గుమ్మడిపూలు, బంతి-చేమంతులు, గొబ్బి పువ్వులు, తామరలు, డిసెంబర పూలతో అలంకరిస్తారు. గొబ్బెమ్మలకు కళ్ల స్థానంలో గురివింద గింజల్ని, ముక్కుగా సంపెంగలనీ పెడతారు. ఆ తర్వాత వాటిని ముగ్గుల మధ్యలో పెట్టి పూజచేస్తారు. ఈ తతంగ మంతా అయ్యాక ముగ్గు చుట్టూ చేరి ఒకరి చేతులొకరు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు.
గొబ్బి సుబ్బమ్మా సుబ్బణ్నీయవే...
చేమంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే
తామర పువ్వంటి తమ్ముణ్నీయవే
అరటి పువ్వంటి అన్ననియ్యవే
మల్లె పువ్వంటి మామానీయవే
బంతి పువ్వంటి బావానియ్యవే
కుంకుమ పువ్వంటి కూతుర్నీయవే
కొబ్బరి పువ్వంటి కొడుకునియ్యవే
అరటి పువ్వంటి అల్లుణ్నియ్యవే
గులాబి పువ్వంటి గురువునియ్యవే
మొగలీ రేకంటి... మొగలీ రేకంటి...
మొగలీ రేకంటి మొగుణ్నీయవే
అంటూ మంచి మొగుడు రావాలని కోరుకుంటూనే సిగ్గుల మొగ్గలవుతారు!  
కన్నియల అంతరార్థం...
కొందరు గొబ్బెమ్మను గౌరీదేవిగా కొలుస్తారు. అర్ధనారీశ్వరుడి వంటి పెనిమిటినిమ్మని పార్వతిని వేడుకుంటారు. గోమాతలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందనీ, గొబ్బెమ్మ ఆమెకు ప్రతిరూపమనీ కొలిచేవాళ్లూ ఉన్నారు. తమ ఇంట గొబ్బెమ్మగా కొలువై సర్వసుఖాలూ ప్రసాదించమని కోరుకుంటారు. మరికొందరేమో... ముగ్గు మధ్యలోని పెద్ద గొబ్బి కృష్ణునికి ప్రతిరూపంగా, చుట్టూ ఉండే చిన్నవన్నీ ఆయన ఇష్టసఖులైన గోపికలుగా భావిస్తారు. దీనికి కారణం లేకపోలేదు. పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావై నిర్వహించేది క్ఠృష్ణ భగవానునికే.
      ధనుర్మాసం ముగిసే లోపు ఏదో ఒకరోజు... అదీ సాయంత్రం పూట కన్నెపిల్లలు తోటి వాళ్లని, ముత్తయిదువులను పేరంటానికి పిలుస్తారు. అందరూ కలిసి గొబ్బెమ్మలను ముగ్గుల్లోకి చేర్చి, పాటలందుకుంటారు. చేతుల్ని వెనక్కూ ముందుకూ తీసుకొస్తూ చప్పట్లు కొడుతూ వారు చేసే నృత్యం కనులకింపుగా ఉంటుంది. దసరా ముంగిట్లో బతుకమ్మలు పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ ఆడి పాడే తెలంగాణ ఆడపడుచుల కళ్లలో కనపడే పండుగ వాతావరణం... సంక్రాంతి సందిట్లో గొబ్బెమ్మలకు పాటల హారతులిచ్చే అమ్మాయిల వదనాల్లోనూ దర్శనమిస్తుంది. 
ఇంతుల వంతు
కన్నెపిల్లలు మాత్రమే గొబ్బెమ్మల్ని పెట్టి ఆడిపాడతారనుకుంటే పొరపాటు. ముత్తయిదువులూ తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలనీ... పిల్లాపాపలతో తమ ఇళ్లు కళకళలాడాలని కోరుకుంటూ గొబ్బెమ్మలకి పూజచేస్తారిలా...
ఉదకాన పుట్టావు నీవు గొబ్బెమ్మ
ఉదకాన పెరిగావు నీవు గొబ్బెమ్మ 
సంధి ద్రాక్షపళ్లు శతకోటి స్నానాలు
నీ నోము నాకిచ్చి నాకు వరమీయవే గొబ్బెమ్మ
పసుపున పుట్టావు నీవు గొబ్బెమ్మా
పసుపునా పెరిగావు నీవు గొబ్బెమ్మా
సంధి ద్రాక్షపళ్లు శతకోటి స్నానాలు 
నీ నోము నాకిచ్చి నాకు వరమీయవే గొబ్బెమ్మ 
కుంకాన పుట్టావు నీవు గొబ్బెమ్మ
అక్షింతన పుట్టావు నీవు గొబ్బెమ్మ
పుష్పాన పుట్టావు నీవు గొబ్బెమ్మ 

      సిరిసంపదలకన్నా సౌభాగ్యాన్నే కోరుకునే మగువ మనసులోంచి వచ్చే ఈ మాటలకు గొబ్బెమ్మలో ఉండే గౌరమ్మ కరిగిపోదా! వరాల సిరివాన కురిపించకపోదా!  
అక్కడ మగవాళ్లు...
ఆడవాళ్లు మాత్రమే కాదు మగవాళ్లూ గొబ్బితట్టడం తిరుపతి చుట్టుపక్కల కనిపిస్తుంది. తిరుమల వెంకన్న, తిరుపతి గోవిందరాజులు, శ్రీకాళహస్తి శివయ్యలను తోడుతెచ్చుకుంటూ స్థానికులు పాడే పాట...
గొబ్బియ్యాలో గొబ్బి గొబ్బి పాడారమ్మా - నిబ్బరంపు చేడేలే గొబ్బియాలో
గొబ్బియ్యాలో ఎండి గజ్జా పగడామువ్వా - డేగకాలికి గట్టిరే గొబ్బియాలో             
గొబ్బియ్యాలో డేగబోయి ఎంకటేశుని - దేవాలాన వాలేనే గొబ్బియ్యాలో
గొబ్బియ్యాలో ఎంకటేశుని కాపులారా - డేగవచ్చే కానారో గొబ్బియ్యాలో
గొబ్బియ్యాలో కానాలేమే కన్నెలారా - చూడలేమే పడతూలూ గొబ్బియ్యాలో            
గొబ్బియ్యాలో డేగబోయి గోయిందురాజులు - దేవాలాన వాలేనే గొబ్బియ్యాలో
గొబ్బియ్యాలో గోయిందు రాజుల కాపులారా - డేగవచ్చే కానారే గొబ్బియ్యాలో
గొబ్బియ్యాలో కానాలేమే కన్నెలారా - చూడలేమే పడతూలూ గొబ్బియ్యాలో            
గొబ్బియ్యాలో డేగబోయి కాళాస్త్రి - దేవాలాన వాలేనే గొబ్బియ్యాలో
గొబ్బియ్యాలో కాళాస్త్రి కాపులారా - డేగవచ్చే కానారే గొబ్బియ్యాలో
గొబ్బియ్యాలో కానాలేమే కన్నెలారా - చూడలేమే పడతూలూ గొబ్బియ్యాలో             
గొబ్బియ్యాలో డేగబోయి తలకోన - దేవాలాన వాలేనే గొబ్బియ్యాలో
గొబ్బియ్యాలో తలకోనా కాపులారా - డేగవచ్చే కానారే గొబ్బియ్యాలో
గొబ్బియ్యాలో కానలేమే కన్నెలారా - కానాలేమే పడతూలూ గొబ్బియ్యాలో                      

      విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు. ఆయనే ఇక్కడ ‘డేగ’ అయ్యాడు. వెండి గజ్జెలు, పగడపు మువ్వలు ధరించి మొదట తన యాజమాని దగ్గరకు వెళ్లాడు. తర్వాత ఆయన అన్నగారిని పలకరించి... ఆపై ఆయన బావకు నమస్కరించినట్లుగా చెబుతున్నారు జానపదులు. సాధారణంగా గొబ్బితాళం పాట పాదానికి ముందో వెనకో మాత్రమే ఉంటుంది. కానీ ఈ పాటలో రెండువైపులా రావడం విశేషం. 
సంక్రాంతిలక్ష్మికి స్వాగతం
ఎక్కువగా గొబ్బిపాటల్లో పౌరాణికాంశాలదే ముఖ్యపాత్ర అయినా సామాజిక నేపథ్యాలూ కనపడుతుంటాయి.
గొబ్బియల్లో... గొబ్బియల్లో...
పూవు పూవు పూసిందంట
ఏమీ పువ్వు పూసిందంట
రాజావారి తోటలో జామ పువ్వూ పూసిందంటా
అవునా.. అట్టా.. అక్కల్లారా... 

చంద్రగిరి భామల్లారా అంటూ ప్రశ్న జవాబులతో సాగే ఈ పాటను పాడుకుంటూ గొబ్బితడతారు. అది ముగిశాక గొబ్బి దేవతకు కొబ్బరికాయ, అరటిపళ్లు, పెట్టి హారతులిస్తారు. నెలంతా సాగే ఈ గొబ్బెమ్మల కోలాహలం సంక్రాంతి రోజుతో ముగుస్తుంది. ఆఖరి రోజు సంక్రాంతిలక్ష్మికి స్వాగతం పలుకుతూనే గొబ్బెమ్మలకు వీడ్కోలు చెబుతారు. ఈ రోజు వాకిలంతా నిండిపోయినట్లు ముగ్గులేసి, మరిన్ని పెద్ద పెద్ద గొబ్బెమ్మలు పెడతారు. సంక్రాంతి పండుగ వాతావరణం, తెలుగింటి సంస్కృతీ సంప్రదాయాలు కళ్లకుకట్టే పాట పాడతారు..
సంకురాతిరి పండుగొచ్చె గొబ్బియల్లో - సంబరాల పండుగొచ్చె గొబ్బియల్లో
పుష్యమాసం పండుగొచ్చె గొబ్బియల్లో - పుణ్యకాలం వచ్చినాది గొబ్బియల్లో
సూర్యదేముడు వచ్చినాడు గొబ్బియల్లో - మకరరాశి చేరినాడు గొబ్బియల్లో
భోగిమంట లేసినారు గొబ్బియల్లో -  కళ్లాపి చల్లినారు గొబ్బియల్లో
ముగ్గులెన్నో పెట్టినారు - గొబ్బిళ్లు పెట్టినారు గొబ్బియల్లో
గుమ్మడి పూలు పెట్టినారు గొబ్బియల్లో-  తంగేడుపూలు చల్లినారు గొబ్బియల్లో
బంతిపూలు కట్టినారు గొబ్బియల్లో - చేమంతు లల్లినారు గొబ్బియల్లో
తోరణాలు కట్టినారు గొబ్బియల్లో - గడపకు పసుపు పూసినారు గొబ్బియల్లో
బొమ్మల కొలువు పెట్టినారు గొబ్బియల్లో - భోగిదాన మిచ్చినారు గొబ్బియల్లో
పాడి పంట పండుగొచ్చె గొబ్బియల్లో - ఇంటినిండ ధాన్యాలు గొబ్బియల్లో
అన్నపూర్ణ ఇంటిలోన గొబ్బియల్లో - పిండి వంటలు చేసినారు గొబ్బియల్లో 
అల్లుళ్లు వచ్చినారు గొబ్బియల్లో - అలకపాన్పు వేసినారు గొబ్బియల్లో 
కూతుళ్లు వచ్చినారు గొబ్బియల్లో - కొత్త కోక కట్టినారు గొబ్బియల్లో 
బావగారు వచ్చినారు గొబ్బియల్లో - బడాయిలు చూపినారు గొబ్బియల్లో 
మరదళ్లు వచ్చినారు గొబ్బియల్లో - మంచి గంధం పూసినారు గొబ్బియల్లో 
బుడబుక్కలోడు వచ్చినాడు గొబ్బియల్లో - గంగిరెద్దుల మేళాలొచ్చె గొబ్బియల్లో 
జంగమదేవర వచ్చినాడు గొబ్బియల్లో - ఎరుకలసాని వచ్చినాది గొబ్బియల్లో 
ధాన్యాలు పొందినవారు గొబ్బియల్లో - దీవించి వెళ్లినారు గొబ్బియల్లో 
కోళ్ల పందెమాడినారు గొబ్బియల్లో - కోలాటమాడినారు గొబ్బియల్లో 
పల్లెలోని రైతులంతా గొబ్బియల్లో - పార్వాటమాడినారు గొబ్బియల్లో 
చందమామ వెన్నెల్లో గొబ్బియల్లో - చెమ్మచెక్క లాడినారు గొబ్బియల్లో 
సంకురాతిరి లక్ష్మివచ్చె గొబ్బియల్లో - చల్లగాను దీవించె గొబ్బియల్లో 
గొబ్బియల్లో గొబ్బియల్లో... గొబ్బియల్లో...

      నెల మొత్తం పెట్టిన గొబ్బిళ్ల ముద్దలను పిడకల్లా చేసి ఎండబెడతారు. వాటిని దండగుచ్చి భోగిరోజు మంటల్లో వేస్తారు. సంక్రాంతి రోజు పెట్టిన గొబ్బెమ్మల్ని మాత్రం ఎండబెట్టి దాచి రథసప్తమి రోజు సూర్యుని ఎదుట పెట్టి వెలిగిస్తారు. ఆ పిడకలపైనే పరమాన్నం చేసి సూర్య భగవానునికి నైవేద్యం సమర్పిస్తారు. 
నమ్మకాలు... నిజాలు
పిడకల్ని భోగి మంటల్లో వేసేదెందుకంటే... అలా వేయిస్తే పిల్లలకు దిష్టి తగలదని నమ్మకం. గొబ్బెమ్మలకు, కళ్లాపికి ఆవు పేడనే వాడేందుకూ ఓ కారణం ఉంది. గోవు పవిత్రతకు సంకేతం. అంతేకాకుండా దాని పేడ క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. అందువల్లే కళ్లాపి జల్లి సూక్ష్మక్రిములు ఇంట్లోకి రాకుండా చేస్తారు. బియ్యప్పిండితో ముగ్గులు వెయ్యడమనే సంప్రదాయం భూత దయను చాటుతోంది. ఉడతలు, పిచ్చుకలవంటి చిన్ని జీవులకు ఆహారం అందుతుంది. ఒకవేళ సున్నపురాయితో ముగ్గులు వేసినా కార్బన్‌ డయాక్సైడ్‌ని పీల్చివేసే గుణం దానిలో ఉంటుంది కనుక గాలి శుభ్రపడుతుంది. ఇకపోతే భోగి మంటలు... కేవలం చలి కాచుకోడానికే కాదు. ఇళ్లలో ఉండే పాత సామాన్లు, అట్ట డబ్బాలు, విరిగిపోయిన కుర్చీలు, బల్లల్లాంటి వాటిని వదిలించుకోవచ్చు. సాయంత్రం పిల్లల తలమీద నుంచి వేసే రేగుపళ్లు... దృష్టిదోషాలను, ఉదర సంబంధ వ్యాధుల్ని పోగొడతాయట. వాటి తియ్యని వాసన కూడా మానసికోల్లాసాన్ని ఇస్తుంది. 
      అలాగే సంక్రాంతికి కొత్త పంట ఇంటికొస్తుంది. కొత్త బియ్యంతో చేసే పిండివంటలు ఒంటికి పటుత్వాన్ని ఇస్తాయి. తడిబియ్యం పిండి పట్టి, బెల్లం, నువ్వులు చేర్చి చేసే అరిసెలు ఒంటికి శక్తిని, చలి కాలాన్ని తట్టుకోవడానికి తగిన వేడిని అందిస్తాయి. బియ్యప్పిండి జంతికలు, పరమాన్నం, పులిహోరా, కలగూర పులుసు వేటికవే ఆరోగ్యానికి సోపానాలు. పంట చేతికొచ్చే వరకూ రైతు ఎంత కష్ట పడతాడో, అతనితో సమానంగా పశువులూ కష్టాన్ని పంచుకుంటాయి. దానికి కృతజ్ఞతగా వాటిని కనుమ రోజు పసుపు కుంకుమలతో పూజిస్తారు. కనుమకు మినుములు తినాలని నానుడి. అందుకే గారెలు చేస్తారు. వాటివల్ల ఒంటికి వేడి చేకూరుతుంది.
      తరతరాలుగా వస్తున్న ఈ ఆచార, సంప్రదాయాలన్నీ మనం ఇప్పటికీ, ఎప్పటికీ ఆచరించదగ్గవే. వీటి వల్ల ఐకమత్యం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. అందుకే మన పిల్లలకు, వాళ్ల పిల్లలకు ఈ వారసత్వాన్ని అందిద్దాం. మౌఖిక సాహిత్యంగా పెద్దలందించిన గొబ్బి పాటల వôటి జానపద రసగుళికలనూ భవిష్యత్‌ తరాల కోసం భద్రపరుద్దాం.

***


వెనక్కి ...

మీ అభిప్రాయం